Wednesday, December 22, 2010

ఓ రోజు రాత్రి రైల్లో...

నడికుడి స్టేషన్ వచ్చింది ....
ట్రైన్ దిగాను .... బద్ధకంగా వళ్ళు విరుచుకొని, ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తుకువచ్చి కంపార్టుమెంటు బయట అతికించిన చార్ట్ చూశాను .. ఆశ్చర్యం వేసింది ... మళ్ళీ చూశాను మొత్తం ... భయం వేసింది ... మళ్ళీ చూశాను ... లేదు .. చార్ట్ లో నా పేరు లేదు ... నాకు సర్రున వెన్నులో వణుకు మొదలైంది రాత్రి జరిగింది తలుచుకోగానే .. లక్ నా పక్కన ఉండకపోతే ఎలా బుక్ అయ్యేవాడినో తలచుకోగానే ...........

                              ****** పన్నెండు గంటల క్రితం ******

శబరి ఎక్సుప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాటుఫారం మీదకి రానున్నదనే అనౌన్సుమెంటు విని బ్యాగ్ భుజానికి తగిలించుకొని రెడీగా ఉన్నాను ....
ట్రైన్ వచ్చాక ఎక్కి, నా బెర్త్ ఎక్కడుందో చూసుకుంటూ వెళ్తున్నాను ... అది అర్థరాత్రి కావడంతో నంబర్లు సరిగ్గా కనిపించడం లేదు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు ...
నేను సెల్ లైట్ తో నంబర్లు చూసుకుంటూ వెళ్తుంటే నా నంబర్ కనిపించింది ... కానీ ఆ బెర్త్ లో ఒకావిడ పడుకొని ఉంది ... అది నా బెర్తేనా అని మళ్ళీ చూసుకున్నాను నా టికెట్ లో ... అవును అది నా బెర్తే అని రూడీ చేసుకున్నాక, ఇక ఆమెని లేపక తప్పదు అని .. మెల్లిగా తట్టి లేపాను .... ఆమె నిద్రలో ముఖం అదోలా పెట్టి వింతగా చూసింది నా వైపు ...
"ఈ బెర్తు నాది?" అన్నాను
"కాదు ఇది మాదే... " అని మళ్ళీ పడుకుంది ...
ఈవిడెంట్రా బాబూ అనుకొని మళ్ళీ లేపి, నా టికెట్ చూపించి "ఇదిగో చూడండి... ఇది నాకు అలాట్ చేసిన బెర్త్ ..." అన్నాను.
"నువ్వేంటయ్యా బాబూ ... ఇది మా బెర్తు ... ఒకసారి నీ టికెటే చెక్ చేస్కో ..." అని ఆవులిస్తూ చెప్పి పడుకుంది ...
ఇదెక్కడి గోలరా బాబూ అనుకొని .. ఇక లాభం లేదనుకొని "మీ టికెట్ చూపించండి .." అన్నాను ఆమెని మళ్ళీ లేపి ..
"ఏంటయ్యా బాబూ నీ గోల అర్థ రాత్రి ..." అంది చిరాగ్గా
"అప్పనంగా నా బెర్తు మీద పడుకోడమే కాకుండా నాది గోల అంటావా ... చూపించు టికెట్ .." అన్నాను నాకు తిక్కరేగి ..
"టికెట్ నా దెగ్గర లేదు ... మా ఆయన దెగ్గర ఉంది ..." అంది
"ఎక్కడున్నాడు మీ ఆయన ... " అన్నాను చుట్టూ చూస్తూ ..
"వేరే కంపార్టుమెంటులో ... " అంది ...
"అలాగా ... అయితే వెళ్లి టికెట్ తీసుకురా .. అప్పటిదాకా నేను ఈ బెర్తు మీదే కూర్చుంటా .."  అని ఆ బెర్తు మీద కూర్చున్నాను ...
ఆమె అసహనంగా నావైపు చూసింది ... నేను మటం వేసుకొని మరీ కూర్చున్నా ఆమె బెర్తు మీద ... ఇక తప్పదని లేచి వెళ్ళింది వాళ్ళ ఆయన దెగ్గరకు ... నాకు ఒక వైపు నిద్ర ముంచుకు వస్తుంది .. 'ఈ ఎదవ గోల ఏంట్రా బాబూ' అనుకున్నాను ...

ఒక పదినిముషాలు అయ్యాక వాళ్ళ ఆయనతో వచ్చింది ...
"ఇదిగోనండీ ఈ అబ్బాయే .. " అని నా వైపు చూపించింది ...
"చూడు బాబూ ... ఈ సీట్ మాదే .. ఇదుగో టికెట్ .." అని చూపించాడు ... నాకు మైండ్ బ్లాక్ అయ్యింది ... సేం సీట్ .. సేం కోచ్ ... హౌ .. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ...
"అదేంటి... ఇద్దరికీ ఒకే సీట్ ఎలా ఇచ్చారు .. " అన్నాను ఆశ్చర్యపోతూ ...
"మీ టికెట్ చూపించండి .." అన్నాడు వాళ్ళ ఆయన ... నేను చూపించాను .. తను కూడా చూసి, అవును నిజమే అని కాసేపు ఆశ్చర్యపోయాడు ...
"చూడు బాబూ ... తనకి వంట్లో కూడా బాలేదు .. తనని ఈ బెర్తులోనే పడుకోనివ్వు ... మీరు టీసీని వెళ్లి కలిసి చెప్పండి.. ఆయన మీకు ఇంకో బెర్తు అరేంజ్ చేస్తాడు .." అని ఒక ఉచిత సలహా పడేసి వెళ్ళిపోయాడు ...
నాకు మెంటలెక్కింది ... ఆ ఆంటీ ఏమో హాయిగా బెర్త్ ఎక్కి కునుకు తియ్యడం స్టార్ట్ చేసింది ...

నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ... ట్రైన్ వేగంగా పరిగెడుతుంది.. లోపలా అంతా చీకటి ... ఇప్పుడు ఆ టీసీ గాడిని ఎక్కడ పట్టుకోవాలి ...
టీసీ గాడికోసం  వెదకడం మొదలెట్టాను... వాడు ఎక్కడా కనిపించలేదు ... నాకు ఓ వైపు నిద్ర... రెండో వైపు అసహనం ... మూడో వైపు కోపం .. నాలుగో వైపు నా మీద నాకే "థూ దీనెమ్మ జీవితం .." అనే ఫీలింగ్ కలగలిపి వచ్చాయి .. రైల్వే నాకోడుకులని బండ బూతులు తిట్టుకున్నాను  .... లల్లూ గాడి బొజ్జ భళ్లు మని పగిలిపోవాలి అని ఇష్టదైవాన్ని కోరుకున్నాను ...

ఏం చెయ్యాలో వెన్నపోక (పాలు ... పెరుగు .. ఇంతకముందే అయోపోయాయి .. సారీ), డబ్బులు పెట్టి సీట్ రిజర్వ్ చేసుకొని దిక్కులేని వాడిలా అటూ ఇటూ తోరుగుతున్న నా మీద నాకే ఓ క్షణం జాలి కలిగింది ... నాకే కాదు అక్కడ ఉన్న ఒక అబ్బాయికి కూడా జాలి కలిగింది అనుకుంటా .. "హలో ..." అన్నాడు ... ఆడు ఇంకా పడుకోలేదు అనుకుంటా 
"హాయ్ ..." అన్నాను 
"ఇందాక అక్కడ మీ కాన్వర్సేషన్ విన్నాను.. ఇద్దరికీ ఒకే సీట్ ఎలా ఇచ్చారో ఈ రైల్వే వాళ్ళు .. కంప్యూటర్లు కూడా తప్పులు చేస్తుంటే మనం ఏం చెయ్యగలం చెప్పు బాస్ .. " అన్నాడు
"నిజమే ... " అన్నాను
"మీరేమి కంగారు పడకండి ... పాపం మీకు బాగా నిద్ర వస్తున్నట్లుంది... మా దెగ్గర ఓ బెర్త్ ఖాళీగా ఉంది ... మేము నలుగురం రిజర్వ్ చేయించుకున్నాం .. కానీ మా ఫ్రెండ్ ఒకడు ట్రైన్ మిస్ అయ్యాడు .. సో మీరు ఆ బెర్త్ తీసుకోండి .." అన్నాడు
"అవునా ... చాలా థాంక్స్ బాసు ..." అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా.. అప్పుడు వాడు నాకు అభయమిచ్చే ఆపత్భాందవుడిలా అనిపించాడు...
ఇక వాడు చూపించిన బెర్తులో పడుకొని ... ప్రొద్దున నడికుడి స్టేషన్ వచ్చాక దిగాను .. మధ్యలో టీసీ నాకొడుకు వస్తాడేమో నాలుగు కడిగేద్దాం అని చూసాను ... వాడు రాలేదు ...

                                                                   ***********
చార్టులో నా పేరు ఎందుకో లేదో బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాలేదు...
రిజర్వ్ చేయించుకుంటే చార్ట్ లో ఉండాలి కదా ... ఎందుకు లేదు ... 
ఆ ప్రక్క ఊరిలో ఉండే మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాను అప్పుడు ... వాళ్ళ ఇంటికి వెళ్లానే కానీ నాకు ఇదే ఆలోచన ...
మా అన్నయ్య రైల్వే లో స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు .. ఆయన కూడా పెళ్ళికి వచ్చాడు .. ఆయన దెగ్గరికి వెళ్లి అడిగాను .. ఇలా నేను రిజర్వ్ చేసుకుంటే, నా పేరు చార్ట్ లో లేదు ... అదే సీట్ వేరే వాళ్ళకి అలాట్ చేసారు .. ఇలా ఎందుకు జరిగింది అని అడిగాను ...
"అలా జరగదు, ఏది నీ టికెట్ చూపించు .." అన్నాడు 
నేను చూపించాను ... ఆయన చాలా పరిశీలనగా చూసి బాగా ఆలోచించాడు ...
"నువ్వు ట్రావాల్ చేసింది నిన్న రాత్రి కదా .." అన్నాడు
"అవును.. కావాలంటే డేట్ చూడండి పదమూడు ఫిబ్రవరీ ..." అన్నాను 
"అవును ... కానీ నువ్వు ఇక్క ఒక పాయింట్ మిస్ అయ్యావ్ .." అన్నాడు
"ఏంటది .." అన్నాను
"నిన్న పదమూడే ... కానీ నీ ట్రైన్ తిరుపతిలో డిపార్చర్ అర్థరాత్రి పన్నెండు గంటల అయిదు నిముషాలకి .. అంటే ట్రావల్ డేట్ పద్నాలుగు అవుతుంది ... కానీ నువ్వు పదమూడుకి చేయించావ్ .. ఒక్క అయిదు నిముషాల గ్యాప్ లో డేట్ మారిపోయింది .. అది నువ్ గమనించలేదు .. చాలామంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు ...రాత్రి ప్రయాణం అనగానే ఆ రోజు డేట్ కే రిజర్వ్ చేస్తుంటారు .. కానీ టైం కూడా గమనించాలి ... పన్నెండు దాటితే మరుసటి రోజు కింద లెక్కే కదా ... సో ఈ ఈవిధంగా నిన్న నువ్వు టికెట్ లెస్ ట్రావెల్ చేసావ్ .. టీసీ చూడలేదు కాబట్టి బతికిపోయావ్ లేకపోతే వాడు నీకు బాగా ఫైన్ వేసేవాడు తెల్సా .." అన్నాడు 
నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ... మరొక్కసారి నా టికెట్ చూసుకొని ... ఆ ఆంటీ ని తలచుకొని "థూ దీనెమ్మ జీవితం.." అనుకున్నాను ..Saturday, December 4, 2010

ఏమైంది ఈ వేళ... ఏంలేదు ... జస్ట్ పిచ్చెక్కింది.. కాస్త మెంటల్ కూడా కలిసింది ...

ఇప్పుడే "ఏమైంది ఈ వేళ" సినిమా చూశాను ... వెంటనే నాకు అనిపించింది "అసలు ఏమైంది నాకీ వేళ ..పిచ్చెక్కిందా" అని....
ఆ సినిమా చూసి మెంటల్ ఎక్కి ఈ టపా రాస్తున్నా, సో ధైర్యం ఉన్న వాళ్ళే చదవండి.

అసలు ఆ సినిమా ఏంటి ... ఆ క్యారక్టర్స్ ఏంటి??... అసలు ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే తలెత్తుకొని ఆ సినిమా చూడగలదా?..  టైటిల్ మాత్రం "ఏమైంది ఈ వేళ?"... సినిమా మొత్తం బూతు కావ్యం... ఎండింగ్ లో కొంచెం క్లాస్ కోటింగ్ ... చిన్న షుగర్ కోటింగ్ లాంటిది అన్నమాట ...

అసలు శేఖర్ కమ్ముల గాడ్ని పట్టుకొని తన్నాలి, ఆ తొక్కలో వరుణ్ సందేశ్ గాడ్ని హీరో చేసినందుకు ... వాడు హీరో ఎంటండి బాబూ ... ఇన్ని సినిమాలు చేసినా, అన్నిట్లో ఒకే యాక్షన్ ... వాడిది ఒక్క సినిమా చూసి, మిగతా సినిమాలు చూడక్కర్లేదు ... ఈ సినిమాలో వాడ్ని చూసి ఒక కామ పిశాచిని చూసినట్లు అనిపించింది నాకు ... థూ ఇంకా వాడిని స్క్రీన్ మీద చూడాల్సిన ఖర్మ ఏంటి మనకు ...

ఇక పోతే ఆ డైరెక్టర్ ... వాడి పేరేంటో గుర్తురావట్లేదు, నిజంగా వాడు నాకు కనిపిస్తే, వాడ్ని చంపేసి నేను జైలు కెళ్ళిపోతా హ్యాపీగా ... థూ వాడి జీవితం... ఒక సినిమాని ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలో తెలియకపోయినా పర్వాలేదు, కానీ అసభ్యకరంగా చూపించి సినిమాని నెట్టుకురావాలనుకోవడం ఉంది చూసారూ... దానికి వాడిని ఏం చేసినా పాపం లేదు... ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అసభ్యం లేదని నేను అనట్లేదు, కానీ దీనిలో ఆ చెత్త డైరెక్టర్ ఆ అసభ్యతని చూపడానికి ఎన్నుకున్న మార్గం నిజంగా నీచం... అమీర్పేట హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల మీద ఆ బూతు జోకులు ఏంటి??... అమీర్పేట అమ్మాయిలందరూ ఆ టైపు అని తీర్మానించేశారు ఈ సినిమాలో... అమీర్పేటలో ఉండే అమ్మాయిలందరికీ తప్పనిసరిగా బాయ్ ఫ్రెండ్స్ ఉండాలంట... వాళ్ళు అర్థ రాత్రుళ్ళ దాకా ఫోనులో ముద్దులు పెట్టుకుంటూ ... ఫోన్ శృంగారం చేసుకుంటారట... రాత్రుళ్ళు బాయ్ ఫ్రెండ్స్ రూముల్లో గడిపి వస్తారట ... రాత్రుళ్ళు రోడ్ల మీద చీకటిగా ఉన్న ప్లేసుల్లో ముద్దులు ముచ్చట్లు వగైరాలు ... ఇంటర్నెట్ కేఫుల్లో సరసాలు ఆడుకుంటారట... ఇంకా ఎన్నో... హీరోయిన్ మొదటిసారిగా హాస్టల్ కి వచ్చినప్పుడు ఆ హాస్టల్ లో ఉండే అమ్మాయి ఏమంటుందో తెల్సా.. "బాయ్ ఫ్రెండ్ ఉండటం... అతనితో తిరగడం.. రాత్రుళ్ళు గడిపి ప్రొద్దున రావడం .. అర్థ రాత్రుళ్ళు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడటం... రూమ్ లో సెక్స్ గురుంచి చీప్ గా మాట్లాడుకోవడం ... ఇవన్నీ ఒక అమ్మాయికి అమీర్పేట్ హాస్టల్ కి వచ్చేదాకా ఉండవట... వచ్చిన తర్వాత అవే ఉంటాయట ..." పైగా "ఇంత స్టాండర్డ్ స్టాట్స్ మైంటైన్ చేస్తున్నావ్ నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా" అని అడుగుతుంది హీరోయిన్ ని  ... అసలు ఆ డైలాగ్ ఏ రకమైన మెసేజ్ పంపుతుంది యూత్ కి...  ఆ హాస్టల్ లో ఒక అమ్మాయి ఉంటుంది "అరియో బుడ్డీ ..." అని ఎదో అటుంటుంది... దాన్ని చూస్తే నాకు గూబ పగలగొట్టబుద్దవుద్ది ..

ఆ హాస్టల్ లో ఉండే ఒక అమ్మాయి ప్రొద్దునే రూమ్ కి వస్తే "నైట్ అంతా ఎక్కడున్నావ్ " అని హీరోయిన్ అడిగితే ... " నా బాయ్ ఫ్రెండ్ రూమ్ లో ఏ/సీ ఉందని అక్కడే పడుకున్నాను " అని చెప్తుంది ...అసలు ఆ సినిమా చూసాక, ఎవడైనా అమీర్పేట్ హాస్టల్ లో ఉన్న అమ్మాయి అంటే, ఎలా చూస్తాడు ... ఒక ఐటం లా చూస్తాడా లేదా?..  పైగా చివరిలో హీరో "హైదరాబాద్ లో ఉండే అమ్మాయిల్లో ఒక్కతి కూడా వర్జిన్ ఉండదు, మీ అమీర్పేట్ హాస్టల్ గురుంచి ఇంక అసలు చెప్పాల్సిన పని లేదు" అంటాడు... అప్పుడు మన హీరోయిన్" అమీర్పేట హాస్టల్ అమ్మాయిల గురుంచి చీప్ గా మాట్లాడకు ... నేను ఊరుకొను.." అంటుంది... అప్పటిదాకా అమీర్పేట హాస్టల అమ్మాయిలందరూ _____ లు అని చూపించిన దర్శకుడు, హీరోయిన్ చేత ఆ మాట అనిపించి తను ఏమీ తప్పుగా చూపించలేదు అని చెప్పలనుకున్నాడేమె...ఒక మైండ్ లెస్ డైరెక్టర్ తీసిన చీప్ సీన్స్ కి అమీర్పేట్ లో ఉండే అమ్మాయిలు ఎందుకు శిక్ష అనుభవించాలి ... అమీర్పేట్ లో ఉండే అమ్మాయిలే కావచ్చు, మరే ఇతర హాస్టల్ అమ్మాయిలు అయినా కావచ్చు, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లది .. అందరూ అలాంటి వాళ్ళే అయ్యి ఉండాల్సిన పనిలేదు... అలాంటప్పుడు అందరినీ ఒక గాటిన కట్టేసినట్లు అమీర్పేట అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళే అని ఒక సినిమాలో చూపించడం ఎంత వరకు సమంజసం... అసలు కొంచెం అయినా సామాజిక స్పృహ ఉందా ఆ దర్శకుడికి ...

ఇకమిగతా విషయానికి వస్తే హీరోయిన్.. ఎంత దరిద్రంగా ఆమె క్యారక్టర్ డిసైన్ చెయ్యాలో అంత దరిద్రంగా చేశాడు ...  ఒకసారి కాఫీకి కలుస్తారు హీరో హీరోయిన్లు ... అంతే వాళ్ళ ఫ్రెండ్షిప్ డవలప్ అయిద్ది ... ఇక్కడ నోట్ చెయ్యాల్సిన పాయింట్ .. ఫ్రెండ్షిప్ ... ఆ ఫ్రెండ్షిప్ గొడుగు కింద ...వాళ్ళిద్దరూ అర్థ రాత్రుళ్ళ దాక ఫోన్లు ... లేట్ నైట్ కలిసి రోడ్డు మీద తిరగడాలు ... హీరో అర్థ రాత్రి హీరోయిన్ హాస్టల్ కి వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు .. ఆమె ఆనందంగా వెళ్తుంది ... తర్వాత ఓ రోజు ఇంటర్నెట్ కేఫ్ లో ఆమె శరీరాన్ని పలు రకాలుగా ఆస్వాదిస్తాడు ... ఆమె ఆడ్డు కూడా చెప్పదు ... ఇంకో రోజు, కార్ లో ఎక్కడికో తీసుకెళ్ళి ... ఇరవై రెండేళ్లు ఆగాను, ఇక ఆగలేను అని ఆమెకి ముద్దు పెడతాడు ... ఆ తర్వాత పైత్యం ఇంకాస్త ముదిరి, వాడి రూమ్ మేట్ తో అంటాడు "నువ్వు ఆ రోజు రూమ్ కి తెచ్చుకున్న అమ్మాయికి ఫోన్ చెయ్యి, ఇక నా వల్ల కాదు నేను అర్జెంటుగా పాడాయిపోవాలి..." అని ... మరో రోజు హీరోయిన్ తో అంటాడు "ఇన్ని చేసాక, నేను తట్టుకోలేకపోతున్నాను... నాలో ఏవో రసాయనాలు ప్రవహిస్తున్నాయి ... మనం తప్పు చేసేద్దామా.. మా రూమ్ కి వస్తావా?" అంటాడు ... ఇక్కడ హీరోయిన్ వెంటనే "ఎస్ డార్లింగ్ చేసేద్దాం" అంటే హీరోయిన్ని మరీ ____ అనుకుంటారేమో అనుకున్నాడేమో డైరెక్టర్, ఆమెకి తర్వాత రోజు మార్నింగ్ దాక టైం ఇచ్చాడు ... ఆ తర్వాత రోజు మార్నింగ్ హీరోయిన్ హీరోకి కాల్ చేసి.. "సరే... ప్రేగ్నేసి ఏమీ రాదు కదా... " అంటుంది .. ఇక మన వాడు ఊరుకుంటాడా ... "అసలు అలంటి భయాలు నీకు అవసరం లేదు.." అన్నట్లు మాట్లాడి ... ఆమెని తన రూమ్ కి రప్పించుకొని ... ఆ తప్పు ఎదో చేసేస్తాడు .. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, హీరో హీరోయిన్ అప్పటిదాకా ప్రేమించుకోలేదు ... కనీసం లవ్ అనే టాపిక్ కూడా వాళ్ళ మధ్య రాలేదు... జస్ట్ ఫ్రెండ్స్ అనమాట ... కాని అన్ని పనులు కానిచ్చేసారు ... అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ ముసుగులో ఎలాంటి పనులు అయినా చేసెయ్యొచ్చు అన్నమాట ... అది ఇక్కడ మన గ్రేట్ డైరెక్టర్ గారు చెప్పదలచుకున్న విషయం ... ఒక ఫ్రెండ్షిప్ ని ఇంత కన్నా నీచంగా చూపించడం మీరు చూసారా?.. విచిత్రం ఏమిటంటే పని పూర్తయ్యాక ... హీరో గారు హీరోయిన్ కి ప్రపోస్ చేస్తారు ... ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉందా... అప్పటివరకు ఆమెతో ఎంజాయ్ చెయ్యాలనే మోటివ్ తో ఉన్న వాడు, పని పూర్తయ్యాక పెళ్లి చేసుకోమని ప్రపోస్ చేస్తాడుట.... ఈ సీన్ లో తెలిసిపోతుంది అసలు ఆ డైరెక్టర్ గారి ప్రతిభ ఏంటో??..  సమాజంలో సవాలక్ష జరగొచ్చు, కానీ స్క్రీన్ మీద రియల్ లైఫ్ ని ప్రోజెక్ట్ చేసేప్పుడు కొంచెం సామాజిక స్పృహ కూడా ఉండాలి ...

అసలు ఈ సినిమా మొదటి నుంచి చివరి దాకా ఇలా చీప్ సీన్స్ తో నడిపించాడు ఆ దర్శకుడు .... బాబు నువ్వెవరో గాని నీకు శతకోటి దండాలు ... ఇంకెప్పుడు సినిమాలు తియ్యకు ... తీసినా కొంచెం చూసే జనాలని కూడా దృష్టిలో పెట్టుకో ... ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఈ కళాఖండం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ మధ్య ఉన్న అమ్మాయి ఖర్మకాలి అదే అమీర్పేట హాస్టల్ లో చదువుతుంది అనుకొండి... అమీర్పేట కాకపోతే అంబరుపేట.. ఏదో ఒక హాస్టల్ లో చదువుతుంది అనుకోండి... ఆ సినిమా చూస్తున్నప్పుడు వచ్చే సీన్స్ ని చూసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి గురుంచి ఏమనుకుంటారు ... ఎలా కంగారు పడతారు?? ..ఇక ఈ అమ్మాయి సిగ్గుతో ముఖం ఎక్కడపెట్టుకోవాలి??... అసలు ఈ సినిమా చూసాక అబ్బాయిల దృష్టిలో అమీర్పేట హాస్టల్ అమ్మాయిలు అంటే వాళ్ళు ఎంత చీప్ గా చూస్తారో మీ విజ్ఞతకె వదిలేస్తున్నా... అసలు అవి నిజంగా జరుగుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు... కానీ అవి అలా శక్తివంతమైన సినిమా మాధ్యమం ద్వారా చూపించడం ఎంత వరకు సమజసం... అది ఎలాంటి ప్రభావాన్ని యువతపై చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి ...  అసలు ఈ సినిమాలో  ఒక్క అమ్మాయికి కూడా క్యారక్టర్ ఉన్నట్లు చూపించలేదు ఆ దర్శకుడు, ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సదరు దర్శకుడి చీప్ మెంటాలిటీ ... 

నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం ఈ సినిమా ఆవుట్ లైన్ స్టోరీ ... బట్ స్టోరీని ఎదో మొదటిలో చివరిలో టచ్ చేసి మిగతా మొత్తం ఈ బూతుతో నడిపించాడు ఆ గొప్ప దర్శకుడు... పెళ్లి చేసుకొని పరస్పర ఈగోల వల్ల విడిపోయిన జంట, తరువాత తమ కొత్త పార్టనర్స్ ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో తమ మధ్య దాగి ఉన్న తమ ప్రేమని గుర్తించి, మళ్ళీ కలుసుకుంటారు ఇదీ స్తూలంగా కథ... ఇదే కథని ఏంతో అందంగా, సరయిన భావోద్వేగాలతో తెరకెక్కిస్తే ఒక గొప్ప సినిమా అవుతుంది... బహుసా అది ఆ దర్శకుడికి చేతకాలేదేమో, ఈ కథని నడిపించడానికి ఏవేవో చీప్ ట్రిక్స్... చీప్ సీన్స్ ... చీప్ క్యారెక్టర్స్ ని పెట్టాడు ... చివరికి సినిమా చూసిన వాళ్ళకి ఒక అసభ్యకరమయిన సినిమా చూసిన ఫీలింగ్ కలగకమానదు...  ఈ సినిమా చూసిన చిరాకు...తిక్క...మైండ్ బ్లాక్.... మెంటల్  లాంటి వివిధ వివిధ ఫీలింగ్స్ మధ్య ఈ పోస్ట్ రాశాను ... మీకు చదవడానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే సారీ.... బట్ నాకు చెప్పాలనిపించింది ... చెప్పాను ....

                                                                                                    ---- మీ రామకృష్ణ

Thursday, November 18, 2010

Priscilla Presley and the Wooden House - 1

"Priscilla...."
"Yes, Kiran...."
"Wanna play with me? Let's go to wooden house"
"Am afraid I can't... He will kill me, if i play with you"
"Who?"
"Your Joseph uncle... He is mad at me.. He shouted at me not to see you again.."
 "He shouted at you??.. How dare he shout at my Priscilla.. If i see him shout at you again, I will kill him"
 She broke into tears... "why do u like me so much?" she asked him
"You are my world... you are the one with whom i can laugh, cry, play..... and die..."

                    
                                             ******* After 15 years **********

Late కల్నల్ శ్రీ భానుప్రకాష్ గారి ఇల్లు, ఆ ఊరికి దూరంగా ప్రకృతి అందాలకు దెగ్గరిగా, ఎప్పుడూ పక్షుల కిలకిలరావాలతో, ఇంటి ప్రక్కనుండి పారే సెలయేటి సరిగమలతో నిత్యం ప్రకృతి సంగీతం ఆలపిస్తూ ఉండేది...

ప్రశాంతతకి పుట్టిల్లుగా అనిపించే ఆ ఇంటిలో ఆ రోజు మాత్రం పరిస్థితి అందుకు పూర్తి  భిన్నంగా ఉంది...కల్నల్ గారి ఇంటినిండా పోలీసులు..హాల్లో రక్తపు మడుగులో జోసఫ్ మృతదేహం..
అదే రక్తపు మడుగులో కూర్చొని జోసఫ్ వైపు చూస్తూ "You killed my Priscilla...You deserve this ..." అని తన చేతిలో ఉన్న రక్తపు మరకల కత్తిని చూస్తూ "Only you understood my pain ..." అంటూ ఆ కత్తిని ముద్దుపెట్టుకున్నాడు సూర్యకిరణ్.
అది చూసిన ఎస్.ఐ అతన్ని కాలర్ పట్టుకొని లేపి "కానిస్టేబుల్స్ ఇతన్ని జీప్ లో ఎక్కించండి...." అంటూ ఆర్డర్ వేశాడు.
సూర్యకిరణ్ కి బేడీలు వేసి ఇంటి బయటకి తీసుకొచ్చి పోలీసు జీపులో ఎక్కించారు...
అతని మొహం క్రోధంతో ఎర్రబారి ఉంది... కళ్ళు నిప్పులు చిమ్ముతున్నాయి.... అతని ఒంటినిండా రక్తపు మరకలు..
పోలీసులు అతన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా అతని ముఖంలో ఎటువంటి భావాలు లేవు..
"Be here and complete the formalities...శవాన్ని పోస్ట్-మార్టంకి తరలించండి..ఘటనకి సంబంధిన అన్ని క్లూస్ జాగ్రత్తగా సేకరించండి .."అని వెళ్తూ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కి చెప్పాడు ఎస్.ఐ.

                                                            *****
సూర్య కిరణ్ ని కోర్టులో హాజరు పరిచారు....
కోర్టులో విచారణ జరగడానికి సిద్ధంగా ఉంది...
బోనులో నిలబడ్డ సూర్యకిరణ్ ని ఉద్దేశించి "మీ తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ ఎవరైనా ఉన్నారా?" అంది జడ్జ్ రాధికా దేవి.
లేరన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు సూర్యకిరణ్.
"ఓ.కె. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీరు వాదనని మొదలు పెట్టొచ్చు..." అంది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ చక్రధర్ లేచి నిల్చుని, బోనులో నిలబడ్డ సూర్యకిరణ్ వైపు ఓ సారి చూసి చిన్నగా భుజాలెగరేస్తూ నవ్వి, జడ్జ్ వైపు తిరిగి "యువర్ హానర్, ఈ కేసులో పెద్దగా వాదించడానికి ఏమీ లేదు... ఘటనా స్థలంలో దొరికిన క్లూస్ బట్టి సూర్య కిరణ్ అనబడే ఇతనే జోసఫ్ అనే వ్యక్తిని దారుణంగా హతమార్చాడు అనేది తెట తెల్లం అయింది ... మీరు కూడా ఆ క్లూస్ రిపోర్ట్స్ చూడండి .." అన్నాడు ...
కోర్టు బంట్రోతు ఆ రిపోర్ట్స్ ని జడ్జ్ కి అందజేశాడు ...
చక్రధర్ మళ్ళీ మాట్లాడుతూ "యువరానర్, ఇతనే హత్య చేశాడని రిపోర్ట్స్ చూస్తున్న మీకు అర్థమయ్యే ఉంటుంది ... కానీ ఎందుకు చేశాడు, అతని మోటివ్ ఏంటి అనేది కూడా మనం తెలుసు కోవాలి కాబట్టి నిందితుడిని ఇంటరాగేట్ చెయ్యడానికి అనుమంచించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను "
"గ్రాంటెడ్"

చక్రధర్ సూర్యకిరణ్ దెగ్గరికి వచ్చి "జోసఫ్ నీకు ఎలా తెలుసు?" అని అడిగాడు ..
"అతను మా నాన్నగారు నాకోసం నియమించిన గార్డియన్"
"ఓ.కే. అతన్ని అంత కిరాతకంగా చంపడానికి కారణం?"
"......."
"మిస్టర్ సూర్యకిరణ్, జోసఫ్ ని నువ్వే చంపావని చెప్పడానికి ఖచ్చితమయిన సాక్ష్యాధారాలు ఉన్నాయి... నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన లేక ఖండించినంత మాత్రాన నీ మీద అభియోగం చెరిగిపోదు... ఇప్పుడు హత్య ఎందుకు చేశావో కారణం చెపితే, ఆ కారణాన్ని బట్టి నీకు పడే శిక్ష తీవ్రత ఆధారపడి ఉంది.. "
"జోసఫ్... నా ఒక్కగానొక్క స్నేహితురాలిని చంపాడు...నా ప్రాణాన్ని, నా ప్రపంచాన్ని, నా సంతోషాన్ని నాకు దూరం చేశాడు .." గద్గదమయింది సూర్యకిరణ్ గొంతు...
అది విన్న చక్రధర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు...  కోర్టులో ఉన్న జనాలు అందరు ఒక్కసారిగా ఒకరితో ఒకరు ఏదేదో మాట్లాడుకోవడం... జడ్జ్ ఆర్డర్ అనడం ఒకేసారి జరిగిపోయాయి....

"వాట్... జోసఫ్ నీ స్నేహితురాలిని చంపాడా? ఎప్పుడు చంపాడు? అది నువ్వు చూశావా?... ఎలా చెప్పగలుగుతున్నావు?"
"ఒక నెల క్రితం...నేను చూడలేదు ... కానీ నాకు తెలుసు"
"ఒక నెల క్రితం నీ స్నేహితురాలు చంపబడితే, నువ్వు అతనికి ఇన్ని రోజులుగా ఎటువంటి హానీ తలపెట్టకుండా నిన్న అతన్ని అతి క్రురంగా చంపడానికి కారణం?" అడిగాడు చక్రధర్.
"జోసఫ్ నా స్నేహితురాలిని చంపినట్లు నాకు నిన్నే తెలిసింది... ఒక నెల రోజులుగా ఆమె నాకు కనపడక పోయేసరికి పిచ్చెక్కిన వాడిలా అయ్యాను.. నరకయాతన అనుభవించాను.." అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి...
"అదే ఎలా?... అందుకు ఏదైనా సాక్ష్యం ఉందా?"
"......."
"ఎవరా స్నేహితురాలు ... నీ ప్రేమికురాలా?...ఆమె పేరు?"
"అది మీకు అనవసరం... జోసఫ్ ని ఎందుకు చంపానో, చెప్పమన్నారు చెప్పాను ..."
"నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మడం... " అంటూ జడ్జ్ వైపు చూసి "యువరానర్, జోసఫ్ క్రైమ్ రికార్డ్ తెలుసుకోవడానికి మీ సమ్మతం కోరుతూ, అందుకు పోలిస్ వారిని ఆజ్ఞాపించవలసిందిగా కోరుతున్నాను" అన్నాడు చక్రధర్...
ఇంతలో సూర్యకిరణ్ అందుకొని "జోసఫ్ నా స్నేహితురాలిని కిరాతకంగా చంపినట్లు మూడో కంటికి తెలీదు.. ఇంక పోలీసులకి ఎలా తెలుస్తుంది?.. అయినా ఈ హత్య నేనే చేసాను.. అందులో ఎటువంటి సందేహం లేదు.. నేనేమి పశ్చాత్తాప పడటం లేదు.. నేను ఎంత కఠిన శిక్షకైనా సిద్ధమే.. అటువంటప్పుడు ఇంక కారణాలు తెలుసుకొని ఏం చేస్తారు?" అన్నాడు.. 
"తెలుసుకోవలసిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది..నువ్వు అతనిపై  వేసిన అభియోగానికి, ఆతనికి నేర చరిత్ర ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. దర్యాప్తు చేసేందుకు అది సహకరిస్తుంది.." అన్నాడు చక్రధర్.
"గ్రాంటెడ్, సంబంధిత పోలిస్ అధికారి జోసఫ్ క్రైమ్ రికార్డ్ ని వచ్చే వాయిదాలో కోర్టు వారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాను... The court is adjourned for the next week... అప్పటిదాకా ముద్దాయిని రిమాండ్ లో ఉంచవలసిందిగా పోలీసు వారిని ఆజ్ఞాపించడమయినది.." అంటూ పైకిలేచింది జడ్జ్ రాధికా దేవి.

                                                ******
జోసఫ్ పోస్టు మార్టం రిపోర్ట్ పోలీసులకి అందజేశాడు డాక్టర్..

"ఇక బాడీని వాళ్ళ కుటుంబీకులకి హ్యాండ్ ఓవర్ చెయ్యొచ్చు.." అన్నాడు డాక్టర్
"ఈయనకి ఒకే ఒక్క కూతురు ఉంది లండన్ లో ...ఇంకెవరూ లేరు ...ఆమెకి కబురు చేశాము... రేపు ప్రొద్దున ఆమె వస్తుంది.. ఆమెకి అప్పగించండి .." అన్నాడు ఎస్.ఐ.
"అలాగే..." అన్నాడు డాక్టర్.

                                             ******
"నేను సూర్య కిరణ్ ని కలవాలి" అందామె ఎస్.ఐ.తో పోలీసు స్టేషన్ కి వచ్చి
"మీరెవరు?" అన్నాడు ఎస్.ఐ.
"అయామ్ రేచల్... లాయర్ ని... అతను ఒప్పుకుంటే వచ్చే వాయిదాలో తన తరపున వాదించాలనుకుంటున్నాను... అందుకు అతనితో మాట్లాడాలి.." అందామె స్థిరంగా.
అది విన్న ఎస్.ఐ. పకపక నవ్వి "ఏంటి... వాడి వైపు వాదిస్తారా... నేరం కూడా ఒప్పుకున్నాడు కోర్టులో... వాడికి ఆల్మోస్ట్ శిక్ష ఖాయమయింది.. కేవలం ఆ శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మాత్రమే తేలాలి... ఇక మీరేం వాదిస్తారు ఇందులో..." అన్నాడు.
"చూద్దాం... మీరు అనుమతిస్తే, నేను అతనితో కొద్దిసేపు మాట్లాడుతాను .." అందామె
"అలాగే..." అంటూ కానిస్టేబుల్ వైపు తిరిగి "ఆ సూర్యకిరణ్ సెల్ కి తీసుకెళ్ళు మేడంని.." అన్నాడు 

కానిస్టేబుల్ రేచల్ ని సూర్యకిరణ్ ఉన్న సెల్ కి తీసుకువెళ్ళి, లాక్ ఓపెన్ చేసి ఆమెని లోపలి పంపి అతను బయటే నిల్చున్నాడు...
ఆ సెల్ లో ఒక మూల కూర్చొని ఉన్నాడు సూర్యకిరణ్... అతని ముఖంలో ఎదో బాధ... కోపం.. సర్వస్వం కోల్పోయినట్లు సూన్యంలోకి చూస్తున్నాడు ...
ఆమె నెమ్మదిగా అతని దెగ్గరికి వచ్చింది ...
"మిస్టర్ కిరణ్... " అందామె చిన్నగా
అతను ఆమె వైపు విచిత్రంగా చూశాడు ...
"నా పేరు రేచల్ .... నేను లాయర్ ని ...  నీ కేసు వాదించాలనుకుంటున్నాను .." అంది
ఒక భావరహితమయిన నవ్వు విరిసింది అతని పెదవుల పైన ....
"మీరు నాకు కొన్ని వివరాలు చెప్పగలిగితే ...."
"మీరు నా తరపున వాదించాల్సిన అవసరం లేదు ... నాకు ఈ జీవితం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు... నాకు ఏ శిక్ష పడ్డా ఒకటే... " అన్నాడు
"కావచ్చు ... కానీ ఈ హత్య మీరు చేసిన కారణం నేను తెలుసుకోవాలి ... మీ స్నేహితురాలిని జోసఫ్ చంపారు అన్నారు ... ఆయనకి ఆ అవసరం ఎందుకు వచ్చింది... మీరు ప్రతీకారంగా జోసఫ్ ని అంత కిరాతకంగా చంపారు అంటే, ఆ స్నేహితురాలుకి మీకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది?...మీకు జోసెఫ్ కి మధ్య రేలషన్ ఎలా ఉండేది?....ఇవన్నీ నేను తెలుసుకోవాలి.." అందామె చాలా స్థిరంగా ...
"అవన్నీ మీరు ఎందుకు తెలుసుకోవాలి... చెప్పాను కదా నాకు ఏ లాయర్ సహాయం అవసరం లేదని... సో, మీకు అవన్నీ చెప్పాల్సిన పని లేదు ..." అన్నాడు
"ఉంది మిస్టర్ సూర్యకిరణ్ ... చెప్పాల్సిన బాధ్యత మీకు  ఉంది... తెలుసుకోవలసిన అవసరం నాకు ఉంది ... Because Am Joseph's only daughter, Rachel.... "
ఆ మాట వినగానే నిశ్చేష్టుడై ఆమెనే చూస్తూ ఉండి పోయాడు సూర్యకిరణ్...
"సొంత తండ్రిని హతమార్చిన వాడికి మరణ శిక్ష పడాలని కోరుకోవాలి కానీ, ఇలా హంతకుడిని వెతుక్కొని మరీ వచ్చి సహాయం చేస్తాను అంటుంది ఎవరీ పిచ్చిది అనుకుంటున్నావా?..." అంటూ అతని వైపు చూసింది ...
అతను ఆమె వైపు చూడలేక తలదించుకుని ఉన్నాడు ....

"అందుకు మా నాన్న జోసఫ్ కారణం.. నేను మా నాన్నకి దూరంగా లండన్ లో ఉంటున్నా ఫోన్ చేసిన ప్రతిసారీ నీ గురుంచి ఎన్నో విషయాలు చెప్తుండేవాడు, అతను నీ గురుంచి నాకు ఎప్పుడూ చెప్పే మాటలే కారణం ... నీ ప్రవర్తన కారణం.. అన్నిటికీ మించి... ముఖ్యమయిన కారణం... మీ ఇంటి ప్రక్కన ఉన్న ఉడెన్ హౌజ్... అందులో ఉండే నీ ప్రాణ స్నేహితురాలు ప్రిసిల్లా ప్రెస్లీ." అంది రేచల్ జాగ్రత్తగా సూర్యకిరణ్ ని గమనిస్తూ...
ఆ మాట విన్న సూర్యకిరణ్ చివ్వున తల ఎత్తి ఆమె వైపు చూసాడు.. వణుకుతున్నట్లు ఉంది అతని దేహం.. వళ్ళంతా చెమటలు... అతని కనుపాప వేగంగా అటూ ఇటూ కదులాడుతుంది..  అతని కళ్ళ వెంబడి నీళ్ళు...
"ప్రిసిల్లా..... ఆమె గురుంచి నాకు తెలియాలి...మా నాన్న ఆమెని చంపాడు అని నువ్వు చేసిన అభియోగంలో నిజమెంతో నాకు తెలియాలి.. అందుకోసం నీ కేస్ నేను టెక్ అప్ చెయ్యాలి.. నీకేదో సహాయం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు.. మా నాన్న మీద నువ్వు చేసిన అభియోగం తప్పు అని నిరూపించండం.. అసలు నువ్వు మా నాన్నని చంపడం వెనుక ఉన్న అసలైన కారణం తెలుసుకోవడం..." అందామె తన వైపే చూస్తూ..
అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు... మౌనంగా ఆమె వైపే చూస్తూ ఉండి పోయాడు...
"అసలు ప్రిసిల్లా ఎవరు? She is a British girl.. ఆమెకి నీకు ఎలా పరిచయం?" అడిగింది రేచల్...
"Your Dad... He killed my Priscilla....He killed my happiness...He destroyed my little world....Priscilla Presley.... She is my childhood sweetheart...." అతను చెప్తుండగా జాగ్రత్తగా అతన్నే గమనిస్తుంది రేచల్..

Meet you all with the much exciting second part, hold your breath till then ---- Ramakrishna Reddy Kotla

Sunday, November 14, 2010

నేను శీను రమణ @ ట్రెక్కింగ్ ఆపరేషన్

కొన్నికాంబినేషన్స్ జీవితంలో ఎప్పుడూ వర్కవుట్ అవ్వవు....

--> బాలకృష్ణ , అతని చేతిలో భగవద్గీత, అతని ప్రక్కనే మదర్ తెరిస్సా..
--> ఆర్. నారాయణమూర్తి, అతని నోట్లో సాక్సో ఫోన్, చుట్టూ ఆఫ్రికన్ డాన్సర్లు...
-->భక్తీ పాటకి ముమైత్ ఖాన్ డాన్స్, ఆమెకి నిండుగా కప్పి ఉన్న చీర, ఆ పాటకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం
-->నేను, నా కుడి ప్రక్కన శీను, ఎడమ ప్రక్కన రమణ....

                                                                ***

"ఒరేయ్ ఈ రోజు ఈవెనింగ్ ఎలాగైనా ట్రెక్కింగుకి వెళ్దాంరా ..." అడిగాడు రమణగాడు యధావిధిగా పళ్ళు తోముకోడానికి శీను గాడి పేస్టు, వళ్ళు తోముకోడానికి నా మైసూరు సబ్బు తీసుకొని బాత్రూంకి బైల్దేరుతూ ...
"అలాగే వెళ్దాంలే ...." అన్నాను నా మైసూరు సబ్బు కేసి జాలిగా చూస్తూ ...
"నీ ఎబ్బ కాకి నాకొడకా... నా పేస్టు యూజ్ చెయ్యొద్దని ఎన్ని సార్లు చెప్పాను భే..." అంటూ వచ్చి రమణ గాడి చేతిలోని పేస్టు లాక్కున్నాడు శీనుగాడు...
"ఈ ఒక్క రోజుకి ఇవ్వరా ... ఇప్పుడు నా పెట్టె వోపెన్ చేసి నా పేస్టు తియ్యలేను ..."
"వోరినీ కాకి మొహానికి నా తుపాకి.... నీ పేస్టు ఉంచుకొని కూడా నాది వాడుతున్నావా రోజూ ....తియ్యి నీ పేస్టు ముందు ...వోపెన్ చెయ్యి నీ పెట్టె ..." అంటూ బలవంతంగా రమణ గాడి పెట్టె ఓపెన్ చేయించాడు ...

అందులో ఇంకా సీల్ కూడా ఓపెన్ చెయ్యని కాల్గేట్ పేస్ట్ ని బయటకి తీసి విస్మయంగా మొహం పెట్టి "దీన్ని ఇంకా వోపెన్ కూడా చెయ్యలేదా మహానుభావా ..." అంటూ ఆ టూత్ పేస్ట్ వైపే చూస్తూ ఒక్కసారిగా దిమ్మ తిరిగి స్థాణువై స్టన్ అయ్యి అలాగే చూస్తూ, అంతలోనే తేరుకొని "నీ లఫంగి ఫేసులో నా ఫిరంగి... దీని యక్స్ పైరీ డేట్ కూడా దాటిపోయింది కదరా .... ఎన్నేళ్ళు అయిందిరా దీన్ని కొని ..." అన్నాడు కొరకొరా చూస్తూ ...
"ఏమో ... నన్ను ఈ కాలేజీలో చేర్పించేప్పుడు మా నాన్న కొన్నట్లు గుర్తు ... దాదాపు ఓ రెండేళ్లు అయ్యిందేమో ... అంతే కదరా రెడ్డిగా ..." అన్నాడు నా వైపు చూస్తూ ...
నేను నా మీద జాలిపడటం తప్పితే ఏమీ చెయ్యలేకపోయాను ... వాడు రెండు సంవత్సరాలుగా మా పేస్టు, సబ్బు, పౌడరు, సెంటు వగైరాలు వాడిన దాని ఖర్చు లెక్కకడితే ఒక పేద విద్యార్ధికి ఉచిత విద్య అందించవచ్చేమో అనిపించింది నాకు... అది తలచుకోగానే సన్నని వణుకు పుట్టింది ...
"రేపు నువ్వు కొత్త సబ్బు, కొత్త పేస్టు కొనుక్కొని కనిపించలేదో ... ఈ ఎక్స్ పైరీ దాటిన పేస్టుతో బలవంతంగా నీకు పళ్ళు తోమించి పది రోజుల్లో నీ పళ్ళన్నీ ఊడిపోయేలా చెయ్యకపోతే నేను మద్దెలపాలెం శీనే కాదు ..." అంటూ వాడిని వదిలేశాడు ... రమణ గాడు లేట్ చెయ్యకుండా బాత్రూంలో దూరాడు ... 

వాడు బయటకి వచ్చేసరికి నా సబ్బు కాస్తా అర సబ్బు అయ్యింది ... నాకు చిరాకు దొబ్బింది " కొత్త సబ్బుని అర సబ్బు చేశావు కదరా... నీ లాంటి వాడెవడో డాష్ నాది కాకపోతే కాశి కైనా డేకుతానన్నాడట..."అన్నాను ..
"డాష్ లో ఏంటి?" అన్నాడు రమణ రోజూలాగే వాడి టవల్ అనుకొని నా టవల్ తో తుడుచుకుంటూ ...
"డాష్ కిందకి ఇన్నేళ్ళు వచ్చాయి ఆమాత్రం అర్థం చేసుకోలేవా?" అన్నాను...
"మళ్ళీ ఇంకో డాషా?"
"అన్ని డాష్ లకి ఒకటే అర్థం ...డాష్ నా కొడకా ..." అంటూ బాత్రూంలో దూరాడు శీనుగాడు ...
రమణ గాడు నా పౌడర్ ని ఒక పిడికెడు వంపుకొని అందులో కొన్ని నీళ్ళు కలిపి పేస్టులా చేసి మొఖానికి సున్నం కొడుతుంటే నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది ...
శీను గాడు కూడా రెడీ అవ్వడంతో నేను లేచి " పదండ్రా బాబూ...క్లాస్ టైం అయింది ...అసలే ఈ రోజు సుస్మితకి విషయం చెప్పేయాలి .."అన్నాను బైటకి నడుస్తూ
"వావ్ చెప్పెస్తున్నావా...మాకూ చెప్పరా ఏం చెప్పబోతున్నవో .." అన్నాడు రమణగాడు నన్నే అనుసరిస్తూ..
"ఏముంది... ఈ.డీ.సి నోట్స్ తీసుకున్నారా తనది... చాలా తప్పులు రాసింది.. చూడు ఎన్ని తప్పులు రాశావో అని చెప్పెయ్యబోతున్నా .." అన్నాను నేను ...
రమణ, శీనుగాడు జాయింట్ గా "థూ ..." అన్నారు ...

                                                                    ****
సాయంత్రం కాలేజీ నుంచి రాగానే ట్రెక్కింగుకి బైల్దేరాము ... ట్రెక్కింగ్ అంటే ..మా కాలేజీ వెనుక ఉన్నతుప్పల్లో పడి వెళ్ళడమే ... అలా వెళ్తూ మధ్యలో వచ్చే పాము పుట్టల్ని, చెరువు గట్టుల్ని, చింత చెట్టుల్నీ, తేనె పట్టుల్ని దాటుకొని వెళ్లగా వెళ్లగా చక్రద్వారబంధం అనే ఊరు వస్తుంది.. ఆ ఊరు కూడా దాటి, వెళ్లగా ఓ స్మశానం...అక్కడికి చేరుకోవాలని మా టార్గెట్ ఈ రోజు .

అసలే కాకి రంగులో ఉండే రమణ గాడు నల్ల షర్టు, నల్ల జీన్స్, నల్ల షూస్ వేసుకోడం చూసి కొంచెం చీకటి పడ్డాక వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం అసాధ్యం అని తలచి... మనిషి కనిపించకుండా మాటలు వినిపిస్తే దెయ్యం అని దడుచుకొని చస్తామేమో అని వగచి ... వాడిని బలవంతంగా ఒప్పించి తెల్ల షర్ట్ వేయించాను... శీను గాడు బాడీ ఫిట్ స్లీవులేస్ బనీన్, కార్గో పాంట్... నేను పసుపు పచ్చని జీన్స్, ఎర్రటి టీ-షర్ట్, దేవీ చౌక్ లో కొన్న చలువ కళ్ళద్దాలు, చేతులో టార్చ్ లైట్...ఇక బైల్దేరాము....

అయిదింటికి మొదలెట్టాము మా ట్రెక్కింగ్ ....కాలేజీ వెనుక నుంచి తుప్పల్లోకి వెళ్ళాం ... చిందరవందరగా ఉన్న దారిలో అంతకన్నా చిందరవందరగా నడుస్తూ వెళ్తున్నాము ..
"తొమ్మిది కల్లా మనం హాస్టల్ కి రిటర్న్ అవ్వాలి ..." చెప్పాను నేను
"అలాగేలేరా... ఇంతకీ ఇటేపు ఎళ్తే చక్రద్వారబంధం వస్తుందంటావా?..." అడిగాడు రమణ ..
"అవును ...మనం మలుపులు తిరగకుండా ముక్కుసూటిగా ఎళ్ళిపోవడమే ...." అన్నాను ..
అలా ముక్కుసూటిగా నడుస్తున్న మాకు చిన్న అలసిపోయిన-బ్రేక్ తీసుకోవాలి అనిపించి ఆగాము... మంచి నీళ్ళు దాహం వేశాయి... బాటిల్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి రమణ గాడిని బండ బూతులు తిట్టాడు శీనుగాడు .. దాంతో అలిగిన రమణ గాడు ఆ ప్రక్కనే ఉన్న చింత చెట్టు కింద కూర్చొని దాన్ని గిల్లుతూ చిన్నప్పుడు తన ఎదురింటి అబ్బాయి ఎప్పుడూ తనని తొండి చేసి ఓడించే విషయం గుర్తు తెచ్చుకొని "ఎందుకు నాకే ఎప్పుడూ ఇలా అవుతుంది..." అనుకోని ముక్కు చీదుకుంటూ ఏవో గొణుక్కుంటున్నాడు ....

"బాటిల్ మర్చిపోవడంలో ఆడి తప్పేం లేదు కదరా ..." అన్నాను శీనుగాడితో ...
"మరి మన పేస్టులు, సబ్బులు, పౌడర్లు నానారకాల కిరాణా సామాన్లు కిలోల్లెక్కన కడికి పారేస్తుంటే, అందులో ఆడి తప్పు లేదా... " అడిగాడు యువరానర్ టైపు లో ...
నాకు లాజిక్ అర్థం కాలేదు ...చిన్న రివెంజ్ సీన్ అనుకున్నా ...

బ్రేక్ తరువాత మళ్ళీ నడక ప్రారంభించాము ...అలా నడుస్తూ ఉండగా కనుచూపు మేరల్లో చక్రద్వారబంధం పొలిమేరలు కనిపించాయి ... ఆ ఉత్సాహంతో స్పీడు పెంచి ఊళ్లోకి చేరుకున్నాము ...ఊళ్లోకి ఎంటర్ కాగానే సెంటర్లో ఉన్న "ఎర్రబాబు పాన్ షావు" లో ముగ్గురం మూడు లిమ్కాలు తీసుకొని తాగుతున్నాం .. ఎవడు ముందు తాగేస్తే వాడు డబ్బులు తియ్యాల్సి వస్తుందని ఎవడికి వాడు చప్పరిస్తూ లిమ్కా తాగుతున్నాం ... అప్పుడు నేను గమనించగా లిమ్కా మొత్తం తాగేసి ఇంకా చప్పరిస్తున్నాడు రమణగాడు .."ఇంకేం చప్పరిస్తావులే ..." అన్నాను వాడిని చూసి ..ఇక నటించి లాభం లేదని ..లిమ్కా బాటిల్ పక్కన పెట్టి వెనుక జేబులోంచి పర్సు తీసి అందులోంచి కొంత డబ్బు తీసి మాకు చూపించకుండా షాప్ లో ఉన్న పాన్ డబ్బా మీద పెట్టి "మిగతా చిల్లర మీరు ఇచ్చేయండి .." అని మాకు చెప్పి అలా పక్కకి వెళ్లాడు ...

నేను ఉన్న రెండు చుక్కలనే అయిదు నిముషాలుగా చప్పరిస్తుండగా... శీను గాడు పర్సు తీసి "బాలన్స్ ఎంత ఇవ్వాలి?" అడిగాడు
"22.50" అన్నాడు పాన్ షాపోడు...
"అదేంటి ...మా వాడు కొంత మనీ ఇచ్చాడుగా ..." అన్నాడు శీను గాడు
"ఇచ్చాడు .....రూపాయన్నర " అన్నాడు పాన్ షాపోడు ...
శీనుగాడు వెయ్యి సెంటీగ్రేడుల ఉష్ణ తీవ్రతతో రమణగాడి వైపు చూశాడు... అసలే కాకిని మరిపించే కలర్ ఆయే, ఇంకేం ఉంది స్పెషల్ గా మాడటానికి మా రమణ గాడి దెగ్గర, కనుక ఆ ఉష్ణ తీవ్రత దాసోహం అంది రమణ గాడి ముందు ...
"ఆడి పర్స్ లో అంత కన్నా ఎక్కువ మనీ మైంటైన్ చెయ్యడు కదరా శీనుగా... లైట్ తీసుకో.." అన్నాను లిమ్కా ఎక్కువసేపు చప్పరించి ఇరవై రెండు రూపాయలు సేవ్ చేసానని హ్యాపీగా ఫీల్ అవుతూ ....

"చక్రద్వారబంధం వచ్చేసాము ...ఇక ఇక్కడనుంచి స్మశానానికి ..." అన్నాను నేను
"నేను రెడీ ..." అన్నాడు రమణ గాడు
"నేను కూడా రెడీనే ఆ స్మశానంలో నిన్ను పాతేయ్యడానికి ..." అన్నాడు శీను పళ్ళుకొరుకుతూ..
"చూడరా రెడ్డిగా...శీను గాడికి నా మీద ఎప్పుడూ కోపమే... అమెరికాలో ఆడెవాడో ఇంకొకడ్ని చంపితే అదంతా ఆడు ప్రొద్దున్నే ఇక్కడ నా మొహం చూడటం వల్లే జరిగిందని చెప్పి బండబూతులు తిడతాడురా ..." అన్నాడు నాకు కంప్లయింట్ చేస్తూ...

"వాడి కోపానికో అర్థం ఉందిరా రమణగా... ఇలా పరాన్నజీవిగా బతకడం అసహ్యంగా లేదూ ... " అన్నాను
"నేనేమీ పరాన్నజీవిని కాదు... నా అన్నం నేనే తింటున్నా " అన్నాడు
"పరాన్నజీవి అంటే నువ్వు నా అన్నం పళ్ళెం లాగేసుకొని లాగించేసి చేతులు కడుక్కొని వెళ్లి బాబ్బోవడం కాదు ... మేము డబ్బులతో కొన్న వాటిని నువ్వు ఫ్రీగా నీ అబ్బ సొత్తులా వాడుకోవడం ..." అన్నాను
"మీరు నా ఫ్రెండ్స్ రా ...మీ దెగ్గర నాకు మొహమాటం ఏమిటీ ...మీరేవో రెండు మాటలు అంటే పట్టించుకుంటానా చెప్పు ..మీవి నావి కాదా చెప్పు ..." వాడి మాట పూర్తి కాకుండానే శీను గాడు తగులుకొని "చెప్పిచ్చుకు కొడతా చేపల చెరువులో ఈగలు పట్టే ఎదవా ... మా ఊరు నక్కపల్లి...మా ఇల్లు పొలంకెల్లి అని నువ్వన్నప్పుడే నేను అర్థం చేసుకున్నా నువ్వు శనిగాడికి సైడ్ మెంబెర్ అని .. ఏంటీ మావన్నీ నీవా... నీ సత్తరు ఫేసులో నా తాడు .... నీకు ఫ్రెండ్స్ అయిన పాపానికి మమ్మల్ని రెండు సంవత్సరాలు కిరాణా కొట్టులా వాడుకున్నావు కదరా ...నీ లతుకూర్ ఫేసులో నా లంగరు హౌస్ ... " అంటూ కడుపులో రగులుతున్న మంటతో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు శీనుగాడికి... ఆడి కడుపు మంట ఈడి గుండె మంటై మొహం మాడ్చుకున్నాడు రమణగాడు

ఇంతలో చక్రద్వారబంధం బ్యూటీస్ కొంత మంది నవ్వుతూ తుళ్ళుతూ అటువైపు వెళ్ళడం మా ముగ్గురి కంటపడింది... అప్పటిదాకా రకరకాల అవయవాల్లో రకరకాల మంటలతో మండుతున్న శీనుగాడు, రమణగాడికి ఆ అమ్మాయిల చూపులు ఫైర్ ఇంజిన్ లా మారి ఆ మంటలను ఆర్పేశాయి .. వెంటనే శీనుగాడు పాకెట్ దువ్వెన తీసి దువ్వాడు..రమణ గాడు కాలర్ ఎగరేసి "తొందరగా దువ్వెన ఇవ్వు భే.." అంటూ గుసుసుసలాడాడు శీనుగాడితో ... నేనేం తక్కువ తిన్నానా, దేవిచౌక్ లో కొన్న నా చలువ కళ్ళద్దాలు తీసి పెట్టుకొని చిన్నగా విజిల్ వేస్తూ నిల్చున్నా...

ఆ అమ్మాయిలు మమ్మల్ని చూస్తూ వెళ్తూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు ..."ఒసేయ్ ...ఇంజనీరింగ్ కుర్రాళ్ళే ...ఆ దర్పం చూస్తే తెలియట్లా.." అందొక అమ్మాయి ...
ఆ మాటతో రెచ్చిపోయిన రమణ గాడు..."ఇదిగో తెల్లచీరా...అదిగో మల్లెపూలు .." అని పాడుతూ రెండు చేతులు పైకెత్తి...రెండు కళ్ళు ఎడంగా చాపి..డ్రిల్ ఎక్సరుసైజులు చెయ్యడం మొదలెట్టాడు ...
శీను గాడు "నేనొక ప్రేమ పిపాసిని..." అంటూ గడ్డం గోక్కుంటూ ఆకాశం కేసి పిచ్చి చూపులు చూస్తున్నాడు ...నేను నా చలువ కళ్ళద్దాలతో అమ్మాయిలు ఎక్కడున్నారో సరిగ్గా కనిపించక చిన్నగా తావిళ్ళాడుకుంటున్నా...

"ఇంజనీరింగోళ్ళు అయితే ఏటి ...ఎరకలోళ్ళు అయితే ఏటి..అమ్మాయిలను చూస్తే ఈ ఎదవలందరికీ ఒకటే పైత్యం ...ఆడు చూడు ఇంకాసేపు అయితే చీకట్లో కలిసిపోయేలా ఉన్నాడు, కొండముచ్చులా ఆ డాన్స్ చూడు ... " అంది ఒక అమ్మాయి రమణ గాడిని చూస్తూ ...అది విన్న రమణ గాడు ..ఆ పాటకి డాన్స్ బదులు డ్రిల్ ఎక్సరుసైజు చేసిన కృష్ణని బండ బూతులు తిట్టుకున్నాడు ...

"కానీ అక్కడ ఒక గుడ్డోడు ఉన్నాడు చూశారా...పాపం దేవుడు అతనికి కళ్ళు లేకుండా చేశాడు...చూడెలా తవిళ్ళాడుకుంటున్నాడో..." అంది ఇంకొక అమ్మాయి నన్ను చూసి...నేను ఖంగుతిని దెబ్బకి ఆ కళ్ళద్దాలు తీసి, నేను గుడ్డివాడ్ని కాదు అని నిరూపించుకునేందుకు ప్రయత్నించా....నా ప్రయత్నాన్ని అర్థం చేసుకొని "అతను గుడ్డివాడు కాదు .. చూడు ఎంత చక్కగా ఉన్నాడో ... సూప్పర్ గా ఉన్నాడు ... భలే అందగాడు .." అందామ్మాయి ....నేను సుయ్ య్ య్ య్ య్ మని సరాసరి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి, అక్కడ కక్షలో తిరుగుతున్న ఎన్నో ఉపగ్రహాలను పరిశీలించి..మళ్లీ భూలోకంకి తిరుగు ప్రయాణం అయ్యి మార్గ మాధ్యంలో విమానంలో "నేను తోడగోడితే.." అనే సినిమా షూటింగ్ కి వెళ్తున్న బాలకృష్ణని పలకరించి...తొడగొట్టి...కిందకి వచ్చేసా..చక్రద్వారబంధానికి...ఈ లోపు ఆ అమ్మాయిలు వెళ్ళిపోయారు ....

ముగ్గురం కాళ్ళీడ్చుకుంటూ బైల్దేరాము అక్కడనుంచి ... స్మశానంకి దారెటో మాకు తెలియక పోవడంతో ఒకతన్ని అడిగాము ..
"స్మశానం ఎక్కడండి?"అంటూ అడిగాను
"స్మశానమా??...ఎందుకు అబ్బాయిలూ?" అడిగాడు ఆయన ఆశ్చర్యంగా 
"ఏం లేదు ... స్మశానంలో రోజూ ఒక పావు గంట వాకింగ్ చేస్తే మా వాడికి ఉన్న పిచ్చి తగ్గిపోతుంది అని డాక్టర్ చెప్పాడు .." అన్నాడు శీను గాడు రమణ గాడిని చూపిస్తూ ...
"ఇలా తిన్నగా పోతే ఇజయా సినిమా హాల్ వత్తాది...అది దాటుకుంటూ ఇంకా సక్కగా ఎల్తే మట్టిబాట...అట్టాగే ఓ పర్లాంగు పోతే వల్లకాడు ..." అని చెప్పి వెళ్ళిపోయాడు ... 

మేము అలాగే అంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము ..కొద్ది దూరం వెళ్ళాక, నా పక్కన ఇద్దరూ లేరు ... ఏమయిపోయారబ్బా అనుకొని వెనక్కితిరిగి చూసేసరికి ఇద్దరూ చొంగ కార్చుకుంటూ ఎటో చూస్తున్నారు ...నేను వెనక్కి వచ్చి వాళ్ళ చూపు వైపు ఓ చూపు విసిరా ... విసిరిన ఆ చూపు అక్కడనుంచి రానంటుంది ...'విజయా టాకీసులో మాంచి మళయాళ చిత్రం "రాత్రికి రా కాటేస్తా..." రోజూ రాత్రి 9గం ఆట మాత్రమే....రండి వచ్చి కాటేయించుకొండి.." అని ఆ సినిమా పోస్టర్ ఉంది అక్కడ ...రమణ గాడు వాచ్ వైపు చూసి "ఇప్పుడు ఏడున్నర...ఇంకా గంటన్నర ఉంది ..." అన్నాడు ...

"నీకు అవసరమంటావా ఈ సినిమా ..." కిచ కిచ నవ్వాడు శీను గాడు ...
నాకు కర్తవ్యం గుర్తుకువచ్చి.." మనం స్మశానానికి ట్రెక్కింగుకి వచ్చామని మర్చిపోయారా ...పదండి త్వరగా స్మశానానికి వెళ్లి...మరి తొమ్మిదింటికల్లా హాస్టల్ లో ఉండాలి .." అన్నాను ...
రమణ గాడు ఆ సినిమా చూడాల్సిందే అన్నాడు ... శీను గాడు కూడా పోనిలే పాపం రమణగాడు ముచ్చటపడుతున్నాడుగా అన్నాడు... ఈడికి ఈ సినిమా పోస్టర్ చూసేసరికి రమణగాడి మీద జాలి కలిగిందే అనుకున్నా...మొత్తానికి ట్రెక్కింగుని గాలికి వదిలారు ...
"ఒరేయ్ ఈ సినిమా అయ్యేసరికి పదవుద్ది...మనం అప్పుడు హాస్టల్ కి వెళ్ళడం కష్టం .." అన్నాను
"పర్వాలేదు ... సతీష్ గాడిది ఈ ఊరే కదరా ..ఆడికి బైక్ ఉంది..దిగబెట్టమందాము ..." అన్నాడు రమణ గాడు ...

మొత్తానికి ఈనాకొడుకులు ఫుల్ ఫిక్స్ అయినట్లున్నారు అనుకొని, ఇక నేనేమి మాట్లాడలేదు ...
విజయా టాకీస్ ఎదురుగా ఉన్న 'రాజ్యం మిలటరీ హోటల్' లో తలా రెండు పుల్లట్లు తిన్నాం ...కాసేపు అక్కడ ఉన్న యాపు చెట్టు క్రింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం ...ఇంతలో ఓ పెద్దాయన వచ్చాడు అక్కడికి ..

"ఏ ఊరు అబ్బాయి మీది ...ఈ ఊరి కుర్రాళ్ళలా లేరే ..." అడిగాడు ...
"మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ...." చెప్పాడు రమణ గాడు
"అట్టాగా ...ఏటి మా ఊరు వచ్చేరు...ఏదైనా పనా ..." అడిగాడు
"రాత్రికి రా కాటేస్తా ..." అంటూ ఇంకా ఏదో అనబోతుండగా రమణగాడి డొక్కలో పొడిచాడు శీనుగాడు..
"ఏం లేదండీ... ఈ ఊరి ప్రక్కనే కదా మా కాలేజీ...ఊరికే అలా సరదాగా కాలక్షేపం కోసం ఇలా వస్తుంటాం... పల్లెలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా ..." అన్నాను నేను కవర్ చేస్తూ ...
"అట్టాగా మరి సెప్పరే... ఈ ఊళ్ళో చాల ఇసేసాలు ఉన్నాయి...ఈ సారీ కాస్త పొద్దుటింతల రండి ..." అన్నాడు ఆయన..
"ఖచ్చితంగా వస్తాము ... మీ ఇల్లు ఎక్కడ .." అన్నాడు రమణ గాడు ...
నేను ఇంకో పోటు పొడిచాను రమణ గాడిని 'మూసుకొని ఉండు భే' అని ...
"ఈ పక్క బజార్లోనే ...రండి మా ఇంటికి పోదాం ...పొద్దున్నే కాలేజీకి ఎళ్ళిపోదురుగాని ఎట్టాగూ ఈ టైంలో కాలేజీకి ఎట్టా ఎల్తారు ..." అన్నాడు ఆయన ...

మా ముగ్గురి గొంతులో వెలక్కాయ ఒకేసారి పడింది ...
"అబ్బే పర్లేదండి ....మాకు అలవాటే మేము వెళ్తాం ..." అన్నాడు శీనుగాడు ..
"మీరు ఇప్పుడు మా ఇంటికి రావాల్సిందే అబ్బాయి...అంతే.. మర్చేపోయా నా పేరు చినరాజు...ఈ ఊరి ప్రెసిడెంటుని.. మా ఊరోచ్చిన ఇంజనీరింగ్ కుర్రాళ్ళు మా ఇంటికి రాకుండా పోతే ఎట్టా ...మీరు ఇప్పుడు వొచ్చి మా యావిడ చేసిన బొమ్మిడాయిల పులుసు, ఉలవ చారు అన్నం తిని వెళ్ళాలి అంతే ..." అన్నాడు
"మేము ఆల్రడీ తినేశాం ..." అన్నాడు రమణ గాడు ... 'రాత్రికి రా కాటేస్తా' ఎక్కడ మిస్ అయిపోతానో అని భయంగా ఉంది రమణ గాడికి ..
"తిన్నా సరే...కొంచెం అయినా తినాల్సిందే ... మా ఇంటి బొమ్మిడాయిల పులుసు ఎంత బాగుంటది అనుకున్నారు .... కాకపోతే తిన్నాక వచ్చేద్దురు గాని రండి ..." అంటూ లేచాడు
నేను టైం చూసాను 8 15 అయింది ...సరేలే తిరిగి వచ్చేయ్యచ్చు అని "అలాగే ..." అన్నాను ...

వాళ్ళింటికి తీసుకెళ్ళిన చినరాజు...మొదట వాళ్ళిల్లు మొత్తం చూపెట్టడం మొదలెట్టాడు ...తర్వాత తమ తరతరాలగా వచ్చిన ఆస్తి, ఊరిలో తమ పలుకుబడి, తమ తాత ముత్తాతలు ఊరికి చేసిన మేలు, తను ప్రెసిడెంటుగా చేసిన గొప్ప పనులు, మన్ను మశానం ఆడి శార్ధం పిండా కూడు మొదలగువాటి మీద ఏకధాటిగా ప్రసంగించడంతో... మాకు జీవితం మీద క్రమ క్రమంగా విరక్తి రాసాగించి ...టైం చూసా 8 45...ఇక బైట పడాలి అనుకొని "చినరాజు గారు ...ఇక మేము వెళ్తాం ..."అన్నాను ...

"ఏటి ఎల్తారా .... మా ఇంటికొచ్చి బొమ్మిడాయిల పులుసు రుచి సూడకుండా ఎల్తారా ...మా పరువేం గావలి ...మిమ్మల్ని నేనే దేగ్గరుండి రేపు ప్రొద్దున్నే నా కారులో కాలేజీ దెగ్గర వదిలేస్తా...మీరిక మాట్లాడకండి ..." అన్నాడు ...
"మీరే కదా కొద్దిసేపు ఉండి వెళ్ళిపొండి కావాలంటే అన్నారు ...మళ్లీ ఇప్పుడేంటి ఇలా ..." అన్నాడు రమణ గాడు, చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇస్తా అని ఊరించి చివరికి ఇవ్వను పో అన్నప్పుడు కలిగే బాధ ధ్వనించింది రమణ గాడిలో ...

రమణ గాడి మాటలు పట్టించుకోకుండా చినరాజు గారు "ఏవే...కుర్రాళ్ళకి భోజనాలు ఏర్పాటు చెయ్యి ...." అని కేకేశాడు ....
ముగ్గురం దేబురు మొహాలు వేసుకొని బొమ్మిడాయిల పులుసు తినసాగాము ... టైం చూసా 9 15...మా ముగ్గురి మనస్సులో ఒక్కసారి విజయా టాకీస్ మెరిసి మాయమయింది ....
"ఏమే అబ్బాయిలకి ఇంకో చేప ముక్క ఎయ్యి ....ఎరా, అబ్బాయి ఎట్టా ఉండాది మా యావిడ బొమ్మిడాయిల పులుసు ....ఒసేయ్ ఉలవ చారు కూడా అట్రా ..." అన్నాడు వాళ్ళావిడని కేకేస్తూ .... 

 Have a great day     --- --------------------------------------------------Ramkee

Saturday, October 30, 2010

కిషన్, The S.P.L and ఒక పిల్ల దెయ్యం

ఒక వ్యక్తి తన దేశానికి తాను ప్రధాని అయితే, ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో తెలియదు కాని, మా స్కూల్ కి నేను ఎస్పీయల్ (S.P.L.) అయినప్పుడు మాత్రం అంతకు పది రెట్లు ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యాను... దానికి కారణం, స్కూల్ లో మనకు హీరో ఇమేజ్ రావడంతో పాటు, పదవ తరగతి అంకుల్స్ ఉండగా తొమ్మిదో తరగతిలో ఉన్న నేను ఎస్పీయల్ కావడం.. పదవ తరగతిలో ఉన్నవాళ్ళకు అప్పటికే మీసాలు గడ్డాలు రావడంతో, తొమ్మిదో తరగతిలో ఉన్న మేము ఇంకా పాల బుగ్గల పసి మొగ్గలుగా ఉండటంతో, వాళ్ళు మాకు అంకుల్స్ గా కనపడే వాళ్ళు...

ఎస్పీయల్ గా స్కూల్ కారిడార్ లో ఠీవీగా నడిచివెళ్తుంటే, ఎదురుగా వచ్చే అంకుల్స్ అసూయ జ్వాలలు నా మీద ఎగసిపడుతుంటే, కాలర్ మెలిపెట్టి కళ్ళెగరేసి వాళ్ళకు కుళ్ళుపుట్టిస్తుంటే, పళ్ళ కింద పళ్ళు కొరుకుతూ వాళ్ళు చేసే పటపట శబ్దానికి నేను వ్యంగ్యంగా నవ్వుకుంటూ లేని మీసాన్ని గర్వంగా  మెలెయ్యడంలో ఉన్న మాంచి కిక్ ఏంటో తెలిసొచ్చింది...

మా స్కూల్ లో ఎస్పీయల్ పోస్టుకి స్టూడెంట్స్ వోటింగ్ ఉండదు, టీచర్స్ ఏకగ్రీవంగా ఒక స్టూడెంటుని ఎన్నుకుంటారు.. మా స్కూల్ ప్యూన్ నుంచి ప్రిన్సీ దాకా నేనంటే ఒక మంచి వోపీనియన్ ఉండబట్టి (అదెలాగో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. ఒకవేళ నేను మరీ బుద్దిమంతుడిలా నటించాల్సిందిబోయి జీవించానేమో..), ఆ వోపీనియన్ నాకు ఎస్పీయల్ పోస్టు తెచ్చిపెట్టింది....

అప్పటిదాకా సీపీయల్(C.P.L.) గా సంతృప్తి చెందిన నేను ఎస్పీయల్ అవ్వడంతో నాలో కర్లాన్ పరుపు మీద కునుకు తీస్తున్న "ఒకేఒక్కడు" "భారతీయుడు" నిద్రలేచారు... లేచీ లేవడంతోనే మొహం కూడా కడుక్కోకుండా తమ ఆకలి తీర్చమని నన్ను పోరుపెట్టారు... ఇక నేను రెచ్చిపోయాను.. ఎస్పీయల్ అయిన రెండో రోజు నుంచే ఒకటవ క్లాస్ సీపీయల్ నుంచి తొమ్మిదవ క్లాస్ సీపీయల్ దాక రోజుకి ఒకడిని పిలిచి అత్యవసర సమావేశం నిర్వహించేవాడిని... ఆకస్మిక తనికీలు చేసేవాడిని ....

"మీ క్లాస్ లో పాస్ పర్సెంటేజ్ ఎంత?" అని ఒకటో క్లాస్ సీపీయల్ ని అడిగితే, వాడు నోట్లో వేలు పెట్టుకొని బిత్తరచూపులు చూసేవాడు... "ఖాళీ పీరియడ్స్ లో ఏం చేస్తున్నారు?" అని రెండో తరగతి సీపీయల్ ని అడిగితే, "గోల చేసే వాళ్ళ నేమ్స్ రాస్తున్నా సార్.." అని వాడు అనడంతో "గుడ్... ఆ నేమ్స్ తెచ్చి నాకు చూపించు రేపటినుంచి.." అన్నాను... మరుసటి రోజు నేను క్లాస్ లో "స్కూల్ అభివృద్ధి, అందుకు అవలంభించాల్సిన పద్దతులు" అనే ఆర్టికల్ చదువుతుంటే రెండో తరగతి సీపీయల్ వచ్చి "సార్ నేమ్స్" అన్నాడు.. ఆ లిస్టులో యాభై మంది ఉన్నారు.. లేనిది ఆ సీపీయల్ గాడోక్కడే.. నాకు తిక్కరేగింది..ఆగ్రహోద్రుడినై ఆవేశంతో ఎగేసుకొని రెండో తరగతికి బైల్దేరాను..

అక్కడ సీన్ చూసి చిర్రెత్తింది నాకు.. అందరూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.. ఒక పిల్లేమో ఇంకో పిల్ల జుట్టు పట్టుకొని పీకుద్ది...ఇదేమో దాని బుక్ లాగేసుకొని గిరాటేసి కొట్టుద్ది... ఒకడేమో పలక మీద బొమ్మేసుకుంటుంటే ఇంకొకడొచ్చి తుపుక్ మని ఆ బొమ్మ మీద ఊసి నవ్వుతాడు..వీడికి ఎక్కడో కాలి వాడి చేతి మీద కోరుకుతాడు...దాంతో వాడు సైరన్ అందుకుంటాడు.. ఒక పిల్లేమో నోట్ బుక్ అట్టమీది హీరోయిన్ బొమ్మకి మీసాలు గీస్తుంటే, ఇంకొకత్తేమో దీని జడ విప్పి మళ్ళి వెయ్యడం మొదలెడుతుంది... వాళ్ళని అలా చూసాక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు...వెంటనే క్లాస్ లోకి దూకి, అందరినీ దాటుకుంటూ బోర్డ్ దెగ్గరికి వెళ్లి కళ్ళుమూసుకొని... సై...లె...న్స్... అని క్లాసులు పిక్కటిల్లేలా అరిచాను.. నా గాండ్రింపుకి అక్కడి గండుచీమ కూడా చలించలేదు... ఆల్రడీ నాకు వాళ్ళని చూసి పుచ్చకాయ సైజులో పిచ్చి ఎక్కి ఉండటంతో ఆవేశంగా అటూ ఇటూ చూసాను.. 

అక్కడ ఒక పిల్ల కాళ్ళు బార్లా చాపుకొని ఒక పెళ్లి కూతురి బొమ్మకి బొట్టు పెట్టి తలదువ్వుతుంది... నేను ఆ పిల్ల దెగ్గరికి వెళ్లి ఆ బొమ్మ లాక్కొని విసిరికొట్టి హిహ్హిహ్హి అని వికటాట్టహాసం చేసాను.. ఆ పిల్ల మిడిగుడ్లేసుకొని నన్నే చూస్తూ ఎవరో స్విచ్ వేసినట్లుగా సునామీ సిస్టర్ లాంటి సైరన్ అందుకుంది...అక్కడి పిల్లలందరూ ఆ అమ్మాయి సైరన్ విని ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.. ఒక్క చర్యతో అందరి నోళ్ళూ మూయించినందుకు నా మీద నాకే గర్వం కలిగింది 'నీ దుంపతెగ నిన్ను మించిన యస్పీయల్ ఏ స్కూల్లోనూ ఉండడెహే..' అనుకుంటుండగా.. ఆ సీపీయల్ గాడు నా దెగ్గరకి వచ్చాడు.. ఆ పిల్ల ఇంకా సైరన్ ఆఫ్ చెయ్యలేదు.. 'ఆ అమ్మాయి.....' అంటూ నా చెవిలో ఒక దేవరహస్యం ఊదాడు.. నాకు మొదట చెమటోచ్చింది.. ఆ తర్వాత వణుకొచ్చింది.. ఫైనల్గా భయమొచ్చింది... 

ఎవరి పేరు చెబితే స్టూడెంట్స్ గుండెల్లో గూడ్స్ పరిగెడుతుందో... ఎవరు భోదిస్తే బయాలజీకే భయమేస్తుందో .. ఎవరి వస్తే తుఫాను వస్తుందో.. ఎవరి రాస్తే బోర్డ్ ఏడుస్తుందో.. ఆ ఫలానా టీచర్ కూతురు ఆ పిల్ల అని చెప్పాడు ... అప్పటికప్పుడు ఆ సునామీ పిల్ల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నాను.. వెంటనే విసిరేసిన బొమ్మ తీసుకొచ్చి ఆ పిలకిచ్చి బుగ్గలు పట్టుకొని లాగి వదిలాను.. అంటే, ఆ పిల్ల నాకు ముద్దోచ్చింది అని నేను అనుకోవాలి.. నాకు బుద్దొచ్చింది అని ఆ పిల్ల అనుకోవాలి... కాని ఆ పిల్ల అలా అనుకోలేదు .. నేను దాని కాళ్ళ బేరానికి రాక తప్పలేదు.. 

"నా చిచ్చి కదూ.. నా బూచి కాదూ.. నా కుచ్చి కదూ.."
"కాదు...పొ ... మా అమ్మకి చెప్తా నీ మీదా ....నన్ను కొట్టాడు, గిచ్చాడు, కొరికాడు అని చెప్తా ... ఆ ..వావావా  ..."
'కొరికానా...గిచ్చానా ...ఓసి రాక్షసి.. ఎలా కనిపిస్తున్నానే' అనుకొని "వద్దు స్వీటీ అమ్మకి చెప్పకు... రేపు నీకు చాక్లెట్ తీసుకొస్తా సరేనా?"
"ఆ చాక్లెట్....అమ్మా చాక్లెట్.... నాకు ఇప్పుడే కావాలి చాక్లెట్...పొడుగు డైరీ మిల్క్ చాక్లేట్...నాకు ఇప్పుడే కావాలి...ఆ ...వావావా..."
'ఇప్పుడు చాక్లెట్ ఎక్కడనుంచి తీసుకురానే పిల్ల రాక్షసి' అనుకొని "ఇప్పుడు బయట ఎక్కడ ఉంటాయి బుజ్జి చాక్లెట్స్... రేపు ష్యూర్ గా తీసుకొస్తా...సరేనా ..." అని మాట పూర్తయ్యేలోపే "పక్కనే చిట్టి కొట్టు ఉంటుంది ...అక్కడ ఉంటాయి...పోయి తీసుకురా ..." అంటూ కిందపడి కొట్టుకొంటూ ఏడవడం మొదలెట్టింది...
'ఇదేక్కడ గోలరా దేవుడా... జేబులో డబ్బులు లేవు ఇప్పుడు చాక్లెట్ ఎలా తీసుకురావాలి ...' అనుకొని ..."సరే..తీసుకొస్తా...ఒక పది నిముషాల్లో వస్తా.." అని వెళ్లబోతుంటే .. నా వెనకాలే వస్తుంది ఆ పిల్ల కూడా.. "నువ్వు నా వెనుకాల ఎందుకు అట్టి కుట్టీ... నేను తీసుకువస్తాలే ..." అన్నాను పళ్ళు పటపటా కొరుకుతూ... "అమ్మా...నువ్వు అటునుంచి అటే వెళ్ళిపోతే ఎలాగా... నువ్ నాకు చాక్లెట్ కొనిచ్చే దాకా నేను నీతోనే వస్తాను .." అంది... 'ఒసినీ...నా తోడంత లేవు నేకెన్ని తెలివితేటలే.. నువ్వు ఫ్యూచర్ లో ఎంత మందిని ముంచుతావో..' అనుకొని .."సరే బంగారం...నీ ఇష్టం.." అన్నాను...

ఇద్దరం కల్సి మా క్లాస్ దాకా వచ్చాం... నేను, నా సెకండ్ క్లాస్ గర్ల్ ఫ్రెండ్ మిస్ పిల్ల రాక్షసి...
"చూడు బంగారం... నువ్విక్కడే ఉండు, నేను నా బ్యాగ్ లో డబ్బులు తీసుకొని ఇప్పుడే వస్తా... ఆ తర్వాత ఇద్దరం కల్సి జాం జాం అంటూ చిట్టి కొట్టుకి వెళ్దాం ...సరేనా?"
"నువ్ లోపలికి వెళ్లి రాకపోతే ..?"
'పెద్దయ్యాక నిన్ను ఎవడు చేసుకుంటాడో కాని సర్వనాశనం ...' అనుకొని "అప్పుడు లోపలి రావడానికి నువ్వున్నావ్ గా ..." అంటూ లోపలికి వెళ్లాను ...

"సురేష్ గా ...ఓ పది రూపాయలు ఉంటే ఇవ్వరా ...రేపిస్తా .." అన్నాను క్లాస్ లోపలికి వెళ్తూనే సురేష్ గాడితో ...
"పది రూపాయలా... అంత డబ్బు ఎందుకురా?"
"అదిగో బయట నిల్చుందే... ఆ అమ్మాయికి చాక్లెట్ కొనాలి..."
"ఆ దెయ్యం పిల్లకి చాక్లెట్ కొనడానికి నన్ను పది రూపాయలు అడుగుతావా? .."
"ప్లీజ్ రా... అది మన బయాలజీ మేడం పుత్రికారత్నం అని తెలియక దానితో పెట్టుకున్నాను...దానికి ఇప్పుడు చాక్లెట్ కొనివ్వకపోతే, రేపు ఆ మహంకాళికి నన్ను మేతగా వేస్తుంది... ప్లీజ్ రా ..."
"ఆహా... నా దెగ్గర లేవురా ... ఇందాకే నోట్స్ కొన్నాను .. "
"నీ తింగరి మొహంలో నా బొంగరం... ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా... ఇంత హిస్టరీ నీకు అవసరమా ..." అన్నాను తిక్కరేగి... అమ్మాయిల్లో కొంచెం మంచి అమ్మాయిలా కటింగ్ ఇచ్చే అరుణ దెగ్గరికి వెళ్లి "అరుణా ...అరుణా...మరే ...నాకు ఒక పది రూపాయలు ఇవ్వవా ..." అన్నాను బెంచ్ మీద గోరుతో గీకుతూ ...
"అర్జెంటా ... సరే మరి నాకు రేపు ఇచ్చేస్తావా ..."
"ఖచ్చితంగా... అంతగా దొరక్కపోతే ఆ కనపడే దెయ్యం పిల్లని సంతలో అమ్మేసి అయినా సరే పది రూపాయలు నీకు ఇచ్చేస్తాను రేపు ..." అని మొత్తానికి పది రూపాయలు సాధించేసి బయటకి వచ్చి ఆ దెయ్యం పిల్ల వైపు చూశా "ఇక వెళ్దామా.." అన్నట్లు ...
"సరే ... రా .." అన్నట్లు ఓ లుక్కిచ్చి ముందుకు కదిలింది ...
"నీ పేరేంటి బంగారం ..."
"పేరు చెప్తే కాని చాక్లెట్ కొనిపెట్టవా ..."
'దీనికి ఈ ఏజ్ లోనే ఇంత ఎటకారం ఉంటే... నా ఏజ్ కొస్తే ఓ రేంజ్ లో ఆడుకుంటది జనాల్ని ... ఆ బయాలజీ మహంకాళి నోట్లోంచి ఊడిపడింది పిల్ల దెయ్యం ...' అనుకుంటూ "రోజుకి ఎన్ని చాక్లేటు తింటావ్ బుజ్జీ ... మరీ ఎక్కువ తినకు .. పళ్ళు పుచ్చిపోతాయి ..ఇప్పుడున్న సైజుకి డబల్ అవుతావ్ .." అన్నాను...
"టెన్ రూపీస్ చాక్లెట్ కి ఇంత బిల్డప్పా... " అని ఆ పిల్ల పిశాచం అనడంతో దెబ్బకి షాక్ తగిలి షేక్ అయ్యాను ... ముస్కోని దాన్ని ఫాలో అయ్యాను ...

ఆ చిట్టి కొట్టు దెగ్గరికి వచ్చాం ...
"డైరీ మిల్క్ బార్ ఇవ్వవా..." అడిగింది పిల్ల దెయ్యం ...
"డైరీ మిల్క్ అయిపోయ్యాయి ... ఫైవ్ స్టార్ ఇవ్వనా .." అంది చిట్టి కొట్టు చిట్టి ...
"వద్దు ... పోనీ కిట్ క్యాట్ ఉందా ... " ఛాయిస్ మార్చింది పిల్ల దెయ్యం ఈ సారి ...
"ఆ ఉంది ..." అంటూ కిట్ క్యాట్ ఇచ్చి "పది హేను రూపాయలు .." అంది ...
నేను ఖంగుతిని "పదిహేనా ...నా దెగ్గర పది రూపాయలే ఉన్నాయి ... వేరే ఏమైనా తీసుకో పది రూపాయల్లో" అన్నాను
"నాకు తెలీదు... నాకు కిట్ క్యాట్ కావాలీ... నాకు కిట్ క్యాటే కావాలీ...ఆ ...అమ్మా ...వావావా ..." మళ్ళ్లీ సైరెన్ మొదలెట్టింది ...
"నా దెగ్గర పది రూపాయలే ఉన్నాయి బుజ్జి కానీ అది పదిహేను అని చెప్పింది కదా ఆవిడ... మరి ఏం చెయ్యను ..."
"అదా ... ఒక పని చెయ్యి ... చిట్టికి మిగతా అయిదు రూపాయలు రేపు ఇస్తా అని చెప్పు ..." అంది ..
"అలా ఇవ్వరు బుజ్జీ ... మనల్ని అలా నమ్మి ఎలా ఇస్తారు ..నేను ఆమెకి తెలియదు కదా .." అన్నాను ..
"మరి నమ్మాలంటే ఏం చెయ్యాలి .."
"జనరల్ గా అయితే మన దెగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదన్నా వాళ్ళ దెగ్గర పెడితే అప్పుడు నమ్మి ఇస్తారు ..." అన్నాను ఆ పిల్లకి గొప్ప విషయాన్ని బోధిస్తున్నట్లు ఫీల్ అయిపోయి ... మామూలు పిల్లలు అయితే విని ఓహో అంటారు ...కానీ ఇది పిల్ల పిశాచం కదా అందుకే .."అయితే నీ వాచ్ చిట్టి కొట్టులో పెట్టి కిట్ క్యాట్ తీసుకుందాం ...రేపు నువ్ ఫైవ్ రుపీస్ ఇచ్చేసి నీ వాచ్ తీసుకో ..." అంది ... ఒక్కసారిగా నా మట్టి బుర్రలో కూడా విధ్యుతాఘాతం జరిగింది ... సర్క్యూట్లు అన్ని పేలిపోయాయి ... ఎక్కడి కనెక్షన్లు అక్కడే తెగి అవతల పడ్డాయి .... ఒక్క రెండు నిముషాలు నేను ఈ ప్రపంచానికి చెందిన వాడిని అనే విషయం మర్చిపోయాను ....తెలివి వచ్చిన వెంటనే అది చెప్పిన విషయం గుర్తొచ్చి సర్ ర్  ర్ మని వచ్చిన కోపానికి సలసల మరిగింది నా రక్తం...

"ఏంటే...నీ చాక్లెట్ కోసం నేను నా వాచ్ తాకట్టు పెట్టాలా ... పిల్ల కొరివి దెయ్యమా ... నువ్ ఏం చేసుకుంటావో చేసుకో ... నేను నీకు కనీసం న్యూట్రిన్ ఆశ చాక్లెట్ కూడా కొనిపెట్టను పోవే " అన్నాను ఆవేశంగా ...
అది మళ్ళీ రాగం మొదలెట్టింది ... నేను ఆ రాగానికి తాళం వేశాను తప్పితే తగ్గలేదు ...
ఇక ఏమనుకుందో అదే కాళ్ళ బేరానికి వచ్చింది ... " సరేలే ...ఫైవ్ స్టార్ కొనిపెట్టు .." అంది ...
'ఏం కళలున్నాయే నీ దెగ్గర ... అందితే తల లేకపోతే తోక ..' అనుకొని ఫైవ్ స్టార్ కొని దాని మొహాన కొట్టి ...చకచకా నడుచుకుంటూ స్కూల్ ప్రాంగణంలోకి వచ్చాను ....బయాలజీ మహంకాళి ఎవరినో వంగోబెట్టి బాదుతుంది ... "ఈ రోజు వీడు అయిపోయాడు ....రేపు ఎవడో ?" అనుకుంటూ క్లాస్ కెళ్ళాను ...

                                                                **** మరుసటి రోజు *****

"ఏరా మా అమ్మాయిని కొట్టావంట... దాని బొమ్మని పగలగొట్టావంట... మాట్లడకుండా సైలెంట్ గా చదువుకుంటుంటే వచ్చి అరిచావంట... వళ్లెలా ఉంది.." అంది బయాలజీ మేడం నన్ను చూడగానే నా దెగ్గరికి వచ్చి ...
నాకు వాల్యుమ్ లేదు... 'అదేంటి ఈ పిల్లకి పది రూపాయల చాక్లెట్ కొనిపెట్టినా ఈ మహంకాళికి అడ్డమైనవన్నీ చెప్పేసిందనమాట.. కొరివి దెయ్యమా అయిపోయావే..' అనుకొని "అయ్యో అదేం లేదు మేడం ... నేను అలా ఎందుకు చేస్తాను ... పాప కొంచెం చిలిపి... అందుకే అలా చెప్పింది .." అన్నాను ...
"పాప చిలిపో... నేను చిలిపో రేపు బయాలజీ ఎగ్జాం రిజల్ట్స్ లో తెలుస్తుంది నీకు .... దానికోసమే దుడ్డు కర్ర రెడీ చేశా ..." అంది నా వైపు అమ్మోరికి బలిచ్చే మేకను చూసినట్టు ...

నాకు మహంకాళి చెప్పిన మాటలకు భయం కన్నా ఆ పిల్ల పిశాచం చేసిన మోసమే నాలోని ఎస్పీయల్ ని ఉస్కో అని లేపింది ... యుద్ధ రంగంలోకి దూకినట్లు ఆ పిల్ల పిశాచం ఉండే సెకండ్ క్లాస్ వైపు లంఘించాను... క్లాస్ లో అడుగెట్టి చుట్టూ చూశాను .. ఆ పిల్ల చాక్లెట్ తింటూ బొమ్మకి వాటర్ బాటిల్ లోని నీళ్ళు గుమ్మరించి స్నానం చేయిస్తుంది ... నాకు తిక్కరేగి దాని దెగ్గరికి వెళ్లి .. "ఏమే పిల్ల పిశాచమా ... నిన్న పది రూపాయల చాక్లెట్ కొనిపెట్టినా కూడా మీ అమ్మకి నా మీద లేనిపోనివి చెప్తావా ... ఏమనుకున్నావే నా గురుంచి .."
"నువ్వేమనుకున్నావ్ ... నాకు కిట్ క్యాట్ కొనకుండా ఫైవ్ స్టార్ కొంటావా ...పైగా నన్నుదెయ్యం పిశాచం అంటావా ... అందుకే అమ్మకి చెప్పా ..." అంది నా వైపు కూడా చూడకుండా ...
నాకు బీపీ రైజ్ అయ్యి ఆ పిల్ల బొమ్మని మళ్ళీ లాక్కొని ఈ సారి నేరుగా కిటికీ గుండా విసిరి అవతలికి వేసాను .. అంటే, కిటికీ అవతలికి వెయ్యాలనుకోలేదు ...కానీ నా కోపం అది ఇంధనంగా చేసుకొని అలా వెళ్ళిపోయింది అనమాట ... అప్పుడు సడన్ గా తెలిసొచ్చింది నేను చేసిన తప్పు... ఈ పిల్ల పిశాచం కింద పడి దొర్లి దొర్లి ఎడుస్తుంది... నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది .. ఈ లోపు ఆ క్లాస్ సీపియాల్ గాడు "సార్ నేమ్స్.." అంటూ నా చేతిలో ఒక కాగితం పెట్టాడు ... అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని మా క్లాస్ అరుణ దెగ్గరికి వెళ్లాను ....ఈ సారి పదిహేను రూపాయలు అడగడానికి....


See you all soon, have a great day ------------------------------- Ramakrishna Reddy Kotla

Wednesday, October 20, 2010

తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ... 2

"అమ్మాయిని ఏమన్నా అడగాలి అనుకుంటే అడుగు బాబూ..." అన్నాడు పిల్ల తండ్రి పైపంచె సర్దుకొని జరిగి కూర్చుంటూ...
"నేను అమ్మాయితో మాట్లాడాలి....ఏకాంతంగా..." అన్నాడు సుధాకర్..
ఆ మాటకి ఆ అమ్మాయి తలెత్తి వాడి వైపు చూసింది భావరహితంగా...
"మన పెరటిలోకి వెళ్లి కాసేపు మాట్లాడుకొని రండమ్మా..." అంటూ కూతురికి చెప్పాడు..
ఆ అమ్మాయి, సుధాకర్ పెరటి లోకి వెళ్ళారు...

"అబ్బో...మీ పెరటిలో చాలా రకాల చెట్లు ఉన్నాయే...ఓహో నిమ్మ చెట్టు కూడా..."
"అది...ఉసిరి" అందామె పెదాలు విడివడకుండా నవ్వీనవ్వనట్లుండి..
"ఉసిరా...ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మా బామ్మ వాళ్ళింట్లో..పెద్దయ్యాక చాలా మారిపోయింది సుమండీ...అందుకే గుర్తుపట్టలా.." అంటూ కొంచెం ముందుకు వెళ్లి "ఓహో...నాకు దానిమ్మ అంతే ఎంత ఇష్టమో..." అన్నాడు ఓ చెట్టు పైకి తదేకంగా చూస్తూ...
"అది...బత్తాయి.." అంది...
"ఆ...ఆ...బత్తాయే...పండు దూరంగా ఉంది కదా...సైజూ...షేపు సరిగ్గా అర్థంకాలా..." అనుకుంటూ చుట్టూ చూసి..అటు ప్రక్కగా ఏదో చిన్న చెట్టు కనిపించగా దాని దెగ్గరికి వెళ్లి దానికి కాసిన చిన్న చిన్న పండ్లను ఓ రెండిటిని తెంపాడు..."రేగ్గాయలు తిని ఎన్ని రోజులయిందో..." అనుకుంటూ నోట్లో పెట్టుకోబోతుంటే...
"చస్తారు..." అన్న మాట బుల్లెట్ లా రావడంతో పండు తినబోయిన వాడు ఖంగుతిని ఆమె వైపు చూశాడు ...."అయ్యో...అవి తినకండీ..చచ్చిపోతారు...అవి రేగ్గాయలు కాదు..అవి విషపు ఫలాలు..మా నాన్నారు ఎక్కడినుంచో తెచ్చి అవి నాటారు...ఈ మధ్య కుక్కలూ పందులూ పెరటి మీద పడి దొరికిన పండు తింటుంటే, అవి నాటారు...ఒక్కసారి ఆ పళ్ళు తింటే అవి మళ్ళీ మా పెరటి వంక చూడవు..." అంది కంగారుగా ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అని...సుధాకర్ కి తనని కుక్కలు పందులతో పోల్చిందేమో అన్న అనుమానం వచ్చింది..

సుధాకర్ మనస్సాక్షి వెంటనే వాడి ముందు అక్కడే ప్రత్యక్షమయ్యి "థూ...నీ బతుకు...కనీసం వందో పెళ్లి చూపులు అయినా నీకు సెట్ అయ్యిద్దనే నమ్మకం నాకు లేదు...అసలు ఇక్కడ ఏం జరుగుతుంది... వ్యవసాయదారుల కార్యక్రమమా? లేక పెళ్లి చూపులా?...ఈ పండు ఏంటి.. ఆ కాయ ఏంటి.. ఆ చేట్టేంటి.. ఈ పుట్టేంటి?...అవసరమా నీకు??..పక్కన అమ్మాయిని పెట్టుకొని పక్కింటి పకోడీల వాసన గురుంచి ఆలోచించే తిండిబోతు ఎదవా...రాత్రి మొత్తం కష్టపడి రాసిపెట్టుకున్న మెటీరియల్ ని ఉపయోగించరా.."  అనడంతో వెంటనే బల్బు వెలిగి మెటీరియల్ కోసం జేబులో చెయ్యి బెట్టి బయటకి తీశాడు...అంతలో క్రిష్ణ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.."ఒరేయ్ సుధా...అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడే ముందు, ఏదో ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేసి బయటకి వెళ్లి, ఒక సారి రాసుకున్న పేపర్ మొత్తం రివైస్ చేసి...ఆ తర్వాత ఇక ఆ అమ్మాయితో అనర్గళంగా మాట్లాడు...విజయోస్తు...కళ్యాణ మస్తు.."

"ఏమిటా పేపర్..." అంది ఆ అమ్మాయి...
"ఇదా...అదీ...ఆ...మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కిట్టు అని, పెద్ద ఎదవ...సుస్మీ అనే అమ్మాయి కోసం ఏదో జావా ప్రోగ్రాం కావాలంటే పేపర్ లో రాసుకొచ్చా...తర్వాత వాడికి ఇవ్వాలి..."
"నాకు జావా బాగా వచ్చు...ఏదీ ఓ సారి చూపించండి..."
"ఆ..అదీ.. ఇంకా దీనిలో కొన్ని కరక్షన్స్ చెయ్యాలి...బాత్రూం ఎక్కడుంది?"
"బాత్రూంలో కరక్షన్స్ చేస్తారా?"
"ఛి ఛి కాదండీ...మెన్స్ ప్రాబ్లం..."
"విమెన్స్ ప్రాబ్లం విన్నాను...ఈ మెన్స్ ప్రాబ్లం ఏంటి?"
"మీరు మరీను... పరాయి అమ్మాయితో ఆ విషయాలు ఎలా చెప్పమంటారు...బాత్రూం ఎక్కడో చెప్పండీ..."

బాత్రూంకి వెళ్లి పేపర్ తీసి, మొత్తం రివైస్ చెయ్యడం మొదలెట్టాడు సుధాకర్...ఒక రెండు మూడు సార్లు మొత్తం సంతృప్తికరంగా చదివి బయటకి వచ్చాడు....
ఆ అమ్మాయి ముఖంలో ఒక విసుగు కనిపించింది సుధాకర్ కి...
"సారీ... కొంచెం లేట్ అయ్యింది.. ప్రాబ్లం కాస్త క్రిటికల్ ...అందుకనే?"
"అవునా!!...కొంపదీసి మీకు అది పని చెయ్యడంలేదా?..."
"వ్వాట్??...ఏది...??" సుధాకర్ ముఖం లో కంగారు...ఎక్కడలేని ఆందోళన...
"అదే...మా బాత్రూంలో వాటర్ టాప్ అప్పుడప్పుడు పని చెయ్యదు...అందుకే లేటేమో అనుకున్నా .."
"అదా...హమ్మయ్యా...లేకపోతే ఆ విషయం ఈ పిల్లకెలా తెలిసిందబ్బా అనుకున్నా..." అన్నాడు గుండె మీద చేయ్యేసుకుంటూ..
"ఏ విషయం....??"
"అనేశానా...బయటకి అనేశానా...ఈ మధ్య నోరు అస్సలు కంట్రోల్ లో ఉండట్లేదు...ఏమీ లేదు లెండి....ఇక మనం ఒకరి ఇష్టాఇష్టాలు మరొకరం తెలుసుకుందామా?" అన్నాడు..
"అలాగే..."
"నాకు...చికెన్ బిర్యాని అంటే చాలా ఇష్టం...నాన్ వెజ్ అంటే పడి చస్తాను..ఇంకా స్వీట్స్ అంటే చాలా ఇష్టం..మరి మీకు?"
"నేను నాన్ వెజ్ అస్సలు తినను... అదంటేనే పరమ అసహ్యం...స్వీట్స్ కూడా తినను...హాట్ అంటే ఇష్టం.." అందామె మొహం అదోలా పెడుతూ...సుధాకర్ కి మొదటి షాక్ తగిలింది...ఈ అమ్మాయి ఇలా జవాబు ఇవ్వకూడదే...ఇదేంటి రివర్స్ లో చెప్తుంది అనుకొని "నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం... అలాగే.... సందు ప్రక్కన పానీ పూరి బండీ, వర్షంలో పకోడీ, కమ్మని నూగుజీడీ, పడుకునేప్పుడు మాంచి మెలోడీ....చాలా ఇష్టం ..."అన్నాడు 
"నాకు పింక్ ఇష్టం... పానీ పూరీ, పకోడీ లాంటి జంక్ అంటే జంకు నాకు... నేను కేలరీ కాన్షియస్..." అంది...
'ఓరి బాబోయ్ ఏంటి అన్నీ ఇలా రివర్స్ కొట్టేస్తున్నాయి...నాకు మైండ్ దొబ్బి అప్పుడే మర్చిపోయానా...ఓ సారి మళ్ళీ రివైస్ చేసుకుంటే బెటర్' అనుకొని..."ఒక్క నిమిషం అండీ....మళ్ళీ బాత్రూం అర్జెంట్...ఇప్పుడే వస్తాను..." అంటూ బాత్రూంకి వెళ్లి పేపర్ ఓపెన్ చేసి, టకా టకా మొత్తం రివైస్ చేసాడు...తాను చెప్పింది మొత్తం కరెక్టే... మరి ఈ పిల్లేంటి అంతా రివర్స్ లో చెప్తుంది అనుకొని కొంచెం అయోమయంగా బయటకి వచ్చాడు...

"ఏంటి మీ ప్రాబ్లం అంత క్రిటికలా...మళ్ళీ మళ్ళీ బాత్రూంకి వెళ్తున్నారు..."
"మీరు దయచేసి ఆ ప్రాబ్లం గురుంచి ఎత్తకండి ప్లీజ్ ...ఇకపోతే నాకు క్రికెట్ అంటే చిరాకు...టెన్నిస్ చాలా ఇష్టం...షరపోవా కనిపించి చచ్చిపోవా అంటే టైం కూడా చూసుకోకుండా నా ప్రాణం వదిలేస్తా ..అంత ఇష్టం..." అన్నాడు 
"నాకు క్రికెట్ అంటే ప్రాణం... సాయిబాబా తరువాత నాకు సచినే దేవుడు... టెన్నిస్ అంటే బోర్... అస్సలు చూడను..." అంది..
సుధాకర్ నమ్మలేనట్లుగా చూస్తున్నాడు...ఈ అమ్మాయి ఏంటి అన్ని ఇలా చెప్తుంది...కృష్ణ అంతా రివర్స్ గా చెప్పాడా నాకు ఈ అమ్మాయి గురుంచి అనుకుంటూ .."మీరు జోక్ చేస్తున్నారు కదూ...మీకు క్రికెట్ అంటే చిరాకు అని నాకు తెలుసు... సచిన్ దేవుడా వాడి మొహం...పొట్టోడికి అంత లేదు...వాడి మొహానికి...." అంటున్న సుధాకర్ మాట పూర్తి కాలేదు...దవడ పగిలిపోవడం మాత్రం పూర్తయింది...

                                                            ********

చిరాగ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు....ఇక జన్మకి పెళ్లవుద్ది అన్న నమ్మకం పోయింది సుధాకర్ కి...
కృష్ణకి కాల్ చేసాడు...
"ఏమయింది సుధా..."
"దవడ పగిలింది నాధా..."
"అదేంటి??...అసలేమయింది?"
"అరవ పెళ్ళికి అరువు బ్యాండ్ మేళం అయ్యింది..."
"అర్థం అయ్యేలా చెప్పు ..."
"ఒరేయ్...నువ్వు చెప్పినట్లే అన్నీ పేపర్ లో రాసుకొని, ఆ పిల్ల ఇంట్లో బాత్రూంకి వెళ్లి మరీ రివైస్ చేశాను రా... కానీ అవన్నీ ఒక్కటి కూడా మ్యాచ్ కాకపోగా పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.. "
"అదేంట్రా....నువ్వు చెప్పిన స్రవంతి గురుంచి పూర్తిగా కనుక్కొని...ఆమె చదివే సెయింట్ ఆన్స్ కాలేజీలో ఆమె స్నేహితులు ఒక ముగ్గురు నలుగురి వద్ద అవన్నీ రూడీ చేసుకొని మరీ తాయారు చేశాను కదా నివేదిక... తప్పయ్యే ఛాన్స్ లేదు..."
"నివేదిక తయారు చేసావా...నేను వచ్చాక నిన్ను కప్పెట్టటానికి పెద్ద గోతి తయారు చేస్తాను... నేను చెప్పిన అమ్మాయి పేరు స్రవంతి కాదు వసంత... సెయింట్ ఆన్స్ కాదు సెయింట్ మేరీస్...ఆ దిక్కుమాలిక స్రవంతి సీరియల్ చూడకురా అంటే వినవు... అది చూసినప్పటినుంచి నీకు ప్రతి పేరు స్రవంతి లాగే వినిపించి ఏడుస్తుంటే మేమేం చెయ్యాలి..." అన్నాడు తలని స్టీరింగ్ కేసి బాదుకుంటూ...
"అయ్యయ్యో అవునా!!...పొరపాటు అయిందిరా...ఈ సారి మ్యాచ్ ఫిక్సింగ్ అయినా చేసి నీకు మేచ్ ఫిక్స్ చేసేస్తా చూడు..."
"వద్దు బాబు...నువ్వు ఏ ఫిక్సింగూ చెయ్యొద్దు...ఇక నాకు పెళ్ళీ కాదు...కనీసం దవడ పగలకుండా చూసుకుంటా..." అంటూ ఫోన్ పెట్టేసాడు సుధాకర్...

ప్రపంచంలోని బాధ మొత్తం తన ముఖంలో చూపిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు సుధాకర్... పెళ్ళికి పిలవని అతిధిలా వర్షం రంగ ప్రవేశం చేసింది... ఆ వర్షం చూడగానే కొంచెం ఉత్సాహం వచ్చింది సుధాకర్ కి...అసలు పెళ్లి కాకపోతే వచ్చే నష్టం ఏంటి?..అసలు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు... ముఖ్యంగా ఎదవ నస ఒకటి ఉండదు లైఫ్ లాంగ్... కింగులా బ్రతకొచ్చు... ఎవ్వరినైనా ఎప్పుడైనా సైట్ కొట్టొచ్చు... ఎంత నైట్ అయినా ఎక్కడైనా షికార్లు చెయ్యొచ్చు...ముఖ్యంగా నా సెలరీ మొత్తం నేనే ఎంజాయ్ చెయ్యొచ్చు... అసలు ఇన్ని బెనఫిట్స్ పెట్టుకొని ఇంకా పెళ్లి అంటూ చూపుల చుట్టూ తిరగడం ఎందుకు.... ఎస్...యాం లైఫ్ లాంగ్ బ్యాచ్లర్...లైఫ్ ని ఇక నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తాను... పెళ్లి చేసుకుంటే...వైఫ్..పిల్లలు...వాళ్ళకి ఫెరేక్స్ లు.. పాల డబ్బాలు... టైమూ పాడూ లేకుండా వాళ్ళు ఇంట్లో ప్రకృతి కార్యక్రమాలు వెలగబెడితే వాటిని క్లీన్ చెయ్యడాలూ..స్కూల్స్..ఫీజులు.. అమ్మో ఇలా ఆలోచిస్తే అంతే ఉండదు... అసలు హేపీగా ఇలా ఉంటే పోలా...అసలు మనం ఎవరికీ నచ్చకపోవడం కూడా మన మంచికే...ఈ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాలి...ఇలా ఆలోచిస్తుండగా...ఎవరో ఒక అమ్మాయి ...చెయ్యి ఊపుతూ లిఫ్ట్ అడగటం లీలగా కనిపించింది...
సుధాకర్ కార్ ఆపి డోర్ ఓపెన్ చేసాడు....
"చాలా థాంక్స్... వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు...కొంచెం దెగ్గరలోని బస్ స్టాప్ దెగ్గర డ్రాప్ చేస్తారా?"
"మీరు ఎక్కడికి వెళ్ళాలి?"
"పంజగుట్ట.."
"నేను అటువైపే వెళ్తున్నాను....డ్రాప్ చేస్తాను..."
"థాంక్స్..."
"ఇట్స్ ఓకే..."
డ్రైవ్ చేస్తూనే ఆ అమ్మాయిని కంటి చివరినుండి చూశాడు పరీక్షగా.... వైట్ కలర్ టాప్ బ్లూ జీన్స్.. టాప్ మీద లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా సింపుల్ గా ఉంది...వర్షంలో తడిచిందేమో హెయిర్ ని లూస్ గా వదిలింది... చేతితో మెల్లిగా హెయిర్ ని సవరించుకుంటూ ఒక్కసారిగా సుధాకర్ వైపు తిరిగింది.. దొంగచాటుగా ఆ అమ్మాయినే అబ్సర్వ్ చేస్తున్న సుధాకర్ వెంటనే సర్దుకొని డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చెయ్యడం మొదలెట్టాడు... అమ్మో ఈ అమ్మాయిలు ఆల్కహాల్ కన్నా డేంజరస్ వెంటనే అడిక్ట్ చేసేసుకుంటారు... అనుకుంటూ...డ్రైవ్ చేస్తుండగా ఒక దెగ్గర పకోడీల బండి చూసి దాని దెగ్గరిగా కార్ ఆపి...
"పకోడీలు తింటారా?" అని అడిగాడు...
"వావ్...నాకు వర్షంలో పకోడీలు తినడం చాలా ఇష్టం..." అందామె...
సుధాకర్ కి ఎందుకో ఆశ్చర్యం వేసింది... ఇందాక చూసిన పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి ఇలా చెప్పి ఉంటే బాగుండు అనుకున్నాడు..కానీ అది రివర్స్ అయ్యింది... ఇప్పుడు తనకి నిజంగానే పకోడీలు తినాలనిపించి ఆపి ఆమెని కూడా అడిగాడు... అలా ఆ టైంలో ఆమెకి కూడా పకోడీలు తినడం ఇష్టం అని తెలిసి ఆశ్చర్యం వేసినా తరువాత ఆనందం కలిగింది...
"నాకు కూడా...మీరు కార్ లోనే ఉండండీ నేను పట్టుకొస్తా..." అంటూ దిగి వెళ్లాడు...
సుధాకర్ తెచ్చిన వేడి వేడి పకోడీలు తింటూ  "వావ్... వర్షంలో పకోడీలు ఇంకా టేస్టీగా ఉంటాయి కదా... థాంక్స్ అండి.." అంది...
"డోంట్ మెన్షన్.... " అన్నాడు
"అక్చువల్ గా ఈ రోజు షరపోవా Vs సెరీనా టెన్నిస్ మ్యాచ్ ఉంది వింబుల్డన్ ఫైనల్... అది మిస్ అవ్వకూడదు అనే మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను....షరపోవా అంటే నాకు చాలా ఇష్టం ..." అంది
ఒక్కసారిగా పొలమారింది సుధాకర్ కి.... షాక్ తిన్నట్లు ఆమె వైపే చూస్తూ...ఎదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా "నాకు కూడా...షరపోవా చచ్చిపోవా అంటే టైం కూడా చూసుకోకుండా ప్రాణం వదిలేస్తా..." అన్నాడు...
"వావ్ నిజమా... మన టెస్టులు భలే కలిసాయే.." అంది నవ్వుతూ...
సుధాకర్ కి ఆమె అలా నవ్వుతుంటే చూడాలి అనిపిస్తుంది... ఒక్కసారిగా సుధాకర్ కి ఆమె చాలా అందంగా కనిపించింది...
"మీ షర్ట్ బాగుంది....ఎందుకంటే బ్లూ కాబట్టి ...నాకు బ్లూ అంటే చాలా ఇష్టం...నా వార్డ్ రోబ్ లో సగం బ్లూ క్లాత్స్ ఉంటాయి..." అంది...
"నాకు కూడా బ్లూ ఇష్టం అందుకే వేసుకున్నాను..." అన్నాడు ...నిజానికి సుధాకర్ కి బ్లూ ఇష్టం లేదు...కానీ ఈ అమ్మాయిని వదులుకోవడం కూడా ఇష్టం లేదు... ఇందాక సింగిల్ గానే లైఫ్ లాంగ్ ఉందామనుకున్న సిల్లీ థాట్ ని గాలికి వదిలేసి, గుండెలో ఈ అమ్మాయికి ఒక కుర్చీ అరేంజ్ చేసాడు ....

"నాకు చికెన్ బిర్యాని అంటే ప్రాణం...స్వీట్స్ అంటే పడి చస్తాను ...మరి మీరు? " అన్నాడు సుధాకర్ తన అంచనా తప్పు అవ్వదు అనే ధీమాతో...
"వావ్ నాకు కూడా... నిజంగా మన అబిప్రాయాలు ఎంత బాగా కలిశాయో కదా..." అంది చిన్న పిల్లలా నవ్వుతూ...
ఆ క్షణం సుధాకర్ కి తెగ ముద్దొచ్చింది ఆ అమ్మాయి ... ఎంత కష్టమైనా సరే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు స్టీరింగుని బలంగా నొక్కుతూ....
కాసేపు...అవి ఇవీ మాట్లాడుకున్నాక పంజగుట్ట వచ్చారు...
"ఇక్కడ ఆపండి...దెగ్గరే మా ఇల్లు ...చాలా థాంక్స్ " అంది..
"మీ పేరు అడగటం మర్చిపోయాను .." అన్నాడు
"స్రవంతి"
"మీ కాలేజీ ..." అని అడిగాడు కృష్ణ చెప్పిన స్రవంతి పేరు గురుంచి ఆలోచిస్తూ
"ఏం...కాలేజీకి వచ్చేస్తారా ...సెయింట్ ఆన్స్ .." అంది నవ్వుతూ ....
సుధాకర్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ...

                                           *******

కళ్యాణ మండపం బంధుమిత్రులతో సందడి గా ఉంది...
కృష్ణ గాడు సరాసరి సుధాకర్ రూమ్ కి వచ్చాడు ...
"ఏరా...పెళ్ళికి కనీసం మూడు రోజుల ముందు రమ్మంటే ...కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడా రావడం .." అన్నాడు సుధాకర్ కృష్ణని చూసి ...
"నువ్వు మాత్రం ...ఆరోజు నేను చేసిన మిస్టేక్ కి ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉండి...సడన్ గా నా పెళ్లి అంటే నాకు ఎలా ఉంటుందిరా ..." అన్నాడు నొచ్చుకుంటూ ...
"సారీరా అన్నీ అలా ఫాస్ట్ గా జరిగిపోయాయి ..."
"హమ్...అది సరే...నువ్వు ఆ రోజు ఫోన్ లో తిట్టిన తిట్లకు స్రవంతి సీరియల్ చూడటం మానేశాను రా...కానీ అదేంటో, ఎవరు ఏ పేరు చెప్పినా స్రవంతి అని వినపడటం పక్కన పెడితే, ఏ పేరు రాసినా స్రవంతిలా కనిపిస్తుందిరా బాబూ....ఆ సంఘటన ఇప్పుడే జరిగింది ...నీ పెళ్లి మండపంలోనే ... సుధాకర్ వెడ్స్ స్రవంతి అని కనిపించిందిరా నాకు ..."
ఆ మాటకు ఫక్కున నవ్వాడు సుధాకర్ ..
"చూడు ముకుందా...నా పెళ్లి జరిగేది స్రవంతి అనే అమ్మాయితోనే...నీకు ఇంకో ఇంటరెస్టింగ్ విషయం చెప్పనా ...ఆ రోజు నా పెళ్లి చూపులకోసం నువ్వు ఇన్ఫర్మేషన్ లాగిన స్రవంతి....ఇప్పుడు నేను చేసుకోబోతున్న స్రవంతి ఒక్కరే... నువ్వు వసంత గురుంచి లాగాల్సిన ఇన్ఫర్మేషన్ స్రవంతి గురుంచి లాగడంతో ఆ పిల్ల లాగి దవడ పగలగొట్టింది.....కానీ అదే ఇన్ఫర్మేషన్ ఈ రోజు నా పెళ్ళికి కారణం అయ్యింది ..." అన్నాడు ..
దెబ్బకి షాక్ తిన్నాడు కృష్ణ...
"అదెలా?"
"తాళి కట్టి వచ్చాక తీరిగ్గా చెప్తాను ....నువ్వెళ్ళి భోజనం చెయ్యి....అటు వైపు ...లెఫ్ట్ కి ...."

                                                    ****** నమస్తే *******       
Hope you all had a great Dussehra and enjoyed the festival ---- Ramakrishna Reddy Kotla      

Monday, September 27, 2010

తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకోమన్నదీ నిన్ను తన చేయి.."

రివైండ్...ప్లే...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకోమన్నదీ నిన్ను తన చేయి.."

రివైండ్...ప్లే...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకో...."

"ఎన్నిసార్లు అందుకోమంటుందిరా తన చేయి...ఏం పాపం నడుమునోప్పులా...లేవలేదా..." అన్నాను స్టీరియో ఆపుచేస్తూ...
"నేను సీరియస్ ..జోకులు ఆపు..." బుంగమూతి పెట్టాడు సుధాకర్..
"అబ్బో...అట్టాగాండీ..రేణిగుంట రైల్వేస్టేషనులో ప్లాట్ఫారం టీవీలాగా నిముషానికి ఓ సారి పాటలో పల్లవేసి అడ్వర్టైజుమెంట్లు వేసి రివైండ్ చేసి మళ్ళి అదే పల్లవి వేస్తుంటే...ఇందాకే ఎర్రగడ్డకి కాల్ చేద్దామని ఎందుకో ఆగిపోయా..."
కోరకోరా చూశాడు సుధాకర్...

"లేకపోతే అరిగిపోయిన రికార్డులా..తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అంటూ పదే పదే అదే వాయించి సంపుతున్నావ్...ఫ్రెష్ గా పిచ్చెక్కిందా...మీ నాన్న కొత్త సంబంధం ఏమన్నా తేచ్చాడా ఏమిటీ..." అన్నాను నవ్వు ఆపుకుంటూ...
"ఇక నాకు పెళ్లి జరుగుతుంది అన్న ఆశ చచ్చిపోయిందిరా కృష్ణా...ఆ పాటలో లాగా ఏదన్నా తెలుగమ్మాయి తన చేయి అందుకోమంటుందేమో అన్న ఆశతో అదే లైన్ అన్ని సార్లు వింటున్నానురా..."
"హమ్...ఏంటీ మళ్ళీ ఫ్లాపా..."
"అది నా ఫేస్ చూస్తే తెలియట్లేదటరా...."
"తెలుస్తుంది...అరకేజీ ఆముదం త్రాగినట్లుంది..."
"మరే...నిజమే...ఏమిటో ఏ అమ్మాయికీ నేను నచ్చడం లేదురా...ఎందుకో..త్వరలో అర్థసెంచురీ పూర్తి అయ్యేలా ఉంది సంబంధాలలో..."
"నువ్వు నచ్చకపోడానికి ఏముంది..చూడ్డానికి పర్లేదు బాగానే ఉంటావు...సాఫ్టువేర్ జీతగాడివి..బట్టతల లేదు..అంత పొట్టీ కాదు..."
"ఏమోరా...అదే తెలియడం లేదు..ఇంటర్వ్యు అయ్యాక ఫీడ్ బ్యాక్ అడగొచ్చు..పెళ్లిచూపులు అయ్యాక ప్రాబ్లం ఏంటని అడగలేం కదా..."
"అడగాలి...అప్పుడు ప్రాబ్లెం ఏంటో తెలుస్తుంది..దాన్నిబట్టి తర్వాత మ్యాచ్ కి నెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.."
"ఏమోరా...అడగాలంటే అదోలా ఉంటుంది, ఏం వినాల్సివస్తుందో అని..నేను మీకు ఎందుకు నచ్చలేదు అని అడగటం చాలా కష్టమైన పనిరా కృష్ణా..."
"కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు..."
"ఆడపిల్ల లేనిదే నాకు పెళ్ళీ కాదు...సోదాపి సమస్యకో మార్గం చెప్పు ముకుందా.." వేడుకోసాగాడు సుధాకర్..


"నువ్వు చివరిసారిగా షూటింగ్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఎవరు..."
"పేరు శ్వేత...హైదరాబాద్ లో వర్కింగ్.."
"ఆ అమ్మాయి నంబర్ ఉందా..."
"నాదేగ్గర లేదు...మా నాన్న దెగ్గర ఉంది..అది కూడా వాళ్ళ ఇంటి నంబరు..."
"గాలి గొట్టంలా ఎదిగావ్...ఆ మాత్రం షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఏదోలా నంబర్ తీసుకోవాలని తెలీదా..సరే, నువ్వు షూటింగ్ కి వెళ్ళిన హీరోయిన్లలో ఏ హీరోయిన్ నంబర్ అయినా ఉందా..."
"ఆ ముగ్గురిది ఉంది..."
"గుడ్...మొదటి హీరోయిన్ కి కలుపు..."
"ఏంటి కలిపేది బ్రూ కాఫీ...ఆ పిల్ల నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది.."
"పాపి కొండల్లో పాప్ కార్న్ అమ్ముకొనే పాపిష్టి సుంఠ...ఆ పిల్ల మర్చిపోతే నువ్వు గుర్తుచేయ్యి...ముందు కలుపు.."
చేతులు వణుకుతుండగా, సుధాకర్ ఆ అమ్మాయికి ఫోన్ కలిపాడు...


"హలో.."
"హలో...నా పేరు సుధాకర్ అండి..నేను "
"ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ పర్సనల్ లోన్స్...డోంట్ వేస్ట్ మై టైం.."
"ఛీ ఛీ...నేను క్రెడిట్ కార్డులో..పర్సనల్ లోన్లో అమ్ముకొనేవాడిని కాదండీ...నేను.."
"కన్సల్టెన్సీ నుండి కాల్ చేస్తున్నావా..యాం నాట్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్.."
"హబ్బా...నన్ను చెప్పనివ్వండి...నేను మిమ్మల్ని.."
"కొంపదీసి ప్రేమిస్తున్నావా...టూ లేట్ నాకు ఈ మధ్యనే పెళ్లయింది.."
"ఓరి భగవంతుడా..."
"ఏంటీ నాకు పెళ్ళయితే అదేదో పాపంలా ఓరి భగవంతుడా అంటున్నావ్...వళ్లెలావుంది..."
"అయ్యో నేనలా అనలేదండీ..మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు..."
"నిన్ను నేను ఎందుకు అర్థం చేసుకోవాలి...ఎవడివి నువ్వసలు.."
"హమ్మయ్యా...ఇప్పుడైనా ఎవడని అడిగారా..సంతోషం..నా పేరు సుధాకర్...నేను.."
"సుధాకర్ నువ్వా...ఎన్ని రోజులకి చేశావ్..భార్గవి బాగుందా..నీ గొంతు గుర్తుపట్టలేదు సుమీ..ఏమనుకోకు..మా అయన రోజూ అంటున్నాడు, ఈ సుధాకర్ అసలు కాలే చెయ్యట్లేదు అని..రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారటగా మా ఆయన దెగ్గర..పాపం ఆయనకీ అవసరమట..మీ దెగ్గర ఉంటే ఇచ్చేయండీ.."
"రెండు లక్షలా!!...ఏవండీ మీరు ఏదీ పూర్తిగా వినడం లేదు...నేను రెండు లక్షల్ని కాదండీ...ఛి ఛి..నేను సుధాకర్ ని కాదండీ...ఛి ఛి...నేను మీరనుకునే సుధాకర్ కాదండీ.."
"కాకపోతే ఎందుకు చేశావ్...ఈవ్ టీజింగ్ కేస్ పెట్టమంటావా!!.."
"వామ్మో..కాదండీ..ఒక్క సెకండ్ నేను చెప్పేది వినండీ...ఒక ఆరేడు నెలల క్రితం మిమ్మల్ని పెళ్లి చూపులు చూశాను నేను..నా పేరు సుధాకర్..అదే, మీ ఇంట్లో పాలకోవా, మైసూర్ పాక్ బాగున్నాయి అని చెప్పి నా ప్లేటే కాకుండా మా చెల్లి ప్లేట్ మా అమ్మ ప్లేట్ కూడా లాగేసుకొని తిన్నాను...గుర్తుందా..."
"దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు...అపుడేప్పుడో పెళ్లి చూపులు చూస్తె, ఇప్పుడు కాల్ చేశావేం.. ఓసారి ఎప్పుడో అనుకున్నట్లు గుర్తు పెళ్లి చూపులకి ఓ కుక్క బ్యాచ్ వాడు వచ్చాడు అని...బహుసా నిన్నేనేమో..."
"ఆ...అదీ...మరి...మీరు మరీను...ఎదో బాగున్నాయి అని తిన్నాను అంతే..అది మీకు కాంప్లిమెంటే..ఇంతకీ నేను ఫోన్ చేసిన కారణమేమిటంటే.."
"ఏముందీ...ఇంట్లో తిని కూర్చుని ఉంటున్నట్లున్నావ్..పని పాటా లేక కాల్ చేశావ్.."
"ఏమండీ..మీరు మరీ అలా అనకండీ..నన్ను పెళ్లి చూపులు అయ్యాక మీరు రిజక్ట్ చేశారు..దానికి కారణం తెలుసుకుందామని కాల్ చేశా..."
"అవునా..మరి ఇన్ని నెలలూ గాడిదలు మేకలూ కాశావా..ఇప్పుడే జ్ఞానోదయం అయిందా..అసలు నువ్వే నాకు గుర్తులేదు, ఇంకెందుకు రిజక్ట్ చేసానో ఏం గుర్తుంటుంది.."
కీక్...కీక్...

"ఏంట్రా పెట్టేసావ్..." అడిగాను నేను..
"ఒరేయ్ ఈ పిల్ల చాలా డామేజింగ్ గా మాట్లాడుతుందిరా..నా మనోభావాలు మంటల్లో కాలి బూడిద అయిపోయాయి..అది రిజక్ట్ చేసి మంచి పని చేసింది..లేకపోతే దానితో రెండు నిముషాలు ఫోన్ లోనే వేగలేకపోయాను..ఇక లైఫ్ లాంగ్ అయితే..అమ్మో..అసలు ఆ పిల్ల చెప్పేది ఏదీ పూర్తిగా వినదేంట్రా అదేం రోగమో..."
"అది రోగం కాదు డామినేషన్...నువ్వు చెప్పేది వినకుండా తను చెప్పేది నువ్వు వినాలి అనుకునే డామినేషన్...ఇలాంటి డామినేషన్ అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే,ఇత్తడే ఇక లైఫ్ అంతా...సరేలే కానీ, ఇంతకీ ఎందుకు రిజక్ట్ చేసిందో చెప్పిందా?"
"లేదురా...దానికి నేను అసలు గుర్తులేనంటా.."
"హమ్...ఉన్న నంబర్లలో రీసెంట్ గా చూసిన అమ్మాయి నెంబర్ కి కొట్టు..కొంచెం స్టైలిష్ గా మాట్లాడు..."
"అలాగే...సుప్రియ ఫ్రం సత్తెనపల్లి...దీనికి చేస్తున్నా..ఓ రెండు నెలల క్రితం చూసిన షూటింగ్ హీరోయిన్.."

"హలో..."
"యా హలో...దిస్ ఈజ్ సుధాకర్ ఫ్రొం విప్రో..యాక్చువల్లీ..."
"హలో...దిస్ ఈజ్ సుప్రియా..ఐ హావ్ డన్ బీటెక్ ఫ్రం నాగార్జున యునివర్సిటీ...అయాం ఫ్రం CSE బ్రాంచ్, ఐ హావ్ సెవెంటీ ఫైవ్ పెర్సెంట్ ఆగ్రిగేట్..మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, వాషింగ్ క్లోత్స్...అండ్..."
"అండ్...క్లీనింగ్ ఇల్లు...తోమింగ్ పళ్ళు..రుద్దింగ్ వళ్ళు...ఇంకేమీ లేవా??.మీ బయోడేటా నాకెందుకు చెప్తున్నారండీ.." విసుగు సుధాకర్ గొంతులో..
" ఇంటర్వ్యు చేసేప్పుడు బయోడేటా చెప్పాలి కదండీ.."
"ఇంటర్వ్యు ఏంటీ??"
"మీరు నన్ను ఇంటర్వ్యు చెయ్యడానికి కాల్ చెయ్యలేదా?"
"నా బొంద...ఎవరూ చెప్పేది సరిగ్గా వినిపించుకోరే...నేను మిమ్మల్ని ఈ మధ్య పెళ్లి చూపులు చూసాను...నా పేరు సుధాకర్...అదే మీ ఇంట్లో గారెలు పెట్టినప్పుడు దాని రంధ్రంలొ గులాబ్ జామ్ కూరుకొని తిన్నాను..గుర్తొచ్చిందా..మీరు నన్ను రిజక్ట్ చేసారు..అందుకు గల కారణం చెప్తారా.."
"ఏమోనండీ...నాకేం తెలుసు...మా నాన్నారు ఈ అబ్బాయి నీకు సరిపోడు..ఇంకో అబ్బాయిని చూద్దాం అంటే..అలాగే మీ ఇష్టం నాన్నారు అనేసి..."
"అనేసి వెళ్లి హాయిగా దుప్పటి కప్పుకొని బబ్బున్నావా...పెళ్లి చేసుకునేది నువ్వే కదా, మీ నాన్న ఎవరూ రిజక్ట్ చెయ్యడానికి...ఇకనయినా పెళ్లిలొ నీ నిర్ణయాలు నువ్వు తీసుకో.."
కీక్...కీక్...

"హమ్...లాభం లేదురా కృష్ణా...వర్కవుట్ అవ్వడం లేదు..."
"ఇలా కాదురా సుధా...ఒకపని చెయ్యి...ఈ సారి పెళ్ళిచూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నంబరు తీసుకో..ఒకవేళ ఆ అమ్మాయి రిజక్ట్ చేస్తే, వెంటనే అప్పుడే కాల్ చేసి అడుగు..సరేనా?"
"అలాగే..."

                                                          ****
"హలో.."
"హలో..నా పేరు సుధాకర్...నిన్న మిమ్మల్ని పెళ్లి చూపులు చూసాను కదా..మీరు నన్ను రిజక్ట్ చేసారు..కారణం ఏంటో తెలుసుకుందామని కాల్ చేశా.."
"సూటు బూటు వేసుకొని టిప్ టాప్ గా రావడమే కాదు...ప్యాంట్ కి జిప్ వేసుకున్నామా లేదా అని కూడా చూసుకోవాలి..దీన్ని బట్టి మీరు చిన్న చిన్న విషయాలలో చూపే అశ్రద్ధ కనిపిస్తుంది..అది నాకు నచ్చలేదు...పైగా, మీ ఎదురుగా నన్ను కూర్చోపెట్టారు..తల దించుకొని మీ వైపు చూస్తుంటే, సరిగ్గా వోపెన్ పోస్ట్ బాక్స్ కనిపించింది..దెబ్బకి షాక్ తగిలి తల పైకెత్తి మీ వైపు చూస్తుంటే, ప్రక్క నుంచి మా అమ్మ..అలా మరీ తలెత్తి చూడకు పొగరు అనుకుంటారు..కొంచెం తలదించి తన వైపే చూడు అని గుసగుసలు..నేనేమో తలెత్తలేక..దించి ఆ సీన్ చూడలేక చాచ్చాననుకో అరగంట సేపు.."
సుదాకార్ ఆ మాటతో సిగ్గుతో చితికి ఫోన్ పెట్టేసాడు...ఈ సారి పెళ్లి చూపులకి జిప్ పెట్టుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..అంతేకాదు...చిన్న చిన్న విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని సంకల్పించుకున్నాడు...

                                                         ****
తరువాతి పెళ్లి చూపులకు జిప్ పెట్టుకోవడం మర్చిపోకుండా వెళ్ళినా కూడా రిజక్ట్ చెయ్యబడ్డాడు సుధాకర్..
"హలో..."
"నేను సుధాకర్ ని...నిన్న పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసాను..నన్నెందుకు రిజక్ట్ చేసారు?"
"మీ చూపులు నాకు నచ్చలేదు...పెళ్లి చూపుల్లోనే సిగ్గులేకుండా అలా చూస్తే..ఇక మాములుగా మీరు ఎందరిని ఎలా చూస్తారో...మీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది..."
"నేను చూసానా...ఏం చూసాను...అసలు ఏమన్నా చూపించవా చూడ్డానికి...కింద నుంచి పైదాకా చీర చుట్టాక ఇంకా ఏముంటుంది చూడ్డానికి నా బొంద..."
"అదే..అదే..మీ మగ బుద్ది...నేను కావాలనే మీరు కూర్చున్న సోఫా ఎదురుగా ఉన్నా అలమరాలొ ప్లే-బాయ్ మ్యాగజైన్ పెట్టాను..పెళ్లి చోపుల్లో మీరు నన్ను పది సార్లు చూస్తే, మ్యాగజైన్ లొ బర్త్ డే సూట్ లొ ఉన్నా అమ్మాయిని వంద సార్లు చూసారు...నేను గమనిస్తూనే ఉన్నాను..." అంది 
సుధాకర్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...
ఫోన్ పెట్టేసాడు...ఈ సారి పెళ్లి కూతురిని తప్ప ఎవరినీ చూడకూడదు అని మళ్ళీ సంకల్పించుకున్నాడు...

                                                      ****

"ఆదిరా కృష్ణా జరిగింది..."
"మరేం పర్లేదు...పర్స్ మర్చిపోయినట్లు ఒక్కోసారి జిప్ పెట్టుకోవడం మరచిపోతుంటాం....కానీ అది కూడా ఒక సంబంధం చెడగొడుతుంది అని ఇప్పుడే తెలిసింది..అలాగే ఎక్స్ పోజ్ చేసే అమ్మయిలనూ చూస్తాము...ఇవేమీ పెద్ద నేరాలు కాదు ...ఇకనుండీ జాగ్రత్తగా ఉండు...మరో విషయం, పెళ్లి చూపులు సక్సెస్ కావాలంటే...పెళ్లి కూతురి గురుంచిన ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకో..ఆమె అభిరుచులు, ఆశయాలు, ఆవకాయ దబ్బా...ఇలాంటివన్నీ అనమాట..పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురితో కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడాలని అడిగి, ముందుగా ప్రిపేర్ అయిన మెటీరియల్ ఓసారి నెమరు వేసుకొని ఇక అనర్గళంగా ఆమె అభిరుచులు నీ అభిరుచులుగా..ఆమె ఆశయాలు నీ ఆశయాలుగా 'ఎన్ని జన్మలెత్తినా ఇతనే నాకు భర్తగా కావాలీ' అని ఆమె ఉన్నపళంగా అన్ని వ్రతాలూ చేసేలా ఒక స్పీచ్ కొట్టు...అంతే...నీకు పెళ్లి గ్యారంటీ.."
"ఐడియా అదిరింది....Game starts now..."


[టపా ఊహించిన దానికన్నా పెద్దగా రావడం మూలానా, ఈ భాగం ఇక్కడితో ముగించి...వచ్చే భాగంలొ ముగింపు ఇస్తాను...ఇది పూర్తి కల్పితం అని గ్రహించండి................మీ కిషన్ రెడ్డి]