Monday, September 27, 2010

తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకోమన్నదీ నిన్ను తన చేయి.."

రివైండ్...ప్లే...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకోమన్నదీ నిన్ను తన చేయి.."

రివైండ్...ప్లే...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకో...."

"ఎన్నిసార్లు అందుకోమంటుందిరా తన చేయి...ఏం పాపం నడుమునోప్పులా...లేవలేదా..." అన్నాను స్టీరియో ఆపుచేస్తూ...
"నేను సీరియస్ ..జోకులు ఆపు..." బుంగమూతి పెట్టాడు సుధాకర్..
"అబ్బో...అట్టాగాండీ..రేణిగుంట రైల్వేస్టేషనులో ప్లాట్ఫారం టీవీలాగా నిముషానికి ఓ సారి పాటలో పల్లవేసి అడ్వర్టైజుమెంట్లు వేసి రివైండ్ చేసి మళ్ళి అదే పల్లవి వేస్తుంటే...ఇందాకే ఎర్రగడ్డకి కాల్ చేద్దామని ఎందుకో ఆగిపోయా..."
కోరకోరా చూశాడు సుధాకర్...

"లేకపోతే అరిగిపోయిన రికార్డులా..తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అంటూ పదే పదే అదే వాయించి సంపుతున్నావ్...ఫ్రెష్ గా పిచ్చెక్కిందా...మీ నాన్న కొత్త సంబంధం ఏమన్నా తేచ్చాడా ఏమిటీ..." అన్నాను నవ్వు ఆపుకుంటూ...
"ఇక నాకు పెళ్లి జరుగుతుంది అన్న ఆశ చచ్చిపోయిందిరా కృష్ణా...ఆ పాటలో లాగా ఏదన్నా తెలుగమ్మాయి తన చేయి అందుకోమంటుందేమో అన్న ఆశతో అదే లైన్ అన్ని సార్లు వింటున్నానురా..."
"హమ్...ఏంటీ మళ్ళీ ఫ్లాపా..."
"అది నా ఫేస్ చూస్తే తెలియట్లేదటరా...."
"తెలుస్తుంది...అరకేజీ ఆముదం త్రాగినట్లుంది..."
"మరే...నిజమే...ఏమిటో ఏ అమ్మాయికీ నేను నచ్చడం లేదురా...ఎందుకో..త్వరలో అర్థసెంచురీ పూర్తి అయ్యేలా ఉంది సంబంధాలలో..."
"నువ్వు నచ్చకపోడానికి ఏముంది..చూడ్డానికి పర్లేదు బాగానే ఉంటావు...సాఫ్టువేర్ జీతగాడివి..బట్టతల లేదు..అంత పొట్టీ కాదు..."
"ఏమోరా...అదే తెలియడం లేదు..ఇంటర్వ్యు అయ్యాక ఫీడ్ బ్యాక్ అడగొచ్చు..పెళ్లిచూపులు అయ్యాక ప్రాబ్లం ఏంటని అడగలేం కదా..."
"అడగాలి...అప్పుడు ప్రాబ్లెం ఏంటో తెలుస్తుంది..దాన్నిబట్టి తర్వాత మ్యాచ్ కి నెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.."
"ఏమోరా...అడగాలంటే అదోలా ఉంటుంది, ఏం వినాల్సివస్తుందో అని..నేను మీకు ఎందుకు నచ్చలేదు అని అడగటం చాలా కష్టమైన పనిరా కృష్ణా..."
"కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు..."
"ఆడపిల్ల లేనిదే నాకు పెళ్ళీ కాదు...సోదాపి సమస్యకో మార్గం చెప్పు ముకుందా.." వేడుకోసాగాడు సుధాకర్..


"నువ్వు చివరిసారిగా షూటింగ్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఎవరు..."
"పేరు శ్వేత...హైదరాబాద్ లో వర్కింగ్.."
"ఆ అమ్మాయి నంబర్ ఉందా..."
"నాదేగ్గర లేదు...మా నాన్న దెగ్గర ఉంది..అది కూడా వాళ్ళ ఇంటి నంబరు..."
"గాలి గొట్టంలా ఎదిగావ్...ఆ మాత్రం షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఏదోలా నంబర్ తీసుకోవాలని తెలీదా..సరే, నువ్వు షూటింగ్ కి వెళ్ళిన హీరోయిన్లలో ఏ హీరోయిన్ నంబర్ అయినా ఉందా..."
"ఆ ముగ్గురిది ఉంది..."
"గుడ్...మొదటి హీరోయిన్ కి కలుపు..."
"ఏంటి కలిపేది బ్రూ కాఫీ...ఆ పిల్ల నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది.."
"పాపి కొండల్లో పాప్ కార్న్ అమ్ముకొనే పాపిష్టి సుంఠ...ఆ పిల్ల మర్చిపోతే నువ్వు గుర్తుచేయ్యి...ముందు కలుపు.."
చేతులు వణుకుతుండగా, సుధాకర్ ఆ అమ్మాయికి ఫోన్ కలిపాడు...


"హలో.."
"హలో...నా పేరు సుధాకర్ అండి..నేను "
"ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ పర్సనల్ లోన్స్...డోంట్ వేస్ట్ మై టైం.."
"ఛీ ఛీ...నేను క్రెడిట్ కార్డులో..పర్సనల్ లోన్లో అమ్ముకొనేవాడిని కాదండీ...నేను.."
"కన్సల్టెన్సీ నుండి కాల్ చేస్తున్నావా..యాం నాట్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్.."
"హబ్బా...నన్ను చెప్పనివ్వండి...నేను మిమ్మల్ని.."
"కొంపదీసి ప్రేమిస్తున్నావా...టూ లేట్ నాకు ఈ మధ్యనే పెళ్లయింది.."
"ఓరి భగవంతుడా..."
"ఏంటీ నాకు పెళ్ళయితే అదేదో పాపంలా ఓరి భగవంతుడా అంటున్నావ్...వళ్లెలావుంది..."
"అయ్యో నేనలా అనలేదండీ..మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు..."
"నిన్ను నేను ఎందుకు అర్థం చేసుకోవాలి...ఎవడివి నువ్వసలు.."
"హమ్మయ్యా...ఇప్పుడైనా ఎవడని అడిగారా..సంతోషం..నా పేరు సుధాకర్...నేను.."
"సుధాకర్ నువ్వా...ఎన్ని రోజులకి చేశావ్..భార్గవి బాగుందా..నీ గొంతు గుర్తుపట్టలేదు సుమీ..ఏమనుకోకు..మా అయన రోజూ అంటున్నాడు, ఈ సుధాకర్ అసలు కాలే చెయ్యట్లేదు అని..రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారటగా మా ఆయన దెగ్గర..పాపం ఆయనకీ అవసరమట..మీ దెగ్గర ఉంటే ఇచ్చేయండీ.."
"రెండు లక్షలా!!...ఏవండీ మీరు ఏదీ పూర్తిగా వినడం లేదు...నేను రెండు లక్షల్ని కాదండీ...ఛి ఛి..నేను సుధాకర్ ని కాదండీ...ఛి ఛి...నేను మీరనుకునే సుధాకర్ కాదండీ.."
"కాకపోతే ఎందుకు చేశావ్...ఈవ్ టీజింగ్ కేస్ పెట్టమంటావా!!.."
"వామ్మో..కాదండీ..ఒక్క సెకండ్ నేను చెప్పేది వినండీ...ఒక ఆరేడు నెలల క్రితం మిమ్మల్ని పెళ్లి చూపులు చూశాను నేను..నా పేరు సుధాకర్..అదే, మీ ఇంట్లో పాలకోవా, మైసూర్ పాక్ బాగున్నాయి అని చెప్పి నా ప్లేటే కాకుండా మా చెల్లి ప్లేట్ మా అమ్మ ప్లేట్ కూడా లాగేసుకొని తిన్నాను...గుర్తుందా..."
"దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు...అపుడేప్పుడో పెళ్లి చూపులు చూస్తె, ఇప్పుడు కాల్ చేశావేం.. ఓసారి ఎప్పుడో అనుకున్నట్లు గుర్తు పెళ్లి చూపులకి ఓ కుక్క బ్యాచ్ వాడు వచ్చాడు అని...బహుసా నిన్నేనేమో..."
"ఆ...అదీ...మరి...మీరు మరీను...ఎదో బాగున్నాయి అని తిన్నాను అంతే..అది మీకు కాంప్లిమెంటే..ఇంతకీ నేను ఫోన్ చేసిన కారణమేమిటంటే.."
"ఏముందీ...ఇంట్లో తిని కూర్చుని ఉంటున్నట్లున్నావ్..పని పాటా లేక కాల్ చేశావ్.."
"ఏమండీ..మీరు మరీ అలా అనకండీ..నన్ను పెళ్లి చూపులు అయ్యాక మీరు రిజక్ట్ చేశారు..దానికి కారణం తెలుసుకుందామని కాల్ చేశా..."
"అవునా..మరి ఇన్ని నెలలూ గాడిదలు మేకలూ కాశావా..ఇప్పుడే జ్ఞానోదయం అయిందా..అసలు నువ్వే నాకు గుర్తులేదు, ఇంకెందుకు రిజక్ట్ చేసానో ఏం గుర్తుంటుంది.."
కీక్...కీక్...

"ఏంట్రా పెట్టేసావ్..." అడిగాను నేను..
"ఒరేయ్ ఈ పిల్ల చాలా డామేజింగ్ గా మాట్లాడుతుందిరా..నా మనోభావాలు మంటల్లో కాలి బూడిద అయిపోయాయి..అది రిజక్ట్ చేసి మంచి పని చేసింది..లేకపోతే దానితో రెండు నిముషాలు ఫోన్ లోనే వేగలేకపోయాను..ఇక లైఫ్ లాంగ్ అయితే..అమ్మో..అసలు ఆ పిల్ల చెప్పేది ఏదీ పూర్తిగా వినదేంట్రా అదేం రోగమో..."
"అది రోగం కాదు డామినేషన్...నువ్వు చెప్పేది వినకుండా తను చెప్పేది నువ్వు వినాలి అనుకునే డామినేషన్...ఇలాంటి డామినేషన్ అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే,ఇత్తడే ఇక లైఫ్ అంతా...సరేలే కానీ, ఇంతకీ ఎందుకు రిజక్ట్ చేసిందో చెప్పిందా?"
"లేదురా...దానికి నేను అసలు గుర్తులేనంటా.."
"హమ్...ఉన్న నంబర్లలో రీసెంట్ గా చూసిన అమ్మాయి నెంబర్ కి కొట్టు..కొంచెం స్టైలిష్ గా మాట్లాడు..."
"అలాగే...సుప్రియ ఫ్రం సత్తెనపల్లి...దీనికి చేస్తున్నా..ఓ రెండు నెలల క్రితం చూసిన షూటింగ్ హీరోయిన్.."

"హలో..."
"యా హలో...దిస్ ఈజ్ సుధాకర్ ఫ్రొం విప్రో..యాక్చువల్లీ..."
"హలో...దిస్ ఈజ్ సుప్రియా..ఐ హావ్ డన్ బీటెక్ ఫ్రం నాగార్జున యునివర్సిటీ...అయాం ఫ్రం CSE బ్రాంచ్, ఐ హావ్ సెవెంటీ ఫైవ్ పెర్సెంట్ ఆగ్రిగేట్..మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, వాషింగ్ క్లోత్స్...అండ్..."
"అండ్...క్లీనింగ్ ఇల్లు...తోమింగ్ పళ్ళు..రుద్దింగ్ వళ్ళు...ఇంకేమీ లేవా??.మీ బయోడేటా నాకెందుకు చెప్తున్నారండీ.." విసుగు సుధాకర్ గొంతులో..
" ఇంటర్వ్యు చేసేప్పుడు బయోడేటా చెప్పాలి కదండీ.."
"ఇంటర్వ్యు ఏంటీ??"
"మీరు నన్ను ఇంటర్వ్యు చెయ్యడానికి కాల్ చెయ్యలేదా?"
"నా బొంద...ఎవరూ చెప్పేది సరిగ్గా వినిపించుకోరే...నేను మిమ్మల్ని ఈ మధ్య పెళ్లి చూపులు చూసాను...నా పేరు సుధాకర్...అదే మీ ఇంట్లో గారెలు పెట్టినప్పుడు దాని రంధ్రంలొ గులాబ్ జామ్ కూరుకొని తిన్నాను..గుర్తొచ్చిందా..మీరు నన్ను రిజక్ట్ చేసారు..అందుకు గల కారణం చెప్తారా.."
"ఏమోనండీ...నాకేం తెలుసు...మా నాన్నారు ఈ అబ్బాయి నీకు సరిపోడు..ఇంకో అబ్బాయిని చూద్దాం అంటే..అలాగే మీ ఇష్టం నాన్నారు అనేసి..."
"అనేసి వెళ్లి హాయిగా దుప్పటి కప్పుకొని బబ్బున్నావా...పెళ్లి చేసుకునేది నువ్వే కదా, మీ నాన్న ఎవరూ రిజక్ట్ చెయ్యడానికి...ఇకనయినా పెళ్లిలొ నీ నిర్ణయాలు నువ్వు తీసుకో.."
కీక్...కీక్...

"హమ్...లాభం లేదురా కృష్ణా...వర్కవుట్ అవ్వడం లేదు..."
"ఇలా కాదురా సుధా...ఒకపని చెయ్యి...ఈ సారి పెళ్ళిచూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నంబరు తీసుకో..ఒకవేళ ఆ అమ్మాయి రిజక్ట్ చేస్తే, వెంటనే అప్పుడే కాల్ చేసి అడుగు..సరేనా?"
"అలాగే..."

                                                          ****
"హలో.."
"హలో..నా పేరు సుధాకర్...నిన్న మిమ్మల్ని పెళ్లి చూపులు చూసాను కదా..మీరు నన్ను రిజక్ట్ చేసారు..కారణం ఏంటో తెలుసుకుందామని కాల్ చేశా.."
"సూటు బూటు వేసుకొని టిప్ టాప్ గా రావడమే కాదు...ప్యాంట్ కి జిప్ వేసుకున్నామా లేదా అని కూడా చూసుకోవాలి..దీన్ని బట్టి మీరు చిన్న చిన్న విషయాలలో చూపే అశ్రద్ధ కనిపిస్తుంది..అది నాకు నచ్చలేదు...పైగా, మీ ఎదురుగా నన్ను కూర్చోపెట్టారు..తల దించుకొని మీ వైపు చూస్తుంటే, సరిగ్గా వోపెన్ పోస్ట్ బాక్స్ కనిపించింది..దెబ్బకి షాక్ తగిలి తల పైకెత్తి మీ వైపు చూస్తుంటే, ప్రక్క నుంచి మా అమ్మ..అలా మరీ తలెత్తి చూడకు పొగరు అనుకుంటారు..కొంచెం తలదించి తన వైపే చూడు అని గుసగుసలు..నేనేమో తలెత్తలేక..దించి ఆ సీన్ చూడలేక చాచ్చాననుకో అరగంట సేపు.."
సుదాకార్ ఆ మాటతో సిగ్గుతో చితికి ఫోన్ పెట్టేసాడు...ఈ సారి పెళ్లి చూపులకి జిప్ పెట్టుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..అంతేకాదు...చిన్న చిన్న విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని సంకల్పించుకున్నాడు...

                                                         ****
తరువాతి పెళ్లి చూపులకు జిప్ పెట్టుకోవడం మర్చిపోకుండా వెళ్ళినా కూడా రిజక్ట్ చెయ్యబడ్డాడు సుధాకర్..
"హలో..."
"నేను సుధాకర్ ని...నిన్న పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసాను..నన్నెందుకు రిజక్ట్ చేసారు?"
"మీ చూపులు నాకు నచ్చలేదు...పెళ్లి చూపుల్లోనే సిగ్గులేకుండా అలా చూస్తే..ఇక మాములుగా మీరు ఎందరిని ఎలా చూస్తారో...మీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది..."
"నేను చూసానా...ఏం చూసాను...అసలు ఏమన్నా చూపించవా చూడ్డానికి...కింద నుంచి పైదాకా చీర చుట్టాక ఇంకా ఏముంటుంది చూడ్డానికి నా బొంద..."
"అదే..అదే..మీ మగ బుద్ది...నేను కావాలనే మీరు కూర్చున్న సోఫా ఎదురుగా ఉన్నా అలమరాలొ ప్లే-బాయ్ మ్యాగజైన్ పెట్టాను..పెళ్లి చోపుల్లో మీరు నన్ను పది సార్లు చూస్తే, మ్యాగజైన్ లొ బర్త్ డే సూట్ లొ ఉన్నా అమ్మాయిని వంద సార్లు చూసారు...నేను గమనిస్తూనే ఉన్నాను..." అంది 
సుధాకర్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...
ఫోన్ పెట్టేసాడు...ఈ సారి పెళ్లి కూతురిని తప్ప ఎవరినీ చూడకూడదు అని మళ్ళీ సంకల్పించుకున్నాడు...

                                                      ****

"ఆదిరా కృష్ణా జరిగింది..."
"మరేం పర్లేదు...పర్స్ మర్చిపోయినట్లు ఒక్కోసారి జిప్ పెట్టుకోవడం మరచిపోతుంటాం....కానీ అది కూడా ఒక సంబంధం చెడగొడుతుంది అని ఇప్పుడే తెలిసింది..అలాగే ఎక్స్ పోజ్ చేసే అమ్మయిలనూ చూస్తాము...ఇవేమీ పెద్ద నేరాలు కాదు ...ఇకనుండీ జాగ్రత్తగా ఉండు...మరో విషయం, పెళ్లి చూపులు సక్సెస్ కావాలంటే...పెళ్లి కూతురి గురుంచిన ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకో..ఆమె అభిరుచులు, ఆశయాలు, ఆవకాయ దబ్బా...ఇలాంటివన్నీ అనమాట..పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురితో కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడాలని అడిగి, ముందుగా ప్రిపేర్ అయిన మెటీరియల్ ఓసారి నెమరు వేసుకొని ఇక అనర్గళంగా ఆమె అభిరుచులు నీ అభిరుచులుగా..ఆమె ఆశయాలు నీ ఆశయాలుగా 'ఎన్ని జన్మలెత్తినా ఇతనే నాకు భర్తగా కావాలీ' అని ఆమె ఉన్నపళంగా అన్ని వ్రతాలూ చేసేలా ఒక స్పీచ్ కొట్టు...అంతే...నీకు పెళ్లి గ్యారంటీ.."
"ఐడియా అదిరింది....Game starts now..."


[టపా ఊహించిన దానికన్నా పెద్దగా రావడం మూలానా, ఈ భాగం ఇక్కడితో ముగించి...వచ్చే భాగంలొ ముగింపు ఇస్తాను...ఇది పూర్తి కల్పితం అని గ్రహించండి................మీ కిషన్ రెడ్డి]

23 comments:

3g said...

షూటింగ్, హీరోయిన్ హ్హ హ్హ బాగున్నాయి మీ కొత్త పదాలు.

Anonymous said...

ఫోటో హింది అమ్మాయి లా ఉంది, తెలుగమ్మాయి ఫోటో దొరకలేడా...ఈ విశాల బ్లాగావరణంలో

మనసు పలికే said...

కిషన్ గారూ.. నాకు తెలియక అడుగుతాను.. చేసేదంతా చేసేసి చివర్లో నాకు ఈ కథకి ఎలాంటి సంబంధం లేదు అంటే నమ్మేస్తారా ఏంటి..? ఈ మధ్య అన్నీ ప్రేమకి సంబంధించిన కబుర్లు... పెళ్లికి సంబంధించిన కబుర్లే.. ఏంటి విశేషం..?;)
టపా మాత్రం చాలా చాలా బాగుంది, మీదైన శైలిలో.. :)
>>"కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు..."
"ఆడపిల్ల లేనిదే నాకు పెళ్ళీ కాదు.
సూ..పర్..:))

దేవన said...

చాలా రోజుల తరువాత ఒక మంచి బ్లాగుపోస్టు చదివాను. బాగా నవ్వించారు. you made my day .

sivaprasad nidamanuri said...

great post.

నేస్తం said...

కిషన్ పోస్ట్ మాత్రం ఫస్ట్ హాఫ్ నిజంగా పడి పడి నవ్వాను .. నెక్స్ట్ ఎప్పుడు రాస్తున్నారు సార్
>>>కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు..."
"ఆడపిల్ల లేనిదే నాకు పెళ్ళీ కాదు
>>ఏంటి కలిపేది బ్రూ కాఫీ...ఆ పిల్ల నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది.."
ఇక శ్వేత,సుప్రియ పోన్ సంభాషణ
చాలా బాగుంది ..:)

nagarjuna said...

>>పాపి కొండల్లో పాప్ కార్న్ అమ్ముకొనే పాపిష్టి సుంఠ<<

లో.....ళ్

వేణూ శ్రీకాంత్ said...

సూపర్ :)

Jaabili said...

Ammayi chaala chakkaga telugammayi la undi.

Sai Praveen said...

Gud one bro. very funny :)

కొన్ని డైలాగులు సూపర్ :)

ఆ.సౌమ్య said...

ఎప్పటిలాగే అదిరింది, కానీ మీరు ఆమ్మాయిలను అవమానించాలని కంకణం కట్టుకుని అతి తెలివిగా, జాగ్రత్తగా ఈ పోస్ట్ రాస్తున్నారేమో అని నాలో ఎక్కడో చిన్న అనుమానం మొదలయింది. :P నేస్తం, అపర్ణ లకి కూడా అదే అనిపించి ఉంటుంది, కానీ వాళ్ళు బయటకి చెప్పలేదు, నేను చెప్పేస్తునాను. అంతే కదూ నేస్తం, అపర్ణా? :D

కొత్త పాళీ said...

good as usual

శివరంజని said...

కిషన్ గారు కామెడీ అదరగొట్టేసారండి బాబు ..

>>.>"కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు...<<
>>>మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, వాషింగ్ క్లోత్స్...అండ్...""అండ్...క్లీనింగ్ ఇల్లు...తోమింగ్ పళ్ళు..రుద్దింగ్ వళ్ళు...ఇంకేమీ లేవా??>>
>>"మీ చూపులు నాకు నచ్చలేదు...పెళ్లి చూపుల్లోనే సిగ్గులేకుండా అలా చూస్తే..ఇక మాములుగా మీరు ఎందరిని ఎలా చూస్తారో...మీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది..."<<

అమ్మాయిలని విమర్శిస్తూ రాసారేంటీ బాగా కోప్పడదామనుకున్నాను........
కాని ఎక్కడ??? ఫుల్ కామెడీ....
ఎంత ప్రయత్నిచిన కోపం రావడం లేదు ...... నవ్వే వస్తుంది ...

ఇంతకి మీ ఫ్రెండ్ కి షూటింగ్ పై అన్ని ఐడియాస్ ఇచ్చే మెటీరియల్ మీ దగ్గర ఉందంటే అపర్ణ గారి కి వచ్చిన డౌటే నాకు వస్తుంది:):):)

విజయ క్రాంతి said...

బావుంది ... పూర్తి గా చదవటానికి సమయం పట్టొచ్చు ;-) ..

దయచేసి మీరు టెక్స్ట్ కలర్ మార్చండి ( పోస్ట్ కాదు ) మిగితావన్నీ ఆ కలర్ లో సరీగా కనపడటం లేదు ...

Ramakrishna Reddy Kotla said...

త్రీజీ: ఏదో అలా ట్రై చేశా...థాంక్స్ :-)

అజ్ఞాత: తెలుగు అమ్మాయి ఫోటో పెట్టాను...థాంక్స్ :-)

అపర్ణ: ప్రేమకి పెళ్లి సంబంధిన టపాలు కొంచెం అశాక్తిగా ఉంటాయని అవి రాస్తున్నా...అంతే..ఇంకేమీ సంగతి లేదు...చేసినదంతా చేసానా??..ఏమి చేశానేమిటీ...

Ramakrishna Reddy Kotla said...

దేవన: ధన్యవాదాలు :-)

శివ: థాంక్స్ :-)

నేస్తం: ధన్యవాదాలు మీ కామెంట్ కి..మిమ్మల్ని అంతగా నవ్వించానంటే నేను హేపీ..తరువాతి పార్ట్ త్వరలో రాస్తాను..

Ramakrishna Reddy Kotla said...

నాగార్జున: :-)) థాంక్స్

వేణూ: థాంక్స్ మాస్టారు :-)

జాబిలీ: తెలుగు అమ్మాయి పోస్ట్ కదా, అందుకే తెలుగు అమ్మాయినే పెట్టాను...ఆ అమ్మాయి ఎవరని అడగకండే..ఎందుకంటే నాకే తెలీదు కాబట్టి :-))

Ramakrishna Reddy Kotla said...

ప్రవీణ్: థాంక్స్ :-)

సౌమ్య: అమ్మాయిలను అవమానించడమా...అయ్యో...రామ రామ...నా మీద ఇన్ని అభాండాలా...మీ అమ్మాయిలే మా అబ్బాయిలను ఎలా అవమానించారో రాసాను టపాలో ...అది మీకు ఇలా రివర్స్ గా అర్థమయిందా... ;-)

కొత్తపాళీ: థాంక్స్

Ramakrishna Reddy Kotla said...

రంజని: మీ అందరికీ ఎలాంటి డౌట్లు వచ్చినా...అందులో ఈసుమంత నిజం కూడా లేదు...అయినా ఆ మెటీరియల్ ఇచ్చింది కృష్ణ ...నేను కాదు...ఈ టపాకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాసినా మీరు ఇలా అడగటం భావ్యం కాదు...అమ్మాయిలను విమర్శించానా...ఎక్కడ??...అమ్మాయిలు కరువై డిమాండ్ పెరగటంతో మీ అమ్మాయిలకు పోజు పెరిగి పెళ్లి చూపులకి వచ్చే అబ్బాయిలను లెక్క చెయ్యడం లేదు...దాన్ని నేను ఖండించాదానికే ఈ టపా :-)

క్రాంతి: ధన్యవాదాలు...అలాగే మార్చుతాను.

ఆ.సౌమ్య said...

nice,తరువాతి టపా ఎప్పుడు?

శివరంజని said...

>>అమ్మాయిలు కరువై డిమాండ్ పెరగటంతో మీ అమ్మాయిలకు పోజు పెరిగి పెళ్లి చూపులకి వచ్చే అబ్బాయిలను లెక్క చెయ్యడం లేదు.>>
--------------------------------

ఇంతే...... కిషన్ గారు ఇంతే........
ఈ తెలుగు అమ్మాయిలందరూ ఇంతే ......

అందుకే నా మాట విని మీరు మాత్రం తమిళ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమని నేను ఒక ఉచిత సలహా ఇస్తున్నాను.... ఏమంటారు?????

ఇందు said...

కిషన్ గారు మీ పోస్ట్ ఇప్పుడే చూసాను...ముందు సెకెండ్ పార్ట్ చదివి..అప్పుడు ఫస్ట్ పార్ట్ చదివాను..బాగుంది కామెడీ... :) especially shooting,heroine, and that bio-data scene :))

divya vani said...

post super kishan gaaru konni dialagues ayite
keka
"కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు..."
"ఆడపిల్ల లేనిదే నాకు పెళ్ళీ కాదు..

"పాపి కొండల్లో పాప్ కార్న్ అమ్ముకొనే పాపిష్టి సుంఠ.
ela rastaru kishan gaaru inta baaga