Friday, August 13, 2010

One Missed SMS

 2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

"అమ్మా..flat చాలా బాగుంది..5th ఫ్లోర్..Liked it a lot..ఆఫీసుకి కూడా చాలా దెగ్గర..మంచి వెంటిలేషన్.." చెప్తుంది కీర్తి వాళ్ళ అమ్మతో ఫోన్లో..
"అవునా...జాగ్రత్త బంగారం..అసలే కొత్త ప్రదేశం..చుట్టుప్రక్కన ఇళ్ళ వాళ్ళని పరిచయం చేసుకో..."
"హబ్బా..మొన్నటిదాకా అమెరికాలో ఉండొచ్చిన దాన్ని నాకు చెప్తావేంటమ్మా.."
"నువ్విప్పుడు ఉంటున్నది అమెరికా కాదే...హైదరాబాద్..సరేలే కాని, నిన్న నాన్నగారు నీకు ఈ-మెయిల్ చేసిన అబ్బాయి ఫోటో చూసావా ...నచ్చాడా?"
"మొదలెట్టేసావా...అనుకుంటున్నా ఇంకా మొదలెట్టలేదెంటా అని...ఒక్క 2 years గ్యాప్ ఇవ్వవే..ఫుల్ గా లైఫ్ ఎంజాయ్ చేసి, అప్పుడు నువ్వు ఎవడిని చూస్తే వాడిని కట్టేసుకుంటా...ప్లీజ్"
"పెళ్లి చేసుకోవే తల్లీ అంటుంటే, లైఫ్ ఎంజాయ్ అంటావేంటే తిక్కల బొంతా....అసలు ఆ అబ్బాయి గురుంచి చెప్పాలంటే..."
"అమ్మా...రేపు తీరిగ్గా వింటాను..నాకు నిద్రొస్తుంది...గుడ్ నైట్..." అంటూ ఫోన్ పెట్టేసింది కీర్తి...

బాల్కనీలోకి వెళ్లి చుట్టూ చూసింది..కనుచూపు మేరలదాకా వీధి దీపాలతో మెరిసిపోతూ ఉంది భాగ్యనగరం..చల్లటి గాలి ముఖానికి తాకుతుండగా, వెంటనే కాఫీ తాగాలనే ఆలోచన వచ్చింది కీర్తికి..తనకి అప్పుడప్పుడు ఇలా మిడ్నయిట్ కాఫీ తాగుతూ చల్లటి గాలికి బయటకూర్చోని అలా చంద్రుని కేసి చూడటం చాలా ఇష్టం..అనుకున్నదే తడవుగా కాఫీ పెట్టుకొని కప్పుతో బాల్కనీకి వచ్చి చంద్రుని వైపు చూసుకుంటూ..ఐ-పోడ్ లో పాత పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంది..అందులో ఉన్న గొప్ప అనుభూతి కేవలం తనకి మాత్రమే తెలుసు...

టైం పన్నెండున్నర కావస్తుండగా, పడుకుందామని బెడ్ రూమ్ కి వచ్చి బెడ్ మీద వాలింది...కొత్త ప్రదేశం కావడం మూలాన ఓ పట్టాన నిద్రపట్టడం లేదు కీర్తికి..అటూ ఇటూ మెసలడమే సరిపోతుంది..ఇంతలో బైట రివ్వున వీస్తున్న గాలి మరీ ఎక్కువ కావడంతో హాల్లో కిటికీలు టపా టపా కొట్టుకోవడం మొదలెట్టాయి..తను లేచి వెళ్లి కిటికీలు మూసి, వెనక్కి మళ్ళగా ఒక్కసారిగా కరంట్ పోయింది..'కొంచెం గాలి ఎక్కువైతే చాలు కరెంట్ పీకి పారేస్తాడు..ఛా..' అనుకుంటూ తవిళ్ళాడుకుంటూ బెడ్ రూమ్ వైపు వెళ్తుండగా దేన్నో తట్టుకొని కిందపడింది..తడిమి చూడగా అదేదో బుక్ షెల్ఫ్..ఆ షెల్ఫ్ క్రింద లోపల ఏదో తళుక్కుమని కనిపించడంతో చేత్తో దాన్ని పట్టుకొని చూసింది..ఏదో పుస్తకం...కాదు డైరీ..అంత చీకట్లోనూ..ఆ డైరీ మీద తళుక్కుమంటున్నాయి 2008 అని అంకెలు....
                                                                        *****
2008 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్. 

కౌశిక్ చాలా టెన్షన్ గా ఉన్నాడు..ప్రతి సెకండు ఒక యుగంలా గడుస్తుంది ఆతనికి...స్వప్న నుండి ఇంకా SMS ఎందుకు రాలేదు..ఉత్తరం చదివే ఉంటుంది..మరి ఎందుకు ఇంకా తను SMS చెయ్యలేదు ..ఎమన్నా తేడా జరిగితే తను బ్రతకడు..స్వప్న తనకి ప్రాణం కన్నా ఎక్కువ..ఆమె నుండి తిరస్కారం భరించలేడు..దానికన్నా మరణమే ఆతనికి సంతృప్తిని కలిగిస్తుంది..
ఇంతలో...టింగ్..టింగ్...అంటూ మోగింది SMS టోన్ తన మొబైల్ లో...
వణుకుతున్న చేతులతో మొబైల్ తీసుకున్నాడు...
"Read SMS" అనే బట్టన్ నొక్కడానికి అతని చేతుల్లో ఉన్న బలాన్ని మొత్తం ఎవరో లాగేస్తున్నట్లు ఉంది...
వణుకుతున్న చేతులతో బట్టన్ నొక్కి చూసాడు...
"NO...IAM SORRY..I DON'T LOVE U" అని ఉంది...
క్షణాల్లో అతని వళ్ళంతా చమటలు...పిచ్చేక్కినట్లు అయిపోయాడు..ఫోన్ ని గిరాటేసికొట్టాడు...వెక్కి వెక్కి ఏడ్చాడు...చివరిసారిగా స్వప్నతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది ...కానీ ... ఎందుకో ...ఏమనుకున్నాడో...అలా ఎదురుగా కనిపిస్తున్న బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు...చుట్టూ చూసాడు, నిద్రలో జోగుతుంది నగరమంతా...ఒక్కసారిగా కళ్ళు మూసుకొని, ఒక్క ఉదుటన దూకేసాడు...తను ఉంటున్న అయిదవ అంతస్తునుండి...

మరు నిముషంలో ఎక్కడో బీరువా క్రింద విసిరేయబడ్డ సెల్-ఫోన్ లో మళ్ళీ మెసేజ్ బీప్... 

                                                                    ******
2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

ఆ డైరీ పట్టుకొని...అటూ..ఇటూ తిప్పుతూ చూస్తుండగా...కరెంట్ వచ్చింది..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది కీర్తి..ఎలాగూ నిద్ర రావట్లేదు, ఈ డైరీతో టైం పాస్ చేద్దామనుకొని..దాన్ని పట్టుకొని బెడ్ రూమ్ కి వెళ్లి..ఓపెన్ చేసింది..
డైరీ మొదటి పేజీలో ఒక అందమైన అమ్మాయి ఫోటో...ఆ ఫోటో క్రింద..నా ప్రాణం, నా సర్వసం...నా స్వప్న అని రాసుంది...
డైరీ లోని ఒక్కొక్క పేజీ తిరగేస్తూ చాలా శ్రద్ధగా చదవసాగింది కీర్తి ...

"ఈ రోజు స్వప్నతో చాలా సేపు మాట్లాడాను..ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను..తను నాకోసమే పుట్టిందేమో అనిపిస్తుంటుంది నాకు..తనతో మాట్లాడితే చాలు, నాకు ఇంక ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం అవసరం లేదు..అనాధగా పెరిగిన నాకోసం దేవుడు కురిపించిన వారాల మూటే స్వప్న..నేనొక ఒంటరిని అన్న భావన నాలో నుంచి దూరం చేసిన స్నేహమయి...తనంటే నాకెంత ఇష్టమో నేను కూడా మాట్లల్లో చెప్పలేను.."

"ఈ రోజు స్వప్నని ఎవడో ఏడిపించాడంట..నాకు చెప్పి నా దెగ్గర బాధ పడింది..నా స్వప్నని బాధ పెట్టిన వాడిని ఊరికే వదులుతానా... స్వప్న నాకు గిఫ్ట్ గా ఇచ్చిన క్రికెట్ బ్యాట్ తోనే వాడి రూమ్ కి వెళ్లి మరీ వాడి తల బద్దలు కొట్టాను ...స్వప్న కి ఈ విషయం చెప్పలేదు...తనకి గొడవలంటే నచ్చదు.."

"స్వప్న పేరు పచ్చ పొడిపించుకున్నా ఈ రోజు నా ఛాతీ దెగ్గర...నా మనసులో మాట ఆమెకి చెప్పిన తరువాత నా హృదయ భాగాన ఉన్న ఆమె పేరు ఆమెకి చూపిస్తా..తను నీకేమన్నా పిచ్చా అని నన్ను తిడుతుంది..అయినా సరే పర్లేదు, నా హృదయ భాగాన ఉండాల్సింది తనే కదా.."

"రేపు స్వప్న పుట్టిన రోజు...తనకి నన్ను నేను గిఫ్ట్ గా ఇచ్చుకుందామనుకుంటున్నా...తను స్వీకరిస్తుందో? లేదో?..తను స్వీకరించని నా జీవితం ఖచ్చితంగా వృధానే..జీవితాంతం తనతోనే గడపాలని అనుకున్నాను..అందులో తేడా జరిగితే ఈ కౌశిక్ బ్రతకడు..."
'అబ్బో...వీడు బాగా మునిగిపోయాడు ఈ పిల్లతో లవ్వు లో ...అయినా లవ్ చెయ్యకపోతే చనిపోవడం ఏంటో..చూద్దాం ఏం జరిగిందో'..అంటూ తరువాతి పేజ్ ఓపెన్ చేసింది..

"ఈ రోజు తనని అందరికన్నా మొదటగా నేనే విష్ చేశా...నోబుల్ ప్రైజ్ అందుకున్నంత ఆనందంగా ఉంది..ఉదయం తనతో కలసి టెంపుల్ కి వెళ్లాను..అప్పుడే, నేను రాసి పెట్టిన లెటర్ ఆమె చూడకుండా ఆమె హ్యాండ్ బాగ్ లో వేసాను...తన మీద నాకున్న ప్రేమనంతా ఒక చిన్న లెటర్ లో ఖచ్చితంగా రాయలేను..కానీ తన ప్రేమ నన్నెంత ప్రభావితం చేసిందో రాసాను..తనతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని రాసాను..తన అభిప్రాయం, నాకు ఒక SMS ద్వారా చెప్పమని...ఆ SMS కోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసాను..."

"టైం పన్నెండు దాటింది...తన నుంచి నాకు ఇంకా SMS రాలేదు ..నాకు పిచేక్కిపోతుంది...మైండ్ పనిచెయ్యట్లేదు..దేవుడా, నాకు నా అనే వాళ్ళని ఎవరినీ నువ్వు ఇవ్వలేదు..ఇన్నాళ్ళకి నువ్వు నాకు స్వప్నని చూపించి నా జీవితానికి ఒక అర్థం ఉండేలా చేసావు...ఇప్పుడు తనని నా నుంచి దూరం చెయ్యకు...అది భరించి బ్రతకలేను..............."
తరువాతి పేజీలు తిప్పి చూసింది కీర్తి..ఏమీ లేదు...అన్ని ఖాళీ కాగితాలు...

'ఏమయ్యుంటుంది....స్వప్న కౌశిక్ ప్రేమ ఒప్పుకొని ఉంటుందా??..లేకపోతే, పాపం ఆ అబ్బాయి ఎమన్నా చేసుకొని ఉంటాడా...దేవుడా అలా జరగకుండా ఉండాలి...అయినా, స్వప్న తన లవ్ యాక్సెప్ట్ చేసి ఉంటే, ఆ విషయం ఈ డైరీలో రాసేవాడు కదా...ఇక్కడ నుంచి అన్నీ తెల్ల పేజీలు ఉన్నాయి అంటే...కొంపదీసి అతను...' కీర్తికి ఆలోచించాలంటేనే అదోలా అనిపించింది..
అయినా ఈ డైరీ ఈ ఇంట్లో ఉందంటే, ఆ అబ్బాయి రెండేళ్ళ క్రితం ఈ ఇంట్లోనే ఉన్నాడేమో...రేపు ఇంటి ఓనర్ ని కనుక్కోవాలి..
                                                                     *****
2008 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

"suicide case సార్...ఆధారాలేమీ తెలియరాలేదు..." అన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఎస్.ఐ స్పాట్ కి రాగానే..
"క్లూస్ టీంని పిలిచారా...." అడిగాడు ఎస్.ఐ
"క్లూస్ టీం సెర్చ్ చేసారు..ఇంట్లో క్లూ ఏం దొరకలేదు..ఇతని పేరు కౌశిక్, నా అనేవాళ్ళు ఎవరూ లేరు.. TCS లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..బాడీ మీద మాత్రం స్వప్న అని పచ్చ పొడిపించుకున్నాడు.."
"ఓ.కే...ఇతని కొలీగ్స్ ని ఎంక్వైరీ చెయ్యండి..ఎమన్నా క్లూ దొరకొచ్చు..లవ్ ఫైల్యుర్ కావచ్చేమో.."
"అలాగే సార్..."
"అలాగే..బాడీని పోస్ట్-మార్టంకి పంపించండి..." అంటూ వెళ్లిపోయాడు ఎస్.ఐ.
                                                                      *****
2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

"రెండు సంవత్సరాల క్రితం కౌశిక్ అనే అబ్బాయి ఉండేవాడు..నిజమే..నీకెలా తెలుసు.." తెల్లబోయి అడిగింది ఇంటి వోనర్..
"అంటే ఆంటీ...మా ఫ్రెండ్ ఒకమ్మాయి చెప్పింది..ఆ అమ్మాయి కౌశిక్ ఫ్రెండ్..." అంది కీర్తి 
"అవునా...ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు పాపం...బాల్కనీ నుంచి దూకేసాడు...మంచి కుర్రాడు, ఎందుకలా చేసాడో..."
ఆ మాట విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది కీర్తి..పెద్ద షాక్ లా తగిలింది ఆ మాట కీర్తికి..ఎందుకో చాలా బాధగా అనిపించింది...
"కౌశిక్ గురుంచి వివరాలు ఏమైనా తెలుసా..."
"ఆ అబ్బాయి TCS లో పనిచేసే వాడు...పాపం ఎవరూ లేరు..నాకు కూడా అతని విషయాలు పెద్దగా తెలియవు..ఎప్పుడూ పెద్దగా మాట్లాడేవాడు కాదు..అయినా ఎందుకు అడుగుతున్నావ్ అమ్మాయ్ ఇవన్నీ .." అందామె దీర్ఘం తీస్తూ..
"ఏం లేదాంటీ...మామూలుగానే..."
"నువ్వు ఆ ఫ్లాట్ లో ఉండటానికి ఏమీ భయపడక్కర్లేదు...ఫర్నీచర్ అప్పటిదే అయినా.. ఆ అబ్బాయి చనిపోయాక, రకరకాల పూజలూ, హోమాలూ, శాంతి జరిపించాము...దెయ్యాలు గట్రా ఏమీ రావులే.." అందామె 
"హ హ...అయ్యో ఆంటీ...నాకలాంటి నమ్మకాలు ఏమీ లేవులే...వెళ్ళొస్తా ఆంటీ.." అంటూ బైటకి వచ్చింది కీర్తి..
                                                       ****
"రజితా...నేను కీర్తిని..."
"కీర్తి..ఏంటి మామ్ ఈ surprise...U.S. నుండి వచ్చాక ఒక్క కాల్ కూడా లేదు..."
"అదేం..లేదే..కొంచెం వర్క్ బిజీ...నువ్వు ఇంకా TCS లోనే వర్క్ చేస్తున్నావా?"
"అవునే...ఇక్కడ వర్క్ టెన్షన్ తక్కువ ఉంది నాకు...సో అందుకే మారలేదు.."
"two years back మీ కంపెనీలో పనిచేసిన కౌశిక్ అనే అతను తెలుసా నీకు...??"
"ఏ కౌశిక్?..suicide case కౌశిక్?"
"అవును...అతనే...తెలుసా.." ఆత్రుతగా అడిగింది కీర్తి..
"తెలియకపోవడం ఏమిటే బాబూ...అతను మా టీమే...పెద్ద మూడీ ఫెలో..ఎవ్వరితో మాట్లాడడు..ఏమైందో ఏంటో, సడన్ గా suicide.."
"ఓహో...సరేకాని, అతను ఎవరితో ఎక్కువ క్లోస్ గా ఉండేవాడు..."
"మాతో ఎవరితోనూ క్లోస్ గా ఉండేవాడు కాదు...కానీ వేరే టీంలో స్వప్న అని ఒకమ్మాయి ఉండేది..ఆ అమ్మాయితో మాత్రం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు..."
"స్వప్న...ఎస్...స్వప్న ఎక్కడ ఉంది ఇప్పుడు??"
"ఎంటే బాబూ ఈ ప్రశ్నలు..ఎమన్నా CBI లో చేరావా?"
"తర్వాత చెప్తా...ముందు స్వప్న ఎక్కడ ఉందో చెప్పు..."
"ఆ అమ్మాయి TCS లో లేదు ఇప్పుడు...పెళ్లి చేసుకొని US వెళ్లిందని చెప్పారు..ఈ కౌశిక్ చనిపోయిన దెగ్గరనుంచి ఆ అమ్మాయి కూడా జాబ్ మానేసింది అని విన్నాను..ఏంటో మరి.."
"ఓహ్..అలాగా..సరెలేవే..నేను మళ్ళీ చేస్తాను..." అంటూ ఫోన్ పెట్టేసింది కీర్తి..

ప్రొద్దుగుంకింది...చల్లగా గాలి మొదలయ్యింది...కీర్తి బాల్కనీలో నిల్చుని కౌశిక్ గురుంచే ఆలోచిస్తుంది...
'ఏంటో పాపం లవ్ ఫెయిల్ అయినందుకు కౌశిక్ ఆత్మహత్య చేసుకున్నాడు..ఒక అమ్మాయి కోసం మంచి లైఫ్ నాశనం చేసుకున్నాడు..ఏమోలే, ఇలాంటి మాటలు మనం ఎన్నయినా చెప్పొచ్చు...కానీ ఆ సమయంలో అతను ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో...చనిపోవడానికి నిర్ణయించుకున్నాడంటే ఎంత మనోసంఘర్షణ అనుభవించి ఉంటాడో...అలాంటి ప్రేమికుడిని దూరం చేసుకున్న స్వప్న నిజంగా దురద్రుష్టవంతురాలు...' అనుకుంటుండగా అప్పుడు గుర్తొచ్చింది ఆమె నిల్చుంది బాల్కనీ దెగ్గర అని...అక్కడ నుంచే కౌశిక్ దూకి చనిపోయాడు అని..వెంటనే ఆ దృశ్యం గుర్తురాగానే, ఏదో తెలియని దడ పుట్టింది ఆమెలో...

కాసేపు వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడింది...తరువాత పడుకుందామని బెడ్ పైన వాలింది..కానీ నిద్ర పట్టడం లేదు..లేచి అటూ ఇటూ తిరగనారంభించింది...అక్కడ ఉన్న అలమారాలు షెల్ఫ్ లు అన్ని వెతుకుతూ ఉంది...ఏవేవో పాత మాగజైన్స్..అవీ ఇవీ అన్నీ ఉన్నాయి..అలా చూస్తూ ఉండగా, బీరువా వెనుక ఆమెకి కనిపించింది...సెల్ ఫోన్...
భ్రుకుటి ముడిచి ఆ సెల్ ఫోన్ చేతులోకి తీసుకొని చూసింది...
'ఇది ఎవరి సెల్ ఫోన్ అయ్యి ఉంటుంది' అనుకుంటుండగా... చూసేసరికి...డిస్ప్లే కొంచెం పగిలి ఉంది...
అది నోకియా కావడంతో తన దెగ్గర ఉన్న చార్జర్ తో ఒక పావుగంట చార్జ్ చేసి, స్విచ్ ఆన్ చేసింది...ఆన్ అయ్యాక వెల్కం మెస్సేజ్ "Swapna...my life" అని వచ్చింది...ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది కీర్తికి..
ఆన్ అయ్యింది..."సెర్చింగ్ ఫర్ సిగ్నల్..." అని రావడం చూసి ఆశ్చర్య పోయింది కీర్తి...రెండు సంవత్సరాల క్రితం సిమ్..ఇంకా ఎలా వ్యాలిడ్ గా ఉందో ఆమెకి అర్థం కాలేదు...ఒకేవేళ 3 years validity కాని life long validity కానీ అయ్యుంటుందేమో అనుకుంది..
"Airtel" అని సిగ్నల్ చూపించడం.."unread message" అని ఇన్బాక్స్ లో చూపించడం ఒకేసారి జరిగాయి...

ఆమె చేతులు వణుకుతుండగా...మెసేజ్ ఓపెన్ చేసింది...అందులో ఉన్న మెసేజ్ చూసి..ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.. చేష్టలుడిగి అలాగే మెసేజ్ వైపు చూస్తుండిపోయింది.. ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి...

"Text message
 From : Swapna

No ante nammesava?..orey fool, repu April fools day telusugaa.. ippudu NO cheppi, repu April fool ani fool cheddam anukunnanu, but i dont wanna make you feel sad and disappointed for 10 more hours..so ippude cheppestunna "I LOVE U A LOT MY DARLING...no life without U"     


                                                              *****
                   -- A story and Script by --------------- Ramakrishna Reddy Kotla
                   [It is purely a work of fiction]

Tuesday, August 10, 2010

నిన్ను చూడగా గుండెలో...

ప:    నిన్ను చూడగా గుండెలో ఎన్నెన్నో రాగాలు...
        మనసునిండుగా మ్రోగెనులే ఏవేవో తాళాలు..
        తనువంతా సంగీతం...తపనలతో సావాసం...
        ఊహలలో ప్రయాణం...మేఘాల్లో సరాగం..
        పరిచెయమయ్యెను కొత్త భాష..అనుభవమయ్యెను తీపి ఘోష..

చ1:  నిన్ను చేరే సమయాన..పెదవే దాటని మాటలమూటలు విప్పి కళ్ళతో ఎన్నోఊసులు చెప్పెయ్యనా..
        నిన్ను తలచే విరహాన.. కొంటె ఆశలు కలవరపెడితే నిజమంటి కలగా కలలో నిజమై దరిచేరనా..
        ఆకాశం అందనంత దూరంలో లేదులే...జాబిల్లిలా నాముందే నువ్వుంటే..
        వెన్నెల్లో హాయి పగలైనా చేరునులే..నాగమల్లిలా నువ్వు నవ్వుతుంటే...

చ1:  గుండె వేగం తగ్గేనా..ఓ నిముషం పాటు నీ ఓరచూపే నా తనువుని తడిమీ కన్నుగీటుతుంటే..
        కలకంటున్నాననుకున్నా.. నువ్వు కళ్ళముందున్నా పోల్చలేకున్నా నిజమే కలలాగున్నదే..
        గుండెలోనే గువ్వలా దాగున్నావే...అయినా నీకోసం ఎక్కడో వెదుకులాట..
        చెప్పవే మనసా నువ్వైనా నా కళ్ళకి...నీలోనే దాగున్న నాచెలి చిరునామాని...
      
                                                                                                 -- కోట్ల రామకృష్ణా రెడ్డి 

[ఈ రోజు ఆఫీసులో పెద్దగా పనిలేక, ఏదో ఇలా ఓ పాట రాయడానికి ప్రయత్నించాను... దీనికి ట్యూన్ కూడా కట్టాలి అనుకుంటున్నా..అలా ట్యూన్ కట్టాక ఒక పోడ్-కాస్ట్ గా రిలీజ్ చేస్తా..]