Wednesday, February 7, 2018

బుజ్జులు పుట్టినరోజు - 1

1988... May 22

బయట జోరున వాన.....
సీతారామపురం రామాలయం వీధి చివర ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురులో తళుక్కుమంటున్న వాన నీటి ధారలో ఆ ఇల్లు మసక మసకగా కనిపిస్తుంది....
అపుడే దూరదర్శన్ లో శాంతి స్వరూప్ గారి వార్తలు ముగిసి చిత్రలహరి మొదలయింది ... సరిగ్గా ఏడున్నర ...
"అమ్మా .... నాన్న ఇంకా రాలేదేంటి .... " ఏడుపు మొహం పెట్టింది బుజ్జులు..
"వచ్చేస్తాడమ్మా .... ఆఫీస్ లో ఎదో పని పడి ఉంటుంది.... " అంది సరళ తన వళ్ళో పడుకున్న బుజ్జులు జుట్టు నిమురుతూ ...

"అమ్మా ... చిరంజీవి పాట " చూపించింది బుజ్జులు టీవీ కేసి ... "నాన్న చిరంజీవి సినిమాకి కూడా తీసుకెళ్తా అన్నాడు తెలుసా ... అమ్మకి చెప్పొద్దు .. అది రాకాసి అన్నడు" అంది నవ్వుతూ  ... చిత్రలహరి లో కొత్తగా రిలీజ్ అయిన యముడికి మొగుడు సినిమాలోని "అందం హిందోళం ..." పాట  వస్తుంది... బుజ్జులు కాసేపు అన్ని మరిచిపోయి చిరంజీవి పాట చూస్తూ తాను కూడా నోటికి వచ్చింది పాడుతుంది....

బుజ్జులు ఆలా సరళ వడిలోనే నిద్రలోకి జారుకుంది.... చిత్రలహరి ముగిసి జాతీయ కార్యక్రమాలు ఏవో వస్తున్నాయి... సరళకి అసహనం పెరిగిపోతుంది .. 'బుజ్జులు పుట్టినరోజు కూడా మర్చిపోయేంత పనులేంటి ఈయనకి .... పాపం చంటిది నాన్న వస్తేనే కేక్ కట్ చేస్తా అని చూసి చూసి పడుకుంది.. '
టేబుల్ మీద ఉన్నకేక్ పై సగం తెరిచిన కిటికీ నుండి పడిన స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్నాయి  ఆ అక్షరాలు ... 'బుజ్జులు.... నాన్న బంగారం" అని.. ఆ కేక్ చుట్టూ ఆరు కొవ్వొత్తులు ....

"ఏంటమ్మాయ్ ... కృష్ణ బాబు ఇంకా రాలేదా?... " అంటూ లోపలికి వచ్చింది పక్కింటి రాజ్యలక్ష్మి ...
"ఇంకా లేదు పిన్ని.... పాపం బుజ్జులు ఆయన వస్తే కేక్ కట్ చెయ్యాలని ఆలా చూసి చూసి పడుకుంది ... పాపం ఎంత బెంగ పెట్టుకుందో .... ఈ మగాళ్ళకి ఇంటి ధ్యాసే పట్టదు బైటకెళ్తే ... "
"కంగారు పడకు సరళ ... వచ్చేస్తాడులే ... రాజముండ్రి నుంచి బైక్ మీద రావాలిగా .... పైగా వర్షం కూడా ... లేట్ అయ్యుంటుందేమో .." అంది సర్ది చెప్తూ ...
"ఏమోలెండి .... ఉండండి పిన్ని పాయసం తెస్తాను... "
"వద్దమ్మా ఇప్పుడు ... ఈ షుగర్ జబ్బు వచ్చినప్పటినుండి తీపి ముడితే ఒట్టు .... సరేలే మీ అంకుల్ గారు వచినట్లున్నారు నేను వెళ్తాను... " అంటూ బయల్దేరింది వాళ్ళింటి గేటు చప్పుడు కాగానే ...
రాజ్యలక్ష్మి గారు బయటకి వెళ్లి చూడగా వచ్చింది వాళ్ళ ఆయన కాదు ..

కళ్ళజోడు సవరించుకొని చూస్తూ "ఎవరూ .... ??" అంది
"కృష్ణ ప్రసాద్ గారి ఇల్లు ....??"
"ఆ ఈ పక్కిల్లే ... ఏమిటి పని?" అంది గొడుగు తెరుస్తూ వర్షం మెండు కావడంతో ...
"ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ... "
"ఇంట్లో మా అమ్మాయి ఉంది... కృష్ణ బాబు ఇంకా రాలేదు... పనేమిటో నాకు చెప్పండి .."
"అదీ .... కృష్ణ ప్రసాద్ గారు రాజముండ్రి నుండి వస్తుండగా ఆక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయారు... ఈ విషయం వారి భార్యకి తెలియజేయండి ... బాడీ ఉదయం ఐదింటి కల్లా పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇంటికి పంపిస్తారు ... అడ్రస్సు కనుక్కోవడంలో కొంత జాప్యం జరిగింది ... ఫోన్ నంబరు లేకపోవడం వల్ల ట్రంకాలు చేయలేకపోయాము ..."
రాజ్యలక్ష్మికి ఒక్కసారిగా వణుకు వచ్చింది ... వళ్ళంతా  చెమటలు  .. తూలిపోయి పడబోతూ పక్కన గోడని పట్టుకొని మెల్లిగా సరళ ఇంటి వైపు వెళ్ళింది ...

"అమ్మా ... నాన్న వచ్చాడా?" బుజ్జులు లేచింది...
"నాన్న నీకోసం గుర్రం బొమ్మ తేవడానికి టౌన్ కి వెళ్లాడంట... పక్కింటి తుపాకీ తాత చెప్పాడు .... నువ్వు గుర్రం బొమ్మ అడిగావు కదా అందుకని వెళ్ళాడంటా ....  "
"నాకు గుర్రం బొమ్మొద్దు ... నాన్నే కావాలి .... "

కిటికీ గుండా చూస్తున్న రాజ్యలక్ష్మి కళ్ళలో నీళ్లు వర్షపు జల్లుల్లో కలిసిపోయాయి ...

సరిగ్గా అప్పుడు టైం 11 45

*******************       *******************     ********************

2017 May 22

పక్క సీట్లో ఎవరో గట్టి గట్టిగా మాట్లాడుకోవడం వినిపించి నిద్ర మత్తు వదిలి బద్దకంగా కళ్ళు తెరిచి చూసాడు సుధీర్... బస్ ఆగి ఉంది...
వెంటనే వాచ్ కేసి చూసుకున్నాడు... టైం పదకొండు కావస్తుంది...
బస్సు కిటికీ లోంచి బయటకి తొంగి చూసాడు.. డ్రైవర్ కండక్టర్ తో పాటు సగం మంది కిందే ఉన్నారు..
సుధీర్ కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు...

"ఏమైంది?" అడిగాడు పక్క సీటు అతన్ని...
"బస్సు రిపేర్ అంట...ఆగి గంట దాటింది.." అన్నాడు, గంట నుంచి కుంబకర్ణుడిలా ఇంత హాయిగా ఎలా నిద్రపోయావు అనే అర్థం ధ్వనించే స్వరంతో...
మళ్ళీ కిటికీ బయటకి తొంగి చూసాడు..
కొంత మంది అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని ఏవో పిచ్చా పాటి మాట్లాడుకుంటున్నారు... మరి కొంత మంది రోడ్డు మీద అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు... అర్థరాత్రి అయినా పౌర్ణమి కావడంతో అంతా వెన్నెల పరుచుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం..

ఆఫీసు నుంచి హడావిడిగా వచ్చి ఉన్నపళంగా రడీ అయ్యి, బస్టాండ్ కి వచ్చి బస్సులో కూర్చున్నాక కొంచెం కుదుట పడ్డాడు సుదీర్... ఆఫీసులో బాగా అలసిపోవడంతో మత్తుగా నిద్ర పట్టేసింది... "పెళ్లి సంబంధం చూశాను.. పిల్ల చక్కగా ఉంది.. అమ్మాయి తరపు వాళ్ళకి సమ్మతమే ...  నువ్వు కూడా వచ్చి చూసుకో.. నీకు కూడా నచ్చితే ఇక ముహూర్తాలు పెట్టించేస్తాను" అని గత నెల రోజులుగా సుదీర్ వాళ్ళమ్మ పోరు పెడుతూనే ఉంది ఇంటికి రమ్మని, కానీ తనకి ఇన్నాళ్ళకు కుదిరింది.. పెళ్లి సంబంధం విషయం గుర్తుకురాగానే కొంచెం ఆలోచనలో పడ్డాడు సుదీర్ .. ఆ అమ్మాయి తన అభిరుచులకి తగ్గట్టుగా ఉంటుందో లేదో ... ఒకవేళ తనకి నచ్చకపోతే అమ్మకి ఏమని కారణం చెప్పాలో.. ఒక వేళ అప్పటికి నచ్చి ఒప్పుకున్నాక, తరువాత ఎమన్నా తేడా జరిగితే ఎలాగా?.. ఇలా సాగుతున్నాయి సుదీర్ ఆలోచనలు...

తన సెల్ ఫోన్ తీసి ఆ అమ్మాయి ఫోటో మరోసారి చూసాడు ... 'సమీరా ... చక్కని పేరు .. చక్కగా ఉంది ... ఫైనల్ చెయ్యడం బెటర్ ఏమో ... లేదు లేదు ... కలిసి అన్నీ మాట్లాడుకున్నాకే ఫైనల్ చేస్తా ..' అనుకుంటూ మరోసారి ఆ అమ్మాయి ఫోటో చూసి ఫోన్ లోపల పెట్టుకున్నాడు ... 

ఇక సీటులో కూర్చోలేక బస్సు దిగి బయటకి వచ్చాడు..
ఒక్కసారిగా చల్లటి గాలి ముఖానికి తాకి హాయి కలిగించింది.. నడుస్తున్న ప్రతి అడుగులో ఏదో ఒక కొత్త పులకింత.. తెలియని ఆత్మీయత... కాసేపు అలాగే నిల్చుండిపోయాడు...
అంతలోనే తేరుకొని, కండక్టర్ దెగ్గరికి వెళ్లి "ఇంకెంతసేపు పడుతుంది?" అని అడిగాడు 
"సరిగ్గా చెప్పలేం సార్.. ఇది సీతారామపురం అని మారుమూల పల్లెటూరు పొలిమేర.. ఈ ఊళ్ళో మనకి మెకానిక్కులు ఎవరూ దొరకరు.. రాజమండ్రి డిపోకి చేస్తే ఇంకెవరినో పంపిస్తా అన్నాడు.. వాడు అక్కడనుంచి రావాలి.. ఇది బాగు కావాలి.. తెల్లవారోచ్చేమో.." అన్నాడు..

ఆ మాట వినేసరికి ఒక్క సారిగా నీరసం వచ్చేసింది సుధీర్ కి.. ఏమి చెయ్యాలో పాలు పోలేదు .. వెళ్లి అలా ఆ పెద్ద మర్రి చెట్టు క్రింద తను కూడా సెటిల్ అయ్యాడు ... అక్కడ కూర్చున్న వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు ..
కండక్టర్ దెగ్గరికి వెళ్లి "హైదరాబాద్ కి ఇంకేమైనా బస్సులు ఉన్నాయా ఈ రూట్ లో వచ్చేవి .." అని అడిగాడు ...
"ఇంకో అరగంటలో ఉంది వోల్వో బండి రాజముండ్రి నుండి... అరగంటలో రాజముండ్రి వెళ్ళలేరు కానీ... సీతారామపురం బస్సు స్టాండ్ లో నిల్చొని చెయ్యి ఊపి రిక్వెస్ట్ చెయ్యండి ... ఆపుతాడు ... "
"సరే .. థాంక్స్ .." అని చెప్పి అటుగా వెళ్లే మోటార్ సైకిల్ అతన్ని రిక్వెస్ట్ చేసి సీతారామపురం బస్సు స్టాండ్ లో దిగాడు...

ఒక్క పురుగు కూడా లేదు అక్కడ ... పల్లెటూరు కదా ... ఒక చిన్న షెడ్ లా ఉంది ఆ బస్సు స్టాండ్ ... 'ఎర్రంశెట్టి సూర్యకాంతమ్మ గారి జ్ఞాపకార్థం' అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది ఆ షెడ్ మీద ... 'హ్మ్మ్ ... గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి... ఈ పల్లెటూళ్ళని అసలు పట్టించుకుంటారా ... ' అనుకున్నాడు..
తనకి చాలా అసహనంగా ఉంది ...
సడన్ గా బోరున వర్షం మొదలైంది .... చిటికెలోనే కుండపోతలా తయారయింది ....
ఆ షెడ్డు నుండి వాన నీరు కారుతుండటంతో ఒక పక్కకి జరిగి కూర్చున్నాడు...
"ఛా... ఈ బస్ ఎప్పుడు వస్తుందో ...." అసహనం మింగేస్తుంది తనని ....

టైం చూసాడు 11 45 అయ్యింది ....

ఇంతలోనే ... "ఏవండీ ... " అంటూ పెద్దగా కేక వేసుకుంటూ వస్తుంది ఆమె  ...
తన వైపే వస్తుంది....
వర్షంలో ఆమె ముఖం సరిగ్గా పనిపించడం లేదు ....
ఆమె తనకి అతి దెగ్గరగా సమీపిస్తోంది ...
అపుడు కనిపించింది ఆమె ముఖం .... స్పష్టంగా ... ఆశ్చర్యపోయాడు ... నివ్వెరపోయాడు .... తను...  ఇక్కడ ...  ఈ వర్షంలో ... అసలు తాను కలగనడం లేదు కదా... అప్రయత్నంగా అంటున్నాడు "సమీరా... " అంటూ

"నా మొహం ... సమీరా ఎవరండీ .... బుజ్జులు పుట్టిన రోజుతో పాటు నా పేరు కూడా మర్చిపోయారా... అయినా చంటిది మీకోసం సాయంత్రం నుండి చూస్తుంది .. ఆ ధ్యాస ఏమైనా ఉందా మీకు ... ఈ టైం లో ఇక్కడ ఒక్కరే కూర్చున్నారేమిటి ...  " అంటూ అతన్ని లేపి తనతో లాక్కెళుతుంది ...

అంతా అయోమయంగా ఉంది ... అయినా ఆమెని అలాగే అనుసరిస్తున్నాడు ... "ఎవరు మీరు?" గొంతులోనే ఆగిపోయింది అతని ప్రశ్న ... ఏమీ మాట్లాడలేని నిస్సహాయత ఎదో అతన్ని ఆవహించి వివశుడిని చేస్తుంది ... తన ఉనికినే కోల్పోతున్నాడా అనే భయం అలుముకుంటున్నా .. అంతకన్నా బలమైన శక్తి ఎదో అతన్ని ఆమె వైపు లాక్కెళుతుంది ...

చుట్టూ చూసాడు ... అంతా విచిత్రంగా కనిపిస్తుంది ... ఎప్పుడూ చూడని పరిసరాలు ... కానీ అక్కడి అడుగడుగు అతని మస్తిష్కంలో ముద్రించి ఉంది ...  దారిపొడుగునా ఉండే చెట్లు కూడా అతన్ని పలకరిస్తున్నాయి ... వర్షపు జల్లు అతన్ని ఆత్మీయంగా అల్లుకుంటుంది ...  అతని వాచ్ కేసి చూసుకున్నాడు ... HMT వాచ్ ... తాను ముచ్చటపడి కొనుక్కున్న ROLEX కాదు ... ప్యాంటు తడుముకున్నాడు ... సెల్ ఫోన్ లేదు ... బుజ్జులు కోసం కొన్న 5 స్టార్ చాకోలెట్లు ఉన్నాయి ... చొక్కా కేసి చూసుకున్నాడు ... pepejeans టీ షర్ట్ కాదు ... పాపారావు బట్టల కొట్టులో తన కోసం ఆమె ప్రేమగా కొని కుట్టించిన నీలి రంగు చొక్కా ... ప్యాంటు.. జీన్స్ కాదు ... బెల్ బాటమ్ ... పర్సు తీశాడు .. అందులో రెండు వేల రూపాయల నోటు లేదు ... రెండు వంద నోట్లు ... రాజముండ్రి పేపర్ మిల్స్ లో సూపర్ వైజర్ ఐ.డీ కార్డు దాని మీద 'కృష్ణ ప్రసాద్ .. సూపర్ వైజర్ ... పేపర్ మిల్ .. రాజముండ్రి  1988' అని ఉంది ... తానెవరు? తనని తాను ప్రశ్నించుకున్నాడు ... అతనిలో కొన్ని వేల అగ్ని గోళాలు పగులుతున్న శబ్దం ... అతి నిశ్శబ్దం ... ఇది కాదు అబద్దం ....

రాయాలయం వీధి వైపు తిరిగారు ఇద్దరూ ..ఆ మూల మలుపున అంటించిన సినిమా పోస్టర్ చూసాడు "యముడికి మొగుడు...  విజయవంతమైన 4 వారం .."
అప్రయత్నంగా ఆమె వైఫు చోస్తూ .. "సరళా... ఈ రోజు బుజ్జులుని సినిమాకి కూడా తీసుకెళ్తా అని చెప్పాను ... పాపం బుజ్జులు బెంగ పెట్టుకుందా .... రేపు దానికోసం సెలవు పెడతానే ... రాజమండ్రిలో సినిమా చూపించి ... ఐస్ క్రీం తినిపించి..  గుర్రం బొమ్మ కొంటాను ... " అన్నాడు ....
"మీ గారాల పట్టిని మీరే తీసుకెళ్లండి ... నేను రాను ... రాజ్యం పిన్ని రేపు సంతకి వెళ్దాం అంది ... కొనాల్సినవి చాలా ఉన్నాయి... "


----- Exciting and thrilling final part very soon

----- Your Ramakrishna Reddy is back to blogging after 7 years.




Sunday, November 13, 2011

ప్రణీతారాం - A Love Story @ Accenture - 1


టైం చూశాను... ఆరున్నర కావస్తుంది... కాసేపట్లో ఆఫీస్ షటిల్ బస్సులు బైల్దేరుతాయి...సిస్టం షడ్డవున్ చేసి నా వెనుక సీటులో కూర్చున్న ఆమె వైపు చూశాను.. సీరియస్ గా ఏదో మెయిల్ టైప్ చేస్తుంది...
"ప్రణీ... యాం లీవింగ్ ఫర ద డే..." అన్నాను ఆమె వెనుకగా నిల్చుని...
ఆమె కనీసం నా వైపు కూడా చూడలేదు..
"సి యు టుమారో..." అని చెప్పి ఆమె ఎలాగూ బదులివ్వదని తెలిసీ అక్కడనుంచి బైల్దేరాను...
ఆఫీసు బయటకి వచ్చాను... చల్లటి గాలి చుట్టేసింది... ఎంతో హాయిగా అనిపించింది.. ఆ హాయి శరీరానికి మాత్రమే కానీ మనసు వరకు చేరలేకపోయింది... మనసులో ఏదో బాధ..
జరిగిన విషయం ఎవరికైనా చెప్పుకుంటే కొంత బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది..
వెంటనే అరుణ్ కి కాల్ చేశాను...


"అరుణ్..."
"ఆ.. చెప్పరా.."
"కొండాపూర్ రోడ్డులోని హోళీ బార్ అండ్ రెస్టారెంట్ కి రా ... షార్ప్ 7 PM."
"ఏంట్రా నువ్వేనా మాట్లాడేది?.. నేను ఎన్ని సార్లు రమ్మన్నా రాను అనేవాడివి.. ఇప్పుడు నువ్వే రమ్మంటున్నావ్?.. ఏంటి సంగతి?"
"చెప్తాను నువ్వు వచ్చాక... సి యు దేర్.." అని ఫోన్ పెట్టేసాను ....


నేను వచ్చిన పది నిముషాలకి వచ్చేశాడు అరుణ్...
ఐదో ఫ్లోర్ పైన ఉన్న రూఫ్ టాప్ గార్డెన్ లో కూర్చున్నాం...
బయట వర్షం తుంపర్లుగా పడుతుంది.. దానికి గాలి తోడై ఆ తుంపర్లు మా ముఖాన పడి కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి...
"ఆ ఇప్పుడు చెప్పరా... ఏంటి సంగతి?" అడిగాడు అరుణ్ ఉండబట్టలేక...
"చెప్తాను ఒక పెగ్గు వేసాక..." అంటూ బేరర్ ని కేకేసాను...
వాడు రాగానే "రెండు స్మిర్న్ ఆఫ్ లార్జ్ విత్ స్ప్రైట్ .... అండ్ వన్ ఫుల్ తందూరీ..." అంటూ ఆర్డరిచ్చి మెనూ మూసేశాను...


బేరర్ ఆర్డర్ తో వచ్చేదాకా.. ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు ... నేను దూరంగా కనిపించే DLF బిల్డింగ్ వైపు చూస్తుండగా ... వాడు పక్క సీటులో ఉన్న డిల్లీ పాప వైపు చూస్తున్నాడు ... బహుశా నేను మేటర్ ఏంటో చెప్పేదాకా మనోడు మరేమీ మాట్లాడడేమో అనిపించింది...


"ప్రణయమా.. మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా..
పరువమా.. సరసాల వీణ పాటలో సరిగమా..
మోయలేని భావమా.. రాయలేని కావ్యమా..
నండూరి వారి గేయమా.."  అంటూ బొంబాయి ప్రియుడు సినిమాలోని పాత మంద్రంగా వినిపిస్తుంది... అది నా ఫేవరేట్..


ఆర్డర్ రాగానే కనీసం ఛీర్స్ కూడా చెప్పకుండా ఎత్తిన పెగ్గు దించకుండా లాగించేసి గ్లాసు క్రింద పెట్టాను ... అరుణ్ వింతగా చూస్తున్నాడు నా వైపు.. నేను చిన్నగా నవ్వాను...
"ఏదో అయ్యింది రా నీకు?.. ఇంతకీ విషయం ఏంటో చెప్తావా లేదా?" అన్నాడు వోడ్కా సిప్ చేసి..
"నేను తనకి ప్రపోస్ చేశాను..."
"ఎవరికీ?" అన్నాడు మరో సిప్ తీసుకొని...
"నేను ఎవరిని లవ్ చేస్తున్నాను అని నీకు చెప్పానో ఆ అమ్మాయికే..."
"ప్రణీతకా..." అన్నాడు ఎత్తబోయిన గ్లాస్ ని కిందకి దింపుతూ...
"అవును..."
"Are you joking?... ఇలా బార్ కి పిలిచి మరీ జోక్ చెయ్యడం బాలేదురా ..."
"నేను తనని ప్రేమించింది నిజం... ఆమెకి ప్రపోస్ చేసిందీ నిజం.. ఇందులో జోక్ చెయ్యడానికి ఏముంది?"
"ఏంట్రా నువ్వనేది... Are you out of your mind?"
"సరిగ్గా తను కూడా ఇదే మాట అంది నేను ప్రపోస్ చెయ్యగానే... దానికి నేను You are in my mind అన్నాను.."
"అఘోరించావులే... ఆ పిల్ల నీ టీం లీడ్ అనే విషయం మర్చిపోయావా?" అన్నాడు మరో సిప్ వేసి...


ఒక్క విషయం నాకు అర్థం కాదు ... ఆడ టీం లీడ్లు, మ్యాథ్స్ టీచర్లు, బస్సు కండక్టర్లు.. వీళ్ళని ఎవరూ ప్రేమించాకూడదా?.. వీళ్ళలో ఉన్న ఆడపిల్లని ఎవరూ చూడరా? ... అసలు వీళ్ళకి ఫీలింగ్స్ ఉండవని మన ఫీలింగా..
"టీం లీడ్ అయితే ఏంటి... ఆమె కూడా ఆడపిల్లే కదా ... పైగా నా కన్నా పదమూడు రోజులు చిన్న..."
"అబ్బో... చాలా పెద్ద గ్యాప్ రా... చాల్లే గాని లైట్ తీస్కో... "
"తీసుకోను... "
"అది కాదురా... రేపు నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆ అమ్మాయి చేతిలో ఉంది.. నీకు సి రేటింగ్ ఇచ్చిందనుకో, నువ్వు ఇక యాక్సెంచర్ నుంచి బుట్ట సర్దేయ్యాలి.." 
"యాక్సెంచర్ ఒక్కటే కాదు కంపెనీ.. ఇంకా చాలా ఉన్నాయి.. కానే ప్రణీత ఒక్కతే... మరో ప్రణీత దొరకదు.."
"ఎందుకు దొరకదు.. మా అపార్టుమెంటులో ముగ్గురు ప్రణీతలు ఉన్నారు.. రేపు రా చూపిస్తా.."
"ఆపుతావా?" అన్నాను చిరాగ్గా...
"సరే నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను... అది సరే ఇంతకీ ఎప్పుడు ప్రపోస్ చేశావ్ తనకి?"
"ఈ రోజు మధ్యాహ్నం... లంచ్ అయ్యాక.."
"ఎలా?"


"ఈ రోజు ఏంటో తను నాకు ప్రతి క్షణం కొత్తగా కనిపించింది...రోజా రంగు చీరలో ముద్దు గుమ్మలా మెరిసిపోతున్న ఆమెని చూసినకొద్దీ చూడాలనిపించింది... ఆమె కళ్ళు నాతో ఏవో మాట్లాడుతున్నట్లు అనిపించాయి... ఇంకెన్ని రోజులు దాస్తావు నా మీద ఉన్న నీ ప్రేమ అని నన్ను జాలిగా అడుగుతున్నట్లు అనిపించాయి.... లంచ్ అయ్యాక పెర్ఫార్మెన్స్ గోల్స్ సెట్ చెయ్యడానికి మీటింగ్ రూం కి పిలిచింది... వెళ్లాను... ఈ మిడ్ ఇయర్ కి నీ గోల్స్ ఏంటి అని తను నన్ను అడిగింది ... ఆమెని చూస్తూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన వాడిలా 'నువ్వే' అన్నాను... 'వాట్?' అంది తను అర్థం కాక... 'నువ్వంటే నాకు ఇష్టం ప్రణీ... అయామ్ ఇన్ లవ్ విత్ యు' అన్నాను... తను ఒక్కసారిగా షాక్ తింది.. ఆమెకి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు 'Are you out of your mind?' అని మాత్రం అనగలిగింది..."No, you are in my mind.. ఆరు నెలలు నీ మీద ఉన్న ప్రేమని ఏదో భయం తో చెప్పలేకపోయాను... ఈ రోజు నాకు నిన్ను చూస్తుంటే ఏదో తెలియని దైర్యం వచ్చింది.. నువ్వు నాదానివి అనిపించింది... అందుకే నీతో..' నా మాట పూర్తి కాకముందే 'స్టాప్ ఇట్  అండ్ గెట్ అవుట్.." అని నన్ను వెళ్ళమని తనే వెళ్ళిపోయింది.. "


"జాగ్రత్తరా... She can screw your career if you keep pestering her... నేను ఆమె గురించి చాలా విన్నాను.." అన్నాడు అరుణ్
"అప్పుడామెకే నష్టం కదరా.."
"ఏం నష్టం ..."
"తన భర్త కరీర్ ని తనే నాశనం చేసింది అని పాపం చాలా ఫీల్ అవుతుంది కదా తరువాత..."
"నువ్వు.. చాలా దూరం వెళ్లిపోయావురా... మరీ ఇంత లోతుగా ఉన్నవాని నాకు తెలీదు సుమీ.." అన్నాడు పెగ్గు ఖాళీ చేస్తూ...
నేను ఆ మాటకి చిన్నగా నవ్వి అలా ప్రక్కకి చూసాను... అటు సైడ్ కార్నర్ లో ఒక అమ్మాయి.. అబ్బాయి కూర్చున్నారు...సైడ్ డిష్ లో ఉన్న చికెన్ పీస్ ని ఆ అబ్బాయి ఆ అమ్మాయి నోటికి అందించి ఎలా ఉంది అన్నట్లు సైగ చేసాడు... సూపర్ అని చెప్పింది ఆ అమ్మాయి.. ఆ అబ్బాయి ఆ అమ్మాయి నోటికి అందించడం వల్ల ఆ పీస్ అంత సూపర్ గా ఉందేమో అనిపించింది నాకు... ఒక్క క్షణం ఆ ప్లేస్ లో నన్ను, ప్రణీతని ఊహించుకున్నాను... గుండెల్లో ఒక తియ్యని గిలిగింత... ఆ ఫీలింగ్ ని తనివితీరా అనుభవించి ఇక చచ్చిపోయినా పర్వాలేదు అపించింది.
                                                          *******
రూం కి వెళ్ళాక నిద్ర పట్టలేదు.. తన గురుంచిన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది... ఒక్క సెకండ్ కూడా తనని నా ఆలోచనలనుంచి వేరు చెయ్యలేకపోతున్నాను...  తనతో మాట్లాడాలన్న కోరిక ఒక్కసారిగా సునామీలా చుట్టేసింది నన్ను... టైం చూసాను... ఒకటిన్నర.. ఒక్క సెకండ్ ఆలోచింది ఫోన్ తీసి తన నెంబర్ డైల్ చేసాను... ఫోన్ రింగవుతుంది... రింగు రింగుకి నాలో ఏదో టెన్షన్... వెంటనే కట్ చేసాను... ఆ తర్వాత నేను చేసిన పిచ్చిపనికి నన్ను నేను  బండబూతులు తిట్టుకొని పడుకున్నాను...
                                                          ********
మరునాడు తొమ్మిది కల్లా ఆఫీసులో ఉన్నాను... తను దాదాపు పదకొండుకి వస్తుంది రోజూ...
అప్పటికే మా టీం మేట్స్ కొంత మంది ఉన్నారు.. వాళ్ళకి విష్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండగా ప్రక్కన కూర్చునే ఇందు చెప్పింది "ఈ రోజు ప్రణీ రావడం లేదు .. సిక్ అంటా... అందరికీ వర్క్ అలాట్ చేసి మెయిల్ పెట్టింది.."
తనని ఇంకొకరు ప్రణీ అని పిలవడం నాకు నచ్చలేదు.. అది అమ్మాయి అయినా సరే...


నేను వెంటనే తన మెయిల్ చెక్ చేశాను... ఏవో టాస్కులు అందరికీ ఇచ్చింది..  Please do complete them by EoD and mail me the status అని ఉంది... తనకి హెల్త్ ఎలా ఉందొ అన్న గాభరా ఎక్కువయ్యింది నాకు... నా మొహం చూడ్డం ఇష్టం లేక రాలేదా లేక నిజంగానే హెల్త్ బాలేదా?.. 99% తను నన్ను చూడ్డానికి చిరాకుగా అనిపించి రాకుండా ఉండిఉండొచ్చు అని అర్థమవుతున్నా.. ఆ ఒక్క శాతం నిజం అవ్వోచ్చేమో అన్న ఆత్రంతో తనకి ఫోన్ కలిపాను... లిఫ్ట్ చెయ్యలేదు.. అలాగనీ కట్ కూడా చెయ్యలేదు.. మళ్ళీ చేశాను... నో రెస్పాన్స్ ... మళ్ళీ చేశాను.. చేస్తూనే ఉన్నాను... నా ఓపికకి నాకే ఆశ్చర్యం వేసింది... ఎట్లీస్ట్ ఏదో ఒక్క క్షణంలో తన ఓపిక నశించి నా కాల్ లిఫ్ట్ చేస్తుందేమో అన్న చిన్న ఆశ...నా ఆశ అడియాస కాలేదు... ఇరయయ్యో అటెంప్ట్ కి నా కాల్ లిఫ్ట్ చేసింది నా డార్లింగ్... సారీ నా టీం లీడ్ ...


"హలో ప్రణీ..."
"....."
"హెల్త్ ఎలా ఉంది... ఏమైనా మెడిసిన్ వేసుకున్నావా? అసలు ఏమైంది.. నువ్వు.."
"Mind your business.. Don't call me.. "
"Please.. Just say that you are O.K.."
దానికి సమాధానంగా నాకు రెండు బీప్స్ మాత్రమే విపించాయి....
తను ఈ రోజు నన్ను చూడ్డానికి ఇష్టపడకపోవచ్చు... రేపు కూడా ఆఫీసుకి  రాకపోవచ్చు.. కానీ ఎన్ని రోజులు సెలవు పెడుతుంది... నా పెదవులపై చిన్న చిరునవ్వు.... నా వెనుక వైపు ఖాలిగా ఉన్న తన సీట్ వైపే చూస్తుండిపోయాను...
ఆ రోజు మొత్తం చాలా నిస్తేజంగా గడిచింది... ఏమీ తినాలనిపించలేదు...


అప్పటిదాకా తన నుండి నాకు వచ్చిన మెయిల్స్ అన్ని అపురూపంగా చదువుకున్నాను ఒకటికి రెండు సార్లు.. వాటిల్లో ఉన్న మేటర్ మొత్తం టాస్కులు, టైం షీట్లు, టార్గెట్లు అయినా అవన్ని తను నాకు చెబుతున్న స్వీట్ నతింగ్స్ లా అనిపించాయి... తను నాకు ఏదో ప్రోగ్రాం గురుంచి చెపుతూ అక్కడ కనిపించిన కాగితం మీద గీసిన పిచ్చి గీతలు నాకు రంగావల్లికలుగా కనిపించాయి.. ఆ కాగితాన్ని తీసుకొని సుతారంగా పెదవులకి తాకించాను... సిగ్గు పడుతున్న తన ముఖం నా కళ్ళ ముందు కదలాడింది...


ఆరున్నర కల్లా సిస్టం షడ్డవున్ చేసి షటిల్ బస్సులు ఆగే కాంపౌండ్ కి వెళ్లాను... అరుణ్ కనిపించాడు..
"ఏరా... ఆల్ ఈజ్ వెల్లా.." అన్నాడు నవ్వుతూ 
"ఇంకా తెలీదు?"
"అదేంటి?"
"ప్రణీ ఈ రోజు ఆఫీసుకి రాలేదు..."
"అవునా... నువ్విచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకొని ఉండదు.." అన్నాడు చిన్నగా నవ్వుతూ..


నేను వెళ్లి నా రూట్ బస్ లో కూర్చున్నాను... ఆరు నెలల క్రితం జరిగిన మా మొదటి పరిచయం గుర్తొచ్చి అప్రయత్నంగా చిన్న నవ్వు విరిసింది నా పెదవులపై...


                                               ****** ఆరు నెలల క్రితం ******


మూడు నెలల క్రితం "Better luck next time" అని ఫీడ్ బ్యాక్ ఇచ్చిన యాక్సెంచర్ H.R. ఇప్పుడు "We are pleased to inform that you got selected" అని మెయిల్ ఇచ్చేసరికి ఓటమి తరువాత గెలిపు రుచికి ఎంత కిక్ ఉంటుందో తెలిసొచ్చింది..


ఒక శుభముహూర్తాన గచ్చిబౌలిలోని యాక్సెంచర్ క్యాంపస్ లో అడుగుపెట్టాను... ఇంత పెద్ద కంపనీలో నేను కూడా ఒక భాగం అనే ఆలోచన కొంచెం గర్వంగా అనిపించింది...
జాయిన్ అయ్యాక ITP (Inter Talent Pool) అంటే బెంచ్ లో వేసారు నన్ను... యాక్సెంచర్ లో బెంచ్ లో ఉన్నవాడు ప్రాజెక్ట్ లో ఉన్నవాడికంటే బిజీగా ఉంటాడు.. కాదు బిజీగా ఉంచుతారు.. బెంచిలో ఉన్నాకూడా పది గంటలు ఆఫీసులో ఉండాల్సిందే... ఆ ట్రైనింగులు ఈ ట్రైనింగులు అంటూ ఊపిరి సలపనివ్వరు... 


రోజూ ఎనిమిదిన్నర కల్లా షటిల్ బస్సులో రావడం... టిఫిన్ చెయ్యడం... ఆన్లయిన్ ట్రైనింగులు చేసుకోవడం.. మధ్య మధ్యల్లో గ్రవుండ్ ఫ్లోర్ Chai n Chai లో టీ బ్రేకులు తీసుకుంటూ ... అటూ ఇటూ తిరిగే అందమైన నార్త్ అమ్మాయిలను చూస్తూనే అప్పుడప్పుడు మన సౌత్ అమ్మాయిలను కూడా చూస్తూ సమ న్యాయం చెయ్యడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం.. ఇవన్ని చేస్తూ కూడా ఒక చెయ్యి ఎప్పుడూ ప్యాంట్ జేబులో ఉన్న మా సెల్ ఫోన్స్ పై ఉండేది... అది ఎప్పుడు మోగితే సారీ వైబ్రేట్ అయితే అప్పుడు వెంటనే అలెర్ట్ అయిపోయి ఎక్కడలేని సీరియస్నెస్ తెచ్చుకొని బైటకి పరిగేత్తేవాళ్ళం... ఎందుకంటే అవి ప్రాజెక్ట్ రిక్వయర్మేంట్ కాల్స్ కాబట్టి... ఎక్కువ కాలం బెంచిలో ఉండడం ఆట్టే మంచిది కాదు యాక్సెంచర్ లో...


అలా ఓ రోజు ఒక కాల్ వస్తే బైటకి పరిగెత్తాడు ప్రవీణ్...
తను వచ్చాక "ఎవరు?" అని అడిగాడు నవీన్...
"ప్రణీత.. తాలిస్మాన్ ప్రాజెక్ట్ నుంచి .." చెప్పాడు 
"నో అని చెప్పెసావా?" వెంటనే అడిగాడు నవీన్...
"అది మీరు చెప్పాలా... నేను బెంగుళూరు కోసం చూస్తున్నాను అని చెప్పేశా.." అన్నాడు ప్రవీణ్ 
"అదేంటి మీరు హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు కదా నాతో?" అన్నాన్నేను అర్థంకాక..
"ఆమె దెగ్గర వర్క్ చెయ్యడం కంటే అండమాన్ లో చెయ్యడం బెటర్... పెద్ద లేడీ శాడిస్ట్... టార్చర్ అంటే ఏంటో చూపిస్తుంది.." అన్నాడు నవీన్...
"ఓహో..." అన్నాను నేను... నాకు ఆమె దెగ్గరనుంచి కాల్ రానివ్వకు దేవుడా అనుకుంటూ...


లంచ్ అయ్యాక ఆన్లయిన్ ట్రైనింగ్ చేస్తుంటే నా ఫోన్ వైబ్రేట్ అయ్యింది...
"హలో..." అన్నాను 
"Am i speaking to Mr. Ram" అని వినిపించింది ఒక శ్రావ్యమైన గొంతు ... ఒక అమ్మాయి గొంతులో ఇంత తియ్యదనం ఉంటుందా అనిపించింది మొదటిసారిగా...
"Yes... Who is this?"
"Hai Ram... This is Praneetha from Talisman Energy project... Am looking for SAP Basis candidate for our requirement... Is it good time to talk to you?"
నా గుండెల్లో దడ మొదలయ్యింది... ఏం చెప్పాలో అర్థం కాలేదు... సలహా అడుగుదామంటే పక్కన ఎవరూ లేరు...
"Aa.. well.. Aa...hmmm... "
"Sorry??"
"Aa... hmmm.. OK"
"Fine... If it is possible can you meet me in 4th floor at meeting room number 13 right now"
"Ya.. sure" ఫోన్ పెట్టేసాను...


నాకు టెన్షన్ మొదలయ్యింది.. అనవసరంగా ఇరుక్కు పోయనేమో అనిపించిది.. ప్రవీణ్ చెప్పినట్లు బెంగుళూరో పూనేనో అని చెప్పాల్సింది... ఇంతలో నవీన్ ప్రవీణ్ వచ్చారు...
విషయం వాళ్ళకి చెప్పాను...
"ఏం కాదులే.. వెళ్లి కలువు... బట్ అడిగినవాటికి సమాధానాలు తెలియనట్లు ఉండు.. ఏది అడిగినా దాని మీద వర్క్ చెయ్యలేదు అని చెప్పు.. సో నిన్ను ప్రాజెక్ట్ కి ఆమె లాక్ చెయ్యదు.." అని సలహా ఇచ్చాడు నవీన్...
సరే అని చెప్పి... లోపల కొంచెం టెన్షన్ గా ఉన్నా ఇక తప్పదని బైల్దేరాను ఫోర్త్ ఫ్లోర్ కి...




                                                                        ---- To be continued in 2nd part.


Note: It's a complete fictional work. This is the first time i have ever used self-narration method in any fictional works of my blogs. Hope you like it. - Ramakrishna Reddy Kotla.

Wednesday, March 16, 2011

ఈ జన్మ నీదని అంటున్నా... వింటున్నావా ప్రియా - 1

ఆఫీస్ వర్కులో మునిగిపోయిన మధుమిత తన సెల్ ఫోన్ బీప్ కి ఒక్కసారిగా ఉలిక్కిపడింది...
చూస్తే అది రిమైండర్ "Drop Abhi at the intreview" అని ఉంది... వెంటనే వాచ్ వైపు చూసుకొని "God, its already late... వెళ్ళాలి' అనుకోని, ప్రక్కన ఉండే కొలీగ్ ని పిలిచి "సుధా నేను అర్జెంటుగా వెళ్ళాలిరా...టూ - త్రీ అవర్స్ లో వచ్చేస్తా.. కొంచెం నా డెస్క్ కాల్స్ అటెండ్ చెయ్యవా ప్లీజ్" అంది.
"చేస్తాలే గానీ... ఏంటి అంత ఇంపార్టెంట్... boyfriend responsibilities eh?"
"Shut up" అంటూ నవ్వుతూ "ప్లీజ్ రా.. తనకి ఇంపార్టెంట్ ఇంటర్వ్యు... కష్టపడి సెట్ చేశా తెల్సా?"
"అతను మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా అది చేడగోట్టేస్తాడు... ఎన్నిసార్లు చూడలేదు.."
"ఆపవే బాబూ ... వెళ్తున్నా నేను టైం అవుతుంది.." అంది హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కదులుతూ...
"బాస్ వస్తే ఎం చెప్పమంటావ్?" అంది సుధ..
"రెస్ట్ రూంకి వెళ్లిందని చెప్పు.."
"కొద్దిసేపు అయ్యాక మళ్ళీ వచ్చి అడిగితే.."
"మళ్ళీ రెస్ట్ రూంకి వెళ్లిందని చెప్పు... ఎందుకని అడిగితే లూస్ మోషన్స్ అని చెప్పు... నన్ను వదిలేయ్యవే తల్లీ.." అంటూ పరిగెత్తింది... సుధ నవ్వుతూ చూస్తుండిపోయింది...

మధు బయటకి వచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తూ అభికి కాల్ చేసింది... మూడో అటెమ్ట్ కి ఎత్తాడు అభి..
"హ....లో...."
 "అభీ...."
"ఎవరు?"
ముక్కు వెంటనే ఎరుపెక్కింది మధుకి..."నేను మధుని రా ... ఏంటి కన్నా నన్నే గుర్తుపట్టలేదు.."
"చె..ప్పు.."
"ఏంటి చెప్పేది ఇంటర్యు ఉందని చెప్పాగా ... ఏంటి నిద్రపోతున్నావా??"
"హా..."
"లేరా కన్నా... ఈ ఇంటర్యు అటెండ్ అవ్వరా ప్లీజ్ ... నేను మొత్తం సెట్ చేసాను నా ఫ్రెండ్ ని బ్రతిమిలాడి ... నువ్వు జస్ట్ ఒక రెండు మూడు కోస్చేన్స్ కి ఆన్సర్ చెప్తే చాలు... ఆ కోస్చేన్స్ కూడా ఏమిటో చెప్తాను నేను వచ్చాక.."
"సర్లే... నువ్ రా..."
"నేను వచ్చేసరికి స్నానం చేసి రడీ అవ్వరా నా మంచి అభి కదా..." అంటూ ఫోన్ పెట్టేసి బైక్ స్టార్ట్ చేసింది...

                                                            *****

డోర్ బెల్ మోతకి లేచాడు అభి...
డోర్ ఓపెన్ చెయ్యగా ఎదురుగా మధు...
"సచ్చినోడా... ఇంకా స్నానం చెయ్యలేదా??" అంది కళ్ళు పెద్దవి చేసి లొపలికి వస్తూ..
"బ్రష్ కూడా చెయ్యలేదు .." అంటూ మధు బుగ్గలు పట్టుకొని లాగుతూ "అసలు కోపంలో నీ బుగ్గలు ఇలా టొమాటోలా మారినప్పుడు కొరుక్కొని తినేయ్యాలి అనిపిస్తుందే" అన్నాడు..
"ఆహా అలా అనిపిస్తుందా...పదే పది నిముషాల్లో నువ్ రడీ అయ్యి రావాలి లేకపోతే నాకు అనిపించింది చేస్తా జాగ్రత్తా" అంది బుగ్గల్ని విడిపించుకుంటూ...
"చెయ్యి చెయ్యి... అయినా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా చెప్పు...." అన్నాడు నవ్వుతూ 
"ఛీ ఛీ పాడయిపోతున్నవురా రూములో కూర్చొని... వెళ్ళరా బాబూ.." అంటూ బాత్రూంలోకి తోసింది..

                                                                *****
"ఓకే నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా... ఈ ఇంటర్యు నీకు అయిపోవాలిరా.. ఇంటర్యు చేసేది ఫ్రెండే అని చెప్పాగా సో కంగారు పడకు.." అంది మధు ఇంటర్యు వెన్యూకి రాగానే...
"అలాగేలేవే... నువ్వెళ్ళు ఇక..."
"నువ్వొచ్చేదాక నేను ఇక్కడే వెయిట్ చేస్తారా కన్నా... నువ్వు వచ్చి బాగా చేశాను అని చెప్పాలి..."
"సరే.." అంటూ లొపలికి వెళ్ళాడు...

మధు అక్కడే రిసెప్షన్ లో కుర్చుని ఉంది... 
"హే మధూ.." అనే వాయిస్ వినిపించి వెనక్కి తిరిగి చూసింది.. 
"దివ్యా..." అంది కళ్ళు పెద్దవి చేస్తూ "నువ్వేంట్రా ఇక్కడ?"
"ఏమిలేదు.. ఈ మధ్యే ఈ కంపెనీలో జాయిన్ అయ్యా.."
"అవునా... గ్రేట్.."
"నువ్వేంటి ఇక్కడ?"
"అదీ... అభీకి ఇంటర్యూ.." అంది మెల్లిగా 
"వాట్... You must be joking!.. ఈ ఇంటర్యు నంబర్ ఎంత?"
"ఆపవే.." అంది ఉడుక్కుంటూ..
"నేను ఆపడం కాదు.. నువ్వే ఆపెయ్యి అతనితో రిలేషన్.. కొంచెం కూడా నీ పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు అతనికి.. ఏం చూసి అతన్ని నువ్వింకా ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.. నువ్వేమో కష్టపడి సంపాదిస్తుంటే అతనేమో జల్సా చేసుకుంటున్నాడు.. ఒక అమ్మాయి సంపాదనతో బతకడం కొంచెం కూడా సిగ్గుగా లేదు అతనికి..."
"దివ్యా..." అంది కోపంగా "అభీకి నేను తప్ప ఈ ప్రపంచం లో ఎవరూ లేరు.. అలాగే నాకు కూడా.."
"తెలుసు... మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్ లో కలిసి పెరిగారు అని తెల్సు... కానీ నువ్వు కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి జాబ్ తేచ్చుకున్నావ్.. అతను ఫెయిల్ అయ్యి జులయీలా తయారు అయ్యాడు... ఓకే నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చెయ్యి... కానీ దేనికయినా ఒక లిమిట్ ఉంటుంది.. అతనే ప్రపంచంలా బ్రతకడం.. పిచ్చిదానిలాగా ప్రేమించడం అదీ అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోని... ప్రాక్టికల్ గా ఆలోచించవే... ఒకవేళ రేపు అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నా నీ పట్ల ఎంతవరకు భాద్యతగా ఉంటాడు.."
"ప్రేమలో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది స్వార్ధం అవుతుంది... అతను మీకు ఇర్రెస్పాన్సిబుల్ గా కనిపించొచ్చు, నాకు మాత్రం అతను నాకోసం ఉన్నాడు అనే ఆలోచనే ప్రతిక్షణం ఆనందం కలిగిస్తుంది.. అయినా ఈ జాబ్ నా అభీకి వచ్చేస్తుంది చూడు ... అతను అలా జాబ్ లో జాయిన్ అవుతాడు .. నేనిలా రిజైన్ చేసేస్తా..." అంది చిన్నగా నవ్వుతూ...
"హమ్ ... కలలు కంటూ ఉండు ... సరే నాకు కొంచెం పనుంది మళ్ళీ కలుస్తా .." అంటూ వెళ్ళింది ...


మధు కూర్చొని ఏవేవో ఆలోచిస్తుంది ... ఇందాక దివ్య అన్న మాటలు తనకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి 'ఏం చూసుకొని తనని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు..'
అసలు అభీ అంటే నాకెందుకు అంత పిచ్చి ... అతను కనిపించకపోయినా మాట్లాడకపోయినా శ్వాస ఆగినట్లు ఉంటుందెందుకు... 
నా అభీ నా జీవితంలోకి ఒక పండగలా వచ్చాడు... నవ్వుల్ని నింపాడు.. నేస్తం అయ్యాడు...సమస్తం అయ్యాడు....


                                                      **  పదిహేనేళ్ళ క్రితం  **
వీ కేర్ ఆర్ఫనేజ్ , కర్నూలు.


"సిస్టర్, మధుమిత అనే అమ్మాయి చాలా డల్ అయ్యింది ... అసలు రెండ్రోజుల నుంచి ఏమీ తినడం లేదు ..." అంటూ వచ్చింది సిస్టర్ లిజీ..
"అలాగా ... ఎందుకని.."
"ఆ అమ్మాయి పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారు ... ఎవరో తెలిసిన వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసారు ... పాపం ఆ అమ్మాయి అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూనే ఉంది.."
"అలాగా... సరే నేను వస్తున్నాను పదండి.." అంటూ హెడ్ సిస్టర్ ఆమెని అనుసరించింది ...
వాళ్ళిద్దరూ మధు ఉన్న రూమ్ లోపలికి రాబోతూ ఆగిపోయారు... లోపలికి చూశారు.. మధు పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు ..
"ఈ బిస్కెట్ తీసుకో..."
"నాకొద్దు.." అంది మధు
"బాగుంటుంది.. "
"వద్దు.."
"పోనీ చాక్లెట్ కావాలా... "
"ఉహు..."
"నువ్వు నేను ఇచ్చిన బిస్కెట్ తింటే, నేను రోజూ నీతో ఆడుకుంటా .. ఎప్పుడు నీతోనే ఫ్రెండ్షిప్ చేస్తా ...రోజూ చాక్లెట్ ఇస్తా..."
ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు ...
"ఏడవద్దు ప్లీజ్ ..." అంటూ కళ్ళు తుడిచి మధు నోట్లో బిస్కెట్ పెట్టాడు ... మధు బిస్కెట్ తింటూ అలానే చూస్తూ ఉండి పోయింది ఆ అబ్బాయి వైపు... మధుకి వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు...
"హమ్మయ్యా ... నాకు హ్యాపీగా ఉంది నువ్వు తిన్నందుకు ... నీ పేరేంటి.."
"మధుమిత..."
"నేను అభినయ్... ఇప్పటినుంచి మధుమిత అభినయ్ ఫ్రెండ్స్ సరేనా?"
"ఊ..." అంది బిస్కెట్ తింటూ కళ్ళు తుడుచుకుంటూ ...


ఆరోజునుంచి మధు, అభీ కలిసి ఆడుకునేవాళ్ళు... కలిసి తినేవాళ్ళు...కలిసి ఆర్ఫనేజ్ స్కూల్ కి వెళ్ళేవాళ్ళు... మధూ అభికి ఎన్నెన్నో కథలు చెప్పేది...
"నీకు ఇన్ని కథలు ఎలా తెలుసు మధూ.." అడిగేవాడు ఆశ్చర్యపోతూ 
"మా డాడీ రోజూ నాకు కథ చెప్పి పడుకోబెట్టేవారు... ఆ కథలు నాకు బాగా గుర్తుంటాయి.."


"...... అలా రాజు అడవులకి వెళ్ళిపోయాడు .. పాపం రాజ్యంలో రాణి ఒక్కతే ఉండేది.. ఎన్ని రోజులయినా రాజు తిరిగిరాలేదు... రాణికి భయమేసింది... దేవుడికి ప్రేయెర్ చేసింది... కానీ రాజు రాలేదు.." అంటూ చెప్పుకుపోతున్న మధుని మధ్యలో ఆపి.. "రాజు చాచ్చిపోయాడా.." అని అడిగాడు అభి.
"ముందు కథ విను అభి... అప్పుడేమో ఆ అడవిలో ఒక వేటగాడు.."
"కాదు... ముందు చెప్పు రాజు చచ్చిపోయాడా?" అంటూ మధుని చెప్పనివ్వకుండా ఆపాడు..
"అవును అభీ... రాజు చచ్చిపోయాడు పాపం.."
"వద్దు... ఆలా అయితే ఈ కథ నాకు వద్దు..  వేరే కథ చెప్పు.. లేకపోతే రాజుని బ్రతికించు.."
"ఎందుకు అభీ.."
"రాజు చచ్చిపోతే రాణి ఏడుస్తుంది కదా... పాపం రాణికి తోడు ఎవరు ఉంటారు.."
"నిజమే కదా... అయితే వాళ్ళిద్దరిని ఎప్పటికీ కలిపే ఉంచుదాం.." 
"మా మంచి మధు.."
"నువ్వు కూడా ఎప్పుడూ నాతో కలిసే ఉంటావు కదా అభీ.."
"నేను రాజూ కాదు... నువ్వు రాణీ కాదుగా... మనం కలిసి ఎలా ఉంటాము.."
"అంటే కలిసి ఉండాలంటే... రాజూ రాణీ అయ్యి ఉండాలా.."
"అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా మన మమ్మీ డాడీ లాగా.. అందుకే కలిసి ఉంటారు..."
"అయితే మనం కూడా పెళ్లి చేసుకుందామా... అప్పుడు కలిసే ఉండొచ్చుగా..."
"అవును నిజమే... సరే నువ్వు ఇక పడుకో... "


ఓరొజు మధు ఒక్కతే కూర్చొని ఏడుస్తుండటం చూసి "మధూ... ఎందుకు ఏడుస్తున్నావ్?" అంటూ వచ్చాడు అభి..
"ఏమి లేదు.."
"సరే రా ఆడుకుందాం..."
"నేను రాను.. నువ్వెళ్ళి ఆడుకో..."
"అయితే నేనూ వెళ్ళను ... ఆడుకుంటే నీతోనే... నువ్ రాకపోతే నేను కూడా ఆడుకోను.."
"అభీ నాకిప్పుడు డాడీ కావాలనిపిస్తుంది.."
"అలాగే .. నువ్వు ఎప్పుడూ ఏడవకుండా నవ్వుతుంటే డాడీ వస్తారు..."
"నిజంగా.. అయితే అలాగే... ఈ రోజు నా బర్త్ డే..డాడీ ఉంటె నాకు టాయ్స్ అన్నీ కొనేవారు.. ఇంకా అందరిని పిలిచి పార్టీ చేసేవారు..."
"నీ బర్త్ డే నా.. మరి నాకు చెప్పలేదేంటి... మధు నేను ఇప్పుడే వస్తాను.." అంటూ పరిగెత్తాడు...
కాసేపయ్యాక ఒక పెద్ద చాక్లెట్ ప్యాకెట్ తో వచ్చాడు అభీ..
"మధు రా ... అందరికీ పంచి పెడుదువుగాని.."
"అభీ... ఎక్కడివి ఇన్ని చాక్లెట్లు" ఆశ్చర్యపోతూ అడిగింది
"లిజీ సిస్టర్ ని అడిగాను ఈ రోజూ నీ బర్త్ డే అని... సిస్టెరే ఇచ్చి అందరికీ పంచి పెట్టమంది.. పదా అందరికీ ఇద్దాం.."
మధు అభీ కలిసి అందరికీ చాక్లెట్లు పంచి పెట్టారు... సిస్టర్స్ మధు పేరు మీద ప్రేయెర్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ..


"అభీ నాకు హ్యాపీగా ఉందిరా ... ఇంకెప్పుడూ ఏడవను .. నాకు డాడీ లేకపోయినా నువ్వున్నావ్..."
ఆ మాటతో అభీ మెల్లిగా ముందుకు వంగి మధూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు...


రోజులు గడిచిపోతున్నాయి... రాను రాను మధు అభిల ఫ్రెండ్షిప్ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా బలపడింది...
టెన్త్ క్లాస్ రిజల్స్ వచ్చాయి...
అరవై శాతం వచ్చిన స్టూడెంట్స్ నే కాలేజ్ కి పంపుతా అని సిస్టర్ ముందే చెప్పింది..
మధుకి డిస్టింక్షన్ వచ్చింది... అభీ జస్ట్ పాస్ అయ్యాడు...
"మధూ నెక్స్ట్ వీక్ నుండి నువ్వు సెయింట్ జాన్స్ కాలేజ్ లో ఇంటర్ చేయ్యబోతున్నావ్... బీ ప్రిపెర్డ్..."
"నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తాను సిస్టర్... ప్లీజ్"
"నెక్స్ట్ ఇయరా... Are you mad?.. why you want to waste one academic year.. you are so bright student"
"అదీ సిస్టర్... అభీ జస్ట్ పాస్ అయ్యాడు... సో మీరు తనని ఈ ఇయర్ కాలేజ్ కి పంపరు... తను లేకుండా నేనెలా?.. అందుకే ఈ ఇయర్ తనని నేను బాగా చదివిస్తా.. తను నెక్స్ట్ ఇయర్ తప్పక క్వాలిఫై అవుతాడు.. అప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం.."
"మధూ డోంట్ బీ చైల్దిష్.. ఇప్పుడు మీరు ఇంకా చిన్న పిల్లలు కాదు.. Being a girl you should know your limits now... తన కోసం నీ చదువు పాడుచేసుకుంటావా?.. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది."
"అభీ లేకుండా నాకు ఏ ఫ్యూచర్ లేదు  .. నేను ఈ ఇయర్ వెళ్ళడం లేదు.." అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది...


                                                            *********
ఎదో శబ్దానికి ఆలోచనల్లోంచి బయటకి వచ్చింది మధు ... చూస్తె అభీ వచ్చి తన ప్రక్కన కూర్చున్నాడు...
"అభీ.. ఎప్పుడు వచ్చావ్ రా..." అంది తేరుకొని
"ఇప్పుడేలే... ఏంటి ఈ లోకం లేనట్లున్నావ్?"
"నాకు నువ్వే లోకం కన్నా... మన గురుంచే ఆలోచిస్తూ ఉండిపోయా... ఇంతకీ ఇంటర్యూ ఎలా చేసావ్?"
"ఆ బాగానే చేశాలే... ఏదన్నా హోటల్ కి వెళ్దాం పదా నాకు బాగా ఆకలేస్తుంది.."
"అయ్యో నా బుజ్జి కన్నకి ఆకలేస్తుందా .. పద వెళ్దాం" అంటూ లేచింది...


                                                               ****
ఆఫీసు నుండి బైల్దేరబోతూ తన ఫ్రెండ్ కి కాల్ చేసింది మధు...
"హలో..."
"సిద్ధు నేను మధుని..."
"ఆ చెప్పు మధు..."
"అభీ ఎలా చేసాడు ఇంటర్యు ... ఓకే నా.."
"అసలు ఇంటర్యుకి వస్తే కదా ఓకేనో కాదో చెప్పడానికి.."
దెబ్బకి షాక్ తగిలింది మధుకి .. "అదేంటి రాలేదా?.. నేనే తీసుకువచ్చాను సిద్ధూ"
"నేను వన్నవర్ వెయిట్ చేశా తన కోసం... అయినా ఇంటర్యు కి రాలేదు... నువ్వు నన్ను అంతగా రిక్వస్ట్ చేశావని తనని ఎలాగయినా సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు.. కానీ మనిషే రాలేదు, ఏం చెయ్యమంటావ్??.. Looks like he is totally irresponsible ...ఇతని కోసమా నువ్వు ఇంతగా నన్ను రిక్వస్ట్ చేసింది అనిపించింది మధు.."
మధుకి బాధ కోపం కలగలిపి వచ్చాయి.. "యాం సారీ సిద్ధు... నేను మళ్ళీ చేస్తా.." అని పెట్టేసింది
మధు కి ఏడుపు వచ్చింది... అభీ ఎందుకు నా బాధ అర్థం చేసుకోవడం లేదు.. తనని సెటిల్ చెయ్యలని ఎంతగా ప్రయత్నించినా తను ఎందుకు కొంచెం కూడా రియాక్ట్ కావడం లేదు... అభిని తొందరగా సెటిల్ చేసి, తను ఈ జాబ్ మానేసి హాయిగా అభిని పెళ్లి చేసుకోవాలని తను ఎంత ఆరాటపడుతున్నా అభి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు... వెంటనే సెల్ తీసి అభి నంబర్ కి డైల్ చేసింది.

                                                                                                       ....... To be continued

Monday, January 17, 2011

ఫ్లాట్ నెం 402

డిసెంబర్ 31st 2006....
ఫ్లాట్ నెం 402
కాలింగ్  బెల్ మ్రోగగా, డోర్ ఓపెన్ చేశాడు అభి ...
ఎదురుగా ఆకాంక్ష ..
"అకీ ..." అతని కళ్ళలో కొత్త మెరుపు ఆమెని చూడగానే .. "నాకు తెలుసు బంగారం నువ్వొస్తావని .. నన్ను విడిచి నువ్వుండలేవు.. నేను కూడా ఉండలేనురా ..." అన్నాడు ఉద్వేగంగా .. అతని కళ్ళలో చెమ్మ ఆమె దృష్టి దాటిపోలేదు ...
"నేను లోపలికి రావచ్చా.." అంది క్లుప్తంగా ...
"నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నానురా .." అన్నాడు ఆమెకి లోపలికి దారిస్తూ ...
"నీ దెగ్గర ఉన్న నా వస్తువులు .. గిఫ్టులు ... గ్రీటింగులు ... ఫోటోలు .. అన్నీ నాకు కావాలి .. అవి తీసుకెళ్ళడానికే వచ్చాను .." అంది
"ప్లీజ్ అకీ ... నేను చెప్పేది ఒక్కసారి విను ... ఇంకెప్పుడు అలా జరగదు ... నువ్వు లేని నా జీవితాన్ని నిజంగా ఊహించుకోలేను .."
"ఇనఫ్ ... జరిగింది చాలు ... Let me go on with my life.."
                                                            ******

జనవరి ఫస్ట్ 2008....
అర్థరాత్రి దాటింది... డాబా మీదున్న వాటర్ ట్యాంక్ మీద కూర్చున్నాడు అభి...
చల్లని గాలి రివ్వున వీస్తుంది... కనిచూపు మేరల్లో కనిపించే సిటీ అంతా వెలుగులు చిమ్ముతుంది..కొత్త సంవత్సరంలోకి అడుగెట్టిన ఆనందంలో నగరంలో జనాలు చాలా మంది సంబరాల్లో మునిగితేలుతున్నారు ...
పెద్దవాడైనా  పేదవాడైనా.. ప్రతిరోజొక పండుగలా జీవించేవాడైనా .. గుండెల్లో పుట్టెడు దుఃఖం దాచుకున్నవాడైనా .. అన్నీ మరచిపోయి ఆనందంగా ప్రతిఒక్కరినీ కొత్త సంవత్సరం సంతోషంగా గడపాలని కోరుకునే గొప్ప రోజు .. కానీ అభికి సంవత్సరం క్రితం అది తన జీవితాన్ని ఎప్పటికీ మార్చివేసిన రోజు ...

"Aki why did you do this to me?" సూన్యంలోకి చూస్తూ తనలో తానే అనుకున్నాడు అభి "ఎంతగా ప్రేమించాను ... నువ్వేలోకం అనుకున్నాను ... నన్ను వదిలి ఎలా వెళ్లిపోగలిగావు.. How could you cheat on me.." అతని కళ్ళు ఎర్రబారాయి ... " ఇంత చేసినా నీ మీద నాకున్న ప్రేమ తగ్గలేదు .."
                                                             ********

జనవరి 2, 2007

లిఫ్ట్ లోంచి బయటకి వచ్చాడు అభి ... తనతో పాటు ఓ అమ్మాయి కూడా ...
తన ఫ్లాట్ కి వెళ్లి లాక్ ఓపెన్ చేయ్యబోతుండగా .. "Excuse me" అంది ఆ అమ్మాయి..
ఎంటన్నట్లుగా ఆ అమ్మాయి వైపు చూశాడు అభి..
"నేను కొత్తగా మీ పక్క ఫ్లాట్ 403కి వచ్చాను ... నా పేరు ప్రియ ... చిన్న హెల్ప్ చేస్తారా?"
"చెప్పండి .."
"హాల్లో బుక్స్ ర్యాక్ ఒకటి ఉంది .. దాన్ని నా బెడ్ రూమ్ కి మార్చాలి ... నేను ఒక్కదాన్ని మూవ్ చెయ్యలేను ... మీరు హెల్ప్ చేస్తే ఇద్దరం కల్సి ఈజీగా మూవ్ చెయ్యొచ్చు ..."
"సరే ... పదండి .." అంటూ ఆమెతో పాటు ఆమె ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లాడు అభి ...
లోపలికి వచ్చాక ఇద్దరూ కల్సి ఆ ఉడెన్ బుక్స్ ర్యాక్ ని ఆమె బెడ్రూం లోకి మార్చారు ...
"చాలా థాంక్స్ ... మిగతావి నేను ఈజీగా సర్దుకోగలను .. ఇదొక్కటే కొంచెం బరువైంది .. మీరు హెల్ప్ చేసారు .. చాలా థాంక్స్ .."
"ఇట్స్ ఓ.కే .. ఈ ఫ్లాట్ లో మీరొక్కరే ఉంటున్నారా?"
"అవును ..."
"ఒంటరిగా అనిపించదా ..."
"చిన్నప్పటినుంచీ నాది ఒంటరి జీవితమే .. ఇప్పుడు కొత్తగా ఒంటరినేమీ కాదు ... "
ఆ మాట విని ఆమె వైపే ఓ క్షణం అలా చూస్తుండిపోయాడు ... 'ఎక్కడ విన్నాను ఈ మాట .. అవును ఆకాంక్ష కూడా ఇలానే అనేది ..'
"అభి గారు ... మంచి కాఫీ తెస్తాను ఉండండి .."
"నా పేరు మీకు??"
"హా హా .. అది పెద్ద కష్టమా ..." అంటూ నవ్వుతూ లోపలి వెళ్ళింది ..
అక్కడ ర్యాక్ లో ఉన్న పుస్తకాలను చూస్తున్నాడు అభి ..
"మీరు సిడ్నీ షెల్డన్ చదువుతారా?" అడిగాడు కాఫీ కప్పుతో వస్తున్న ప్రియని చూసి ...
"మై ఫేవరెట్ ..." అందామె ...
ఆశ్చర్యపోయాడు ....

                                                      ******
డిసెంబర్ 31st, 2006.

ఆకాంక్ష అభికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ వెతికి మరీ కలెక్ట్ చేసుకుంటుంది ...
"ఇంకా నాకు సంబంధించినవి నీ దెగ్గర ఏమైనా ఉన్నాయా?" అంది అభి వైపు చూస్తూ ..
"నా ప్రాణం ఉంది కావాలా?"
"నేనేమీ పిశాచాన్ని కాదు ... నేను నీకు ఇచ్చిన సిడ్నీ షెల్డన్ బుక్స్ ఎక్కడ?"
షెల్ఫ్ వైపు చూపించాడు అభి ...
అన్నీ ప్యాక్ చేసుకుంటుండగా ... కార్ హారన్ వినిపించింది.. బాల్కనీ లోంచి చూసి ఎదో సైగ చేసింది ...
"ఎవరు?" అన్నాడు అభి
"రాజ్ ..."
"వాడొక ఈడియట్ ... వాడితో నీకేం పని ..."
"నీకంటే ఎన్నో రెట్లు నయం ... అయినా నా విషయాలు నీకు ఇక అనవసరం ..."
"పిచ్చిగా మాట్లాడకు ... నా మీద కోపంతో వాడికి దెగ్గర అవుతున్నావా ... వాడు నన్ను ఎంత మోసం చేసాడో నీకు తెలియదా ... "
"షటప్ ... నా లైఫ్ నా ఇష్టం ... నీ లాంటి సైకో కంటే రాజ్ ఎంతో బెటర్ ... హీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంతే ..."
"అకీ ... గివ్ మీ ఏ చాన్స్ ... I will correct myself.. "
"Am exhausted giving u chances... Now, i don't wanna take any chance with you... you understand that..." అంటూ వెళ్లిపోతుండగా, ఆమెకి వెళ్లి అడ్డుగా నిల్చున్నాడు ...
"అభీ తప్పుకో..."
"వెళ్ళనివ్వను ... ప్లీజ్ .. నేను చెప్పేది విను ... నిన్ను వదులుకోలేను ..."

                                                     ********
జనవరి 2nd, 2007

"ఏంటి అలా చూస్తున్నారు .." అడిగింది ప్రియ
"ఏమీ లేదు ... నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కూడా నీలాగే సిడ్నీ షెల్డన్ నోవెల్స్ ఇష్టం .."
"ఓహ్ అలాగా ... ఫ్రెండా... గాళ్ ఫ్రెండా?" అంది నవ్వుతూ
"హమ్ .... We broke up recently.."
"Oh am sorry ..."
"Thats ok... మీ గురుంచి చెప్పండి ... మీకు బాయ్ ఫ్రెండ్ లేడా?"
"నాదీ మీ స్టోరీనే ... విడిపోయాం ..." అంది
"అవునా ... ఏమయింది?"
"మెన్ ఈగో ... too much possessiveness ... ఆఫీసులో అందరితో నాకు రేలషన్ అంటగట్టి మెంటల్ టార్చర్ పెట్టాడు ... చివరికి భరించలేని స్థితికి వచ్చాను ..."
అభికి తానేమి వింటున్నాడో అర్థం కావడం లేడు ... "Who is she?" అనుకున్నాడు ఆశ్చర్యంగా ...
"ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చి తనకి కాల్ చేస్తే .. 'ఈ రోజు ఎవడి బండి మీదో వెళ్ళావట... మీ ఆఫీస్ లో పని చేసే నా ఫ్రెండ్ శేఖర్ చెప్పాడు ... వాడితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నావట..' అంటూ ఏడిపించే వాడు ... ఒకోసారి 'తిరిగితే తిరిగావులే.. వాళ్ళతో నీ రాసలీలలు ఎలా సాగించావో చెప్పు ... విని తరిస్తా' అంటూ చెండాలంగా మాట్లాడేవాడు .. He was sick.."
అదంతా విని స్టన్ అయ్యి అక్కడే కొయ్యబొమ్మలా నిలబడ్డాడు అభి ..

                                                          ******

డిసెంబర్ 31st, 2006.

"Get off my way.." అంది అతన్ని విదిలించుకుంటూ ...
"ప్లీజ్ అకీ ... ఇంకెప్పుడు అలా ప్రవర్తించను ...ఈ ఒక్కసారికి నన్ను క్షమించు .."
"ఇంక నాకు ఓపిక లేదు ...  I have experienced the extremes of your psychopathic nature.. you are sick... మాట్లాడిన పతి మగాడితో రిలేషన్ అంటగట్టే నీలాంటి వాడిని ఇన్ని రోజులు ప్రేమించాను అన్న ఊహే నాకు కంపరం పుట్టిస్తుంది ..."
"అది నాకు నీ మీద ఉన్న అతి ప్రేమ అలా చేయించింది ... నువ్వెక్కడ నా చెయ్యి జారి పోతావో అన్న ఇన్సెక్యూరిటీ నాతో అలా చేయించింది ... నీ అందం చదువుతో పోలిస్తే నేను నీకు ఎక్కడా సరితూగను.. అందుకే నీ విషయంలో నాకు ఎప్పుడూ ఇన్సెక్యూరిటీ ఉండేది ... అందుకే ఓవర్ పోసేసివ్ గా ఉండేవాడిని.. ఇవన్నీ నీ ప్రేమ వల్ల కలిగినవే .. అంతే కానీ నేనేదో సైకోని కాదు .."
"Whatever, its over... రేపు నువ్వు పెళ్లిచేసుకోబోయే అమ్మాయిని అయినా ప్రేమతో చూసుకొని కనీసం మనిషివి అనిపించుకో ..." అంటూ డోర్ వైపు నడచింది ...
అభి ఒక్క ఉదుటున ఆమెని పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు ... ఆమెని గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు .. "Am not going to let you leave... " అన్నాడు బలవంతంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుంటూ ...
అతన్ని లాగి చెంప మీద కొట్టింది ...
"నిన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వను... నువ్వు లేకపోతే నేను ఉండలేను .. నువ్వు నాతో పాటే ఉంటున్నావ్  ... ఎప్పటికీ .. ఇంకో పది కొద్దిసేపట్లో మొదటి సంవత్సరం రాబోతుంది ... మనం కొత్తగా కొత్త సంవత్సరానికి విషెస్ చెప్దాం ... " అంటూ బలవంతంగా ఆమెని ఎత్తుకొని బెడ్రూం వైపు తీసుకెళ్ళాడు ...వెళ్లి అక్కడ ఉన్న కబోర్డ్ డ్రాయర్ ఓపెన్ చేశాడు ...

                                                               *******
జనవరి 2nd, 2007

"He might not be sick as you think... He might not be a psycho as you think... He might be in love with u so deeply that he lost himself... " అన్నాడు అన్యమస్కంగా ...
ఆమె అతని వైపే చూస్తుంది ..
"అతను నిన్ను పిచ్చివాడిలా ప్రేమించాడేమో ... ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకొని ఉండాల్సింది .. అతని ప్రాబ్లెం ఏమిటోకనుక్కొని ఉండాల్సింది ..." అన్నాడు నెమ్మదిగా
"అతను ఒక మదమెక్కిన మృగం .." అంది .. ఆమె కళ్ళు ఎర్రగా నిప్పులు చెరుగుతున్నాయి ...
"షటప్ ..." అన్నాడు అప్రయత్నంగా ...
"ఏం .. ఎందుకంత కోపం... నీ గాళ్ ఫ్రెండుతో నువ్వు కూడా అలానే ప్రవర్తించావా?.. ఆమెని టార్చర్ పెట్టావా?..నిజం చెప్పు .. అందుకే నువ్వు ఇది తప్పు అని ఒప్పుకోలేకపోతున్నావు ..."
"అది నీకు అనవసరం ... నేను వెళ్తున్నాను ..." అంటూ వెనక్కి తిరిగాడు
"నువ్వేక్కడికీ వెళ్ళలేవు ..."
"వాట్ ??"
ఇంతలో డోర్ బెల్ మ్రోగింది ...
అభి వడివడిగా వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ...
                       
                                        **********
జనవరి ఫస్ట్ 2008....

"అభి అంకుల్..." అంది పదేళ్ళ అమ్ములు ..
అతని ప్రక్కనే కూర్చొని ఉంది అమ్ములు ...
అమ్ములు కళ్ళలోకి చూడలేకపోతున్నాడు అభి ...
"నన్ను క్షమిస్తావా అమ్ము ..." అన్నాడు  ... అతని గొంతు బాధతో వణికిపోతుంది ..
"అమ్మ ఏడుస్తుంది అంకుల్... I hate you for that... నేను అమ్మ లేకుండా ఒక్క రోజైనా ఉన్నానా .. అమ్మ కూడా అంతే ... ఇప్పుడు నీ వల్ల ..."
"అందుకే నేను ఇంకా నరకం అనుభవిస్తున్నాను ..."
                                                                     ******
జనవరి 2nd, 2007

"అమ్ములు ..." అన్నాడు తెల్లబోయి ...
"అంకుల్ ... అమ్మ ఎక్కడికో వెళ్ళింది ... ఇంటికి తాళం వేసి ఉంది .. అందుకే ఇక్కడికి వచ్చా .." అంటూ లోపలికి వెళ్ళింది ....
అభికి ముచ్చెమాటలు పోశాయి ... 'వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి ..' అనుకొని ఆ అపార్టుమెంట్ నుంచి బయటకి వచ్చి తన అపార్టుమెంటుకి వెళ్లాడు ...
మెల్లిగా నడుచుకుంటూ ... బెడ్రూం దెగ్గర ఆగాడు ...
మెల్లిగా డోర్ తెరుచుకొని లోపలి వెళ్లాడు ...
ఆ బెడ్ మీద హాయిగా నిద్రపోతుంది ఆకాంక్ష ...
అతను వెళ్లి ఆమె ప్రక్కనే పడుకొని ఆమెని కౌగిలించుకున్నాడు
"అకీ ... మై లవ్ ... నన్ను విడిచి నువ్వు ఉండలేవురా ... అందుకే నిన్ను నాతో పాటే ఉంచుకున్నాను ... ఐ లవ్ యు డార్లింగ్ ... నీకు నా మీద కోపంగా ఉండొచ్చు ... కానీ నీ మీద నాకు ఉన్న ప్రేమ ఆ కోపాన్ని చల్లార్చుతుంది .. నువ్వెప్పటికీ ఇలాగే నాతో పాటు ఉండాలిరా ... "
ఇంతలో బెడ్రూం తలుపు చప్పుడు అయింది ...
వెళ్లి తీశాడు ... ఎదురుగా ... ప్రియ..
"ప్రియా ..." అన్నాడు విస్మయంగా
మెయిన్ డోర్ వైపు చూశాడు ... లోపలి నుంచి బోల్ట్ వేసే ఉంది ..
ముచ్చెమటలు  పోశాయి .. స్టన్ అయ్యి ఆమె చూస్తున్నాను ...
"ఎలా వచ్చావు?" అన్నాడు .. గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది ...
"ఇది నీకు ఇద్దామని .." అంటూ అతనికి చూపించింది ... రివాల్వర్ ...
"ఇది నాది కాదు ... ముందు వెళ్ళు ఇక్కడి నుంచి ..."
"ఇది నీదే .. నా బెడ్రూంలో కబోర్డ్ డ్రాయర్ లో ఉంది ... మీది మీకు ఇచ్చాకే .. నేను వెళ్తాను ..."
                                                                *******
జనవరి 1, 2007.
దాదాపు ఒంటి గంట...
అభి బయటకి వచ్చాడు ...
కారిడార్ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు ...
"హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్ .." అంటూ దూరం అరిచింది అమ్ములు అతన్ని కారిడార్ లో చోడగానే ...
అతను సమాధానంగా చెయ్యి ఊపాడు ..
"అంకుల్ ఆకాంక్ష అక్క కూడా ఇక్కడే ఉంది కదా, తనకి కూడా విషెస్ చెప్పివస్తా ..." అంటూ అతని ఫ్లాట్ లోకి పరిగెత్తింది ..
అభి కి ఒక్కసారిగా గుండెజారింది ...
అభి వెంటనే వేగంగా పరిగెత్తాడు లోపలికి.... అమ్ములు ఆల్రడీ బెడ్రూం లో ఉన్న ఆకాంక్ష దెగ్గర ఉంది ...

                                                               ******

జనవరి 3, 2007.

అపార్టుమెంట్ ముందు పోలిస్ జీప్ ఆగింది ...
అక్కడ ఉన్న వాచ్మెన్ దెగ్గరికి వచ్చి "ఇందాక ఫోన్ చేసింది నువ్వేనా?" అని అడిగాడు ఇన్స్పెక్టర్
"అవును సార్ ..."
"సరే...బాడీ ఎక్కడ?"
"పైన వాటర్ ట్యాంకులో ... బాగా వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి చూసి మీకు కాల్ చేస్తున్నా .."
"ఓకే ... నాతో పాటురా ..."అని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ని కూడా రమ్మని సైగ చేశాడు ...
వాటర్ ట్యాంక్ దెగ్గరికి రావడంతోనే బాడ్ స్మెల్ వస్తుండటంతో ముక్కులకి కర్చీఫులు కట్టుకొని ట్యాంక్ ఓపెన్ చేసారు ...
కానిస్టేబుల్స్ బాడీని బయటకి తీసారు ...
"ఈ బాడీ ఎవరిది?" అడిగాడు ఇన్స్పెక్టర్ వాచ్మెన్ ని
"ఇది అమ్ములు అనే అమ్మాయిది ... నాలుగో ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు .. మూడు రోజులుగా కనిపించడం లేదని కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలిస్ స్టేషన్ లో ..." అన్నాడు వాచ్మేన్ ..
"అవును .. గుర్తుంది .. విషయం పాప తల్లితండ్రులకి తెలుసా?" అడిగాడు ఇన్స్పెక్టర్
"లేదు సార్.. నేను చెప్పలేదు .. అంత దైర్యం రాలేదు .. చూడగానే మీకు కాల్ చేశాను అంతే ... పాపం ఈ పాప అంటే ఆ తల్లికి ప్రాణం సారూ .. ఆమె భర్త కూడా ఈ మధ్యే చనిపోయారు .."
"చూస్తె గొంతు నులిమి చంపేసినట్లున్నారు ..." అని ఇన్స్పెక్టర్ అంటుండగా "సార్ .. ఈ రింగ్ దొరికింది ట్యాంక్ ప్రక్కన" అని చూపించాడు వాచ్మెన్ .. రింగ్ మీద AKI అని రాసి ఉంది.
"ఇది ఎవరిదై ఉంటుంది .." అన్నాడు ఇన్స్పెక్టర్
"నాకు తెలిసి ఇది అభిరాం గారిది అయి ఉంటుంది .. AKI అంటే ఆయన గాళ్ ఫ్రెండ్ పేరు .. ఆకాంక్ష .." అన్నాడు వాచ్మెన్
"ఓకే ... అతని ఫ్లాట్ ఎక్కడ ... "
"నాలుగో ఫ్లోర్ లోనే 402 ... అమ్ములు వాళ్ళ ఫ్లాట్ ప్రక్కన.."
"ఓకే..అతని ఫ్లాట్ కి వెళ్దాం పదండి .."

డోర్ బెల్ ఎన్ని సార్లు రింగ్ చేసినా ఎవరూ ఓపెన్ చెయ్యడం లేడు ...
"ఎందుకు.. ఎవరూ ఓపెన్ చెయ్యడం లేదు..."
"ఏమో సార్... అభిరాం గారు రెండు రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నారు .. ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను .. ఆయనగారికి ఆకాంక్ష గారి గొడవలు అయాయి అని తెల్సింది సార్ .." అన్నాడు
"ఓకే .. నాకేదో అనుమానంగా ఉంది... లెట్స్ బ్రేక్ ద డోర్ .. అవునూ ఆ ప్రక్కన 403 ఫ్లాట్ ఎవరిదీ .." అడిగాడు ఇన్స్పెక్టర్ ..
"ఎవరూ ఉండటం లేడు సార్... ఆరు నెలలుగా ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది ..."
"ఓహ్ ..."

                                                                        ******
జనవరీ ఫస్ట్ 2008
ఫ్లాట్ నెం 402

ఫ్లాట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ గోల గోల చేస్తున్నారు ...
మందు తాగి ... డ్యాన్స్ వేస్తున్నారు ...
"సైలెన్స్ గైస్ ..." అంటూ అరిచాడు అశోక్
"ఎంజాయ్ చేస్తుంటే సైలెన్స్ అంటావేంట్రా బాబూ.." అన్నాడు ఒకడు 
"నేను ఇప్పుడు చెప్పబోయేది ఇంకా బాగుంటుంది ... నేను మీకు చెప్పాను కదా ఈ రోజు ఒక ఇంట్రస్టింగ్ విషయం చెప్తాను అని .." అన్నాడు 
"అదేంటో చెప్పరా తొందరగా ..." అన్నారు అందరూ
"ఓ కే ... ఈ ఫ్లాట్ లో సరిగ్గా సంవత్సరం క్రితం .. అంటే 2007 న్యూ ఇయర్ రోజున ... హత్య జరిగింది .." అన్నాడు 
"హత్యా .. ఏంట్రా బాబూ .. ఈ టైం లో ఇలాంటివి చెప్తున్నావ్ .."
"హత్య జరిగిన టైం కూడా ఇదే ... అందుకే చెప్తున్నా " అన్నాడు కన్ను కొట్టి ...
"అలాంటి ఫ్లాట్ లో నువ్వెందుకు దిగావ్ రా ..." అన్నాడు ..
"నాకు ఎలాంటి భయాలు లేవులే ..." అన్నాడు అశోక్
"అసలు ఏం జరిగిందో చెప్పరా .."
"ఇదే ఫ్లాట్ లో అభిరాం లో అనే అతను ఉండేవాడు ... అతనికి ఆకాంక్ష అనే గాళ్ ఫ్రెండ్ ఉండేది .. ఇద్దరికీ సంవత్సరం క్రితం ఇదే రోజున ఎదో పెద్ద గొడవ అయిందట ... తను ఆమెని రివాల్వర్ తో కాల్చాడు ...కాల్చి అదిగో కనిపిస్తుందే అదే బెడ్రూంలో మూడు రోజులు పాటు ఉంచుకున్నాడు .. రోజూ ఆ శవం ప్రక్కనే పడుకునే వాడట.. హీ ఈజ్ ఏ సైకో టైప్ ... ఆ శవాన్ని ప్రక్కింటి పాప చూసిందని ఆమెని చంపి టెర్రస్ పైనున్న వాటర్ ట్యాంక్ లో పడేసాడు ..." అన్నాడు 
"ఓ మై గాడ్ ... ఎవడ్రా బాబూ వాడు .. ఇంతకీ వాడిని అరెస్ట్ చేసారా?" అన్నాడు ఒకడు ...
"లేదు ... అతను తన గాళ్ ప్రెండ్ ని చంపిన మూడు రోజులు తర్వాత ఎవరి చంపేశారు తనని ... పోలీసులు తలుపులు బ్రేక్ చేసి ఓపెన్ చెయ్యగా అభిరాం బాడీ, ఆకాంక్ష బాడీ బెడ్రూంలో కనిపించాయి ... ఆ తర్వాతే ఇవన్నీ బైటకి వచ్చాయి "
"ఎలా?.. ఎవరు చంపారు తనని?"
"ఎవరో పాయింట్ బ్లాక్ మీద కాల్చారు ... ఆ చంపింది ఎవరు అన్నది ఇప్పటిదాకా తేలదేదు ... యు నో .. ఆ రివాల్వర్ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా లేవట .. అదే రివాల్వర్ తో అంతకముందు అభిరాం ఆకాంక్షని చంపాడు ... అభిరాంని చంపింది ఎవరో ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టలేదు .. పక్క ఫ్లాట్ లో అపుడప్పుడు ఎవరో అరుచుకుంటున్నట్లు గొంతు వినిపించేదట వాచ్మెన్ చెప్పాడు ..."
"మై గాడ్ ..."
ఇదంతా వాళ్ళ ప్రక్కనే ఉండి వింటూ ... నవ్వుకుంటూ బెడ్రూం వైపు వెళ్లాడు అభిరాం ... అతను అక్కడ ఎవ్వరికీ కనిపించడు ....

                                          **** THE END *****


                                                                                        Yours Ramakrishna Reddy Kotla