Sunday, November 14, 2010

నేను శీను రమణ @ ట్రెక్కింగ్ ఆపరేషన్

కొన్నికాంబినేషన్స్ జీవితంలో ఎప్పుడూ వర్కవుట్ అవ్వవు....

--> బాలకృష్ణ , అతని చేతిలో భగవద్గీత, అతని ప్రక్కనే మదర్ తెరిస్సా..
--> ఆర్. నారాయణమూర్తి, అతని నోట్లో సాక్సో ఫోన్, చుట్టూ ఆఫ్రికన్ డాన్సర్లు...
-->భక్తీ పాటకి ముమైత్ ఖాన్ డాన్స్, ఆమెకి నిండుగా కప్పి ఉన్న చీర, ఆ పాటకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం
-->నేను, నా కుడి ప్రక్కన శీను, ఎడమ ప్రక్కన రమణ....

                                                                ***

"ఒరేయ్ ఈ రోజు ఈవెనింగ్ ఎలాగైనా ట్రెక్కింగుకి వెళ్దాంరా ..." అడిగాడు రమణగాడు యధావిధిగా పళ్ళు తోముకోడానికి శీను గాడి పేస్టు, వళ్ళు తోముకోడానికి నా మైసూరు సబ్బు తీసుకొని బాత్రూంకి బైల్దేరుతూ ...
"అలాగే వెళ్దాంలే ...." అన్నాను నా మైసూరు సబ్బు కేసి జాలిగా చూస్తూ ...
"నీ ఎబ్బ కాకి నాకొడకా... నా పేస్టు యూజ్ చెయ్యొద్దని ఎన్ని సార్లు చెప్పాను భే..." అంటూ వచ్చి రమణ గాడి చేతిలోని పేస్టు లాక్కున్నాడు శీనుగాడు...
"ఈ ఒక్క రోజుకి ఇవ్వరా ... ఇప్పుడు నా పెట్టె వోపెన్ చేసి నా పేస్టు తియ్యలేను ..."
"వోరినీ కాకి మొహానికి నా తుపాకి.... నీ పేస్టు ఉంచుకొని కూడా నాది వాడుతున్నావా రోజూ ....తియ్యి నీ పేస్టు ముందు ...వోపెన్ చెయ్యి నీ పెట్టె ..." అంటూ బలవంతంగా రమణ గాడి పెట్టె ఓపెన్ చేయించాడు ...

అందులో ఇంకా సీల్ కూడా ఓపెన్ చెయ్యని కాల్గేట్ పేస్ట్ ని బయటకి తీసి విస్మయంగా మొహం పెట్టి "దీన్ని ఇంకా వోపెన్ కూడా చెయ్యలేదా మహానుభావా ..." అంటూ ఆ టూత్ పేస్ట్ వైపే చూస్తూ ఒక్కసారిగా దిమ్మ తిరిగి స్థాణువై స్టన్ అయ్యి అలాగే చూస్తూ, అంతలోనే తేరుకొని "నీ లఫంగి ఫేసులో నా ఫిరంగి... దీని యక్స్ పైరీ డేట్ కూడా దాటిపోయింది కదరా .... ఎన్నేళ్ళు అయిందిరా దీన్ని కొని ..." అన్నాడు కొరకొరా చూస్తూ ...
"ఏమో ... నన్ను ఈ కాలేజీలో చేర్పించేప్పుడు మా నాన్న కొన్నట్లు గుర్తు ... దాదాపు ఓ రెండేళ్లు అయ్యిందేమో ... అంతే కదరా రెడ్డిగా ..." అన్నాడు నా వైపు చూస్తూ ...
నేను నా మీద జాలిపడటం తప్పితే ఏమీ చెయ్యలేకపోయాను ... వాడు రెండు సంవత్సరాలుగా మా పేస్టు, సబ్బు, పౌడరు, సెంటు వగైరాలు వాడిన దాని ఖర్చు లెక్కకడితే ఒక పేద విద్యార్ధికి ఉచిత విద్య అందించవచ్చేమో అనిపించింది నాకు... అది తలచుకోగానే సన్నని వణుకు పుట్టింది ...
"రేపు నువ్వు కొత్త సబ్బు, కొత్త పేస్టు కొనుక్కొని కనిపించలేదో ... ఈ ఎక్స్ పైరీ దాటిన పేస్టుతో బలవంతంగా నీకు పళ్ళు తోమించి పది రోజుల్లో నీ పళ్ళన్నీ ఊడిపోయేలా చెయ్యకపోతే నేను మద్దెలపాలెం శీనే కాదు ..." అంటూ వాడిని వదిలేశాడు ... రమణ గాడు లేట్ చెయ్యకుండా బాత్రూంలో దూరాడు ... 

వాడు బయటకి వచ్చేసరికి నా సబ్బు కాస్తా అర సబ్బు అయ్యింది ... నాకు చిరాకు దొబ్బింది " కొత్త సబ్బుని అర సబ్బు చేశావు కదరా... నీ లాంటి వాడెవడో డాష్ నాది కాకపోతే కాశి కైనా డేకుతానన్నాడట..."అన్నాను ..
"డాష్ లో ఏంటి?" అన్నాడు రమణ రోజూలాగే వాడి టవల్ అనుకొని నా టవల్ తో తుడుచుకుంటూ ...
"డాష్ కిందకి ఇన్నేళ్ళు వచ్చాయి ఆమాత్రం అర్థం చేసుకోలేవా?" అన్నాను...
"మళ్ళీ ఇంకో డాషా?"
"అన్ని డాష్ లకి ఒకటే అర్థం ...డాష్ నా కొడకా ..." అంటూ బాత్రూంలో దూరాడు శీనుగాడు ...
రమణ గాడు నా పౌడర్ ని ఒక పిడికెడు వంపుకొని అందులో కొన్ని నీళ్ళు కలిపి పేస్టులా చేసి మొఖానికి సున్నం కొడుతుంటే నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది ...
శీను గాడు కూడా రెడీ అవ్వడంతో నేను లేచి " పదండ్రా బాబూ...క్లాస్ టైం అయింది ...అసలే ఈ రోజు సుస్మితకి విషయం చెప్పేయాలి .."అన్నాను బైటకి నడుస్తూ
"వావ్ చెప్పెస్తున్నావా...మాకూ చెప్పరా ఏం చెప్పబోతున్నవో .." అన్నాడు రమణగాడు నన్నే అనుసరిస్తూ..
"ఏముంది... ఈ.డీ.సి నోట్స్ తీసుకున్నారా తనది... చాలా తప్పులు రాసింది.. చూడు ఎన్ని తప్పులు రాశావో అని చెప్పెయ్యబోతున్నా .." అన్నాను నేను ...
రమణ, శీనుగాడు జాయింట్ గా "థూ ..." అన్నారు ...

                                                                    ****
సాయంత్రం కాలేజీ నుంచి రాగానే ట్రెక్కింగుకి బైల్దేరాము ... ట్రెక్కింగ్ అంటే ..మా కాలేజీ వెనుక ఉన్నతుప్పల్లో పడి వెళ్ళడమే ... అలా వెళ్తూ మధ్యలో వచ్చే పాము పుట్టల్ని, చెరువు గట్టుల్ని, చింత చెట్టుల్నీ, తేనె పట్టుల్ని దాటుకొని వెళ్లగా వెళ్లగా చక్రద్వారబంధం అనే ఊరు వస్తుంది.. ఆ ఊరు కూడా దాటి, వెళ్లగా ఓ స్మశానం...అక్కడికి చేరుకోవాలని మా టార్గెట్ ఈ రోజు .

అసలే కాకి రంగులో ఉండే రమణ గాడు నల్ల షర్టు, నల్ల జీన్స్, నల్ల షూస్ వేసుకోడం చూసి కొంచెం చీకటి పడ్డాక వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం అసాధ్యం అని తలచి... మనిషి కనిపించకుండా మాటలు వినిపిస్తే దెయ్యం అని దడుచుకొని చస్తామేమో అని వగచి ... వాడిని బలవంతంగా ఒప్పించి తెల్ల షర్ట్ వేయించాను... శీను గాడు బాడీ ఫిట్ స్లీవులేస్ బనీన్, కార్గో పాంట్... నేను పసుపు పచ్చని జీన్స్, ఎర్రటి టీ-షర్ట్, దేవీ చౌక్ లో కొన్న చలువ కళ్ళద్దాలు, చేతులో టార్చ్ లైట్...ఇక బైల్దేరాము....

అయిదింటికి మొదలెట్టాము మా ట్రెక్కింగ్ ....కాలేజీ వెనుక నుంచి తుప్పల్లోకి వెళ్ళాం ... చిందరవందరగా ఉన్న దారిలో అంతకన్నా చిందరవందరగా నడుస్తూ వెళ్తున్నాము ..
"తొమ్మిది కల్లా మనం హాస్టల్ కి రిటర్న్ అవ్వాలి ..." చెప్పాను నేను
"అలాగేలేరా... ఇంతకీ ఇటేపు ఎళ్తే చక్రద్వారబంధం వస్తుందంటావా?..." అడిగాడు రమణ ..
"అవును ...మనం మలుపులు తిరగకుండా ముక్కుసూటిగా ఎళ్ళిపోవడమే ...." అన్నాను ..
అలా ముక్కుసూటిగా నడుస్తున్న మాకు చిన్న అలసిపోయిన-బ్రేక్ తీసుకోవాలి అనిపించి ఆగాము... మంచి నీళ్ళు దాహం వేశాయి... బాటిల్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి రమణ గాడిని బండ బూతులు తిట్టాడు శీనుగాడు .. దాంతో అలిగిన రమణ గాడు ఆ ప్రక్కనే ఉన్న చింత చెట్టు కింద కూర్చొని దాన్ని గిల్లుతూ చిన్నప్పుడు తన ఎదురింటి అబ్బాయి ఎప్పుడూ తనని తొండి చేసి ఓడించే విషయం గుర్తు తెచ్చుకొని "ఎందుకు నాకే ఎప్పుడూ ఇలా అవుతుంది..." అనుకోని ముక్కు చీదుకుంటూ ఏవో గొణుక్కుంటున్నాడు ....

"బాటిల్ మర్చిపోవడంలో ఆడి తప్పేం లేదు కదరా ..." అన్నాను శీనుగాడితో ...
"మరి మన పేస్టులు, సబ్బులు, పౌడర్లు నానారకాల కిరాణా సామాన్లు కిలోల్లెక్కన కడికి పారేస్తుంటే, అందులో ఆడి తప్పు లేదా... " అడిగాడు యువరానర్ టైపు లో ...
నాకు లాజిక్ అర్థం కాలేదు ...చిన్న రివెంజ్ సీన్ అనుకున్నా ...

బ్రేక్ తరువాత మళ్ళీ నడక ప్రారంభించాము ...అలా నడుస్తూ ఉండగా కనుచూపు మేరల్లో చక్రద్వారబంధం పొలిమేరలు కనిపించాయి ... ఆ ఉత్సాహంతో స్పీడు పెంచి ఊళ్లోకి చేరుకున్నాము ...ఊళ్లోకి ఎంటర్ కాగానే సెంటర్లో ఉన్న "ఎర్రబాబు పాన్ షావు" లో ముగ్గురం మూడు లిమ్కాలు తీసుకొని తాగుతున్నాం .. ఎవడు ముందు తాగేస్తే వాడు డబ్బులు తియ్యాల్సి వస్తుందని ఎవడికి వాడు చప్పరిస్తూ లిమ్కా తాగుతున్నాం ... అప్పుడు నేను గమనించగా లిమ్కా మొత్తం తాగేసి ఇంకా చప్పరిస్తున్నాడు రమణగాడు .."ఇంకేం చప్పరిస్తావులే ..." అన్నాను వాడిని చూసి ..ఇక నటించి లాభం లేదని ..లిమ్కా బాటిల్ పక్కన పెట్టి వెనుక జేబులోంచి పర్సు తీసి అందులోంచి కొంత డబ్బు తీసి మాకు చూపించకుండా షాప్ లో ఉన్న పాన్ డబ్బా మీద పెట్టి "మిగతా చిల్లర మీరు ఇచ్చేయండి .." అని మాకు చెప్పి అలా పక్కకి వెళ్లాడు ...

నేను ఉన్న రెండు చుక్కలనే అయిదు నిముషాలుగా చప్పరిస్తుండగా... శీను గాడు పర్సు తీసి "బాలన్స్ ఎంత ఇవ్వాలి?" అడిగాడు
"22.50" అన్నాడు పాన్ షాపోడు...
"అదేంటి ...మా వాడు కొంత మనీ ఇచ్చాడుగా ..." అన్నాడు శీను గాడు
"ఇచ్చాడు .....రూపాయన్నర " అన్నాడు పాన్ షాపోడు ...
శీనుగాడు వెయ్యి సెంటీగ్రేడుల ఉష్ణ తీవ్రతతో రమణగాడి వైపు చూశాడు... అసలే కాకిని మరిపించే కలర్ ఆయే, ఇంకేం ఉంది స్పెషల్ గా మాడటానికి మా రమణ గాడి దెగ్గర, కనుక ఆ ఉష్ణ తీవ్రత దాసోహం అంది రమణ గాడి ముందు ...
"ఆడి పర్స్ లో అంత కన్నా ఎక్కువ మనీ మైంటైన్ చెయ్యడు కదరా శీనుగా... లైట్ తీసుకో.." అన్నాను లిమ్కా ఎక్కువసేపు చప్పరించి ఇరవై రెండు రూపాయలు సేవ్ చేసానని హ్యాపీగా ఫీల్ అవుతూ ....

"చక్రద్వారబంధం వచ్చేసాము ...ఇక ఇక్కడనుంచి స్మశానానికి ..." అన్నాను నేను
"నేను రెడీ ..." అన్నాడు రమణ గాడు
"నేను కూడా రెడీనే ఆ స్మశానంలో నిన్ను పాతేయ్యడానికి ..." అన్నాడు శీను పళ్ళుకొరుకుతూ..
"చూడరా రెడ్డిగా...శీను గాడికి నా మీద ఎప్పుడూ కోపమే... అమెరికాలో ఆడెవాడో ఇంకొకడ్ని చంపితే అదంతా ఆడు ప్రొద్దున్నే ఇక్కడ నా మొహం చూడటం వల్లే జరిగిందని చెప్పి బండబూతులు తిడతాడురా ..." అన్నాడు నాకు కంప్లయింట్ చేస్తూ...

"వాడి కోపానికో అర్థం ఉందిరా రమణగా... ఇలా పరాన్నజీవిగా బతకడం అసహ్యంగా లేదూ ... " అన్నాను
"నేనేమీ పరాన్నజీవిని కాదు... నా అన్నం నేనే తింటున్నా " అన్నాడు
"పరాన్నజీవి అంటే నువ్వు నా అన్నం పళ్ళెం లాగేసుకొని లాగించేసి చేతులు కడుక్కొని వెళ్లి బాబ్బోవడం కాదు ... మేము డబ్బులతో కొన్న వాటిని నువ్వు ఫ్రీగా నీ అబ్బ సొత్తులా వాడుకోవడం ..." అన్నాను
"మీరు నా ఫ్రెండ్స్ రా ...మీ దెగ్గర నాకు మొహమాటం ఏమిటీ ...మీరేవో రెండు మాటలు అంటే పట్టించుకుంటానా చెప్పు ..మీవి నావి కాదా చెప్పు ..." వాడి మాట పూర్తి కాకుండానే శీను గాడు తగులుకొని "చెప్పిచ్చుకు కొడతా చేపల చెరువులో ఈగలు పట్టే ఎదవా ... మా ఊరు నక్కపల్లి...మా ఇల్లు పొలంకెల్లి అని నువ్వన్నప్పుడే నేను అర్థం చేసుకున్నా నువ్వు శనిగాడికి సైడ్ మెంబెర్ అని .. ఏంటీ మావన్నీ నీవా... నీ సత్తరు ఫేసులో నా తాడు .... నీకు ఫ్రెండ్స్ అయిన పాపానికి మమ్మల్ని రెండు సంవత్సరాలు కిరాణా కొట్టులా వాడుకున్నావు కదరా ...నీ లతుకూర్ ఫేసులో నా లంగరు హౌస్ ... " అంటూ కడుపులో రగులుతున్న మంటతో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు శీనుగాడికి... ఆడి కడుపు మంట ఈడి గుండె మంటై మొహం మాడ్చుకున్నాడు రమణగాడు

ఇంతలో చక్రద్వారబంధం బ్యూటీస్ కొంత మంది నవ్వుతూ తుళ్ళుతూ అటువైపు వెళ్ళడం మా ముగ్గురి కంటపడింది... అప్పటిదాకా రకరకాల అవయవాల్లో రకరకాల మంటలతో మండుతున్న శీనుగాడు, రమణగాడికి ఆ అమ్మాయిల చూపులు ఫైర్ ఇంజిన్ లా మారి ఆ మంటలను ఆర్పేశాయి .. వెంటనే శీనుగాడు పాకెట్ దువ్వెన తీసి దువ్వాడు..రమణ గాడు కాలర్ ఎగరేసి "తొందరగా దువ్వెన ఇవ్వు భే.." అంటూ గుసుసుసలాడాడు శీనుగాడితో ... నేనేం తక్కువ తిన్నానా, దేవిచౌక్ లో కొన్న నా చలువ కళ్ళద్దాలు తీసి పెట్టుకొని చిన్నగా విజిల్ వేస్తూ నిల్చున్నా...

ఆ అమ్మాయిలు మమ్మల్ని చూస్తూ వెళ్తూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు ..."ఒసేయ్ ...ఇంజనీరింగ్ కుర్రాళ్ళే ...ఆ దర్పం చూస్తే తెలియట్లా.." అందొక అమ్మాయి ...
ఆ మాటతో రెచ్చిపోయిన రమణ గాడు..."ఇదిగో తెల్లచీరా...అదిగో మల్లెపూలు .." అని పాడుతూ రెండు చేతులు పైకెత్తి...రెండు కళ్ళు ఎడంగా చాపి..డ్రిల్ ఎక్సరుసైజులు చెయ్యడం మొదలెట్టాడు ...
శీను గాడు "నేనొక ప్రేమ పిపాసిని..." అంటూ గడ్డం గోక్కుంటూ ఆకాశం కేసి పిచ్చి చూపులు చూస్తున్నాడు ...నేను నా చలువ కళ్ళద్దాలతో అమ్మాయిలు ఎక్కడున్నారో సరిగ్గా కనిపించక చిన్నగా తావిళ్ళాడుకుంటున్నా...

"ఇంజనీరింగోళ్ళు అయితే ఏటి ...ఎరకలోళ్ళు అయితే ఏటి..అమ్మాయిలను చూస్తే ఈ ఎదవలందరికీ ఒకటే పైత్యం ...ఆడు చూడు ఇంకాసేపు అయితే చీకట్లో కలిసిపోయేలా ఉన్నాడు, కొండముచ్చులా ఆ డాన్స్ చూడు ... " అంది ఒక అమ్మాయి రమణ గాడిని చూస్తూ ...అది విన్న రమణ గాడు ..ఆ పాటకి డాన్స్ బదులు డ్రిల్ ఎక్సరుసైజు చేసిన కృష్ణని బండ బూతులు తిట్టుకున్నాడు ...

"కానీ అక్కడ ఒక గుడ్డోడు ఉన్నాడు చూశారా...పాపం దేవుడు అతనికి కళ్ళు లేకుండా చేశాడు...చూడెలా తవిళ్ళాడుకుంటున్నాడో..." అంది ఇంకొక అమ్మాయి నన్ను చూసి...నేను ఖంగుతిని దెబ్బకి ఆ కళ్ళద్దాలు తీసి, నేను గుడ్డివాడ్ని కాదు అని నిరూపించుకునేందుకు ప్రయత్నించా....నా ప్రయత్నాన్ని అర్థం చేసుకొని "అతను గుడ్డివాడు కాదు .. చూడు ఎంత చక్కగా ఉన్నాడో ... సూప్పర్ గా ఉన్నాడు ... భలే అందగాడు .." అందామ్మాయి ....నేను సుయ్ య్ య్ య్ య్ మని సరాసరి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి, అక్కడ కక్షలో తిరుగుతున్న ఎన్నో ఉపగ్రహాలను పరిశీలించి..మళ్లీ భూలోకంకి తిరుగు ప్రయాణం అయ్యి మార్గ మాధ్యంలో విమానంలో "నేను తోడగోడితే.." అనే సినిమా షూటింగ్ కి వెళ్తున్న బాలకృష్ణని పలకరించి...తొడగొట్టి...కిందకి వచ్చేసా..చక్రద్వారబంధానికి...ఈ లోపు ఆ అమ్మాయిలు వెళ్ళిపోయారు ....

ముగ్గురం కాళ్ళీడ్చుకుంటూ బైల్దేరాము అక్కడనుంచి ... స్మశానంకి దారెటో మాకు తెలియక పోవడంతో ఒకతన్ని అడిగాము ..
"స్మశానం ఎక్కడండి?"అంటూ అడిగాను
"స్మశానమా??...ఎందుకు అబ్బాయిలూ?" అడిగాడు ఆయన ఆశ్చర్యంగా 
"ఏం లేదు ... స్మశానంలో రోజూ ఒక పావు గంట వాకింగ్ చేస్తే మా వాడికి ఉన్న పిచ్చి తగ్గిపోతుంది అని డాక్టర్ చెప్పాడు .." అన్నాడు శీను గాడు రమణ గాడిని చూపిస్తూ ...
"ఇలా తిన్నగా పోతే ఇజయా సినిమా హాల్ వత్తాది...అది దాటుకుంటూ ఇంకా సక్కగా ఎల్తే మట్టిబాట...అట్టాగే ఓ పర్లాంగు పోతే వల్లకాడు ..." అని చెప్పి వెళ్ళిపోయాడు ... 

మేము అలాగే అంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము ..కొద్ది దూరం వెళ్ళాక, నా పక్కన ఇద్దరూ లేరు ... ఏమయిపోయారబ్బా అనుకొని వెనక్కితిరిగి చూసేసరికి ఇద్దరూ చొంగ కార్చుకుంటూ ఎటో చూస్తున్నారు ...నేను వెనక్కి వచ్చి వాళ్ళ చూపు వైపు ఓ చూపు విసిరా ... విసిరిన ఆ చూపు అక్కడనుంచి రానంటుంది ...'విజయా టాకీసులో మాంచి మళయాళ చిత్రం "రాత్రికి రా కాటేస్తా..." రోజూ రాత్రి 9గం ఆట మాత్రమే....రండి వచ్చి కాటేయించుకొండి.." అని ఆ సినిమా పోస్టర్ ఉంది అక్కడ ...రమణ గాడు వాచ్ వైపు చూసి "ఇప్పుడు ఏడున్నర...ఇంకా గంటన్నర ఉంది ..." అన్నాడు ...

"నీకు అవసరమంటావా ఈ సినిమా ..." కిచ కిచ నవ్వాడు శీను గాడు ...
నాకు కర్తవ్యం గుర్తుకువచ్చి.." మనం స్మశానానికి ట్రెక్కింగుకి వచ్చామని మర్చిపోయారా ...పదండి త్వరగా స్మశానానికి వెళ్లి...మరి తొమ్మిదింటికల్లా హాస్టల్ లో ఉండాలి .." అన్నాను ...
రమణ గాడు ఆ సినిమా చూడాల్సిందే అన్నాడు ... శీను గాడు కూడా పోనిలే పాపం రమణగాడు ముచ్చటపడుతున్నాడుగా అన్నాడు... ఈడికి ఈ సినిమా పోస్టర్ చూసేసరికి రమణగాడి మీద జాలి కలిగిందే అనుకున్నా...మొత్తానికి ట్రెక్కింగుని గాలికి వదిలారు ...
"ఒరేయ్ ఈ సినిమా అయ్యేసరికి పదవుద్ది...మనం అప్పుడు హాస్టల్ కి వెళ్ళడం కష్టం .." అన్నాను
"పర్వాలేదు ... సతీష్ గాడిది ఈ ఊరే కదరా ..ఆడికి బైక్ ఉంది..దిగబెట్టమందాము ..." అన్నాడు రమణ గాడు ...

మొత్తానికి ఈనాకొడుకులు ఫుల్ ఫిక్స్ అయినట్లున్నారు అనుకొని, ఇక నేనేమి మాట్లాడలేదు ...
విజయా టాకీస్ ఎదురుగా ఉన్న 'రాజ్యం మిలటరీ హోటల్' లో తలా రెండు పుల్లట్లు తిన్నాం ...కాసేపు అక్కడ ఉన్న యాపు చెట్టు క్రింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం ...ఇంతలో ఓ పెద్దాయన వచ్చాడు అక్కడికి ..

"ఏ ఊరు అబ్బాయి మీది ...ఈ ఊరి కుర్రాళ్ళలా లేరే ..." అడిగాడు ...
"మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ...." చెప్పాడు రమణ గాడు
"అట్టాగా ...ఏటి మా ఊరు వచ్చేరు...ఏదైనా పనా ..." అడిగాడు
"రాత్రికి రా కాటేస్తా ..." అంటూ ఇంకా ఏదో అనబోతుండగా రమణగాడి డొక్కలో పొడిచాడు శీనుగాడు..
"ఏం లేదండీ... ఈ ఊరి ప్రక్కనే కదా మా కాలేజీ...ఊరికే అలా సరదాగా కాలక్షేపం కోసం ఇలా వస్తుంటాం... పల్లెలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా ..." అన్నాను నేను కవర్ చేస్తూ ...
"అట్టాగా మరి సెప్పరే... ఈ ఊళ్ళో చాల ఇసేసాలు ఉన్నాయి...ఈ సారీ కాస్త పొద్దుటింతల రండి ..." అన్నాడు ఆయన..
"ఖచ్చితంగా వస్తాము ... మీ ఇల్లు ఎక్కడ .." అన్నాడు రమణ గాడు ...
నేను ఇంకో పోటు పొడిచాను రమణ గాడిని 'మూసుకొని ఉండు భే' అని ...
"ఈ పక్క బజార్లోనే ...రండి మా ఇంటికి పోదాం ...పొద్దున్నే కాలేజీకి ఎళ్ళిపోదురుగాని ఎట్టాగూ ఈ టైంలో కాలేజీకి ఎట్టా ఎల్తారు ..." అన్నాడు ఆయన ...

మా ముగ్గురి గొంతులో వెలక్కాయ ఒకేసారి పడింది ...
"అబ్బే పర్లేదండి ....మాకు అలవాటే మేము వెళ్తాం ..." అన్నాడు శీనుగాడు ..
"మీరు ఇప్పుడు మా ఇంటికి రావాల్సిందే అబ్బాయి...అంతే.. మర్చేపోయా నా పేరు చినరాజు...ఈ ఊరి ప్రెసిడెంటుని.. మా ఊరోచ్చిన ఇంజనీరింగ్ కుర్రాళ్ళు మా ఇంటికి రాకుండా పోతే ఎట్టా ...మీరు ఇప్పుడు వొచ్చి మా యావిడ చేసిన బొమ్మిడాయిల పులుసు, ఉలవ చారు అన్నం తిని వెళ్ళాలి అంతే ..." అన్నాడు
"మేము ఆల్రడీ తినేశాం ..." అన్నాడు రమణ గాడు ... 'రాత్రికి రా కాటేస్తా' ఎక్కడ మిస్ అయిపోతానో అని భయంగా ఉంది రమణ గాడికి ..
"తిన్నా సరే...కొంచెం అయినా తినాల్సిందే ... మా ఇంటి బొమ్మిడాయిల పులుసు ఎంత బాగుంటది అనుకున్నారు .... కాకపోతే తిన్నాక వచ్చేద్దురు గాని రండి ..." అంటూ లేచాడు
నేను టైం చూసాను 8 15 అయింది ...సరేలే తిరిగి వచ్చేయ్యచ్చు అని "అలాగే ..." అన్నాను ...

వాళ్ళింటికి తీసుకెళ్ళిన చినరాజు...మొదట వాళ్ళిల్లు మొత్తం చూపెట్టడం మొదలెట్టాడు ...తర్వాత తమ తరతరాలగా వచ్చిన ఆస్తి, ఊరిలో తమ పలుకుబడి, తమ తాత ముత్తాతలు ఊరికి చేసిన మేలు, తను ప్రెసిడెంటుగా చేసిన గొప్ప పనులు, మన్ను మశానం ఆడి శార్ధం పిండా కూడు మొదలగువాటి మీద ఏకధాటిగా ప్రసంగించడంతో... మాకు జీవితం మీద క్రమ క్రమంగా విరక్తి రాసాగించి ...టైం చూసా 8 45...ఇక బైట పడాలి అనుకొని "చినరాజు గారు ...ఇక మేము వెళ్తాం ..."అన్నాను ...

"ఏటి ఎల్తారా .... మా ఇంటికొచ్చి బొమ్మిడాయిల పులుసు రుచి సూడకుండా ఎల్తారా ...మా పరువేం గావలి ...మిమ్మల్ని నేనే దేగ్గరుండి రేపు ప్రొద్దున్నే నా కారులో కాలేజీ దెగ్గర వదిలేస్తా...మీరిక మాట్లాడకండి ..." అన్నాడు ...
"మీరే కదా కొద్దిసేపు ఉండి వెళ్ళిపొండి కావాలంటే అన్నారు ...మళ్లీ ఇప్పుడేంటి ఇలా ..." అన్నాడు రమణ గాడు, చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇస్తా అని ఊరించి చివరికి ఇవ్వను పో అన్నప్పుడు కలిగే బాధ ధ్వనించింది రమణ గాడిలో ...

రమణ గాడి మాటలు పట్టించుకోకుండా చినరాజు గారు "ఏవే...కుర్రాళ్ళకి భోజనాలు ఏర్పాటు చెయ్యి ...." అని కేకేశాడు ....
ముగ్గురం దేబురు మొహాలు వేసుకొని బొమ్మిడాయిల పులుసు తినసాగాము ... టైం చూసా 9 15...మా ముగ్గురి మనస్సులో ఒక్కసారి విజయా టాకీస్ మెరిసి మాయమయింది ....
"ఏమే అబ్బాయిలకి ఇంకో చేప ముక్క ఎయ్యి ....ఎరా, అబ్బాయి ఎట్టా ఉండాది మా యావిడ బొమ్మిడాయిల పులుసు ....ఒసేయ్ ఉలవ చారు కూడా అట్రా ..." అన్నాడు వాళ్ళావిడని కేకేస్తూ .... 

 Have a great day     --- --------------------------------------------------Ramkee

5 comments:

ఇందు said...

హ్మ్! బాగుంది కిషన్ గారు మీ ట్రెక్కింగ్ కథ.మీ డెస్టినేషన్ ఇంకా బాగుంది :)) కానీ పాపం రమణగారిని మరీ ఎక్కువ తిట్టేసారేమో!మీ తిట్లు చూస్తే నాకు జంధ్యాల గారి తిట్లు గుర్తొచ్చాయి.

Anywayz Funny naration :)

మాలా కుమార్ said...

బాగుందండి మీ ట్రెక్కింగ్ :)

వేణూ శ్రీకాంత్ said...

హ హ బాగుంది మీ అడ్వెంచర్. నిజమే కొన్ని కాంబినేషన్లు అస్సలు వర్కౌట్ అవ్వవ్ :)

శివరంజని said...

>>>>>>>>కానీ అక్కడ ఒక గుడ్డోడు ఉన్నాడు చూశారా...పాపం దేవుడు అతనికి కళ్ళు లేకుండా చేశాడు...చూడెలా తవిళ్ళాడుకుంటున్నాడో.<<<<<<<<<<<<.."
హహహహ ........పాపం కిషన్ గారు ఆ కళ్ళజోడు ఇంకొంతసేపు పెట్టుకుంటే మీ మీద జాలితో ముగ్గురమ్మాయిలు అలా మిమ్మల్ని వదిలి వేళ్ళేవారు కాదు కదా ...

ఎంత సబ్బులు పేస్ట్ లు దానం చేస్తే మాత్రం పాపం రమణ గారిని అంతలా తిట్టేసారేమిటి ? పరాన్నజీవా?ఈ తిట్లన్ని ఎక్కడ నేర్చుకున్నారండి బాబు

Ramakrishna Reddy Kotla said...

ఇందు: థాంక్స్ :-) రమణ గారిని ఆమాత్రం తిట్టాలి లేకపోతే కంట్రోల్ లో ఉండదు :-))

మాలాకుమార్ గారు ధన్యవాదాలు :-)

వేణు నిజమే, కొన్ని కాంబినేషన్స్ వర్క్ అవుట్ అవ్వవు ;-)... థాంక్స్

రంజని: వాళ్ళు జాలి పడటం కన్నా నన్ను గుడ్డోడు అనుకోవడమే కష్టం గా అనిపించి, కళ్ళజోడు తీసేసా అన్నమాట :-) ఏంటి రంజనీ మీ అన్నయ్యని తిట్టేసాను అని పాపం తెగ ఫీల్ అవుతున్నావ్ గా ... ;-)