Sunday, November 13, 2011

ప్రణీతారాం - A Love Story @ Accenture - 1


టైం చూశాను... ఆరున్నర కావస్తుంది... కాసేపట్లో ఆఫీస్ షటిల్ బస్సులు బైల్దేరుతాయి...సిస్టం షడ్డవున్ చేసి నా వెనుక సీటులో కూర్చున్న ఆమె వైపు చూశాను.. సీరియస్ గా ఏదో మెయిల్ టైప్ చేస్తుంది...
"ప్రణీ... యాం లీవింగ్ ఫర ద డే..." అన్నాను ఆమె వెనుకగా నిల్చుని...
ఆమె కనీసం నా వైపు కూడా చూడలేదు..
"సి యు టుమారో..." అని చెప్పి ఆమె ఎలాగూ బదులివ్వదని తెలిసీ అక్కడనుంచి బైల్దేరాను...
ఆఫీసు బయటకి వచ్చాను... చల్లటి గాలి చుట్టేసింది... ఎంతో హాయిగా అనిపించింది.. ఆ హాయి శరీరానికి మాత్రమే కానీ మనసు వరకు చేరలేకపోయింది... మనసులో ఏదో బాధ..
జరిగిన విషయం ఎవరికైనా చెప్పుకుంటే కొంత బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది..
వెంటనే అరుణ్ కి కాల్ చేశాను...


"అరుణ్..."
"ఆ.. చెప్పరా.."
"కొండాపూర్ రోడ్డులోని హోళీ బార్ అండ్ రెస్టారెంట్ కి రా ... షార్ప్ 7 PM."
"ఏంట్రా నువ్వేనా మాట్లాడేది?.. నేను ఎన్ని సార్లు రమ్మన్నా రాను అనేవాడివి.. ఇప్పుడు నువ్వే రమ్మంటున్నావ్?.. ఏంటి సంగతి?"
"చెప్తాను నువ్వు వచ్చాక... సి యు దేర్.." అని ఫోన్ పెట్టేసాను ....


నేను వచ్చిన పది నిముషాలకి వచ్చేశాడు అరుణ్...
ఐదో ఫ్లోర్ పైన ఉన్న రూఫ్ టాప్ గార్డెన్ లో కూర్చున్నాం...
బయట వర్షం తుంపర్లుగా పడుతుంది.. దానికి గాలి తోడై ఆ తుంపర్లు మా ముఖాన పడి కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి...
"ఆ ఇప్పుడు చెప్పరా... ఏంటి సంగతి?" అడిగాడు అరుణ్ ఉండబట్టలేక...
"చెప్తాను ఒక పెగ్గు వేసాక..." అంటూ బేరర్ ని కేకేసాను...
వాడు రాగానే "రెండు స్మిర్న్ ఆఫ్ లార్జ్ విత్ స్ప్రైట్ .... అండ్ వన్ ఫుల్ తందూరీ..." అంటూ ఆర్డరిచ్చి మెనూ మూసేశాను...


బేరర్ ఆర్డర్ తో వచ్చేదాకా.. ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు ... నేను దూరంగా కనిపించే DLF బిల్డింగ్ వైపు చూస్తుండగా ... వాడు పక్క సీటులో ఉన్న డిల్లీ పాప వైపు చూస్తున్నాడు ... బహుశా నేను మేటర్ ఏంటో చెప్పేదాకా మనోడు మరేమీ మాట్లాడడేమో అనిపించింది...


"ప్రణయమా.. మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా..
పరువమా.. సరసాల వీణ పాటలో సరిగమా..
మోయలేని భావమా.. రాయలేని కావ్యమా..
నండూరి వారి గేయమా.."  అంటూ బొంబాయి ప్రియుడు సినిమాలోని పాత మంద్రంగా వినిపిస్తుంది... అది నా ఫేవరేట్..


ఆర్డర్ రాగానే కనీసం ఛీర్స్ కూడా చెప్పకుండా ఎత్తిన పెగ్గు దించకుండా లాగించేసి గ్లాసు క్రింద పెట్టాను ... అరుణ్ వింతగా చూస్తున్నాడు నా వైపు.. నేను చిన్నగా నవ్వాను...
"ఏదో అయ్యింది రా నీకు?.. ఇంతకీ విషయం ఏంటో చెప్తావా లేదా?" అన్నాడు వోడ్కా సిప్ చేసి..
"నేను తనకి ప్రపోస్ చేశాను..."
"ఎవరికీ?" అన్నాడు మరో సిప్ తీసుకొని...
"నేను ఎవరిని లవ్ చేస్తున్నాను అని నీకు చెప్పానో ఆ అమ్మాయికే..."
"ప్రణీతకా..." అన్నాడు ఎత్తబోయిన గ్లాస్ ని కిందకి దింపుతూ...
"అవును..."
"Are you joking?... ఇలా బార్ కి పిలిచి మరీ జోక్ చెయ్యడం బాలేదురా ..."
"నేను తనని ప్రేమించింది నిజం... ఆమెకి ప్రపోస్ చేసిందీ నిజం.. ఇందులో జోక్ చెయ్యడానికి ఏముంది?"
"ఏంట్రా నువ్వనేది... Are you out of your mind?"
"సరిగ్గా తను కూడా ఇదే మాట అంది నేను ప్రపోస్ చెయ్యగానే... దానికి నేను You are in my mind అన్నాను.."
"అఘోరించావులే... ఆ పిల్ల నీ టీం లీడ్ అనే విషయం మర్చిపోయావా?" అన్నాడు మరో సిప్ వేసి...


ఒక్క విషయం నాకు అర్థం కాదు ... ఆడ టీం లీడ్లు, మ్యాథ్స్ టీచర్లు, బస్సు కండక్టర్లు.. వీళ్ళని ఎవరూ ప్రేమించాకూడదా?.. వీళ్ళలో ఉన్న ఆడపిల్లని ఎవరూ చూడరా? ... అసలు వీళ్ళకి ఫీలింగ్స్ ఉండవని మన ఫీలింగా..
"టీం లీడ్ అయితే ఏంటి... ఆమె కూడా ఆడపిల్లే కదా ... పైగా నా కన్నా పదమూడు రోజులు చిన్న..."
"అబ్బో... చాలా పెద్ద గ్యాప్ రా... చాల్లే గాని లైట్ తీస్కో... "
"తీసుకోను... "
"అది కాదురా... రేపు నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆ అమ్మాయి చేతిలో ఉంది.. నీకు సి రేటింగ్ ఇచ్చిందనుకో, నువ్వు ఇక యాక్సెంచర్ నుంచి బుట్ట సర్దేయ్యాలి.." 
"యాక్సెంచర్ ఒక్కటే కాదు కంపెనీ.. ఇంకా చాలా ఉన్నాయి.. కానే ప్రణీత ఒక్కతే... మరో ప్రణీత దొరకదు.."
"ఎందుకు దొరకదు.. మా అపార్టుమెంటులో ముగ్గురు ప్రణీతలు ఉన్నారు.. రేపు రా చూపిస్తా.."
"ఆపుతావా?" అన్నాను చిరాగ్గా...
"సరే నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను... అది సరే ఇంతకీ ఎప్పుడు ప్రపోస్ చేశావ్ తనకి?"
"ఈ రోజు మధ్యాహ్నం... లంచ్ అయ్యాక.."
"ఎలా?"


"ఈ రోజు ఏంటో తను నాకు ప్రతి క్షణం కొత్తగా కనిపించింది...రోజా రంగు చీరలో ముద్దు గుమ్మలా మెరిసిపోతున్న ఆమెని చూసినకొద్దీ చూడాలనిపించింది... ఆమె కళ్ళు నాతో ఏవో మాట్లాడుతున్నట్లు అనిపించాయి... ఇంకెన్ని రోజులు దాస్తావు నా మీద ఉన్న నీ ప్రేమ అని నన్ను జాలిగా అడుగుతున్నట్లు అనిపించాయి.... లంచ్ అయ్యాక పెర్ఫార్మెన్స్ గోల్స్ సెట్ చెయ్యడానికి మీటింగ్ రూం కి పిలిచింది... వెళ్లాను... ఈ మిడ్ ఇయర్ కి నీ గోల్స్ ఏంటి అని తను నన్ను అడిగింది ... ఆమెని చూస్తూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన వాడిలా 'నువ్వే' అన్నాను... 'వాట్?' అంది తను అర్థం కాక... 'నువ్వంటే నాకు ఇష్టం ప్రణీ... అయామ్ ఇన్ లవ్ విత్ యు' అన్నాను... తను ఒక్కసారిగా షాక్ తింది.. ఆమెకి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు 'Are you out of your mind?' అని మాత్రం అనగలిగింది..."No, you are in my mind.. ఆరు నెలలు నీ మీద ఉన్న ప్రేమని ఏదో భయం తో చెప్పలేకపోయాను... ఈ రోజు నాకు నిన్ను చూస్తుంటే ఏదో తెలియని దైర్యం వచ్చింది.. నువ్వు నాదానివి అనిపించింది... అందుకే నీతో..' నా మాట పూర్తి కాకముందే 'స్టాప్ ఇట్  అండ్ గెట్ అవుట్.." అని నన్ను వెళ్ళమని తనే వెళ్ళిపోయింది.. "


"జాగ్రత్తరా... She can screw your career if you keep pestering her... నేను ఆమె గురించి చాలా విన్నాను.." అన్నాడు అరుణ్
"అప్పుడామెకే నష్టం కదరా.."
"ఏం నష్టం ..."
"తన భర్త కరీర్ ని తనే నాశనం చేసింది అని పాపం చాలా ఫీల్ అవుతుంది కదా తరువాత..."
"నువ్వు.. చాలా దూరం వెళ్లిపోయావురా... మరీ ఇంత లోతుగా ఉన్నవాని నాకు తెలీదు సుమీ.." అన్నాడు పెగ్గు ఖాళీ చేస్తూ...
నేను ఆ మాటకి చిన్నగా నవ్వి అలా ప్రక్కకి చూసాను... అటు సైడ్ కార్నర్ లో ఒక అమ్మాయి.. అబ్బాయి కూర్చున్నారు...సైడ్ డిష్ లో ఉన్న చికెన్ పీస్ ని ఆ అబ్బాయి ఆ అమ్మాయి నోటికి అందించి ఎలా ఉంది అన్నట్లు సైగ చేసాడు... సూపర్ అని చెప్పింది ఆ అమ్మాయి.. ఆ అబ్బాయి ఆ అమ్మాయి నోటికి అందించడం వల్ల ఆ పీస్ అంత సూపర్ గా ఉందేమో అనిపించింది నాకు... ఒక్క క్షణం ఆ ప్లేస్ లో నన్ను, ప్రణీతని ఊహించుకున్నాను... గుండెల్లో ఒక తియ్యని గిలిగింత... ఆ ఫీలింగ్ ని తనివితీరా అనుభవించి ఇక చచ్చిపోయినా పర్వాలేదు అపించింది.
                                                          *******
రూం కి వెళ్ళాక నిద్ర పట్టలేదు.. తన గురుంచిన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది... ఒక్క సెకండ్ కూడా తనని నా ఆలోచనలనుంచి వేరు చెయ్యలేకపోతున్నాను...  తనతో మాట్లాడాలన్న కోరిక ఒక్కసారిగా సునామీలా చుట్టేసింది నన్ను... టైం చూసాను... ఒకటిన్నర.. ఒక్క సెకండ్ ఆలోచింది ఫోన్ తీసి తన నెంబర్ డైల్ చేసాను... ఫోన్ రింగవుతుంది... రింగు రింగుకి నాలో ఏదో టెన్షన్... వెంటనే కట్ చేసాను... ఆ తర్వాత నేను చేసిన పిచ్చిపనికి నన్ను నేను  బండబూతులు తిట్టుకొని పడుకున్నాను...
                                                          ********
మరునాడు తొమ్మిది కల్లా ఆఫీసులో ఉన్నాను... తను దాదాపు పదకొండుకి వస్తుంది రోజూ...
అప్పటికే మా టీం మేట్స్ కొంత మంది ఉన్నారు.. వాళ్ళకి విష్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండగా ప్రక్కన కూర్చునే ఇందు చెప్పింది "ఈ రోజు ప్రణీ రావడం లేదు .. సిక్ అంటా... అందరికీ వర్క్ అలాట్ చేసి మెయిల్ పెట్టింది.."
తనని ఇంకొకరు ప్రణీ అని పిలవడం నాకు నచ్చలేదు.. అది అమ్మాయి అయినా సరే...


నేను వెంటనే తన మెయిల్ చెక్ చేశాను... ఏవో టాస్కులు అందరికీ ఇచ్చింది..  Please do complete them by EoD and mail me the status అని ఉంది... తనకి హెల్త్ ఎలా ఉందొ అన్న గాభరా ఎక్కువయ్యింది నాకు... నా మొహం చూడ్డం ఇష్టం లేక రాలేదా లేక నిజంగానే హెల్త్ బాలేదా?.. 99% తను నన్ను చూడ్డానికి చిరాకుగా అనిపించి రాకుండా ఉండిఉండొచ్చు అని అర్థమవుతున్నా.. ఆ ఒక్క శాతం నిజం అవ్వోచ్చేమో అన్న ఆత్రంతో తనకి ఫోన్ కలిపాను... లిఫ్ట్ చెయ్యలేదు.. అలాగనీ కట్ కూడా చెయ్యలేదు.. మళ్ళీ చేశాను... నో రెస్పాన్స్ ... మళ్ళీ చేశాను.. చేస్తూనే ఉన్నాను... నా ఓపికకి నాకే ఆశ్చర్యం వేసింది... ఎట్లీస్ట్ ఏదో ఒక్క క్షణంలో తన ఓపిక నశించి నా కాల్ లిఫ్ట్ చేస్తుందేమో అన్న చిన్న ఆశ...నా ఆశ అడియాస కాలేదు... ఇరయయ్యో అటెంప్ట్ కి నా కాల్ లిఫ్ట్ చేసింది నా డార్లింగ్... సారీ నా టీం లీడ్ ...


"హలో ప్రణీ..."
"....."
"హెల్త్ ఎలా ఉంది... ఏమైనా మెడిసిన్ వేసుకున్నావా? అసలు ఏమైంది.. నువ్వు.."
"Mind your business.. Don't call me.. "
"Please.. Just say that you are O.K.."
దానికి సమాధానంగా నాకు రెండు బీప్స్ మాత్రమే విపించాయి....
తను ఈ రోజు నన్ను చూడ్డానికి ఇష్టపడకపోవచ్చు... రేపు కూడా ఆఫీసుకి  రాకపోవచ్చు.. కానీ ఎన్ని రోజులు సెలవు పెడుతుంది... నా పెదవులపై చిన్న చిరునవ్వు.... నా వెనుక వైపు ఖాలిగా ఉన్న తన సీట్ వైపే చూస్తుండిపోయాను...
ఆ రోజు మొత్తం చాలా నిస్తేజంగా గడిచింది... ఏమీ తినాలనిపించలేదు...


అప్పటిదాకా తన నుండి నాకు వచ్చిన మెయిల్స్ అన్ని అపురూపంగా చదువుకున్నాను ఒకటికి రెండు సార్లు.. వాటిల్లో ఉన్న మేటర్ మొత్తం టాస్కులు, టైం షీట్లు, టార్గెట్లు అయినా అవన్ని తను నాకు చెబుతున్న స్వీట్ నతింగ్స్ లా అనిపించాయి... తను నాకు ఏదో ప్రోగ్రాం గురుంచి చెపుతూ అక్కడ కనిపించిన కాగితం మీద గీసిన పిచ్చి గీతలు నాకు రంగావల్లికలుగా కనిపించాయి.. ఆ కాగితాన్ని తీసుకొని సుతారంగా పెదవులకి తాకించాను... సిగ్గు పడుతున్న తన ముఖం నా కళ్ళ ముందు కదలాడింది...


ఆరున్నర కల్లా సిస్టం షడ్డవున్ చేసి షటిల్ బస్సులు ఆగే కాంపౌండ్ కి వెళ్లాను... అరుణ్ కనిపించాడు..
"ఏరా... ఆల్ ఈజ్ వెల్లా.." అన్నాడు నవ్వుతూ 
"ఇంకా తెలీదు?"
"అదేంటి?"
"ప్రణీ ఈ రోజు ఆఫీసుకి రాలేదు..."
"అవునా... నువ్విచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకొని ఉండదు.." అన్నాడు చిన్నగా నవ్వుతూ..


నేను వెళ్లి నా రూట్ బస్ లో కూర్చున్నాను... ఆరు నెలల క్రితం జరిగిన మా మొదటి పరిచయం గుర్తొచ్చి అప్రయత్నంగా చిన్న నవ్వు విరిసింది నా పెదవులపై...


                                               ****** ఆరు నెలల క్రితం ******


మూడు నెలల క్రితం "Better luck next time" అని ఫీడ్ బ్యాక్ ఇచ్చిన యాక్సెంచర్ H.R. ఇప్పుడు "We are pleased to inform that you got selected" అని మెయిల్ ఇచ్చేసరికి ఓటమి తరువాత గెలిపు రుచికి ఎంత కిక్ ఉంటుందో తెలిసొచ్చింది..


ఒక శుభముహూర్తాన గచ్చిబౌలిలోని యాక్సెంచర్ క్యాంపస్ లో అడుగుపెట్టాను... ఇంత పెద్ద కంపనీలో నేను కూడా ఒక భాగం అనే ఆలోచన కొంచెం గర్వంగా అనిపించింది...
జాయిన్ అయ్యాక ITP (Inter Talent Pool) అంటే బెంచ్ లో వేసారు నన్ను... యాక్సెంచర్ లో బెంచ్ లో ఉన్నవాడు ప్రాజెక్ట్ లో ఉన్నవాడికంటే బిజీగా ఉంటాడు.. కాదు బిజీగా ఉంచుతారు.. బెంచిలో ఉన్నాకూడా పది గంటలు ఆఫీసులో ఉండాల్సిందే... ఆ ట్రైనింగులు ఈ ట్రైనింగులు అంటూ ఊపిరి సలపనివ్వరు... 


రోజూ ఎనిమిదిన్నర కల్లా షటిల్ బస్సులో రావడం... టిఫిన్ చెయ్యడం... ఆన్లయిన్ ట్రైనింగులు చేసుకోవడం.. మధ్య మధ్యల్లో గ్రవుండ్ ఫ్లోర్ Chai n Chai లో టీ బ్రేకులు తీసుకుంటూ ... అటూ ఇటూ తిరిగే అందమైన నార్త్ అమ్మాయిలను చూస్తూనే అప్పుడప్పుడు మన సౌత్ అమ్మాయిలను కూడా చూస్తూ సమ న్యాయం చెయ్యడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం.. ఇవన్ని చేస్తూ కూడా ఒక చెయ్యి ఎప్పుడూ ప్యాంట్ జేబులో ఉన్న మా సెల్ ఫోన్స్ పై ఉండేది... అది ఎప్పుడు మోగితే సారీ వైబ్రేట్ అయితే అప్పుడు వెంటనే అలెర్ట్ అయిపోయి ఎక్కడలేని సీరియస్నెస్ తెచ్చుకొని బైటకి పరిగేత్తేవాళ్ళం... ఎందుకంటే అవి ప్రాజెక్ట్ రిక్వయర్మేంట్ కాల్స్ కాబట్టి... ఎక్కువ కాలం బెంచిలో ఉండడం ఆట్టే మంచిది కాదు యాక్సెంచర్ లో...


అలా ఓ రోజు ఒక కాల్ వస్తే బైటకి పరిగెత్తాడు ప్రవీణ్...
తను వచ్చాక "ఎవరు?" అని అడిగాడు నవీన్...
"ప్రణీత.. తాలిస్మాన్ ప్రాజెక్ట్ నుంచి .." చెప్పాడు 
"నో అని చెప్పెసావా?" వెంటనే అడిగాడు నవీన్...
"అది మీరు చెప్పాలా... నేను బెంగుళూరు కోసం చూస్తున్నాను అని చెప్పేశా.." అన్నాడు ప్రవీణ్ 
"అదేంటి మీరు హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు కదా నాతో?" అన్నాన్నేను అర్థంకాక..
"ఆమె దెగ్గర వర్క్ చెయ్యడం కంటే అండమాన్ లో చెయ్యడం బెటర్... పెద్ద లేడీ శాడిస్ట్... టార్చర్ అంటే ఏంటో చూపిస్తుంది.." అన్నాడు నవీన్...
"ఓహో..." అన్నాను నేను... నాకు ఆమె దెగ్గరనుంచి కాల్ రానివ్వకు దేవుడా అనుకుంటూ...


లంచ్ అయ్యాక ఆన్లయిన్ ట్రైనింగ్ చేస్తుంటే నా ఫోన్ వైబ్రేట్ అయ్యింది...
"హలో..." అన్నాను 
"Am i speaking to Mr. Ram" అని వినిపించింది ఒక శ్రావ్యమైన గొంతు ... ఒక అమ్మాయి గొంతులో ఇంత తియ్యదనం ఉంటుందా అనిపించింది మొదటిసారిగా...
"Yes... Who is this?"
"Hai Ram... This is Praneetha from Talisman Energy project... Am looking for SAP Basis candidate for our requirement... Is it good time to talk to you?"
నా గుండెల్లో దడ మొదలయ్యింది... ఏం చెప్పాలో అర్థం కాలేదు... సలహా అడుగుదామంటే పక్కన ఎవరూ లేరు...
"Aa.. well.. Aa...hmmm... "
"Sorry??"
"Aa... hmmm.. OK"
"Fine... If it is possible can you meet me in 4th floor at meeting room number 13 right now"
"Ya.. sure" ఫోన్ పెట్టేసాను...


నాకు టెన్షన్ మొదలయ్యింది.. అనవసరంగా ఇరుక్కు పోయనేమో అనిపించిది.. ప్రవీణ్ చెప్పినట్లు బెంగుళూరో పూనేనో అని చెప్పాల్సింది... ఇంతలో నవీన్ ప్రవీణ్ వచ్చారు...
విషయం వాళ్ళకి చెప్పాను...
"ఏం కాదులే.. వెళ్లి కలువు... బట్ అడిగినవాటికి సమాధానాలు తెలియనట్లు ఉండు.. ఏది అడిగినా దాని మీద వర్క్ చెయ్యలేదు అని చెప్పు.. సో నిన్ను ప్రాజెక్ట్ కి ఆమె లాక్ చెయ్యదు.." అని సలహా ఇచ్చాడు నవీన్...
సరే అని చెప్పి... లోపల కొంచెం టెన్షన్ గా ఉన్నా ఇక తప్పదని బైల్దేరాను ఫోర్త్ ఫ్లోర్ కి...




                                                                        ---- To be continued in 2nd part.


Note: It's a complete fictional work. This is the first time i have ever used self-narration method in any fictional works of my blogs. Hope you like it. - Ramakrishna Reddy Kotla.