Wednesday, March 16, 2011

ఈ జన్మ నీదని అంటున్నా... వింటున్నావా ప్రియా - 1

ఆఫీస్ వర్కులో మునిగిపోయిన మధుమిత తన సెల్ ఫోన్ బీప్ కి ఒక్కసారిగా ఉలిక్కిపడింది...
చూస్తే అది రిమైండర్ "Drop Abhi at the intreview" అని ఉంది... వెంటనే వాచ్ వైపు చూసుకొని "God, its already late... వెళ్ళాలి' అనుకోని, ప్రక్కన ఉండే కొలీగ్ ని పిలిచి "సుధా నేను అర్జెంటుగా వెళ్ళాలిరా...టూ - త్రీ అవర్స్ లో వచ్చేస్తా.. కొంచెం నా డెస్క్ కాల్స్ అటెండ్ చెయ్యవా ప్లీజ్" అంది.
"చేస్తాలే గానీ... ఏంటి అంత ఇంపార్టెంట్... boyfriend responsibilities eh?"
"Shut up" అంటూ నవ్వుతూ "ప్లీజ్ రా.. తనకి ఇంపార్టెంట్ ఇంటర్వ్యు... కష్టపడి సెట్ చేశా తెల్సా?"
"అతను మాత్రం ఏమాత్రం కష్టం లేకుండా అది చేడగోట్టేస్తాడు... ఎన్నిసార్లు చూడలేదు.."
"ఆపవే బాబూ ... వెళ్తున్నా నేను టైం అవుతుంది.." అంది హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కదులుతూ...
"బాస్ వస్తే ఎం చెప్పమంటావ్?" అంది సుధ..
"రెస్ట్ రూంకి వెళ్లిందని చెప్పు.."
"కొద్దిసేపు అయ్యాక మళ్ళీ వచ్చి అడిగితే.."
"మళ్ళీ రెస్ట్ రూంకి వెళ్లిందని చెప్పు... ఎందుకని అడిగితే లూస్ మోషన్స్ అని చెప్పు... నన్ను వదిలేయ్యవే తల్లీ.." అంటూ పరిగెత్తింది... సుధ నవ్వుతూ చూస్తుండిపోయింది...

మధు బయటకి వచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తూ అభికి కాల్ చేసింది... మూడో అటెమ్ట్ కి ఎత్తాడు అభి..
"హ....లో...."
 "అభీ...."
"ఎవరు?"
ముక్కు వెంటనే ఎరుపెక్కింది మధుకి..."నేను మధుని రా ... ఏంటి కన్నా నన్నే గుర్తుపట్టలేదు.."
"చె..ప్పు.."
"ఏంటి చెప్పేది ఇంటర్యు ఉందని చెప్పాగా ... ఏంటి నిద్రపోతున్నావా??"
"హా..."
"లేరా కన్నా... ఈ ఇంటర్యు అటెండ్ అవ్వరా ప్లీజ్ ... నేను మొత్తం సెట్ చేసాను నా ఫ్రెండ్ ని బ్రతిమిలాడి ... నువ్వు జస్ట్ ఒక రెండు మూడు కోస్చేన్స్ కి ఆన్సర్ చెప్తే చాలు... ఆ కోస్చేన్స్ కూడా ఏమిటో చెప్తాను నేను వచ్చాక.."
"సర్లే... నువ్ రా..."
"నేను వచ్చేసరికి స్నానం చేసి రడీ అవ్వరా నా మంచి అభి కదా..." అంటూ ఫోన్ పెట్టేసి బైక్ స్టార్ట్ చేసింది...

                                                            *****

డోర్ బెల్ మోతకి లేచాడు అభి...
డోర్ ఓపెన్ చెయ్యగా ఎదురుగా మధు...
"సచ్చినోడా... ఇంకా స్నానం చెయ్యలేదా??" అంది కళ్ళు పెద్దవి చేసి లొపలికి వస్తూ..
"బ్రష్ కూడా చెయ్యలేదు .." అంటూ మధు బుగ్గలు పట్టుకొని లాగుతూ "అసలు కోపంలో నీ బుగ్గలు ఇలా టొమాటోలా మారినప్పుడు కొరుక్కొని తినేయ్యాలి అనిపిస్తుందే" అన్నాడు..
"ఆహా అలా అనిపిస్తుందా...పదే పది నిముషాల్లో నువ్ రడీ అయ్యి రావాలి లేకపోతే నాకు అనిపించింది చేస్తా జాగ్రత్తా" అంది బుగ్గల్ని విడిపించుకుంటూ...
"చెయ్యి చెయ్యి... అయినా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా చెప్పు...." అన్నాడు నవ్వుతూ 
"ఛీ ఛీ పాడయిపోతున్నవురా రూములో కూర్చొని... వెళ్ళరా బాబూ.." అంటూ బాత్రూంలోకి తోసింది..

                                                                *****
"ఓకే నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా... ఈ ఇంటర్యు నీకు అయిపోవాలిరా.. ఇంటర్యు చేసేది ఫ్రెండే అని చెప్పాగా సో కంగారు పడకు.." అంది మధు ఇంటర్యు వెన్యూకి రాగానే...
"అలాగేలేవే... నువ్వెళ్ళు ఇక..."
"నువ్వొచ్చేదాక నేను ఇక్కడే వెయిట్ చేస్తారా కన్నా... నువ్వు వచ్చి బాగా చేశాను అని చెప్పాలి..."
"సరే.." అంటూ లొపలికి వెళ్ళాడు...

మధు అక్కడే రిసెప్షన్ లో కుర్చుని ఉంది... 
"హే మధూ.." అనే వాయిస్ వినిపించి వెనక్కి తిరిగి చూసింది.. 
"దివ్యా..." అంది కళ్ళు పెద్దవి చేస్తూ "నువ్వేంట్రా ఇక్కడ?"
"ఏమిలేదు.. ఈ మధ్యే ఈ కంపెనీలో జాయిన్ అయ్యా.."
"అవునా... గ్రేట్.."
"నువ్వేంటి ఇక్కడ?"
"అదీ... అభీకి ఇంటర్యూ.." అంది మెల్లిగా 
"వాట్... You must be joking!.. ఈ ఇంటర్యు నంబర్ ఎంత?"
"ఆపవే.." అంది ఉడుక్కుంటూ..
"నేను ఆపడం కాదు.. నువ్వే ఆపెయ్యి అతనితో రిలేషన్.. కొంచెం కూడా నీ పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు అతనికి.. ఏం చూసి అతన్ని నువ్వింకా ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.. నువ్వేమో కష్టపడి సంపాదిస్తుంటే అతనేమో జల్సా చేసుకుంటున్నాడు.. ఒక అమ్మాయి సంపాదనతో బతకడం కొంచెం కూడా సిగ్గుగా లేదు అతనికి..."
"దివ్యా..." అంది కోపంగా "అభీకి నేను తప్ప ఈ ప్రపంచం లో ఎవరూ లేరు.. అలాగే నాకు కూడా.."
"తెలుసు... మీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్ లో కలిసి పెరిగారు అని తెల్సు... కానీ నువ్వు కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి జాబ్ తేచ్చుకున్నావ్.. అతను ఫెయిల్ అయ్యి జులయీలా తయారు అయ్యాడు... ఓకే నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చెయ్యి... కానీ దేనికయినా ఒక లిమిట్ ఉంటుంది.. అతనే ప్రపంచంలా బ్రతకడం.. పిచ్చిదానిలాగా ప్రేమించడం అదీ అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోని... ప్రాక్టికల్ గా ఆలోచించవే... ఒకవేళ రేపు అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నా నీ పట్ల ఎంతవరకు భాద్యతగా ఉంటాడు.."
"ప్రేమలో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది స్వార్ధం అవుతుంది... అతను మీకు ఇర్రెస్పాన్సిబుల్ గా కనిపించొచ్చు, నాకు మాత్రం అతను నాకోసం ఉన్నాడు అనే ఆలోచనే ప్రతిక్షణం ఆనందం కలిగిస్తుంది.. అయినా ఈ జాబ్ నా అభీకి వచ్చేస్తుంది చూడు ... అతను అలా జాబ్ లో జాయిన్ అవుతాడు .. నేనిలా రిజైన్ చేసేస్తా..." అంది చిన్నగా నవ్వుతూ...
"హమ్ ... కలలు కంటూ ఉండు ... సరే నాకు కొంచెం పనుంది మళ్ళీ కలుస్తా .." అంటూ వెళ్ళింది ...


మధు కూర్చొని ఏవేవో ఆలోచిస్తుంది ... ఇందాక దివ్య అన్న మాటలు తనకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి 'ఏం చూసుకొని తనని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు..'
అసలు అభీ అంటే నాకెందుకు అంత పిచ్చి ... అతను కనిపించకపోయినా మాట్లాడకపోయినా శ్వాస ఆగినట్లు ఉంటుందెందుకు... 
నా అభీ నా జీవితంలోకి ఒక పండగలా వచ్చాడు... నవ్వుల్ని నింపాడు.. నేస్తం అయ్యాడు...సమస్తం అయ్యాడు....


                                                      **  పదిహేనేళ్ళ క్రితం  **
వీ కేర్ ఆర్ఫనేజ్ , కర్నూలు.


"సిస్టర్, మధుమిత అనే అమ్మాయి చాలా డల్ అయ్యింది ... అసలు రెండ్రోజుల నుంచి ఏమీ తినడం లేదు ..." అంటూ వచ్చింది సిస్టర్ లిజీ..
"అలాగా ... ఎందుకని.."
"ఆ అమ్మాయి పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారు ... ఎవరో తెలిసిన వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసారు ... పాపం ఆ అమ్మాయి అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూనే ఉంది.."
"అలాగా... సరే నేను వస్తున్నాను పదండి.." అంటూ హెడ్ సిస్టర్ ఆమెని అనుసరించింది ...
వాళ్ళిద్దరూ మధు ఉన్న రూమ్ లోపలికి రాబోతూ ఆగిపోయారు... లోపలికి చూశారు.. మధు పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు ..
"ఈ బిస్కెట్ తీసుకో..."
"నాకొద్దు.." అంది మధు
"బాగుంటుంది.. "
"వద్దు.."
"పోనీ చాక్లెట్ కావాలా... "
"ఉహు..."
"నువ్వు నేను ఇచ్చిన బిస్కెట్ తింటే, నేను రోజూ నీతో ఆడుకుంటా .. ఎప్పుడు నీతోనే ఫ్రెండ్షిప్ చేస్తా ...రోజూ చాక్లెట్ ఇస్తా..."
ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు ...
"ఏడవద్దు ప్లీజ్ ..." అంటూ కళ్ళు తుడిచి మధు నోట్లో బిస్కెట్ పెట్టాడు ... మధు బిస్కెట్ తింటూ అలానే చూస్తూ ఉండి పోయింది ఆ అబ్బాయి వైపు... మధుకి వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు...
"హమ్మయ్యా ... నాకు హ్యాపీగా ఉంది నువ్వు తిన్నందుకు ... నీ పేరేంటి.."
"మధుమిత..."
"నేను అభినయ్... ఇప్పటినుంచి మధుమిత అభినయ్ ఫ్రెండ్స్ సరేనా?"
"ఊ..." అంది బిస్కెట్ తింటూ కళ్ళు తుడుచుకుంటూ ...


ఆరోజునుంచి మధు, అభీ కలిసి ఆడుకునేవాళ్ళు... కలిసి తినేవాళ్ళు...కలిసి ఆర్ఫనేజ్ స్కూల్ కి వెళ్ళేవాళ్ళు... మధూ అభికి ఎన్నెన్నో కథలు చెప్పేది...
"నీకు ఇన్ని కథలు ఎలా తెలుసు మధూ.." అడిగేవాడు ఆశ్చర్యపోతూ 
"మా డాడీ రోజూ నాకు కథ చెప్పి పడుకోబెట్టేవారు... ఆ కథలు నాకు బాగా గుర్తుంటాయి.."


"...... అలా రాజు అడవులకి వెళ్ళిపోయాడు .. పాపం రాజ్యంలో రాణి ఒక్కతే ఉండేది.. ఎన్ని రోజులయినా రాజు తిరిగిరాలేదు... రాణికి భయమేసింది... దేవుడికి ప్రేయెర్ చేసింది... కానీ రాజు రాలేదు.." అంటూ చెప్పుకుపోతున్న మధుని మధ్యలో ఆపి.. "రాజు చాచ్చిపోయాడా.." అని అడిగాడు అభి.
"ముందు కథ విను అభి... అప్పుడేమో ఆ అడవిలో ఒక వేటగాడు.."
"కాదు... ముందు చెప్పు రాజు చచ్చిపోయాడా?" అంటూ మధుని చెప్పనివ్వకుండా ఆపాడు..
"అవును అభీ... రాజు చచ్చిపోయాడు పాపం.."
"వద్దు... ఆలా అయితే ఈ కథ నాకు వద్దు..  వేరే కథ చెప్పు.. లేకపోతే రాజుని బ్రతికించు.."
"ఎందుకు అభీ.."
"రాజు చచ్చిపోతే రాణి ఏడుస్తుంది కదా... పాపం రాణికి తోడు ఎవరు ఉంటారు.."
"నిజమే కదా... అయితే వాళ్ళిద్దరిని ఎప్పటికీ కలిపే ఉంచుదాం.." 
"మా మంచి మధు.."
"నువ్వు కూడా ఎప్పుడూ నాతో కలిసే ఉంటావు కదా అభీ.."
"నేను రాజూ కాదు... నువ్వు రాణీ కాదుగా... మనం కలిసి ఎలా ఉంటాము.."
"అంటే కలిసి ఉండాలంటే... రాజూ రాణీ అయ్యి ఉండాలా.."
"అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా మన మమ్మీ డాడీ లాగా.. అందుకే కలిసి ఉంటారు..."
"అయితే మనం కూడా పెళ్లి చేసుకుందామా... అప్పుడు కలిసే ఉండొచ్చుగా..."
"అవును నిజమే... సరే నువ్వు ఇక పడుకో... "


ఓరొజు మధు ఒక్కతే కూర్చొని ఏడుస్తుండటం చూసి "మధూ... ఎందుకు ఏడుస్తున్నావ్?" అంటూ వచ్చాడు అభి..
"ఏమి లేదు.."
"సరే రా ఆడుకుందాం..."
"నేను రాను.. నువ్వెళ్ళి ఆడుకో..."
"అయితే నేనూ వెళ్ళను ... ఆడుకుంటే నీతోనే... నువ్ రాకపోతే నేను కూడా ఆడుకోను.."
"అభీ నాకిప్పుడు డాడీ కావాలనిపిస్తుంది.."
"అలాగే .. నువ్వు ఎప్పుడూ ఏడవకుండా నవ్వుతుంటే డాడీ వస్తారు..."
"నిజంగా.. అయితే అలాగే... ఈ రోజు నా బర్త్ డే..డాడీ ఉంటె నాకు టాయ్స్ అన్నీ కొనేవారు.. ఇంకా అందరిని పిలిచి పార్టీ చేసేవారు..."
"నీ బర్త్ డే నా.. మరి నాకు చెప్పలేదేంటి... మధు నేను ఇప్పుడే వస్తాను.." అంటూ పరిగెత్తాడు...
కాసేపయ్యాక ఒక పెద్ద చాక్లెట్ ప్యాకెట్ తో వచ్చాడు అభీ..
"మధు రా ... అందరికీ పంచి పెడుదువుగాని.."
"అభీ... ఎక్కడివి ఇన్ని చాక్లెట్లు" ఆశ్చర్యపోతూ అడిగింది
"లిజీ సిస్టర్ ని అడిగాను ఈ రోజూ నీ బర్త్ డే అని... సిస్టెరే ఇచ్చి అందరికీ పంచి పెట్టమంది.. పదా అందరికీ ఇద్దాం.."
మధు అభీ కలిసి అందరికీ చాక్లెట్లు పంచి పెట్టారు... సిస్టర్స్ మధు పేరు మీద ప్రేయెర్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ..


"అభీ నాకు హ్యాపీగా ఉందిరా ... ఇంకెప్పుడూ ఏడవను .. నాకు డాడీ లేకపోయినా నువ్వున్నావ్..."
ఆ మాటతో అభీ మెల్లిగా ముందుకు వంగి మధూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు...


రోజులు గడిచిపోతున్నాయి... రాను రాను మధు అభిల ఫ్రెండ్షిప్ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా బలపడింది...
టెన్త్ క్లాస్ రిజల్స్ వచ్చాయి...
అరవై శాతం వచ్చిన స్టూడెంట్స్ నే కాలేజ్ కి పంపుతా అని సిస్టర్ ముందే చెప్పింది..
మధుకి డిస్టింక్షన్ వచ్చింది... అభీ జస్ట్ పాస్ అయ్యాడు...
"మధూ నెక్స్ట్ వీక్ నుండి నువ్వు సెయింట్ జాన్స్ కాలేజ్ లో ఇంటర్ చేయ్యబోతున్నావ్... బీ ప్రిపెర్డ్..."
"నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తాను సిస్టర్... ప్లీజ్"
"నెక్స్ట్ ఇయరా... Are you mad?.. why you want to waste one academic year.. you are so bright student"
"అదీ సిస్టర్... అభీ జస్ట్ పాస్ అయ్యాడు... సో మీరు తనని ఈ ఇయర్ కాలేజ్ కి పంపరు... తను లేకుండా నేనెలా?.. అందుకే ఈ ఇయర్ తనని నేను బాగా చదివిస్తా.. తను నెక్స్ట్ ఇయర్ తప్పక క్వాలిఫై అవుతాడు.. అప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం.."
"మధూ డోంట్ బీ చైల్దిష్.. ఇప్పుడు మీరు ఇంకా చిన్న పిల్లలు కాదు.. Being a girl you should know your limits now... తన కోసం నీ చదువు పాడుచేసుకుంటావా?.. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది."
"అభీ లేకుండా నాకు ఏ ఫ్యూచర్ లేదు  .. నేను ఈ ఇయర్ వెళ్ళడం లేదు.." అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది...


                                                            *********
ఎదో శబ్దానికి ఆలోచనల్లోంచి బయటకి వచ్చింది మధు ... చూస్తె అభీ వచ్చి తన ప్రక్కన కూర్చున్నాడు...
"అభీ.. ఎప్పుడు వచ్చావ్ రా..." అంది తేరుకొని
"ఇప్పుడేలే... ఏంటి ఈ లోకం లేనట్లున్నావ్?"
"నాకు నువ్వే లోకం కన్నా... మన గురుంచే ఆలోచిస్తూ ఉండిపోయా... ఇంతకీ ఇంటర్యూ ఎలా చేసావ్?"
"ఆ బాగానే చేశాలే... ఏదన్నా హోటల్ కి వెళ్దాం పదా నాకు బాగా ఆకలేస్తుంది.."
"అయ్యో నా బుజ్జి కన్నకి ఆకలేస్తుందా .. పద వెళ్దాం" అంటూ లేచింది...


                                                               ****
ఆఫీసు నుండి బైల్దేరబోతూ తన ఫ్రెండ్ కి కాల్ చేసింది మధు...
"హలో..."
"సిద్ధు నేను మధుని..."
"ఆ చెప్పు మధు..."
"అభీ ఎలా చేసాడు ఇంటర్యు ... ఓకే నా.."
"అసలు ఇంటర్యుకి వస్తే కదా ఓకేనో కాదో చెప్పడానికి.."
దెబ్బకి షాక్ తగిలింది మధుకి .. "అదేంటి రాలేదా?.. నేనే తీసుకువచ్చాను సిద్ధూ"
"నేను వన్నవర్ వెయిట్ చేశా తన కోసం... అయినా ఇంటర్యు కి రాలేదు... నువ్వు నన్ను అంతగా రిక్వస్ట్ చేశావని తనని ఎలాగయినా సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు.. కానీ మనిషే రాలేదు, ఏం చెయ్యమంటావ్??.. Looks like he is totally irresponsible ...ఇతని కోసమా నువ్వు ఇంతగా నన్ను రిక్వస్ట్ చేసింది అనిపించింది మధు.."
మధుకి బాధ కోపం కలగలిపి వచ్చాయి.. "యాం సారీ సిద్ధు... నేను మళ్ళీ చేస్తా.." అని పెట్టేసింది
మధు కి ఏడుపు వచ్చింది... అభీ ఎందుకు నా బాధ అర్థం చేసుకోవడం లేదు.. తనని సెటిల్ చెయ్యలని ఎంతగా ప్రయత్నించినా తను ఎందుకు కొంచెం కూడా రియాక్ట్ కావడం లేదు... అభిని తొందరగా సెటిల్ చేసి, తను ఈ జాబ్ మానేసి హాయిగా అభిని పెళ్లి చేసుకోవాలని తను ఎంత ఆరాటపడుతున్నా అభి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు... వెంటనే సెల్ తీసి అభి నంబర్ కి డైల్ చేసింది.

                                                                                                       ....... To be continued