Monday, January 17, 2011

ఫ్లాట్ నెం 402

డిసెంబర్ 31st 2006....
ఫ్లాట్ నెం 402
కాలింగ్  బెల్ మ్రోగగా, డోర్ ఓపెన్ చేశాడు అభి ...
ఎదురుగా ఆకాంక్ష ..
"అకీ ..." అతని కళ్ళలో కొత్త మెరుపు ఆమెని చూడగానే .. "నాకు తెలుసు బంగారం నువ్వొస్తావని .. నన్ను విడిచి నువ్వుండలేవు.. నేను కూడా ఉండలేనురా ..." అన్నాడు ఉద్వేగంగా .. అతని కళ్ళలో చెమ్మ ఆమె దృష్టి దాటిపోలేదు ...
"నేను లోపలికి రావచ్చా.." అంది క్లుప్తంగా ...
"నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నానురా .." అన్నాడు ఆమెకి లోపలికి దారిస్తూ ...
"నీ దెగ్గర ఉన్న నా వస్తువులు .. గిఫ్టులు ... గ్రీటింగులు ... ఫోటోలు .. అన్నీ నాకు కావాలి .. అవి తీసుకెళ్ళడానికే వచ్చాను .." అంది
"ప్లీజ్ అకీ ... నేను చెప్పేది ఒక్కసారి విను ... ఇంకెప్పుడు అలా జరగదు ... నువ్వు లేని నా జీవితాన్ని నిజంగా ఊహించుకోలేను .."
"ఇనఫ్ ... జరిగింది చాలు ... Let me go on with my life.."
                                                            ******

జనవరి ఫస్ట్ 2008....
అర్థరాత్రి దాటింది... డాబా మీదున్న వాటర్ ట్యాంక్ మీద కూర్చున్నాడు అభి...
చల్లని గాలి రివ్వున వీస్తుంది... కనిచూపు మేరల్లో కనిపించే సిటీ అంతా వెలుగులు చిమ్ముతుంది..కొత్త సంవత్సరంలోకి అడుగెట్టిన ఆనందంలో నగరంలో జనాలు చాలా మంది సంబరాల్లో మునిగితేలుతున్నారు ...
పెద్దవాడైనా  పేదవాడైనా.. ప్రతిరోజొక పండుగలా జీవించేవాడైనా .. గుండెల్లో పుట్టెడు దుఃఖం దాచుకున్నవాడైనా .. అన్నీ మరచిపోయి ఆనందంగా ప్రతిఒక్కరినీ కొత్త సంవత్సరం సంతోషంగా గడపాలని కోరుకునే గొప్ప రోజు .. కానీ అభికి సంవత్సరం క్రితం అది తన జీవితాన్ని ఎప్పటికీ మార్చివేసిన రోజు ...

"Aki why did you do this to me?" సూన్యంలోకి చూస్తూ తనలో తానే అనుకున్నాడు అభి "ఎంతగా ప్రేమించాను ... నువ్వేలోకం అనుకున్నాను ... నన్ను వదిలి ఎలా వెళ్లిపోగలిగావు.. How could you cheat on me.." అతని కళ్ళు ఎర్రబారాయి ... " ఇంత చేసినా నీ మీద నాకున్న ప్రేమ తగ్గలేదు .."
                                                             ********

జనవరి 2, 2007

లిఫ్ట్ లోంచి బయటకి వచ్చాడు అభి ... తనతో పాటు ఓ అమ్మాయి కూడా ...
తన ఫ్లాట్ కి వెళ్లి లాక్ ఓపెన్ చేయ్యబోతుండగా .. "Excuse me" అంది ఆ అమ్మాయి..
ఎంటన్నట్లుగా ఆ అమ్మాయి వైపు చూశాడు అభి..
"నేను కొత్తగా మీ పక్క ఫ్లాట్ 403కి వచ్చాను ... నా పేరు ప్రియ ... చిన్న హెల్ప్ చేస్తారా?"
"చెప్పండి .."
"హాల్లో బుక్స్ ర్యాక్ ఒకటి ఉంది .. దాన్ని నా బెడ్ రూమ్ కి మార్చాలి ... నేను ఒక్కదాన్ని మూవ్ చెయ్యలేను ... మీరు హెల్ప్ చేస్తే ఇద్దరం కల్సి ఈజీగా మూవ్ చెయ్యొచ్చు ..."
"సరే ... పదండి .." అంటూ ఆమెతో పాటు ఆమె ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లాడు అభి ...
లోపలికి వచ్చాక ఇద్దరూ కల్సి ఆ ఉడెన్ బుక్స్ ర్యాక్ ని ఆమె బెడ్రూం లోకి మార్చారు ...
"చాలా థాంక్స్ ... మిగతావి నేను ఈజీగా సర్దుకోగలను .. ఇదొక్కటే కొంచెం బరువైంది .. మీరు హెల్ప్ చేసారు .. చాలా థాంక్స్ .."
"ఇట్స్ ఓ.కే .. ఈ ఫ్లాట్ లో మీరొక్కరే ఉంటున్నారా?"
"అవును ..."
"ఒంటరిగా అనిపించదా ..."
"చిన్నప్పటినుంచీ నాది ఒంటరి జీవితమే .. ఇప్పుడు కొత్తగా ఒంటరినేమీ కాదు ... "
ఆ మాట విని ఆమె వైపే ఓ క్షణం అలా చూస్తుండిపోయాడు ... 'ఎక్కడ విన్నాను ఈ మాట .. అవును ఆకాంక్ష కూడా ఇలానే అనేది ..'
"అభి గారు ... మంచి కాఫీ తెస్తాను ఉండండి .."
"నా పేరు మీకు??"
"హా హా .. అది పెద్ద కష్టమా ..." అంటూ నవ్వుతూ లోపలి వెళ్ళింది ..
అక్కడ ర్యాక్ లో ఉన్న పుస్తకాలను చూస్తున్నాడు అభి ..
"మీరు సిడ్నీ షెల్డన్ చదువుతారా?" అడిగాడు కాఫీ కప్పుతో వస్తున్న ప్రియని చూసి ...
"మై ఫేవరెట్ ..." అందామె ...
ఆశ్చర్యపోయాడు ....

                                                      ******
డిసెంబర్ 31st, 2006.

ఆకాంక్ష అభికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ వెతికి మరీ కలెక్ట్ చేసుకుంటుంది ...
"ఇంకా నాకు సంబంధించినవి నీ దెగ్గర ఏమైనా ఉన్నాయా?" అంది అభి వైపు చూస్తూ ..
"నా ప్రాణం ఉంది కావాలా?"
"నేనేమీ పిశాచాన్ని కాదు ... నేను నీకు ఇచ్చిన సిడ్నీ షెల్డన్ బుక్స్ ఎక్కడ?"
షెల్ఫ్ వైపు చూపించాడు అభి ...
అన్నీ ప్యాక్ చేసుకుంటుండగా ... కార్ హారన్ వినిపించింది.. బాల్కనీ లోంచి చూసి ఎదో సైగ చేసింది ...
"ఎవరు?" అన్నాడు అభి
"రాజ్ ..."
"వాడొక ఈడియట్ ... వాడితో నీకేం పని ..."
"నీకంటే ఎన్నో రెట్లు నయం ... అయినా నా విషయాలు నీకు ఇక అనవసరం ..."
"పిచ్చిగా మాట్లాడకు ... నా మీద కోపంతో వాడికి దెగ్గర అవుతున్నావా ... వాడు నన్ను ఎంత మోసం చేసాడో నీకు తెలియదా ... "
"షటప్ ... నా లైఫ్ నా ఇష్టం ... నీ లాంటి సైకో కంటే రాజ్ ఎంతో బెటర్ ... హీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంతే ..."
"అకీ ... గివ్ మీ ఏ చాన్స్ ... I will correct myself.. "
"Am exhausted giving u chances... Now, i don't wanna take any chance with you... you understand that..." అంటూ వెళ్లిపోతుండగా, ఆమెకి వెళ్లి అడ్డుగా నిల్చున్నాడు ...
"అభీ తప్పుకో..."
"వెళ్ళనివ్వను ... ప్లీజ్ .. నేను చెప్పేది విను ... నిన్ను వదులుకోలేను ..."

                                                     ********
జనవరి 2nd, 2007

"ఏంటి అలా చూస్తున్నారు .." అడిగింది ప్రియ
"ఏమీ లేదు ... నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కూడా నీలాగే సిడ్నీ షెల్డన్ నోవెల్స్ ఇష్టం .."
"ఓహ్ అలాగా ... ఫ్రెండా... గాళ్ ఫ్రెండా?" అంది నవ్వుతూ
"హమ్ .... We broke up recently.."
"Oh am sorry ..."
"Thats ok... మీ గురుంచి చెప్పండి ... మీకు బాయ్ ఫ్రెండ్ లేడా?"
"నాదీ మీ స్టోరీనే ... విడిపోయాం ..." అంది
"అవునా ... ఏమయింది?"
"మెన్ ఈగో ... too much possessiveness ... ఆఫీసులో అందరితో నాకు రేలషన్ అంటగట్టి మెంటల్ టార్చర్ పెట్టాడు ... చివరికి భరించలేని స్థితికి వచ్చాను ..."
అభికి తానేమి వింటున్నాడో అర్థం కావడం లేడు ... "Who is she?" అనుకున్నాడు ఆశ్చర్యంగా ...
"ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చి తనకి కాల్ చేస్తే .. 'ఈ రోజు ఎవడి బండి మీదో వెళ్ళావట... మీ ఆఫీస్ లో పని చేసే నా ఫ్రెండ్ శేఖర్ చెప్పాడు ... వాడితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నావట..' అంటూ ఏడిపించే వాడు ... ఒకోసారి 'తిరిగితే తిరిగావులే.. వాళ్ళతో నీ రాసలీలలు ఎలా సాగించావో చెప్పు ... విని తరిస్తా' అంటూ చెండాలంగా మాట్లాడేవాడు .. He was sick.."
అదంతా విని స్టన్ అయ్యి అక్కడే కొయ్యబొమ్మలా నిలబడ్డాడు అభి ..

                                                          ******

డిసెంబర్ 31st, 2006.

"Get off my way.." అంది అతన్ని విదిలించుకుంటూ ...
"ప్లీజ్ అకీ ... ఇంకెప్పుడు అలా ప్రవర్తించను ...ఈ ఒక్కసారికి నన్ను క్షమించు .."
"ఇంక నాకు ఓపిక లేదు ...  I have experienced the extremes of your psychopathic nature.. you are sick... మాట్లాడిన పతి మగాడితో రిలేషన్ అంటగట్టే నీలాంటి వాడిని ఇన్ని రోజులు ప్రేమించాను అన్న ఊహే నాకు కంపరం పుట్టిస్తుంది ..."
"అది నాకు నీ మీద ఉన్న అతి ప్రేమ అలా చేయించింది ... నువ్వెక్కడ నా చెయ్యి జారి పోతావో అన్న ఇన్సెక్యూరిటీ నాతో అలా చేయించింది ... నీ అందం చదువుతో పోలిస్తే నేను నీకు ఎక్కడా సరితూగను.. అందుకే నీ విషయంలో నాకు ఎప్పుడూ ఇన్సెక్యూరిటీ ఉండేది ... అందుకే ఓవర్ పోసేసివ్ గా ఉండేవాడిని.. ఇవన్నీ నీ ప్రేమ వల్ల కలిగినవే .. అంతే కానీ నేనేదో సైకోని కాదు .."
"Whatever, its over... రేపు నువ్వు పెళ్లిచేసుకోబోయే అమ్మాయిని అయినా ప్రేమతో చూసుకొని కనీసం మనిషివి అనిపించుకో ..." అంటూ డోర్ వైపు నడచింది ...
అభి ఒక్క ఉదుటున ఆమెని పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు ... ఆమెని గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు .. "Am not going to let you leave... " అన్నాడు బలవంతంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుంటూ ...
అతన్ని లాగి చెంప మీద కొట్టింది ...
"నిన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వను... నువ్వు లేకపోతే నేను ఉండలేను .. నువ్వు నాతో పాటే ఉంటున్నావ్  ... ఎప్పటికీ .. ఇంకో పది కొద్దిసేపట్లో మొదటి సంవత్సరం రాబోతుంది ... మనం కొత్తగా కొత్త సంవత్సరానికి విషెస్ చెప్దాం ... " అంటూ బలవంతంగా ఆమెని ఎత్తుకొని బెడ్రూం వైపు తీసుకెళ్ళాడు ...వెళ్లి అక్కడ ఉన్న కబోర్డ్ డ్రాయర్ ఓపెన్ చేశాడు ...

                                                               *******
జనవరి 2nd, 2007

"He might not be sick as you think... He might not be a psycho as you think... He might be in love with u so deeply that he lost himself... " అన్నాడు అన్యమస్కంగా ...
ఆమె అతని వైపే చూస్తుంది ..
"అతను నిన్ను పిచ్చివాడిలా ప్రేమించాడేమో ... ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకొని ఉండాల్సింది .. అతని ప్రాబ్లెం ఏమిటోకనుక్కొని ఉండాల్సింది ..." అన్నాడు నెమ్మదిగా
"అతను ఒక మదమెక్కిన మృగం .." అంది .. ఆమె కళ్ళు ఎర్రగా నిప్పులు చెరుగుతున్నాయి ...
"షటప్ ..." అన్నాడు అప్రయత్నంగా ...
"ఏం .. ఎందుకంత కోపం... నీ గాళ్ ఫ్రెండుతో నువ్వు కూడా అలానే ప్రవర్తించావా?.. ఆమెని టార్చర్ పెట్టావా?..నిజం చెప్పు .. అందుకే నువ్వు ఇది తప్పు అని ఒప్పుకోలేకపోతున్నావు ..."
"అది నీకు అనవసరం ... నేను వెళ్తున్నాను ..." అంటూ వెనక్కి తిరిగాడు
"నువ్వేక్కడికీ వెళ్ళలేవు ..."
"వాట్ ??"
ఇంతలో డోర్ బెల్ మ్రోగింది ...
అభి వడివడిగా వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ...
                       
                                        **********
జనవరి ఫస్ట్ 2008....

"అభి అంకుల్..." అంది పదేళ్ళ అమ్ములు ..
అతని ప్రక్కనే కూర్చొని ఉంది అమ్ములు ...
అమ్ములు కళ్ళలోకి చూడలేకపోతున్నాడు అభి ...
"నన్ను క్షమిస్తావా అమ్ము ..." అన్నాడు  ... అతని గొంతు బాధతో వణికిపోతుంది ..
"అమ్మ ఏడుస్తుంది అంకుల్... I hate you for that... నేను అమ్మ లేకుండా ఒక్క రోజైనా ఉన్నానా .. అమ్మ కూడా అంతే ... ఇప్పుడు నీ వల్ల ..."
"అందుకే నేను ఇంకా నరకం అనుభవిస్తున్నాను ..."
                                                                     ******
జనవరి 2nd, 2007

"అమ్ములు ..." అన్నాడు తెల్లబోయి ...
"అంకుల్ ... అమ్మ ఎక్కడికో వెళ్ళింది ... ఇంటికి తాళం వేసి ఉంది .. అందుకే ఇక్కడికి వచ్చా .." అంటూ లోపలికి వెళ్ళింది ....
అభికి ముచ్చెమాటలు పోశాయి ... 'వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి ..' అనుకొని ఆ అపార్టుమెంట్ నుంచి బయటకి వచ్చి తన అపార్టుమెంటుకి వెళ్లాడు ...
మెల్లిగా నడుచుకుంటూ ... బెడ్రూం దెగ్గర ఆగాడు ...
మెల్లిగా డోర్ తెరుచుకొని లోపలి వెళ్లాడు ...
ఆ బెడ్ మీద హాయిగా నిద్రపోతుంది ఆకాంక్ష ...
అతను వెళ్లి ఆమె ప్రక్కనే పడుకొని ఆమెని కౌగిలించుకున్నాడు
"అకీ ... మై లవ్ ... నన్ను విడిచి నువ్వు ఉండలేవురా ... అందుకే నిన్ను నాతో పాటే ఉంచుకున్నాను ... ఐ లవ్ యు డార్లింగ్ ... నీకు నా మీద కోపంగా ఉండొచ్చు ... కానీ నీ మీద నాకు ఉన్న ప్రేమ ఆ కోపాన్ని చల్లార్చుతుంది .. నువ్వెప్పటికీ ఇలాగే నాతో పాటు ఉండాలిరా ... "
ఇంతలో బెడ్రూం తలుపు చప్పుడు అయింది ...
వెళ్లి తీశాడు ... ఎదురుగా ... ప్రియ..
"ప్రియా ..." అన్నాడు విస్మయంగా
మెయిన్ డోర్ వైపు చూశాడు ... లోపలి నుంచి బోల్ట్ వేసే ఉంది ..
ముచ్చెమటలు  పోశాయి .. స్టన్ అయ్యి ఆమె చూస్తున్నాను ...
"ఎలా వచ్చావు?" అన్నాడు .. గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది ...
"ఇది నీకు ఇద్దామని .." అంటూ అతనికి చూపించింది ... రివాల్వర్ ...
"ఇది నాది కాదు ... ముందు వెళ్ళు ఇక్కడి నుంచి ..."
"ఇది నీదే .. నా బెడ్రూంలో కబోర్డ్ డ్రాయర్ లో ఉంది ... మీది మీకు ఇచ్చాకే .. నేను వెళ్తాను ..."
                                                                *******
జనవరి 1, 2007.
దాదాపు ఒంటి గంట...
అభి బయటకి వచ్చాడు ...
కారిడార్ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు ...
"హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్ .." అంటూ దూరం అరిచింది అమ్ములు అతన్ని కారిడార్ లో చోడగానే ...
అతను సమాధానంగా చెయ్యి ఊపాడు ..
"అంకుల్ ఆకాంక్ష అక్క కూడా ఇక్కడే ఉంది కదా, తనకి కూడా విషెస్ చెప్పివస్తా ..." అంటూ అతని ఫ్లాట్ లోకి పరిగెత్తింది ..
అభి కి ఒక్కసారిగా గుండెజారింది ...
అభి వెంటనే వేగంగా పరిగెత్తాడు లోపలికి.... అమ్ములు ఆల్రడీ బెడ్రూం లో ఉన్న ఆకాంక్ష దెగ్గర ఉంది ...

                                                               ******

జనవరి 3, 2007.

అపార్టుమెంట్ ముందు పోలిస్ జీప్ ఆగింది ...
అక్కడ ఉన్న వాచ్మెన్ దెగ్గరికి వచ్చి "ఇందాక ఫోన్ చేసింది నువ్వేనా?" అని అడిగాడు ఇన్స్పెక్టర్
"అవును సార్ ..."
"సరే...బాడీ ఎక్కడ?"
"పైన వాటర్ ట్యాంకులో ... బాగా వాసన వస్తుండటంతో అనుమానం వచ్చి చూసి మీకు కాల్ చేస్తున్నా .."
"ఓకే ... నాతో పాటురా ..."అని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ని కూడా రమ్మని సైగ చేశాడు ...
వాటర్ ట్యాంక్ దెగ్గరికి రావడంతోనే బాడ్ స్మెల్ వస్తుండటంతో ముక్కులకి కర్చీఫులు కట్టుకొని ట్యాంక్ ఓపెన్ చేసారు ...
కానిస్టేబుల్స్ బాడీని బయటకి తీసారు ...
"ఈ బాడీ ఎవరిది?" అడిగాడు ఇన్స్పెక్టర్ వాచ్మెన్ ని
"ఇది అమ్ములు అనే అమ్మాయిది ... నాలుగో ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు .. మూడు రోజులుగా కనిపించడం లేదని కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలిస్ స్టేషన్ లో ..." అన్నాడు వాచ్మేన్ ..
"అవును .. గుర్తుంది .. విషయం పాప తల్లితండ్రులకి తెలుసా?" అడిగాడు ఇన్స్పెక్టర్
"లేదు సార్.. నేను చెప్పలేదు .. అంత దైర్యం రాలేదు .. చూడగానే మీకు కాల్ చేశాను అంతే ... పాపం ఈ పాప అంటే ఆ తల్లికి ప్రాణం సారూ .. ఆమె భర్త కూడా ఈ మధ్యే చనిపోయారు .."
"చూస్తె గొంతు నులిమి చంపేసినట్లున్నారు ..." అని ఇన్స్పెక్టర్ అంటుండగా "సార్ .. ఈ రింగ్ దొరికింది ట్యాంక్ ప్రక్కన" అని చూపించాడు వాచ్మెన్ .. రింగ్ మీద AKI అని రాసి ఉంది.
"ఇది ఎవరిదై ఉంటుంది .." అన్నాడు ఇన్స్పెక్టర్
"నాకు తెలిసి ఇది అభిరాం గారిది అయి ఉంటుంది .. AKI అంటే ఆయన గాళ్ ఫ్రెండ్ పేరు .. ఆకాంక్ష .." అన్నాడు వాచ్మెన్
"ఓకే ... అతని ఫ్లాట్ ఎక్కడ ... "
"నాలుగో ఫ్లోర్ లోనే 402 ... అమ్ములు వాళ్ళ ఫ్లాట్ ప్రక్కన.."
"ఓకే..అతని ఫ్లాట్ కి వెళ్దాం పదండి .."

డోర్ బెల్ ఎన్ని సార్లు రింగ్ చేసినా ఎవరూ ఓపెన్ చెయ్యడం లేడు ...
"ఎందుకు.. ఎవరూ ఓపెన్ చెయ్యడం లేదు..."
"ఏమో సార్... అభిరాం గారు రెండు రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నారు .. ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను .. ఆయనగారికి ఆకాంక్ష గారి గొడవలు అయాయి అని తెల్సింది సార్ .." అన్నాడు
"ఓకే .. నాకేదో అనుమానంగా ఉంది... లెట్స్ బ్రేక్ ద డోర్ .. అవునూ ఆ ప్రక్కన 403 ఫ్లాట్ ఎవరిదీ .." అడిగాడు ఇన్స్పెక్టర్ ..
"ఎవరూ ఉండటం లేడు సార్... ఆరు నెలలుగా ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది ..."
"ఓహ్ ..."

                                                                        ******
జనవరీ ఫస్ట్ 2008
ఫ్లాట్ నెం 402

ఫ్లాట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ గోల గోల చేస్తున్నారు ...
మందు తాగి ... డ్యాన్స్ వేస్తున్నారు ...
"సైలెన్స్ గైస్ ..." అంటూ అరిచాడు అశోక్
"ఎంజాయ్ చేస్తుంటే సైలెన్స్ అంటావేంట్రా బాబూ.." అన్నాడు ఒకడు 
"నేను ఇప్పుడు చెప్పబోయేది ఇంకా బాగుంటుంది ... నేను మీకు చెప్పాను కదా ఈ రోజు ఒక ఇంట్రస్టింగ్ విషయం చెప్తాను అని .." అన్నాడు 
"అదేంటో చెప్పరా తొందరగా ..." అన్నారు అందరూ
"ఓ కే ... ఈ ఫ్లాట్ లో సరిగ్గా సంవత్సరం క్రితం .. అంటే 2007 న్యూ ఇయర్ రోజున ... హత్య జరిగింది .." అన్నాడు 
"హత్యా .. ఏంట్రా బాబూ .. ఈ టైం లో ఇలాంటివి చెప్తున్నావ్ .."
"హత్య జరిగిన టైం కూడా ఇదే ... అందుకే చెప్తున్నా " అన్నాడు కన్ను కొట్టి ...
"అలాంటి ఫ్లాట్ లో నువ్వెందుకు దిగావ్ రా ..." అన్నాడు ..
"నాకు ఎలాంటి భయాలు లేవులే ..." అన్నాడు అశోక్
"అసలు ఏం జరిగిందో చెప్పరా .."
"ఇదే ఫ్లాట్ లో అభిరాం లో అనే అతను ఉండేవాడు ... అతనికి ఆకాంక్ష అనే గాళ్ ఫ్రెండ్ ఉండేది .. ఇద్దరికీ సంవత్సరం క్రితం ఇదే రోజున ఎదో పెద్ద గొడవ అయిందట ... తను ఆమెని రివాల్వర్ తో కాల్చాడు ...కాల్చి అదిగో కనిపిస్తుందే అదే బెడ్రూంలో మూడు రోజులు పాటు ఉంచుకున్నాడు .. రోజూ ఆ శవం ప్రక్కనే పడుకునే వాడట.. హీ ఈజ్ ఏ సైకో టైప్ ... ఆ శవాన్ని ప్రక్కింటి పాప చూసిందని ఆమెని చంపి టెర్రస్ పైనున్న వాటర్ ట్యాంక్ లో పడేసాడు ..." అన్నాడు 
"ఓ మై గాడ్ ... ఎవడ్రా బాబూ వాడు .. ఇంతకీ వాడిని అరెస్ట్ చేసారా?" అన్నాడు ఒకడు ...
"లేదు ... అతను తన గాళ్ ప్రెండ్ ని చంపిన మూడు రోజులు తర్వాత ఎవరి చంపేశారు తనని ... పోలీసులు తలుపులు బ్రేక్ చేసి ఓపెన్ చెయ్యగా అభిరాం బాడీ, ఆకాంక్ష బాడీ బెడ్రూంలో కనిపించాయి ... ఆ తర్వాతే ఇవన్నీ బైటకి వచ్చాయి "
"ఎలా?.. ఎవరు చంపారు తనని?"
"ఎవరో పాయింట్ బ్లాక్ మీద కాల్చారు ... ఆ చంపింది ఎవరు అన్నది ఇప్పటిదాకా తేలదేదు ... యు నో .. ఆ రివాల్వర్ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా లేవట .. అదే రివాల్వర్ తో అంతకముందు అభిరాం ఆకాంక్షని చంపాడు ... అభిరాంని చంపింది ఎవరో ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టలేదు .. పక్క ఫ్లాట్ లో అపుడప్పుడు ఎవరో అరుచుకుంటున్నట్లు గొంతు వినిపించేదట వాచ్మెన్ చెప్పాడు ..."
"మై గాడ్ ..."
ఇదంతా వాళ్ళ ప్రక్కనే ఉండి వింటూ ... నవ్వుకుంటూ బెడ్రూం వైపు వెళ్లాడు అభిరాం ... అతను అక్కడ ఎవ్వరికీ కనిపించడు ....

                                          **** THE END *****


                                                                                        Yours Ramakrishna Reddy Kotla