Saturday, October 30, 2010

కిషన్, The S.P.L and ఒక పిల్ల దెయ్యం

ఒక వ్యక్తి తన దేశానికి తాను ప్రధాని అయితే, ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో తెలియదు కాని, మా స్కూల్ కి నేను ఎస్పీయల్ (S.P.L.) అయినప్పుడు మాత్రం అంతకు పది రెట్లు ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యాను... దానికి కారణం, స్కూల్ లో మనకు హీరో ఇమేజ్ రావడంతో పాటు, పదవ తరగతి అంకుల్స్ ఉండగా తొమ్మిదో తరగతిలో ఉన్న నేను ఎస్పీయల్ కావడం.. పదవ తరగతిలో ఉన్నవాళ్ళకు అప్పటికే మీసాలు గడ్డాలు రావడంతో, తొమ్మిదో తరగతిలో ఉన్న మేము ఇంకా పాల బుగ్గల పసి మొగ్గలుగా ఉండటంతో, వాళ్ళు మాకు అంకుల్స్ గా కనపడే వాళ్ళు...

ఎస్పీయల్ గా స్కూల్ కారిడార్ లో ఠీవీగా నడిచివెళ్తుంటే, ఎదురుగా వచ్చే అంకుల్స్ అసూయ జ్వాలలు నా మీద ఎగసిపడుతుంటే, కాలర్ మెలిపెట్టి కళ్ళెగరేసి వాళ్ళకు కుళ్ళుపుట్టిస్తుంటే, పళ్ళ కింద పళ్ళు కొరుకుతూ వాళ్ళు చేసే పటపట శబ్దానికి నేను వ్యంగ్యంగా నవ్వుకుంటూ లేని మీసాన్ని గర్వంగా  మెలెయ్యడంలో ఉన్న మాంచి కిక్ ఏంటో తెలిసొచ్చింది...

మా స్కూల్ లో ఎస్పీయల్ పోస్టుకి స్టూడెంట్స్ వోటింగ్ ఉండదు, టీచర్స్ ఏకగ్రీవంగా ఒక స్టూడెంటుని ఎన్నుకుంటారు.. మా స్కూల్ ప్యూన్ నుంచి ప్రిన్సీ దాకా నేనంటే ఒక మంచి వోపీనియన్ ఉండబట్టి (అదెలాగో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. ఒకవేళ నేను మరీ బుద్దిమంతుడిలా నటించాల్సిందిబోయి జీవించానేమో..), ఆ వోపీనియన్ నాకు ఎస్పీయల్ పోస్టు తెచ్చిపెట్టింది....

అప్పటిదాకా సీపీయల్(C.P.L.) గా సంతృప్తి చెందిన నేను ఎస్పీయల్ అవ్వడంతో నాలో కర్లాన్ పరుపు మీద కునుకు తీస్తున్న "ఒకేఒక్కడు" "భారతీయుడు" నిద్రలేచారు... లేచీ లేవడంతోనే మొహం కూడా కడుక్కోకుండా తమ ఆకలి తీర్చమని నన్ను పోరుపెట్టారు... ఇక నేను రెచ్చిపోయాను.. ఎస్పీయల్ అయిన రెండో రోజు నుంచే ఒకటవ క్లాస్ సీపీయల్ నుంచి తొమ్మిదవ క్లాస్ సీపీయల్ దాక రోజుకి ఒకడిని పిలిచి అత్యవసర సమావేశం నిర్వహించేవాడిని... ఆకస్మిక తనికీలు చేసేవాడిని ....

"మీ క్లాస్ లో పాస్ పర్సెంటేజ్ ఎంత?" అని ఒకటో క్లాస్ సీపీయల్ ని అడిగితే, వాడు నోట్లో వేలు పెట్టుకొని బిత్తరచూపులు చూసేవాడు... "ఖాళీ పీరియడ్స్ లో ఏం చేస్తున్నారు?" అని రెండో తరగతి సీపీయల్ ని అడిగితే, "గోల చేసే వాళ్ళ నేమ్స్ రాస్తున్నా సార్.." అని వాడు అనడంతో "గుడ్... ఆ నేమ్స్ తెచ్చి నాకు చూపించు రేపటినుంచి.." అన్నాను... మరుసటి రోజు నేను క్లాస్ లో "స్కూల్ అభివృద్ధి, అందుకు అవలంభించాల్సిన పద్దతులు" అనే ఆర్టికల్ చదువుతుంటే రెండో తరగతి సీపీయల్ వచ్చి "సార్ నేమ్స్" అన్నాడు.. ఆ లిస్టులో యాభై మంది ఉన్నారు.. లేనిది ఆ సీపీయల్ గాడోక్కడే.. నాకు తిక్కరేగింది..ఆగ్రహోద్రుడినై ఆవేశంతో ఎగేసుకొని రెండో తరగతికి బైల్దేరాను..

అక్కడ సీన్ చూసి చిర్రెత్తింది నాకు.. అందరూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.. ఒక పిల్లేమో ఇంకో పిల్ల జుట్టు పట్టుకొని పీకుద్ది...ఇదేమో దాని బుక్ లాగేసుకొని గిరాటేసి కొట్టుద్ది... ఒకడేమో పలక మీద బొమ్మేసుకుంటుంటే ఇంకొకడొచ్చి తుపుక్ మని ఆ బొమ్మ మీద ఊసి నవ్వుతాడు..వీడికి ఎక్కడో కాలి వాడి చేతి మీద కోరుకుతాడు...దాంతో వాడు సైరన్ అందుకుంటాడు.. ఒక పిల్లేమో నోట్ బుక్ అట్టమీది హీరోయిన్ బొమ్మకి మీసాలు గీస్తుంటే, ఇంకొకత్తేమో దీని జడ విప్పి మళ్ళి వెయ్యడం మొదలెడుతుంది... వాళ్ళని అలా చూసాక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు...వెంటనే క్లాస్ లోకి దూకి, అందరినీ దాటుకుంటూ బోర్డ్ దెగ్గరికి వెళ్లి కళ్ళుమూసుకొని... సై...లె...న్స్... అని క్లాసులు పిక్కటిల్లేలా అరిచాను.. నా గాండ్రింపుకి అక్కడి గండుచీమ కూడా చలించలేదు... ఆల్రడీ నాకు వాళ్ళని చూసి పుచ్చకాయ సైజులో పిచ్చి ఎక్కి ఉండటంతో ఆవేశంగా అటూ ఇటూ చూసాను.. 

అక్కడ ఒక పిల్ల కాళ్ళు బార్లా చాపుకొని ఒక పెళ్లి కూతురి బొమ్మకి బొట్టు పెట్టి తలదువ్వుతుంది... నేను ఆ పిల్ల దెగ్గరికి వెళ్లి ఆ బొమ్మ లాక్కొని విసిరికొట్టి హిహ్హిహ్హి అని వికటాట్టహాసం చేసాను.. ఆ పిల్ల మిడిగుడ్లేసుకొని నన్నే చూస్తూ ఎవరో స్విచ్ వేసినట్లుగా సునామీ సిస్టర్ లాంటి సైరన్ అందుకుంది...అక్కడి పిల్లలందరూ ఆ అమ్మాయి సైరన్ విని ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.. ఒక్క చర్యతో అందరి నోళ్ళూ మూయించినందుకు నా మీద నాకే గర్వం కలిగింది 'నీ దుంపతెగ నిన్ను మించిన యస్పీయల్ ఏ స్కూల్లోనూ ఉండడెహే..' అనుకుంటుండగా.. ఆ సీపీయల్ గాడు నా దెగ్గరకి వచ్చాడు.. ఆ పిల్ల ఇంకా సైరన్ ఆఫ్ చెయ్యలేదు.. 'ఆ అమ్మాయి.....' అంటూ నా చెవిలో ఒక దేవరహస్యం ఊదాడు.. నాకు మొదట చెమటోచ్చింది.. ఆ తర్వాత వణుకొచ్చింది.. ఫైనల్గా భయమొచ్చింది... 

ఎవరి పేరు చెబితే స్టూడెంట్స్ గుండెల్లో గూడ్స్ పరిగెడుతుందో... ఎవరు భోదిస్తే బయాలజీకే భయమేస్తుందో .. ఎవరి వస్తే తుఫాను వస్తుందో.. ఎవరి రాస్తే బోర్డ్ ఏడుస్తుందో.. ఆ ఫలానా టీచర్ కూతురు ఆ పిల్ల అని చెప్పాడు ... అప్పటికప్పుడు ఆ సునామీ పిల్ల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నాను.. వెంటనే విసిరేసిన బొమ్మ తీసుకొచ్చి ఆ పిలకిచ్చి బుగ్గలు పట్టుకొని లాగి వదిలాను.. అంటే, ఆ పిల్ల నాకు ముద్దోచ్చింది అని నేను అనుకోవాలి.. నాకు బుద్దొచ్చింది అని ఆ పిల్ల అనుకోవాలి... కాని ఆ పిల్ల అలా అనుకోలేదు .. నేను దాని కాళ్ళ బేరానికి రాక తప్పలేదు.. 

"నా చిచ్చి కదూ.. నా బూచి కాదూ.. నా కుచ్చి కదూ.."
"కాదు...పొ ... మా అమ్మకి చెప్తా నీ మీదా ....నన్ను కొట్టాడు, గిచ్చాడు, కొరికాడు అని చెప్తా ... ఆ ..వావావా  ..."
'కొరికానా...గిచ్చానా ...ఓసి రాక్షసి.. ఎలా కనిపిస్తున్నానే' అనుకొని "వద్దు స్వీటీ అమ్మకి చెప్పకు... రేపు నీకు చాక్లెట్ తీసుకొస్తా సరేనా?"
"ఆ చాక్లెట్....అమ్మా చాక్లెట్.... నాకు ఇప్పుడే కావాలి చాక్లెట్...పొడుగు డైరీ మిల్క్ చాక్లేట్...నాకు ఇప్పుడే కావాలి...ఆ ...వావావా..."
'ఇప్పుడు చాక్లెట్ ఎక్కడనుంచి తీసుకురానే పిల్ల రాక్షసి' అనుకొని "ఇప్పుడు బయట ఎక్కడ ఉంటాయి బుజ్జి చాక్లెట్స్... రేపు ష్యూర్ గా తీసుకొస్తా...సరేనా ..." అని మాట పూర్తయ్యేలోపే "పక్కనే చిట్టి కొట్టు ఉంటుంది ...అక్కడ ఉంటాయి...పోయి తీసుకురా ..." అంటూ కిందపడి కొట్టుకొంటూ ఏడవడం మొదలెట్టింది...
'ఇదేక్కడ గోలరా దేవుడా... జేబులో డబ్బులు లేవు ఇప్పుడు చాక్లెట్ ఎలా తీసుకురావాలి ...' అనుకొని ..."సరే..తీసుకొస్తా...ఒక పది నిముషాల్లో వస్తా.." అని వెళ్లబోతుంటే .. నా వెనకాలే వస్తుంది ఆ పిల్ల కూడా.. "నువ్వు నా వెనుకాల ఎందుకు అట్టి కుట్టీ... నేను తీసుకువస్తాలే ..." అన్నాను పళ్ళు పటపటా కొరుకుతూ... "అమ్మా...నువ్వు అటునుంచి అటే వెళ్ళిపోతే ఎలాగా... నువ్ నాకు చాక్లెట్ కొనిచ్చే దాకా నేను నీతోనే వస్తాను .." అంది... 'ఒసినీ...నా తోడంత లేవు నేకెన్ని తెలివితేటలే.. నువ్వు ఫ్యూచర్ లో ఎంత మందిని ముంచుతావో..' అనుకొని .."సరే బంగారం...నీ ఇష్టం.." అన్నాను...

ఇద్దరం కల్సి మా క్లాస్ దాకా వచ్చాం... నేను, నా సెకండ్ క్లాస్ గర్ల్ ఫ్రెండ్ మిస్ పిల్ల రాక్షసి...
"చూడు బంగారం... నువ్విక్కడే ఉండు, నేను నా బ్యాగ్ లో డబ్బులు తీసుకొని ఇప్పుడే వస్తా... ఆ తర్వాత ఇద్దరం కల్సి జాం జాం అంటూ చిట్టి కొట్టుకి వెళ్దాం ...సరేనా?"
"నువ్ లోపలికి వెళ్లి రాకపోతే ..?"
'పెద్దయ్యాక నిన్ను ఎవడు చేసుకుంటాడో కాని సర్వనాశనం ...' అనుకొని "అప్పుడు లోపలి రావడానికి నువ్వున్నావ్ గా ..." అంటూ లోపలికి వెళ్లాను ...

"సురేష్ గా ...ఓ పది రూపాయలు ఉంటే ఇవ్వరా ...రేపిస్తా .." అన్నాను క్లాస్ లోపలికి వెళ్తూనే సురేష్ గాడితో ...
"పది రూపాయలా... అంత డబ్బు ఎందుకురా?"
"అదిగో బయట నిల్చుందే... ఆ అమ్మాయికి చాక్లెట్ కొనాలి..."
"ఆ దెయ్యం పిల్లకి చాక్లెట్ కొనడానికి నన్ను పది రూపాయలు అడుగుతావా? .."
"ప్లీజ్ రా... అది మన బయాలజీ మేడం పుత్రికారత్నం అని తెలియక దానితో పెట్టుకున్నాను...దానికి ఇప్పుడు చాక్లెట్ కొనివ్వకపోతే, రేపు ఆ మహంకాళికి నన్ను మేతగా వేస్తుంది... ప్లీజ్ రా ..."
"ఆహా... నా దెగ్గర లేవురా ... ఇందాకే నోట్స్ కొన్నాను .. "
"నీ తింగరి మొహంలో నా బొంగరం... ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా... ఇంత హిస్టరీ నీకు అవసరమా ..." అన్నాను తిక్కరేగి... అమ్మాయిల్లో కొంచెం మంచి అమ్మాయిలా కటింగ్ ఇచ్చే అరుణ దెగ్గరికి వెళ్లి "అరుణా ...అరుణా...మరే ...నాకు ఒక పది రూపాయలు ఇవ్వవా ..." అన్నాను బెంచ్ మీద గోరుతో గీకుతూ ...
"అర్జెంటా ... సరే మరి నాకు రేపు ఇచ్చేస్తావా ..."
"ఖచ్చితంగా... అంతగా దొరక్కపోతే ఆ కనపడే దెయ్యం పిల్లని సంతలో అమ్మేసి అయినా సరే పది రూపాయలు నీకు ఇచ్చేస్తాను రేపు ..." అని మొత్తానికి పది రూపాయలు సాధించేసి బయటకి వచ్చి ఆ దెయ్యం పిల్ల వైపు చూశా "ఇక వెళ్దామా.." అన్నట్లు ...
"సరే ... రా .." అన్నట్లు ఓ లుక్కిచ్చి ముందుకు కదిలింది ...
"నీ పేరేంటి బంగారం ..."
"పేరు చెప్తే కాని చాక్లెట్ కొనిపెట్టవా ..."
'దీనికి ఈ ఏజ్ లోనే ఇంత ఎటకారం ఉంటే... నా ఏజ్ కొస్తే ఓ రేంజ్ లో ఆడుకుంటది జనాల్ని ... ఆ బయాలజీ మహంకాళి నోట్లోంచి ఊడిపడింది పిల్ల దెయ్యం ...' అనుకుంటూ "రోజుకి ఎన్ని చాక్లేటు తింటావ్ బుజ్జీ ... మరీ ఎక్కువ తినకు .. పళ్ళు పుచ్చిపోతాయి ..ఇప్పుడున్న సైజుకి డబల్ అవుతావ్ .." అన్నాను...
"టెన్ రూపీస్ చాక్లెట్ కి ఇంత బిల్డప్పా... " అని ఆ పిల్ల పిశాచం అనడంతో దెబ్బకి షాక్ తగిలి షేక్ అయ్యాను ... ముస్కోని దాన్ని ఫాలో అయ్యాను ...

ఆ చిట్టి కొట్టు దెగ్గరికి వచ్చాం ...
"డైరీ మిల్క్ బార్ ఇవ్వవా..." అడిగింది పిల్ల దెయ్యం ...
"డైరీ మిల్క్ అయిపోయ్యాయి ... ఫైవ్ స్టార్ ఇవ్వనా .." అంది చిట్టి కొట్టు చిట్టి ...
"వద్దు ... పోనీ కిట్ క్యాట్ ఉందా ... " ఛాయిస్ మార్చింది పిల్ల దెయ్యం ఈ సారి ...
"ఆ ఉంది ..." అంటూ కిట్ క్యాట్ ఇచ్చి "పది హేను రూపాయలు .." అంది ...
నేను ఖంగుతిని "పదిహేనా ...నా దెగ్గర పది రూపాయలే ఉన్నాయి ... వేరే ఏమైనా తీసుకో పది రూపాయల్లో" అన్నాను
"నాకు తెలీదు... నాకు కిట్ క్యాట్ కావాలీ... నాకు కిట్ క్యాటే కావాలీ...ఆ ...అమ్మా ...వావావా ..." మళ్ళ్లీ సైరెన్ మొదలెట్టింది ...
"నా దెగ్గర పది రూపాయలే ఉన్నాయి బుజ్జి కానీ అది పదిహేను అని చెప్పింది కదా ఆవిడ... మరి ఏం చెయ్యను ..."
"అదా ... ఒక పని చెయ్యి ... చిట్టికి మిగతా అయిదు రూపాయలు రేపు ఇస్తా అని చెప్పు ..." అంది ..
"అలా ఇవ్వరు బుజ్జీ ... మనల్ని అలా నమ్మి ఎలా ఇస్తారు ..నేను ఆమెకి తెలియదు కదా .." అన్నాను ..
"మరి నమ్మాలంటే ఏం చెయ్యాలి .."
"జనరల్ గా అయితే మన దెగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదన్నా వాళ్ళ దెగ్గర పెడితే అప్పుడు నమ్మి ఇస్తారు ..." అన్నాను ఆ పిల్లకి గొప్ప విషయాన్ని బోధిస్తున్నట్లు ఫీల్ అయిపోయి ... మామూలు పిల్లలు అయితే విని ఓహో అంటారు ...కానీ ఇది పిల్ల పిశాచం కదా అందుకే .."అయితే నీ వాచ్ చిట్టి కొట్టులో పెట్టి కిట్ క్యాట్ తీసుకుందాం ...రేపు నువ్ ఫైవ్ రుపీస్ ఇచ్చేసి నీ వాచ్ తీసుకో ..." అంది ... ఒక్కసారిగా నా మట్టి బుర్రలో కూడా విధ్యుతాఘాతం జరిగింది ... సర్క్యూట్లు అన్ని పేలిపోయాయి ... ఎక్కడి కనెక్షన్లు అక్కడే తెగి అవతల పడ్డాయి .... ఒక్క రెండు నిముషాలు నేను ఈ ప్రపంచానికి చెందిన వాడిని అనే విషయం మర్చిపోయాను ....తెలివి వచ్చిన వెంటనే అది చెప్పిన విషయం గుర్తొచ్చి సర్ ర్  ర్ మని వచ్చిన కోపానికి సలసల మరిగింది నా రక్తం...

"ఏంటే...నీ చాక్లెట్ కోసం నేను నా వాచ్ తాకట్టు పెట్టాలా ... పిల్ల కొరివి దెయ్యమా ... నువ్ ఏం చేసుకుంటావో చేసుకో ... నేను నీకు కనీసం న్యూట్రిన్ ఆశ చాక్లెట్ కూడా కొనిపెట్టను పోవే " అన్నాను ఆవేశంగా ...
అది మళ్ళీ రాగం మొదలెట్టింది ... నేను ఆ రాగానికి తాళం వేశాను తప్పితే తగ్గలేదు ...
ఇక ఏమనుకుందో అదే కాళ్ళ బేరానికి వచ్చింది ... " సరేలే ...ఫైవ్ స్టార్ కొనిపెట్టు .." అంది ...
'ఏం కళలున్నాయే నీ దెగ్గర ... అందితే తల లేకపోతే తోక ..' అనుకొని ఫైవ్ స్టార్ కొని దాని మొహాన కొట్టి ...చకచకా నడుచుకుంటూ స్కూల్ ప్రాంగణంలోకి వచ్చాను ....బయాలజీ మహంకాళి ఎవరినో వంగోబెట్టి బాదుతుంది ... "ఈ రోజు వీడు అయిపోయాడు ....రేపు ఎవడో ?" అనుకుంటూ క్లాస్ కెళ్ళాను ...

                                                                **** మరుసటి రోజు *****

"ఏరా మా అమ్మాయిని కొట్టావంట... దాని బొమ్మని పగలగొట్టావంట... మాట్లడకుండా సైలెంట్ గా చదువుకుంటుంటే వచ్చి అరిచావంట... వళ్లెలా ఉంది.." అంది బయాలజీ మేడం నన్ను చూడగానే నా దెగ్గరికి వచ్చి ...
నాకు వాల్యుమ్ లేదు... 'అదేంటి ఈ పిల్లకి పది రూపాయల చాక్లెట్ కొనిపెట్టినా ఈ మహంకాళికి అడ్డమైనవన్నీ చెప్పేసిందనమాట.. కొరివి దెయ్యమా అయిపోయావే..' అనుకొని "అయ్యో అదేం లేదు మేడం ... నేను అలా ఎందుకు చేస్తాను ... పాప కొంచెం చిలిపి... అందుకే అలా చెప్పింది .." అన్నాను ...
"పాప చిలిపో... నేను చిలిపో రేపు బయాలజీ ఎగ్జాం రిజల్ట్స్ లో తెలుస్తుంది నీకు .... దానికోసమే దుడ్డు కర్ర రెడీ చేశా ..." అంది నా వైపు అమ్మోరికి బలిచ్చే మేకను చూసినట్టు ...

నాకు మహంకాళి చెప్పిన మాటలకు భయం కన్నా ఆ పిల్ల పిశాచం చేసిన మోసమే నాలోని ఎస్పీయల్ ని ఉస్కో అని లేపింది ... యుద్ధ రంగంలోకి దూకినట్లు ఆ పిల్ల పిశాచం ఉండే సెకండ్ క్లాస్ వైపు లంఘించాను... క్లాస్ లో అడుగెట్టి చుట్టూ చూశాను .. ఆ పిల్ల చాక్లెట్ తింటూ బొమ్మకి వాటర్ బాటిల్ లోని నీళ్ళు గుమ్మరించి స్నానం చేయిస్తుంది ... నాకు తిక్కరేగి దాని దెగ్గరికి వెళ్లి .. "ఏమే పిల్ల పిశాచమా ... నిన్న పది రూపాయల చాక్లెట్ కొనిపెట్టినా కూడా మీ అమ్మకి నా మీద లేనిపోనివి చెప్తావా ... ఏమనుకున్నావే నా గురుంచి .."
"నువ్వేమనుకున్నావ్ ... నాకు కిట్ క్యాట్ కొనకుండా ఫైవ్ స్టార్ కొంటావా ...పైగా నన్నుదెయ్యం పిశాచం అంటావా ... అందుకే అమ్మకి చెప్పా ..." అంది నా వైపు కూడా చూడకుండా ...
నాకు బీపీ రైజ్ అయ్యి ఆ పిల్ల బొమ్మని మళ్ళీ లాక్కొని ఈ సారి నేరుగా కిటికీ గుండా విసిరి అవతలికి వేసాను .. అంటే, కిటికీ అవతలికి వెయ్యాలనుకోలేదు ...కానీ నా కోపం అది ఇంధనంగా చేసుకొని అలా వెళ్ళిపోయింది అనమాట ... అప్పుడు సడన్ గా తెలిసొచ్చింది నేను చేసిన తప్పు... ఈ పిల్ల పిశాచం కింద పడి దొర్లి దొర్లి ఎడుస్తుంది... నాకు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది .. ఈ లోపు ఆ క్లాస్ సీపియాల్ గాడు "సార్ నేమ్స్.." అంటూ నా చేతిలో ఒక కాగితం పెట్టాడు ... అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని మా క్లాస్ అరుణ దెగ్గరికి వెళ్లాను ....ఈ సారి పదిహేను రూపాయలు అడగడానికి....


See you all soon, have a great day ------------------------------- Ramakrishna Reddy Kotla

Wednesday, October 20, 2010

తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ... 2

"అమ్మాయిని ఏమన్నా అడగాలి అనుకుంటే అడుగు బాబూ..." అన్నాడు పిల్ల తండ్రి పైపంచె సర్దుకొని జరిగి కూర్చుంటూ...
"నేను అమ్మాయితో మాట్లాడాలి....ఏకాంతంగా..." అన్నాడు సుధాకర్..
ఆ మాటకి ఆ అమ్మాయి తలెత్తి వాడి వైపు చూసింది భావరహితంగా...
"మన పెరటిలోకి వెళ్లి కాసేపు మాట్లాడుకొని రండమ్మా..." అంటూ కూతురికి చెప్పాడు..
ఆ అమ్మాయి, సుధాకర్ పెరటి లోకి వెళ్ళారు...

"అబ్బో...మీ పెరటిలో చాలా రకాల చెట్లు ఉన్నాయే...ఓహో నిమ్మ చెట్టు కూడా..."
"అది...ఉసిరి" అందామె పెదాలు విడివడకుండా నవ్వీనవ్వనట్లుండి..
"ఉసిరా...ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మా బామ్మ వాళ్ళింట్లో..పెద్దయ్యాక చాలా మారిపోయింది సుమండీ...అందుకే గుర్తుపట్టలా.." అంటూ కొంచెం ముందుకు వెళ్లి "ఓహో...నాకు దానిమ్మ అంతే ఎంత ఇష్టమో..." అన్నాడు ఓ చెట్టు పైకి తదేకంగా చూస్తూ...
"అది...బత్తాయి.." అంది...
"ఆ...ఆ...బత్తాయే...పండు దూరంగా ఉంది కదా...సైజూ...షేపు సరిగ్గా అర్థంకాలా..." అనుకుంటూ చుట్టూ చూసి..అటు ప్రక్కగా ఏదో చిన్న చెట్టు కనిపించగా దాని దెగ్గరికి వెళ్లి దానికి కాసిన చిన్న చిన్న పండ్లను ఓ రెండిటిని తెంపాడు..."రేగ్గాయలు తిని ఎన్ని రోజులయిందో..." అనుకుంటూ నోట్లో పెట్టుకోబోతుంటే...
"చస్తారు..." అన్న మాట బుల్లెట్ లా రావడంతో పండు తినబోయిన వాడు ఖంగుతిని ఆమె వైపు చూశాడు ...."అయ్యో...అవి తినకండీ..చచ్చిపోతారు...అవి రేగ్గాయలు కాదు..అవి విషపు ఫలాలు..మా నాన్నారు ఎక్కడినుంచో తెచ్చి అవి నాటారు...ఈ మధ్య కుక్కలూ పందులూ పెరటి మీద పడి దొరికిన పండు తింటుంటే, అవి నాటారు...ఒక్కసారి ఆ పళ్ళు తింటే అవి మళ్ళీ మా పెరటి వంక చూడవు..." అంది కంగారుగా ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అని...సుధాకర్ కి తనని కుక్కలు పందులతో పోల్చిందేమో అన్న అనుమానం వచ్చింది..

సుధాకర్ మనస్సాక్షి వెంటనే వాడి ముందు అక్కడే ప్రత్యక్షమయ్యి "థూ...నీ బతుకు...కనీసం వందో పెళ్లి చూపులు అయినా నీకు సెట్ అయ్యిద్దనే నమ్మకం నాకు లేదు...అసలు ఇక్కడ ఏం జరుగుతుంది... వ్యవసాయదారుల కార్యక్రమమా? లేక పెళ్లి చూపులా?...ఈ పండు ఏంటి.. ఆ కాయ ఏంటి.. ఆ చేట్టేంటి.. ఈ పుట్టేంటి?...అవసరమా నీకు??..పక్కన అమ్మాయిని పెట్టుకొని పక్కింటి పకోడీల వాసన గురుంచి ఆలోచించే తిండిబోతు ఎదవా...రాత్రి మొత్తం కష్టపడి రాసిపెట్టుకున్న మెటీరియల్ ని ఉపయోగించరా.."  అనడంతో వెంటనే బల్బు వెలిగి మెటీరియల్ కోసం జేబులో చెయ్యి బెట్టి బయటకి తీశాడు...అంతలో క్రిష్ణ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.."ఒరేయ్ సుధా...అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడే ముందు, ఏదో ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేసి బయటకి వెళ్లి, ఒక సారి రాసుకున్న పేపర్ మొత్తం రివైస్ చేసి...ఆ తర్వాత ఇక ఆ అమ్మాయితో అనర్గళంగా మాట్లాడు...విజయోస్తు...కళ్యాణ మస్తు.."

"ఏమిటా పేపర్..." అంది ఆ అమ్మాయి...
"ఇదా...అదీ...ఆ...మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కిట్టు అని, పెద్ద ఎదవ...సుస్మీ అనే అమ్మాయి కోసం ఏదో జావా ప్రోగ్రాం కావాలంటే పేపర్ లో రాసుకొచ్చా...తర్వాత వాడికి ఇవ్వాలి..."
"నాకు జావా బాగా వచ్చు...ఏదీ ఓ సారి చూపించండి..."
"ఆ..అదీ.. ఇంకా దీనిలో కొన్ని కరక్షన్స్ చెయ్యాలి...బాత్రూం ఎక్కడుంది?"
"బాత్రూంలో కరక్షన్స్ చేస్తారా?"
"ఛి ఛి కాదండీ...మెన్స్ ప్రాబ్లం..."
"విమెన్స్ ప్రాబ్లం విన్నాను...ఈ మెన్స్ ప్రాబ్లం ఏంటి?"
"మీరు మరీను... పరాయి అమ్మాయితో ఆ విషయాలు ఎలా చెప్పమంటారు...బాత్రూం ఎక్కడో చెప్పండీ..."

బాత్రూంకి వెళ్లి పేపర్ తీసి, మొత్తం రివైస్ చెయ్యడం మొదలెట్టాడు సుధాకర్...ఒక రెండు మూడు సార్లు మొత్తం సంతృప్తికరంగా చదివి బయటకి వచ్చాడు....
ఆ అమ్మాయి ముఖంలో ఒక విసుగు కనిపించింది సుధాకర్ కి...
"సారీ... కొంచెం లేట్ అయ్యింది.. ప్రాబ్లం కాస్త క్రిటికల్ ...అందుకనే?"
"అవునా!!...కొంపదీసి మీకు అది పని చెయ్యడంలేదా?..."
"వ్వాట్??...ఏది...??" సుధాకర్ ముఖం లో కంగారు...ఎక్కడలేని ఆందోళన...
"అదే...మా బాత్రూంలో వాటర్ టాప్ అప్పుడప్పుడు పని చెయ్యదు...అందుకే లేటేమో అనుకున్నా .."
"అదా...హమ్మయ్యా...లేకపోతే ఆ విషయం ఈ పిల్లకెలా తెలిసిందబ్బా అనుకున్నా..." అన్నాడు గుండె మీద చేయ్యేసుకుంటూ..
"ఏ విషయం....??"
"అనేశానా...బయటకి అనేశానా...ఈ మధ్య నోరు అస్సలు కంట్రోల్ లో ఉండట్లేదు...ఏమీ లేదు లెండి....ఇక మనం ఒకరి ఇష్టాఇష్టాలు మరొకరం తెలుసుకుందామా?" అన్నాడు..
"అలాగే..."
"నాకు...చికెన్ బిర్యాని అంటే చాలా ఇష్టం...నాన్ వెజ్ అంటే పడి చస్తాను..ఇంకా స్వీట్స్ అంటే చాలా ఇష్టం..మరి మీకు?"
"నేను నాన్ వెజ్ అస్సలు తినను... అదంటేనే పరమ అసహ్యం...స్వీట్స్ కూడా తినను...హాట్ అంటే ఇష్టం.." అందామె మొహం అదోలా పెడుతూ...సుధాకర్ కి మొదటి షాక్ తగిలింది...ఈ అమ్మాయి ఇలా జవాబు ఇవ్వకూడదే...ఇదేంటి రివర్స్ లో చెప్తుంది అనుకొని "నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం... అలాగే.... సందు ప్రక్కన పానీ పూరి బండీ, వర్షంలో పకోడీ, కమ్మని నూగుజీడీ, పడుకునేప్పుడు మాంచి మెలోడీ....చాలా ఇష్టం ..."అన్నాడు 
"నాకు పింక్ ఇష్టం... పానీ పూరీ, పకోడీ లాంటి జంక్ అంటే జంకు నాకు... నేను కేలరీ కాన్షియస్..." అంది...
'ఓరి బాబోయ్ ఏంటి అన్నీ ఇలా రివర్స్ కొట్టేస్తున్నాయి...నాకు మైండ్ దొబ్బి అప్పుడే మర్చిపోయానా...ఓ సారి మళ్ళీ రివైస్ చేసుకుంటే బెటర్' అనుకొని..."ఒక్క నిమిషం అండీ....మళ్ళీ బాత్రూం అర్జెంట్...ఇప్పుడే వస్తాను..." అంటూ బాత్రూంకి వెళ్లి పేపర్ ఓపెన్ చేసి, టకా టకా మొత్తం రివైస్ చేసాడు...తాను చెప్పింది మొత్తం కరెక్టే... మరి ఈ పిల్లేంటి అంతా రివర్స్ లో చెప్తుంది అనుకొని కొంచెం అయోమయంగా బయటకి వచ్చాడు...

"ఏంటి మీ ప్రాబ్లం అంత క్రిటికలా...మళ్ళీ మళ్ళీ బాత్రూంకి వెళ్తున్నారు..."
"మీరు దయచేసి ఆ ప్రాబ్లం గురుంచి ఎత్తకండి ప్లీజ్ ...ఇకపోతే నాకు క్రికెట్ అంటే చిరాకు...టెన్నిస్ చాలా ఇష్టం...షరపోవా కనిపించి చచ్చిపోవా అంటే టైం కూడా చూసుకోకుండా నా ప్రాణం వదిలేస్తా ..అంత ఇష్టం..." అన్నాడు 
"నాకు క్రికెట్ అంటే ప్రాణం... సాయిబాబా తరువాత నాకు సచినే దేవుడు... టెన్నిస్ అంటే బోర్... అస్సలు చూడను..." అంది..
సుధాకర్ నమ్మలేనట్లుగా చూస్తున్నాడు...ఈ అమ్మాయి ఏంటి అన్ని ఇలా చెప్తుంది...కృష్ణ అంతా రివర్స్ గా చెప్పాడా నాకు ఈ అమ్మాయి గురుంచి అనుకుంటూ .."మీరు జోక్ చేస్తున్నారు కదూ...మీకు క్రికెట్ అంటే చిరాకు అని నాకు తెలుసు... సచిన్ దేవుడా వాడి మొహం...పొట్టోడికి అంత లేదు...వాడి మొహానికి...." అంటున్న సుధాకర్ మాట పూర్తి కాలేదు...దవడ పగిలిపోవడం మాత్రం పూర్తయింది...

                                                            ********

చిరాగ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు....ఇక జన్మకి పెళ్లవుద్ది అన్న నమ్మకం పోయింది సుధాకర్ కి...
కృష్ణకి కాల్ చేసాడు...
"ఏమయింది సుధా..."
"దవడ పగిలింది నాధా..."
"అదేంటి??...అసలేమయింది?"
"అరవ పెళ్ళికి అరువు బ్యాండ్ మేళం అయ్యింది..."
"అర్థం అయ్యేలా చెప్పు ..."
"ఒరేయ్...నువ్వు చెప్పినట్లే అన్నీ పేపర్ లో రాసుకొని, ఆ పిల్ల ఇంట్లో బాత్రూంకి వెళ్లి మరీ రివైస్ చేశాను రా... కానీ అవన్నీ ఒక్కటి కూడా మ్యాచ్ కాకపోగా పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.. "
"అదేంట్రా....నువ్వు చెప్పిన స్రవంతి గురుంచి పూర్తిగా కనుక్కొని...ఆమె చదివే సెయింట్ ఆన్స్ కాలేజీలో ఆమె స్నేహితులు ఒక ముగ్గురు నలుగురి వద్ద అవన్నీ రూడీ చేసుకొని మరీ తాయారు చేశాను కదా నివేదిక... తప్పయ్యే ఛాన్స్ లేదు..."
"నివేదిక తయారు చేసావా...నేను వచ్చాక నిన్ను కప్పెట్టటానికి పెద్ద గోతి తయారు చేస్తాను... నేను చెప్పిన అమ్మాయి పేరు స్రవంతి కాదు వసంత... సెయింట్ ఆన్స్ కాదు సెయింట్ మేరీస్...ఆ దిక్కుమాలిక స్రవంతి సీరియల్ చూడకురా అంటే వినవు... అది చూసినప్పటినుంచి నీకు ప్రతి పేరు స్రవంతి లాగే వినిపించి ఏడుస్తుంటే మేమేం చెయ్యాలి..." అన్నాడు తలని స్టీరింగ్ కేసి బాదుకుంటూ...
"అయ్యయ్యో అవునా!!...పొరపాటు అయిందిరా...ఈ సారి మ్యాచ్ ఫిక్సింగ్ అయినా చేసి నీకు మేచ్ ఫిక్స్ చేసేస్తా చూడు..."
"వద్దు బాబు...నువ్వు ఏ ఫిక్సింగూ చెయ్యొద్దు...ఇక నాకు పెళ్ళీ కాదు...కనీసం దవడ పగలకుండా చూసుకుంటా..." అంటూ ఫోన్ పెట్టేసాడు సుధాకర్...

ప్రపంచంలోని బాధ మొత్తం తన ముఖంలో చూపిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు సుధాకర్... పెళ్ళికి పిలవని అతిధిలా వర్షం రంగ ప్రవేశం చేసింది... ఆ వర్షం చూడగానే కొంచెం ఉత్సాహం వచ్చింది సుధాకర్ కి...అసలు పెళ్లి కాకపోతే వచ్చే నష్టం ఏంటి?..అసలు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు... ముఖ్యంగా ఎదవ నస ఒకటి ఉండదు లైఫ్ లాంగ్... కింగులా బ్రతకొచ్చు... ఎవ్వరినైనా ఎప్పుడైనా సైట్ కొట్టొచ్చు... ఎంత నైట్ అయినా ఎక్కడైనా షికార్లు చెయ్యొచ్చు...ముఖ్యంగా నా సెలరీ మొత్తం నేనే ఎంజాయ్ చెయ్యొచ్చు... అసలు ఇన్ని బెనఫిట్స్ పెట్టుకొని ఇంకా పెళ్లి అంటూ చూపుల చుట్టూ తిరగడం ఎందుకు.... ఎస్...యాం లైఫ్ లాంగ్ బ్యాచ్లర్...లైఫ్ ని ఇక నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తాను... పెళ్లి చేసుకుంటే...వైఫ్..పిల్లలు...వాళ్ళకి ఫెరేక్స్ లు.. పాల డబ్బాలు... టైమూ పాడూ లేకుండా వాళ్ళు ఇంట్లో ప్రకృతి కార్యక్రమాలు వెలగబెడితే వాటిని క్లీన్ చెయ్యడాలూ..స్కూల్స్..ఫీజులు.. అమ్మో ఇలా ఆలోచిస్తే అంతే ఉండదు... అసలు హేపీగా ఇలా ఉంటే పోలా...అసలు మనం ఎవరికీ నచ్చకపోవడం కూడా మన మంచికే...ఈ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాలి...ఇలా ఆలోచిస్తుండగా...ఎవరో ఒక అమ్మాయి ...చెయ్యి ఊపుతూ లిఫ్ట్ అడగటం లీలగా కనిపించింది...
సుధాకర్ కార్ ఆపి డోర్ ఓపెన్ చేసాడు....
"చాలా థాంక్స్... వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు...కొంచెం దెగ్గరలోని బస్ స్టాప్ దెగ్గర డ్రాప్ చేస్తారా?"
"మీరు ఎక్కడికి వెళ్ళాలి?"
"పంజగుట్ట.."
"నేను అటువైపే వెళ్తున్నాను....డ్రాప్ చేస్తాను..."
"థాంక్స్..."
"ఇట్స్ ఓకే..."
డ్రైవ్ చేస్తూనే ఆ అమ్మాయిని కంటి చివరినుండి చూశాడు పరీక్షగా.... వైట్ కలర్ టాప్ బ్లూ జీన్స్.. టాప్ మీద లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా సింపుల్ గా ఉంది...వర్షంలో తడిచిందేమో హెయిర్ ని లూస్ గా వదిలింది... చేతితో మెల్లిగా హెయిర్ ని సవరించుకుంటూ ఒక్కసారిగా సుధాకర్ వైపు తిరిగింది.. దొంగచాటుగా ఆ అమ్మాయినే అబ్సర్వ్ చేస్తున్న సుధాకర్ వెంటనే సర్దుకొని డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చెయ్యడం మొదలెట్టాడు... అమ్మో ఈ అమ్మాయిలు ఆల్కహాల్ కన్నా డేంజరస్ వెంటనే అడిక్ట్ చేసేసుకుంటారు... అనుకుంటూ...డ్రైవ్ చేస్తుండగా ఒక దెగ్గర పకోడీల బండి చూసి దాని దెగ్గరిగా కార్ ఆపి...
"పకోడీలు తింటారా?" అని అడిగాడు...
"వావ్...నాకు వర్షంలో పకోడీలు తినడం చాలా ఇష్టం..." అందామె...
సుధాకర్ కి ఎందుకో ఆశ్చర్యం వేసింది... ఇందాక చూసిన పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి ఇలా చెప్పి ఉంటే బాగుండు అనుకున్నాడు..కానీ అది రివర్స్ అయ్యింది... ఇప్పుడు తనకి నిజంగానే పకోడీలు తినాలనిపించి ఆపి ఆమెని కూడా అడిగాడు... అలా ఆ టైంలో ఆమెకి కూడా పకోడీలు తినడం ఇష్టం అని తెలిసి ఆశ్చర్యం వేసినా తరువాత ఆనందం కలిగింది...
"నాకు కూడా...మీరు కార్ లోనే ఉండండీ నేను పట్టుకొస్తా..." అంటూ దిగి వెళ్లాడు...
సుధాకర్ తెచ్చిన వేడి వేడి పకోడీలు తింటూ  "వావ్... వర్షంలో పకోడీలు ఇంకా టేస్టీగా ఉంటాయి కదా... థాంక్స్ అండి.." అంది...
"డోంట్ మెన్షన్.... " అన్నాడు
"అక్చువల్ గా ఈ రోజు షరపోవా Vs సెరీనా టెన్నిస్ మ్యాచ్ ఉంది వింబుల్డన్ ఫైనల్... అది మిస్ అవ్వకూడదు అనే మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను....షరపోవా అంటే నాకు చాలా ఇష్టం ..." అంది
ఒక్కసారిగా పొలమారింది సుధాకర్ కి.... షాక్ తిన్నట్లు ఆమె వైపే చూస్తూ...ఎదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా "నాకు కూడా...షరపోవా చచ్చిపోవా అంటే టైం కూడా చూసుకోకుండా ప్రాణం వదిలేస్తా..." అన్నాడు...
"వావ్ నిజమా... మన టెస్టులు భలే కలిసాయే.." అంది నవ్వుతూ...
సుధాకర్ కి ఆమె అలా నవ్వుతుంటే చూడాలి అనిపిస్తుంది... ఒక్కసారిగా సుధాకర్ కి ఆమె చాలా అందంగా కనిపించింది...
"మీ షర్ట్ బాగుంది....ఎందుకంటే బ్లూ కాబట్టి ...నాకు బ్లూ అంటే చాలా ఇష్టం...నా వార్డ్ రోబ్ లో సగం బ్లూ క్లాత్స్ ఉంటాయి..." అంది...
"నాకు కూడా బ్లూ ఇష్టం అందుకే వేసుకున్నాను..." అన్నాడు ...నిజానికి సుధాకర్ కి బ్లూ ఇష్టం లేదు...కానీ ఈ అమ్మాయిని వదులుకోవడం కూడా ఇష్టం లేదు... ఇందాక సింగిల్ గానే లైఫ్ లాంగ్ ఉందామనుకున్న సిల్లీ థాట్ ని గాలికి వదిలేసి, గుండెలో ఈ అమ్మాయికి ఒక కుర్చీ అరేంజ్ చేసాడు ....

"నాకు చికెన్ బిర్యాని అంటే ప్రాణం...స్వీట్స్ అంటే పడి చస్తాను ...మరి మీరు? " అన్నాడు సుధాకర్ తన అంచనా తప్పు అవ్వదు అనే ధీమాతో...
"వావ్ నాకు కూడా... నిజంగా మన అబిప్రాయాలు ఎంత బాగా కలిశాయో కదా..." అంది చిన్న పిల్లలా నవ్వుతూ...
ఆ క్షణం సుధాకర్ కి తెగ ముద్దొచ్చింది ఆ అమ్మాయి ... ఎంత కష్టమైనా సరే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు స్టీరింగుని బలంగా నొక్కుతూ....
కాసేపు...అవి ఇవీ మాట్లాడుకున్నాక పంజగుట్ట వచ్చారు...
"ఇక్కడ ఆపండి...దెగ్గరే మా ఇల్లు ...చాలా థాంక్స్ " అంది..
"మీ పేరు అడగటం మర్చిపోయాను .." అన్నాడు
"స్రవంతి"
"మీ కాలేజీ ..." అని అడిగాడు కృష్ణ చెప్పిన స్రవంతి పేరు గురుంచి ఆలోచిస్తూ
"ఏం...కాలేజీకి వచ్చేస్తారా ...సెయింట్ ఆన్స్ .." అంది నవ్వుతూ ....
సుధాకర్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ...

                                           *******

కళ్యాణ మండపం బంధుమిత్రులతో సందడి గా ఉంది...
కృష్ణ గాడు సరాసరి సుధాకర్ రూమ్ కి వచ్చాడు ...
"ఏరా...పెళ్ళికి కనీసం మూడు రోజుల ముందు రమ్మంటే ...కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడా రావడం .." అన్నాడు సుధాకర్ కృష్ణని చూసి ...
"నువ్వు మాత్రం ...ఆరోజు నేను చేసిన మిస్టేక్ కి ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉండి...సడన్ గా నా పెళ్లి అంటే నాకు ఎలా ఉంటుందిరా ..." అన్నాడు నొచ్చుకుంటూ ...
"సారీరా అన్నీ అలా ఫాస్ట్ గా జరిగిపోయాయి ..."
"హమ్...అది సరే...నువ్వు ఆ రోజు ఫోన్ లో తిట్టిన తిట్లకు స్రవంతి సీరియల్ చూడటం మానేశాను రా...కానీ అదేంటో, ఎవరు ఏ పేరు చెప్పినా స్రవంతి అని వినపడటం పక్కన పెడితే, ఏ పేరు రాసినా స్రవంతిలా కనిపిస్తుందిరా బాబూ....ఆ సంఘటన ఇప్పుడే జరిగింది ...నీ పెళ్లి మండపంలోనే ... సుధాకర్ వెడ్స్ స్రవంతి అని కనిపించిందిరా నాకు ..."
ఆ మాటకు ఫక్కున నవ్వాడు సుధాకర్ ..
"చూడు ముకుందా...నా పెళ్లి జరిగేది స్రవంతి అనే అమ్మాయితోనే...నీకు ఇంకో ఇంటరెస్టింగ్ విషయం చెప్పనా ...ఆ రోజు నా పెళ్లి చూపులకోసం నువ్వు ఇన్ఫర్మేషన్ లాగిన స్రవంతి....ఇప్పుడు నేను చేసుకోబోతున్న స్రవంతి ఒక్కరే... నువ్వు వసంత గురుంచి లాగాల్సిన ఇన్ఫర్మేషన్ స్రవంతి గురుంచి లాగడంతో ఆ పిల్ల లాగి దవడ పగలగొట్టింది.....కానీ అదే ఇన్ఫర్మేషన్ ఈ రోజు నా పెళ్ళికి కారణం అయ్యింది ..." అన్నాడు ..
దెబ్బకి షాక్ తిన్నాడు కృష్ణ...
"అదెలా?"
"తాళి కట్టి వచ్చాక తీరిగ్గా చెప్తాను ....నువ్వెళ్ళి భోజనం చెయ్యి....అటు వైపు ...లెఫ్ట్ కి ...."

                                                    ****** నమస్తే *******       
Hope you all had a great Dussehra and enjoyed the festival ---- Ramakrishna Reddy Kotla