Monday, September 27, 2010

తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకోమన్నదీ నిన్ను తన చేయి.."

రివైండ్...ప్లే...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకోమన్నదీ నిన్ను తన చేయి.."

రివైండ్...ప్లే...

"తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అందుకో...."

"ఎన్నిసార్లు అందుకోమంటుందిరా తన చేయి...ఏం పాపం నడుమునోప్పులా...లేవలేదా..." అన్నాను స్టీరియో ఆపుచేస్తూ...
"నేను సీరియస్ ..జోకులు ఆపు..." బుంగమూతి పెట్టాడు సుధాకర్..
"అబ్బో...అట్టాగాండీ..రేణిగుంట రైల్వేస్టేషనులో ప్లాట్ఫారం టీవీలాగా నిముషానికి ఓ సారి పాటలో పల్లవేసి అడ్వర్టైజుమెంట్లు వేసి రివైండ్ చేసి మళ్ళి అదే పల్లవి వేస్తుంటే...ఇందాకే ఎర్రగడ్డకి కాల్ చేద్దామని ఎందుకో ఆగిపోయా..."
కోరకోరా చూశాడు సుధాకర్...

"లేకపోతే అరిగిపోయిన రికార్డులా..తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ...అంటూ పదే పదే అదే వాయించి సంపుతున్నావ్...ఫ్రెష్ గా పిచ్చెక్కిందా...మీ నాన్న కొత్త సంబంధం ఏమన్నా తేచ్చాడా ఏమిటీ..." అన్నాను నవ్వు ఆపుకుంటూ...
"ఇక నాకు పెళ్లి జరుగుతుంది అన్న ఆశ చచ్చిపోయిందిరా కృష్ణా...ఆ పాటలో లాగా ఏదన్నా తెలుగమ్మాయి తన చేయి అందుకోమంటుందేమో అన్న ఆశతో అదే లైన్ అన్ని సార్లు వింటున్నానురా..."
"హమ్...ఏంటీ మళ్ళీ ఫ్లాపా..."
"అది నా ఫేస్ చూస్తే తెలియట్లేదటరా...."
"తెలుస్తుంది...అరకేజీ ఆముదం త్రాగినట్లుంది..."
"మరే...నిజమే...ఏమిటో ఏ అమ్మాయికీ నేను నచ్చడం లేదురా...ఎందుకో..త్వరలో అర్థసెంచురీ పూర్తి అయ్యేలా ఉంది సంబంధాలలో..."
"నువ్వు నచ్చకపోడానికి ఏముంది..చూడ్డానికి పర్లేదు బాగానే ఉంటావు...సాఫ్టువేర్ జీతగాడివి..బట్టతల లేదు..అంత పొట్టీ కాదు..."
"ఏమోరా...అదే తెలియడం లేదు..ఇంటర్వ్యు అయ్యాక ఫీడ్ బ్యాక్ అడగొచ్చు..పెళ్లిచూపులు అయ్యాక ప్రాబ్లం ఏంటని అడగలేం కదా..."
"అడగాలి...అప్పుడు ప్రాబ్లెం ఏంటో తెలుస్తుంది..దాన్నిబట్టి తర్వాత మ్యాచ్ కి నెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.."
"ఏమోరా...అడగాలంటే అదోలా ఉంటుంది, ఏం వినాల్సివస్తుందో అని..నేను మీకు ఎందుకు నచ్చలేదు అని అడగటం చాలా కష్టమైన పనిరా కృష్ణా..."
"కష్టం లేనిదే సుఖం లేదు...చీకటి లేనిదే వెలుతురు లేదు...కోడిపిల్ల లేనిదే చికెన్ బిర్యానీ లేదు..."
"ఆడపిల్ల లేనిదే నాకు పెళ్ళీ కాదు...సోదాపి సమస్యకో మార్గం చెప్పు ముకుందా.." వేడుకోసాగాడు సుధాకర్..


"నువ్వు చివరిసారిగా షూటింగ్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఎవరు..."
"పేరు శ్వేత...హైదరాబాద్ లో వర్కింగ్.."
"ఆ అమ్మాయి నంబర్ ఉందా..."
"నాదేగ్గర లేదు...మా నాన్న దెగ్గర ఉంది..అది కూడా వాళ్ళ ఇంటి నంబరు..."
"గాలి గొట్టంలా ఎదిగావ్...ఆ మాత్రం షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఏదోలా నంబర్ తీసుకోవాలని తెలీదా..సరే, నువ్వు షూటింగ్ కి వెళ్ళిన హీరోయిన్లలో ఏ హీరోయిన్ నంబర్ అయినా ఉందా..."
"ఆ ముగ్గురిది ఉంది..."
"గుడ్...మొదటి హీరోయిన్ కి కలుపు..."
"ఏంటి కలిపేది బ్రూ కాఫీ...ఆ పిల్ల నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది.."
"పాపి కొండల్లో పాప్ కార్న్ అమ్ముకొనే పాపిష్టి సుంఠ...ఆ పిల్ల మర్చిపోతే నువ్వు గుర్తుచేయ్యి...ముందు కలుపు.."
చేతులు వణుకుతుండగా, సుధాకర్ ఆ అమ్మాయికి ఫోన్ కలిపాడు...


"హలో.."
"హలో...నా పేరు సుధాకర్ అండి..నేను "
"ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ పర్సనల్ లోన్స్...డోంట్ వేస్ట్ మై టైం.."
"ఛీ ఛీ...నేను క్రెడిట్ కార్డులో..పర్సనల్ లోన్లో అమ్ముకొనేవాడిని కాదండీ...నేను.."
"కన్సల్టెన్సీ నుండి కాల్ చేస్తున్నావా..యాం నాట్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్.."
"హబ్బా...నన్ను చెప్పనివ్వండి...నేను మిమ్మల్ని.."
"కొంపదీసి ప్రేమిస్తున్నావా...టూ లేట్ నాకు ఈ మధ్యనే పెళ్లయింది.."
"ఓరి భగవంతుడా..."
"ఏంటీ నాకు పెళ్ళయితే అదేదో పాపంలా ఓరి భగవంతుడా అంటున్నావ్...వళ్లెలావుంది..."
"అయ్యో నేనలా అనలేదండీ..మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు..."
"నిన్ను నేను ఎందుకు అర్థం చేసుకోవాలి...ఎవడివి నువ్వసలు.."
"హమ్మయ్యా...ఇప్పుడైనా ఎవడని అడిగారా..సంతోషం..నా పేరు సుధాకర్...నేను.."
"సుధాకర్ నువ్వా...ఎన్ని రోజులకి చేశావ్..భార్గవి బాగుందా..నీ గొంతు గుర్తుపట్టలేదు సుమీ..ఏమనుకోకు..మా అయన రోజూ అంటున్నాడు, ఈ సుధాకర్ అసలు కాలే చెయ్యట్లేదు అని..రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారటగా మా ఆయన దెగ్గర..పాపం ఆయనకీ అవసరమట..మీ దెగ్గర ఉంటే ఇచ్చేయండీ.."
"రెండు లక్షలా!!...ఏవండీ మీరు ఏదీ పూర్తిగా వినడం లేదు...నేను రెండు లక్షల్ని కాదండీ...ఛి ఛి..నేను సుధాకర్ ని కాదండీ...ఛి ఛి...నేను మీరనుకునే సుధాకర్ కాదండీ.."
"కాకపోతే ఎందుకు చేశావ్...ఈవ్ టీజింగ్ కేస్ పెట్టమంటావా!!.."
"వామ్మో..కాదండీ..ఒక్క సెకండ్ నేను చెప్పేది వినండీ...ఒక ఆరేడు నెలల క్రితం మిమ్మల్ని పెళ్లి చూపులు చూశాను నేను..నా పేరు సుధాకర్..అదే, మీ ఇంట్లో పాలకోవా, మైసూర్ పాక్ బాగున్నాయి అని చెప్పి నా ప్లేటే కాకుండా మా చెల్లి ప్లేట్ మా అమ్మ ప్లేట్ కూడా లాగేసుకొని తిన్నాను...గుర్తుందా..."
"దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు...అపుడేప్పుడో పెళ్లి చూపులు చూస్తె, ఇప్పుడు కాల్ చేశావేం.. ఓసారి ఎప్పుడో అనుకున్నట్లు గుర్తు పెళ్లి చూపులకి ఓ కుక్క బ్యాచ్ వాడు వచ్చాడు అని...బహుసా నిన్నేనేమో..."
"ఆ...అదీ...మరి...మీరు మరీను...ఎదో బాగున్నాయి అని తిన్నాను అంతే..అది మీకు కాంప్లిమెంటే..ఇంతకీ నేను ఫోన్ చేసిన కారణమేమిటంటే.."
"ఏముందీ...ఇంట్లో తిని కూర్చుని ఉంటున్నట్లున్నావ్..పని పాటా లేక కాల్ చేశావ్.."
"ఏమండీ..మీరు మరీ అలా అనకండీ..నన్ను పెళ్లి చూపులు అయ్యాక మీరు రిజక్ట్ చేశారు..దానికి కారణం తెలుసుకుందామని కాల్ చేశా..."
"అవునా..మరి ఇన్ని నెలలూ గాడిదలు మేకలూ కాశావా..ఇప్పుడే జ్ఞానోదయం అయిందా..అసలు నువ్వే నాకు గుర్తులేదు, ఇంకెందుకు రిజక్ట్ చేసానో ఏం గుర్తుంటుంది.."
కీక్...కీక్...

"ఏంట్రా పెట్టేసావ్..." అడిగాను నేను..
"ఒరేయ్ ఈ పిల్ల చాలా డామేజింగ్ గా మాట్లాడుతుందిరా..నా మనోభావాలు మంటల్లో కాలి బూడిద అయిపోయాయి..అది రిజక్ట్ చేసి మంచి పని చేసింది..లేకపోతే దానితో రెండు నిముషాలు ఫోన్ లోనే వేగలేకపోయాను..ఇక లైఫ్ లాంగ్ అయితే..అమ్మో..అసలు ఆ పిల్ల చెప్పేది ఏదీ పూర్తిగా వినదేంట్రా అదేం రోగమో..."
"అది రోగం కాదు డామినేషన్...నువ్వు చెప్పేది వినకుండా తను చెప్పేది నువ్వు వినాలి అనుకునే డామినేషన్...ఇలాంటి డామినేషన్ అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే,ఇత్తడే ఇక లైఫ్ అంతా...సరేలే కానీ, ఇంతకీ ఎందుకు రిజక్ట్ చేసిందో చెప్పిందా?"
"లేదురా...దానికి నేను అసలు గుర్తులేనంటా.."
"హమ్...ఉన్న నంబర్లలో రీసెంట్ గా చూసిన అమ్మాయి నెంబర్ కి కొట్టు..కొంచెం స్టైలిష్ గా మాట్లాడు..."
"అలాగే...సుప్రియ ఫ్రం సత్తెనపల్లి...దీనికి చేస్తున్నా..ఓ రెండు నెలల క్రితం చూసిన షూటింగ్ హీరోయిన్.."

"హలో..."
"యా హలో...దిస్ ఈజ్ సుధాకర్ ఫ్రొం విప్రో..యాక్చువల్లీ..."
"హలో...దిస్ ఈజ్ సుప్రియా..ఐ హావ్ డన్ బీటెక్ ఫ్రం నాగార్జున యునివర్సిటీ...అయాం ఫ్రం CSE బ్రాంచ్, ఐ హావ్ సెవెంటీ ఫైవ్ పెర్సెంట్ ఆగ్రిగేట్..మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, వాషింగ్ క్లోత్స్...అండ్..."
"అండ్...క్లీనింగ్ ఇల్లు...తోమింగ్ పళ్ళు..రుద్దింగ్ వళ్ళు...ఇంకేమీ లేవా??.మీ బయోడేటా నాకెందుకు చెప్తున్నారండీ.." విసుగు సుధాకర్ గొంతులో..
" ఇంటర్వ్యు చేసేప్పుడు బయోడేటా చెప్పాలి కదండీ.."
"ఇంటర్వ్యు ఏంటీ??"
"మీరు నన్ను ఇంటర్వ్యు చెయ్యడానికి కాల్ చెయ్యలేదా?"
"నా బొంద...ఎవరూ చెప్పేది సరిగ్గా వినిపించుకోరే...నేను మిమ్మల్ని ఈ మధ్య పెళ్లి చూపులు చూసాను...నా పేరు సుధాకర్...అదే మీ ఇంట్లో గారెలు పెట్టినప్పుడు దాని రంధ్రంలొ గులాబ్ జామ్ కూరుకొని తిన్నాను..గుర్తొచ్చిందా..మీరు నన్ను రిజక్ట్ చేసారు..అందుకు గల కారణం చెప్తారా.."
"ఏమోనండీ...నాకేం తెలుసు...మా నాన్నారు ఈ అబ్బాయి నీకు సరిపోడు..ఇంకో అబ్బాయిని చూద్దాం అంటే..అలాగే మీ ఇష్టం నాన్నారు అనేసి..."
"అనేసి వెళ్లి హాయిగా దుప్పటి కప్పుకొని బబ్బున్నావా...పెళ్లి చేసుకునేది నువ్వే కదా, మీ నాన్న ఎవరూ రిజక్ట్ చెయ్యడానికి...ఇకనయినా పెళ్లిలొ నీ నిర్ణయాలు నువ్వు తీసుకో.."
కీక్...కీక్...

"హమ్...లాభం లేదురా కృష్ణా...వర్కవుట్ అవ్వడం లేదు..."
"ఇలా కాదురా సుధా...ఒకపని చెయ్యి...ఈ సారి పెళ్ళిచూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నంబరు తీసుకో..ఒకవేళ ఆ అమ్మాయి రిజక్ట్ చేస్తే, వెంటనే అప్పుడే కాల్ చేసి అడుగు..సరేనా?"
"అలాగే..."

                                                          ****
"హలో.."
"హలో..నా పేరు సుధాకర్...నిన్న మిమ్మల్ని పెళ్లి చూపులు చూసాను కదా..మీరు నన్ను రిజక్ట్ చేసారు..కారణం ఏంటో తెలుసుకుందామని కాల్ చేశా.."
"సూటు బూటు వేసుకొని టిప్ టాప్ గా రావడమే కాదు...ప్యాంట్ కి జిప్ వేసుకున్నామా లేదా అని కూడా చూసుకోవాలి..దీన్ని బట్టి మీరు చిన్న చిన్న విషయాలలో చూపే అశ్రద్ధ కనిపిస్తుంది..అది నాకు నచ్చలేదు...పైగా, మీ ఎదురుగా నన్ను కూర్చోపెట్టారు..తల దించుకొని మీ వైపు చూస్తుంటే, సరిగ్గా వోపెన్ పోస్ట్ బాక్స్ కనిపించింది..దెబ్బకి షాక్ తగిలి తల పైకెత్తి మీ వైపు చూస్తుంటే, ప్రక్క నుంచి మా అమ్మ..అలా మరీ తలెత్తి చూడకు పొగరు అనుకుంటారు..కొంచెం తలదించి తన వైపే చూడు అని గుసగుసలు..నేనేమో తలెత్తలేక..దించి ఆ సీన్ చూడలేక చాచ్చాననుకో అరగంట సేపు.."
సుదాకార్ ఆ మాటతో సిగ్గుతో చితికి ఫోన్ పెట్టేసాడు...ఈ సారి పెళ్లి చూపులకి జిప్ పెట్టుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..అంతేకాదు...చిన్న చిన్న విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని సంకల్పించుకున్నాడు...

                                                         ****
తరువాతి పెళ్లి చూపులకు జిప్ పెట్టుకోవడం మర్చిపోకుండా వెళ్ళినా కూడా రిజక్ట్ చెయ్యబడ్డాడు సుధాకర్..
"హలో..."
"నేను సుధాకర్ ని...నిన్న పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసాను..నన్నెందుకు రిజక్ట్ చేసారు?"
"మీ చూపులు నాకు నచ్చలేదు...పెళ్లి చూపుల్లోనే సిగ్గులేకుండా అలా చూస్తే..ఇక మాములుగా మీరు ఎందరిని ఎలా చూస్తారో...మీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది..."
"నేను చూసానా...ఏం చూసాను...అసలు ఏమన్నా చూపించవా చూడ్డానికి...కింద నుంచి పైదాకా చీర చుట్టాక ఇంకా ఏముంటుంది చూడ్డానికి నా బొంద..."
"అదే..అదే..మీ మగ బుద్ది...నేను కావాలనే మీరు కూర్చున్న సోఫా ఎదురుగా ఉన్నా అలమరాలొ ప్లే-బాయ్ మ్యాగజైన్ పెట్టాను..పెళ్లి చోపుల్లో మీరు నన్ను పది సార్లు చూస్తే, మ్యాగజైన్ లొ బర్త్ డే సూట్ లొ ఉన్నా అమ్మాయిని వంద సార్లు చూసారు...నేను గమనిస్తూనే ఉన్నాను..." అంది 
సుధాకర్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...
ఫోన్ పెట్టేసాడు...ఈ సారి పెళ్లి కూతురిని తప్ప ఎవరినీ చూడకూడదు అని మళ్ళీ సంకల్పించుకున్నాడు...

                                                      ****

"ఆదిరా కృష్ణా జరిగింది..."
"మరేం పర్లేదు...పర్స్ మర్చిపోయినట్లు ఒక్కోసారి జిప్ పెట్టుకోవడం మరచిపోతుంటాం....కానీ అది కూడా ఒక సంబంధం చెడగొడుతుంది అని ఇప్పుడే తెలిసింది..అలాగే ఎక్స్ పోజ్ చేసే అమ్మయిలనూ చూస్తాము...ఇవేమీ పెద్ద నేరాలు కాదు ...ఇకనుండీ జాగ్రత్తగా ఉండు...మరో విషయం, పెళ్లి చూపులు సక్సెస్ కావాలంటే...పెళ్లి కూతురి గురుంచిన ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకో..ఆమె అభిరుచులు, ఆశయాలు, ఆవకాయ దబ్బా...ఇలాంటివన్నీ అనమాట..పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురితో కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడాలని అడిగి, ముందుగా ప్రిపేర్ అయిన మెటీరియల్ ఓసారి నెమరు వేసుకొని ఇక అనర్గళంగా ఆమె అభిరుచులు నీ అభిరుచులుగా..ఆమె ఆశయాలు నీ ఆశయాలుగా 'ఎన్ని జన్మలెత్తినా ఇతనే నాకు భర్తగా కావాలీ' అని ఆమె ఉన్నపళంగా అన్ని వ్రతాలూ చేసేలా ఒక స్పీచ్ కొట్టు...అంతే...నీకు పెళ్లి గ్యారంటీ.."
"ఐడియా అదిరింది....Game starts now..."


[టపా ఊహించిన దానికన్నా పెద్దగా రావడం మూలానా, ఈ భాగం ఇక్కడితో ముగించి...వచ్చే భాగంలొ ముగింపు ఇస్తాను...ఇది పూర్తి కల్పితం అని గ్రహించండి................మీ కిషన్ రెడ్డి]

Wednesday, September 8, 2010

ముకుందాపురం రైల్వే స్టేషన్

వర్షం జోరుగా కురుస్తుంది...
ముకుందాపురం  రైల్వే స్టేషన్ లో ఉన్న చిన్నపాటి షెల్టర్ క్రింద జనాలు చేరిపోవడంతో, మిగతా స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది...

ప్లాట్  ఫారం మీద గుడ్డిఎంకడి వేణుగానం, వర్షంతో తాళం వేస్తున్నట్లుగా ఉంది...తలా ఓ రూపాయో అర్థో అతని ముందు వేసి వెళ్తున్నారు...

"136 డౌన్ రేపల్లె పాసింజర్..... రాజన్న వెళ్లి గంట కొట్టు..." కేకేశాడు స్టేషన్ మాస్టర్ గది బైటకి వచ్చి ..
"అట్టాగే సారూ ..." అంటూ అతను పరిగెత్తుకుంటూ వెళ్లి .. మూడు గంటలు గబాగబా కొట్టేసి, షెల్టర్ కిందకోచ్చేసేడు..
ముకుందాపురం స్టేషన్ లో ఆగే రైళ్ళు రెండే రెండు...ఒకటి రేపల్లె పాసింజర్, మరోటి విజయవాడ పాసింజర్..
రేపల్లె  పాసింజర్ కరెక్టుగా సాయింత్రం నాలుగింటికి రావాల్సిన బండి, ఏ రోజూ ఆరులోపు వచ్చిన పాపాన పోలేదు..
కానీ అదేంటో విజయవాడ పాసింజర్ మాత్రం మా టంచనుగా వచ్చేస్తుంది...

అంత  వర్షంలోనూ పైట తలపై కప్పుకొని తడుచుకుంటూ స్టేషన్ కి వచ్చింది ఆవిడ...యాభై ఏళ్ళు పైనే ఉంటాయి ఆమెకి..వణుకుతూ వచ్చి షెల్టర్ లో ఓ మూలాన కూర్చుంది...
రైలు గంట కొట్టడంతో అందరూ సామానులు అన్నీ ఓ దెగ్గర పెట్టుకొని రైలు కోసం ఎదురు చూడసాగారు..
"చూడయ్యా.. రేపల్లె పాసింజర్ వచ్చిందా?" అడిగింది ఆవిడ ప్రక్కన ఉన్న అతన్ని....
"ఇంకా లేదు...గంట కొట్టాడు ఇందాకే...కాసేపట్లో వత్తాది..." అన్నాడు చుట్ట ముట్టించుకుంటూ..
"అట్టాగా...." అంటూ నుదిటి మీద అరచెయ్యి అడ్డంగా పెట్టుకొని కనుచూపు మేరల దాకా కనిపించే పట్టాలను చూస్తుంది ఆత్రుతగా...
"ఏ ఊరెళ్ళాలేంటి?" అడిగాడు అతను..
"నేనెక్కడికీ ఎల్లడం లేదయ్యా...మా అబ్బాయి వస్తున్నాడు ఈ రైల్లో....ఆడు ఇంజినీర్ సదువు సదువుతున్నాడు పట్నంలో.."
"అట్టాగా...అయినా వచ్చినోడు ఇంటికి రాకుండా ఉంటాడా...ఈ వర్షంలో తడుచుకుంటూ రాకపోతే ఏం.."
"అట్టా కాదు...ఆడు బండి దిగగానే, నేను ఆడికి కనిపియ్యాల...ఎప్పుడొచ్చినా బండి దిగగానే నన్ను సూత్తే ఆడి కళ్ళలో ఆనందం అంతా ఇంతా కాదు..."

ఇంతలో పెద్ద కూత పెట్టుకుంటూ పొగబండి రానే వచ్చింది...అది ప్లాట్ ఫారం మీద ఆగగానే, ఒక్కసారిగా సందడి మొదలయ్యింది వచ్చి పోయే జనాల ఉరుకుల పరుగులతో...
"ఎల్లమ్మా ఆ పళ్ళ బుట్టందుకోవే...."
"పెళ్లి నడక ఆపి ఒడుపు చెయ్యి...రైలు ఆట్టే ఎక్కువసేపు ఆగదు.." గదుముతున్నాడు అతను నెమ్మదిగా నడుస్తున్న పెళ్ళాని చూసి..
"మనవడా నువ్వు ముందు పరిగెత్తి ఎక్కి సీటు మీద నా తుండు ఏసి పెట్టారా...లగెత్తు..."
"వెళ్ళొస్తా నాన్నా .." అంటూ వాళ్ళ నాన్న కేసి చెయ్యి ఊపుతున్న ఆ కుర్రాడి చూపులు మాత్రం, అతని కోసమే వచ్చి దూరంగా నిలబడ్డ ఆ అమ్మాయి మీద ఉన్నాయి...ఆ పిల్ల కన్నీళ్ళు తుడుచుకుంటూ వీడికి టాటా చెప్పింది..దూరం నుంచే..

వర్షంలో తడుచుకుంటూ వచ్చిన ఆవిడ మాత్రం రైలు పెట్టేలన్నీ గాలిస్తుంది బైటనుండే "బాబూ...అనీల్...ఉన్నావా రా...టేసన్ వచ్చినాది " అంటూ అరుచుకుంటూ ..
రైలు కూత పెట్టుకుంటూ వెళ్ళిపోయింది...దానితో పాటే అక్కడి సందడిని కూడా తీసుకుపోయింది...వర్షం కూడా దాదాపు తగ్గింది...ప్లాట్ ఫారం మొత్తం మళ్ళీ ఖాళీ అయ్యింది...
ఆవిడ మళ్ళీ వచ్చి ప్లాట్ ఫారం మీద ఓ ఉన్న ఓ బెంచీ మీద కూర్చుంది దిగులుగా...

స్టేషన్ మాస్టర్ బయటకి వచ్చి ఆమె వైపు చూశాడు...ఆమె దెగ్గరికి వచ్చి .."ఇదిగో చూడమ్మా...మిమ్మల్ని నేను రోజూ చూస్తున్నాను...రోజూ రేపల్లె బండి టైంకి వస్తారు ...పెట్టేలన్నీ ఎవరికోసమో వెదుకుతారు...కానీ ఎవరూ రారు..మీరు ఇలా రోజూ రావడం దేనికి" అడిగాడు అతను..
"నా కొడుకు పలానా రోజున వత్తున్నానని ఉత్తరం ముక్క రాసాడయ్యా...చానాళ్ళయింది రాసి...ఆ రోజు ఆడు రాలేదు...మరుసటి రోజు వత్తాడేమో అని మళ్ళీ వచ్చాను...అప్పుడు కూడా రాలేదు...నా మనసు ఉండబట్టలేక రోజూ వత్తున్నాను బాబుగారు...ఇంకా రాలేదు."
"ఎప్పుడో అతను ఉత్తరం ముక్క రాస్తే, నువ్వు రోజూ రావడం దేనికమ్మా...ఎదో పని ఉండి రాలేకపోయి ఉంటాడు...అయినా ఆగిపోయిన వాడు, అతనైనా ఓ ఉత్తరం ముక్క రాయాల్సింది..." అన్నాడు..
"ఒక ఏల..నేను ఓ రోజు రాకపోయి, అదే రోజు ఆడొస్తే....ఆడు బండి దిగగానే నేను కనిపించకపోతే ఆడు సిన్నబుచ్చుకుంటాడు బాబు..."
"నీకొడుకు మీద ఎంత ప్రేమమ్మా నీకు...అతగాడికీ అంతే ప్రేమ ఉంటే, మా అమ్మ ఇలా నాకోసం రోజూ స్టేషన్ కి వచ్చి ఎదురుచూస్తుంటుందేమో అని ఒక్కసారైనా వచ్చేవాడు..లేదా ఎంటనే ఉత్తరమో ఫోనో చేసేవాడు కదా.."
"ఆడు ఇంజినీరింగు సదువు సదువుతున్నాడు బాబూ...ఆడికి ఏ అవసరం పడి రాలేకపోయాడో...అయినా రోజూ ఆమాత్రం ఆడికోసం టేసన్ కి రాలేనా బాబూ....సరే బాబూ..పోద్దుగూకుతుండాది...ఎల్లోత్తాను.." అంటూ ఆవిడ వెళ్ళిపోతుండగా, ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు స్టేషన్ మాస్టార్

                                         **** మూడేళ్ళ క్రితం ****
"సావిత్రమ్మా.. పోస్ట్...."
"నీ నోట్లో పంచదార బొయ్యా...సల్లటి మాట చెప్పావ్ గంగాధరం ...యాడనుంచి, మా అబ్బాయి కాడనుంచేనా?" అంటూ లోపలి నుంచి పరుగుపరుగున వస్తూ అంది సావిత్రమ్మ..
"అందులో సందేహమా తల్లీ...అనీల్ బాబు దెగ్గరి నుంచే..." అన్నాడు ఉత్తరం విప్పుతూ..
"ఆ ముక్కేదో తొందరగా సదివెయ్యి గంగాధరం...ఏం రాసాడు..." అందామె పైట కొంగు భుజం చుట్టూ కప్పుకొంటూ..
"అమ్మకి నమస్కారం...నేను బాగానే ఉన్నాను..నా గురుంచి నువ్వేమీ బెంగ పెట్టుకోకు...రోజూ మందులు సరిగ్గా వాడుతున్నావా?..నిన్నోక్కదాన్ని వదిలేసి నేను ఇక్కడ చదువుకోసం ఉండటం నాకు బాధగానే ఉన్నా, రేపు నిన్ను నేను బాగా చూసుకోవాలంటే పెద్ద చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి...అందుకు తప్పడం లేదు...ఇంకో ఏడాదికి చదువు పూర్తవుతుంది...వెంటనే ఉద్యోగం తెచ్చుకొని నిన్ను నాతో కూడా తీసుకువెళతాను...ఇక విషయం ఏమిటంటే, మాకు సంక్రాంతికి పది రోజులు సెలవులు...వచ్చే శనివారం రేపల్లె బండికి వస్తున్నాను...నేను దిగగానే నిన్ను చూడాలి..మర్చిపోకుండా స్టేషన్ కి రా...ఇక ఉంటాను.." అంటూ ముగించాడు గంగాధరం
"ఎంత తీపి కబురు చెప్పావు గంగాధరం...వచ్చే శనివారం వస్తున్నాడా...ఇంకా నాలుగు రోజులు ఉంది...ఈ లోపు ఆడికి ఇష్టమైనవి అన్నీ చేసెయ్యాలి..."
"ఇంకేం...మీరు ఆ పనిలో ఉండండి...సరే నే వస్తాను మరి..."
"అట్లు పోశాను...ఉండు తెస్తాను...తిని వెళ్దువు గాని ..." అంటూ లోపలి పరుగుతీసింది సావిత్రమ్మ ....

సావిత్రమ్మ తన కొడుక్కి ఇష్టమయిన పిండివంటలు సిద్దం చెయ్యడంలో మునిగిపోయింది...
ఇల్లంతా శుభ్రంగా కడిగింది...దాదాపు ఆరునెలల తరువాత వస్తున్నాడు...వాడు ఉన్నన్నాళ్ళు ఏ కష్టం రాకుండా సూడాలి అనుకుందామె....
"రవిగా...ఇంట్లో ఫాను తిరగడం లేదురా...రేపు అబ్బాయి వస్తున్నాడు, మెయిన్ రోడ్డులో మెకానిక్ రాజుని అర్జెంటుగా రమ్మన్నానని పిలువు..." కేకేసింది బడికి వెళ్తున్న ఆ అబ్బాయిని ఉద్దేశించి...
"అట్టాగే అత్తా ..." అంటూ పరుగు తీసాడు ...
"మర్చిపోకు అల్లుడా...."

శనివారం రానే వచ్చింది...సావిత్రమ్మకి ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు...ఆమె కొడుకును చూడబోతున్న సంతోషంలో ఉంది...
"సావిత్రమ్మా....ఈ రోజే పెన్షన్ ఇస్తున్నారు...నువ్వెళ్ళి తెచ్చుకో..." ఇంటికొచ్చి చెప్పాడు రంగయ్య... 
సావిత్రమ్మ భర్త చనిపోయాక రంగయ్య ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు..ఆమెని ఓ తోబుట్టువులా చూస్తాడు..
"ఈ రోజు నా కొడుకు వస్తున్నాడు...నేను టేసన్ కి ఎల్లాలి అన్నయ్యా..."
"అనిల్ వచ్చేది రేపల్లె పాసింజర్ కి కదమ్మా...అది సాయంత్రం ఆరు దాటాక గానీ రాదు...ఈ లోపు నువ్వెళ్ళి పెన్షన్ తెచ్చేసుకోవచ్చు...ఈ రోజు నువ్వు తీసుకోకపోతే, మళ్ళా నీ చేతికి వచ్చేదానికి చాలా రోజులు పడతాది..పెన్షన్ డబ్బులే కదమ్మా మీకు ఇప్పుడు ఆదరువు..." అన్నాడు రంగయ్య
"నిజమే రంగయ్యా...అట్టాగేలే...ఎళ్ళి తెచ్చేసుకుంటా..ఎట్టగూ అనిల్ కి కూడా ఏదైనా డబ్బు అవసరం ఉండి ఉంటుంది...ఆ డబ్బు వాడికి ఉపయోగపడుతుంది.."

మధ్యాహ్నం పన్నెండింటికల్లా పెన్షన్ ఆఫీసుకి వెళ్ళింది సావిత్రమ్మ...
పెన్షన్ ఇచ్చే ఆఫీసరు ఇంకా రాలేదట...
"బాబూ...ఎన్నింటికి ఇత్తారు బాబూ పెన్షను..." అడిగింది సావిత్రమ్మ అక్కడున్న క్లర్క్ ని
"నాకేం తెలుసమ్మా...గంటలో ఇవ్వొచ్చు...రెండు గంటల్లో ఇవ్వొచ్చు...అసలు ఈ రోజు ఇవ్వకపోనూ వచ్చు..." అన్నాడు చెవిలో అగ్గిపుల్ల పెట్టి తిప్పుకుంటూ ...
"మా రంగయ్య ఈ రోజే ఇస్తారని చెప్పాడే...లేట్ అయితే మా అబ్బాయి వచ్చే రైలుకి టైం అయిపోతాది...కొంచెం ఇవరంగా సేప్పయ్యా..."
"ఏంటమ్మా నీ నస..పెన్షన్ గావాలంటే వెయిట్ చెయ్యాలి మరి...అప్పనంగా తినే గవర్నమెంటు సొమ్ము కదా...కూసింత వెయిట్ చెయ్యండి..." అన్నాడు నిర్లక్ష్యంగా
అతని మాటలకి నొచ్చుకుంటూ వెళ్లి బల్ల మీద కూర్చుంది సావిత్రమ్మ...
అప్పటికే అక్కడ కొందరు వృద్ధులు పెన్షన్ కోసం కూర్చొని ఉన్నారు....
సావిత్రమ్మ అలాగే కూర్చొని ఎదురు చూస్తుంది...ప్రతి అయిదు నిముషాలకోసారి గుమ్మంకేసి చూస్తుంది, ఎవరైనా వస్తున్నారా అని...
టైం గడిచిపోతుంది...గడియారం కేసి చూసింది...అయిదు కావచ్చింది...
ఇంకో గంటలో బండి వచ్చేస్తుంది, ఇక లాభం లేదనుకొని లేచింది వెళ్దామని...సరిగ్గా అప్పుడే వచ్చాడు పెన్షన్ ఆఫీసరు...
అతను రావడంతో,కాసేపు తటపటాయించి...తీసుకునే వెళ్దాం అనుకుంది సావిత్రమ్మా..
అప్పటిదాకా కూర్చున్న వాళ్ళు ఆ ఆఫీసర్ ని చూడగానే వెళ్లి క్యు కట్టారు...అతను నెమ్మదిగా కౌంటర్ తెరిచి..ఒక్కొక్కళ్ళకి పెన్షన్ ఇవ్వసాగాడు...

మధ్యలో ఎవరో ఓ ముసలాయన పెన్షన్ ఆఫీసర్ తో గొడవకు దిగాడు..తనకి రావాల్సిన మొత్తం రాలేదని..ఇచ్చేదాకా అక్కడ నుంచి కదలనని గొడవ చేయ్యసాగాడు..ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగి, మిగతా వారికి పెన్షన్ ఇవ్వడం లేట్ అయ్యింది.. సావిత్రమ్మకి ఎక్కడ రైలు బండి వేళకు తను స్టేషన్ కి చేరుకోలేనేమో అని దిగులుగా ఉంది.. మొత్తానికి కాసేపట్లో సావిత్రమ్మ చేతికి పెన్షన్ వచ్చింది..డబ్బు తీసుకొని ఆగ మేఘాల మీద స్టేషన్ కి దారితీసింది...వేగంగా నడుస్తూ ఉంది..ఒక్కసారిగా ఆమెకి ఆయాసం దానితో కూడుకున్న దగ్గు విపరీతంగా మొదలయ్యింది...అలా దగ్గుతూనే ఉండటం వల్ల నోట్లో నుండి కొంచెం రక్తం పడటం..అది చూసుకొని "మాయదారి రోగం...అబ్బాయి వచ్చినప్పుడు రాకుండా ఉంటే బాగుండు...లేకపోతే ఆడు బాధపడతాడు...ఆడు చక్కగా చదవాలి..నేను సంతోషంగానే ఉన్నాను అని ఆడికి తెలియాలి..." అనుకుంటూ దెగ్గరిలో ఉన్న బోరింగు దెగ్గరికి వెళ్లి నీళ్ళు పుక్కిలించి శుభ్రం చేసుకొని, మళ్ళీ నడక ప్రారంభించింది...

స్టేషన్ దరిదాపుల్లోకి వచ్చింది..
ఎదురుగా చుక్కాలు వస్తుంది..చుక్కాలు రోజూ పట్నంలో స్కూల్లో ఆయా పని చేసి, సాయంత్రంకల్లా రేపల్లె బండికి ఊరికి చేరుకుంటుంది...చుక్కాలుని చూసేసరికి సావిత్రమ్మకి ఒక్కసారిగా దిగులు పట్టుకుంది "ఏంటే సుక్కాలు...బండి వచ్చేసినాదా?" అంటూ పరుగులాంటి నడకందుకుంది...
చుక్కాలు ఏమీ మాట్లాడకుండా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది...సావిత్రమ్మ ముఖం వైపు కూడా చూడలేకపోతుంది..ఏదో బాధ కనిపిస్తుంది చుక్కాలులో...చుక్కాలు చేతులు వణకడం గమనించలేదు సావిత్రమ్మ...
"ఏంటే..మూగి దానిలాగా మాట్లాడవు...బండి వచ్చేసినట్లు ఉండాదిగా..నువ్వందులోనేగా వస్తావు...అనిల్ కనిపించాడా?"
కానీ చుక్కాలు మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకుండా...అలాగే నడుచుకుంటూ వెళ్తుంది...
"ఇదో తిక్కలది..." అంటూ సావిత్రమ్మ వేగంగా నడుచుకుంటూ స్టేషన్ చేరింది...
లోపలకి వెళ్ళింది సావిత్రమ్మ...చాలా మంది జనాలు ఉన్నారు...ఏంటి కొంపదీసి ఇంకా రైలు రాలేదా?...రాకుండా ఉండే బాగుండు దేవుడా...నా కొడుకు రైలు దిగినాక నేను ఆడికి కనపడాలి..అయినా రైలు రాకపోతే చుక్కాలు ఎట్టా వచ్చింది...ఆ మూగి మొహం ఒక్క మాట కూడా మాట్లడకపోయే అనుకుంటూ...చూస్తుండగా...స్టేషన్ మాస్టర్ సుధాకరరాజు ఆమె దెగ్గరికి వచ్చాడు..

                                     ***** ప్రస్తుతం *****

డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరాడు స్టేషన్ మాస్టర్ రాజారం...స్టేషన్ ప్రక్కనే ఉంటుంది అతను క్వార్టర్...రిటైరుమెంటుకి దెగ్గరిలో ఉన్నాడు..మూడు నెలల క్రితమే ట్రాన్స్ఫర్ అయ్యి ముకుందాపురానికి వచ్చాడు..అంతకముందు బాపట్ల స్టేషన్ మాస్టారుగా పనిచేసాడు..అయన భార్య ఓ ఏడాది క్రితమే కాలంచేసింది..ఇద్దరు పిల్లలూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు..పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి..రిటైర్ అయ్యాక కొడుకుల దెగ్గర ఉండి, మనవాళ్ళతో ఆడుకోవాలని కోరిక రాజారాంకి..

"అయ్యగారూ...డిన్నర్ తీసుకువచ్చాను" అంటూ క్యారియర్ టేబుల్ మీద పెట్టాడు రాజన్న..
"అలాగే రాజన్న..నువ్వేలేకపోతే నేనేమైపోయేవాడినో రాజన్నా...నా అవసరాలన్నీ నువ్వే చూస్తున్నావ్..ఈ ఊరిలో నాకున్న బంధువువి నువ్వొక్కడివే.." అన్నాను అభిమానపూర్వకంగా
"భలేటోరే అయ్యగారు...మీలాంటి మంచి సారుకి ఆమాత్రం చెయ్యలేనా..."
"సరే..నువ్వు కూడారా...కలిసి తిందాం.." అంటూ రెండు ప్లేటులు తీసాడు రాజారాం...
"నేను ఇంటికాడ తింటాలే మీరు కానియ్యండయ్యా .."
"అదేం కుదరదు...నువ్వు ఇప్పుడు నాతో పాటు తినాల్సిందే.." అంటూ రాజన్నకి కూడా వడ్డించాడు ప్లేట్ లో..

 ఇద్దరూ కలిసి తింటుండగా...రాజారాం మాట్లాడుతూ "నాక్కిక్కడ చాలా నచ్చింది రాజన్న..వచ్చి మూడు నెలలే అయినా, ఈ ఊరు చాలా ప్రశాంతంగా అనిపించింది..పెద్దగా పని వత్తిడి లేదు..రిటైర్ అయ్యేదాకా నాకు ఇక్కడ బాగానే ఉంటుంది.." అన్నాడు 
"ముకుందాపురం మహిమ అట్టాంటిది అయ్యా...ఈ ఊరికి వచ్చినోళ్ళు ఈ ఊరుని ఈ జనాలనీ మర్చిపోరు.."
"నిజమే...నా కంటే ముందు స్టేషన్ మాస్టారుగా పనిచేసింది ఎవరు?"
"మీకంటే ముందు గోపాలం గారు ఉన్నారు...కాని చెప్పుకోవలసింది ఆయకన్నా ముందు ఉన్న సుధాకరరాజు గారి గురించి...గొప్ప మనిషి..మంచికి మారు పేరు..ఆయనంటే అందరికీ గౌరవం..ముకుందాపురం రైల్వే స్టేషన్ ఈమాత్రం అయినా అభివృద్ధి చెందింది అంటే అది ఆయన వల్లే...కానీ మంచోళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది..మూడేళ్ళ క్రితం జరిగిన ఓ ఆక్సిడెంటుకి ఆయన బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసాడు..."
"అయ్యో...అలాగా..అయినా ఏదీ మన చేతుల్లో లేదులే రాజన్నా...ఆ చెప్పడం మరచాను...రోజూ ఒక ఆవిడ స్టేషన్ కి వస్తుంటుంది రేపల్లె బండి టైంకి...రోజూ పాపం తన కొడుకు రైల్లో వస్తాడేమో అని ఆశగా చూస్తుంది...ఈ రోజు ఆవిడతో మాట్లాడాను..పాపం ఆవిడని చూస్తే జాలేసింది..ఆ వయసులో కూడా కొడుకు కోసం రోజూ స్టేషన్ కి వస్తుంది..నువ్వెప్పుడైనా గమనించావా రాజన్న ఆమెని.." అడిగాడు రాజారాం..
"మీరు చెప్పేది సావిత్రమ్మ గురుంచే కదా.."
"ఆమె పేరు తెలీదు...కానీ ఆమె కొడుకు మీద కోపం వచ్చింది..ఆ తల్లి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇన్ని రోజులు రాకుండా ఉంటాడా..ఎప్పుడో వచ్చేవాడు కదా..." అన్నాడు ఉద్వేగంగా..
"అందులో అతని తప్పేమీ లేదు రాజారం గారు..." నెమ్మదిగా చెప్పాడు రాజన్న..
వింతగా చూసాడు రాజారం అతని వైపు...
"ఉంటే కదా రావడానికి...అనిల్ బాబు చనిపోయి మూడేళ్ళు.."
దిగ్బ్రాంతిగా చూసాడు రాజారం రాజన్న వైపు...

"ఇదే స్టేషన్ లో, రైలు దిగి పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు డీ కొట్టింది..అదంతా దురదృష్టం..ఈ ఊరిస్టేషన్ కి అప్పుడు ఓవర్ బ్రిడ్జి లేదు..మామూలుగా ఏ బళ్ళూ పెద్దగా రావు కనుక అందరూ పట్టాలు దాటి వెనుక వైపు నుండి బైటకి వెళ్తారు..ఆ రోజు మాత్రం మృత్యువే ఆ గూడ్స్ రూపంలో వచ్చింది..ఇది తన తప్పుగానే సుధాకర్ గారు భావించారు...అందుకే రాజేనామా చేసారు" అన్నాడు 
"మరి..మరి...సావిత్రమ్మ రోజూ ఇలా ..."

"కొడుకు మీదే ఆమెకి ఉన్న ఆశలన్నీ...కొడుకంటే పంచ ప్రాణాలు..ఆమె భర్త అనిల్ బాబు చిన్నతనంలోనే చనిపోయాడు..చాలా కష్టపడి పెంచి ఇంజినీరింగ్ చదివించింది కొడుకుని...ఎప్పుడు చూసినా కొడుకు గురుంచే మాట్లాడుతుంది..కొడుకుని చూడకుండా అస్సలు ఉండలేదు, అయినా ఆడి చదువుకోసం ఏళ్ల తరబడి ఒక్కత్తే ఉంటుంది...'ఎందుకు సావిత్రమ్మ ఒక్కదానివే నీకిన్ని కష్టాలు' అంటే 'కష్టాలేముంది అయ్యా..నాకొడుకు సదువు అయ్యి పట్నంలొ ఆడికి ఓ ఉద్యోగం వస్తే, ఆడితో పాటే నన్ను కూడా తీసుకెళతాడు..' అంటుండేది...కానీ దేవుడు ఇలా అర్ధాంతరంగా....ఇంకా ఘోరం ఏమిటంటే, ఆ ఆక్సిడెంటు జరిగినప్పుడు తన కొడుకు కోసం ఆమె స్టేషన్ కి వచ్చింది..సుధాకర్ గారికి ఆమెతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు..కొడుకు మీద పంచప్రాణాలు పెట్టుకున్న తల్లికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా..కానీ చెప్పడం ఆయన ధర్మం..ఆమెని కొడుకు మృతదేహం దెగ్గరికి తీసుకువచ్చి..విషయం చెప్పి..ఆమెకి చూపించాడు..ఆమె చూసింది..గుండె పగిలితే ఏడుపు కూడా రాదేమో..ఆమెలో చలనం ఏమీ లేదు..అలానే చూస్తుండి పోయింది..ఆమె గొంతు పెగల్లేదు..కొడుకుని అలా చూసిన క్షణమే ఆమె మానసికంగా చచ్చిపోయింది..ఆమె ఆ తరువాత ఎప్పటికీ మామూలు మనిషి కాలేకపోయింది...పిచ్చిది అయ్యింది...కొడుకు విగత జీవుడిగా కనిపించినప్పుడు ఆమెకి కలిగిన గుండె కోత బహుసా ఆ దేవుడికి కూడా అర్థమయ్యి ఉండదు..ఉంటే ఇలా జరిగేదే కాదు.. కొడుకు చనిపోయిన విషయమే ఆమెకి గుర్తులేదు..ఇంకా కొడుకు వస్తాడనే అనుకుంటుంది..అదీ ఒకందుకు మంచిదేనేమో, చనిపోయిన కొడుకుని తలచుకుంటూ పడే మానసిక క్షోభ కన్నా, ఆడు బతికే ఉన్నాడు..రేపో మాపో తన కోసం వస్తాడు అనుకొనే పిచ్చితనమే మేలేమో...ఆ రోజు నుండి ప్రతి రోజూ స్టేషన్ కి రావడం..ఎదురు చూడటం ..వెళ్ళడం...మూడేళ్ళుగా ఆమె స్టేషన్ కి రాని రోజు లేదు...కొడుకు చనిపోయిన రోజు ఆమె స్టేషన్ కి ఆలస్యంగా వచ్చింది...సరైన టైంకి ఆమె వచ్చి ఉండి ఉంటే, ఈ ప్రమాదం తప్పి ఉండేదేమో...అంతా రాసి పెట్టినట్లే జరగుతుంది కాని మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి..." అన్నాడు రాజన్న..

                                ***
"136 డౌన్ రేపల్లె పాసింజర్..... రాజన్న వెళ్లి గంట కొట్టు..." కేకేశాడు రాజారం...
రాజన్న వెళ్లి గంట కొట్టాడు...
ప్లాట్ ఫారం మీద మళ్ళీ సందడి...కొద్దిసేపట్లో సావిత్రమ్మ వచ్చింది...
రైల్ రావడం...వెళ్ళడం..జరిగిపోయాయి...
"నీ కొడుకు ఈ రోజు కూడా రాలేదామ్మా.." అడిగాడు రాజారం 
"లేదయ్యా..." అంది ఆయాసపడుతూ...
"రామ్మా కాసేపు లోపల కూర్చుందువుకాని.."
"లేదు..ఎల్లాలయ్యా..." అంటూ నెమ్మదిగా లేచి వెళ్ళింది సావిత్రమ్మ... 
ఆమెనే చూస్తూ నిలబడ్డాడు రాజారం..అప్రయత్నంగా చెమ్మగిల్లాయి అతని కళ్ళు...

A story and script by  ----- Ramakrishna Reddy Kotla.