Sunday, June 27, 2010

అసలు సంగతేమిటంటే !!

ఇప్పుడే ఆంధ్రామెస్సులో లంచ్ చేసి వచ్చాను...అంటే ఇప్పుడు నేనేదో సుష్ఠుగా తినేసి వచ్చాను అనుకుంటే మీరు పప్పులో పెరుగు కలిపినట్లే ...పప్పులో పెరుగు కలపడం ఏమిటా అనుకుంటున్నారా...మీకే అర్థమవుతుంది లెండి.... అసలు ఆదివారం రోజున మా పీ.యం నన్ను ఆఫీసుకి వెళ్లి వర్క్ చెయ్యమననేల ...అన్నాడు పో...నేను బ్రేక్-ఫాస్ట్ సైతం చెయ్యకుండా ఆఫీసుకి లగెత్తనేల ...లగెత్తితి పో...ఒంటిగంట కల్లా కడుపుమండి ఆఫీసు పక్కనున్న ఆంధ్రామెస్సులో అడుగెట్టనేల .. అడుగెట్టితి పో...ఆ అరవజాతి చీకేసిన టెంకె మొహంగాడు నా ముందు కూర్చోననేల ...కూర్చున్నాడు పో....వాడు అవ్విధముగా చేయనేల...కటకటా ఏమి నాకీ వింత పరీక్ష...


ఆదివారం ఆఫీసుకి రమ్మంటే నాకు మండే మంటని ఆపడానికి ఫైర్ ఇంజిన్ కాదు కదా శ్రీశైలం డ్యాములో నీళ్ళుమొత్తం కుమ్మరించినా ఆగదు..కానీ ఈ మధ్య ఆఫీసులో ఉన్న పని తీవ్రతని అర్థం చేసుకొని, తప్పక నేనే ఆ మంటలను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది ఆర్పేసుకొని ఆఫీసుకి వెళ్ళడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను .. ఆదివారం ఉదయం పదిదాటినా అది నాకు అర్థరాత్రి లాగే అనిపిస్తుంది ఎప్పుడూ.. ఈ రోజు ఉదయం పది కల్లా ఆఫీసులో ఉండాలి కాబట్టి తొమ్మిదిన్నరకు అలారం పెట్టుకొని పడుకున్నాను రాత్రి .. తొమ్మిదిన్నరకు మోగిన అలారాన్ని స్నూజ్ చేస్తూ చేస్తూ తొమ్మిదీ యాభైకి లేచాను.. పది నుముషాల్లో రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళాలి...అది నా టార్గెట్ ఆ క్షణాన.. 9 52 కల్లా బ్రష్ చేసి, 9 54 కల్లా స్నానం చేసి, 9 57 కల్లా డ్రెస్ వేసుకొని,షూస్ తొడుక్కొని, రోజూ లాగే ఎక్కడెక్కడో విసిరేసిన ఐ.డీ ట్యాగ్, రూమ్ తాళాలు, పర్సు, దువ్వెన అన్నీ వెతుక్కొని బైటపడ్డాను... ఇక మూడే మూడు నిముషాలలో ఆఫీస్ చేరుకోవాలి.. ఒక పరుగులాంటి నడకతో ఊపందుకొని దూసుకుపోతున్నా రోడ్డులో.. అందరినీ దాటుకుంటూ వెళ్తుంటే నావైపు అదేదోలాగా చూస్తున్నారు.. ఆహా అబ్బాయి ఏమి ఫాస్టు అనుకుంటున్నారేమో అనుకోని ఇంకా రెచ్చిపోయాను.. కానీ వారి చూపుల వెనుక మర్మమేమిటో నన్ను నేను అలా నడుచుకుంటూ రోడ్డు పక్కన ఉన్న సెలూన్ మిర్రర్ లో చూసుకుంటే అర్థమయింది.. వెంటనే ఆ తప్పుని సరిచేసుకొని... (ఏ తప్పని అడగకండే.. అది మీ క్రియేటివిటీకే వదిలేస్తున్నా ... రెచ్చిపోండి :-) ).. మొత్తానికి ఓ మూడు నిముషాలు ఆలస్యంగా ఆఫీసుకి చేరుకొని పంచ్-ఇన్ చేసాక తీరిగ్గా సీటులో కూలబడ్డాను...


సిస్టం ఆన్ చేసి.. అప్లికేషను ఓపెన్ చేసి..మెయిల్స్ చెక్ చేసి.. ఓ అరగంట అలాగే డెస్క్ మీద పడుకొని..లేచి మళ్ళీ వర్క్ చెయ్యడం ప్రారంభించా.. అకస్మాత్తుగా నేనున్నానంటూ గుర్తు చెయ్యడం ప్రారంభించింది ఆకలి.. మార్నింగ్ టిఫిన్ చెయ్యలేదు కదా.. ఆ అలారం పెట్టుకునేది ఏదో ఒక గంట ముందు పెట్టుకొని, ఎవరో వెనుకనుంచి బెత్తంతో తరుముతున్నట్లు కాకుండా, నింపాదిగా రెడీ అయ్యి చక్కగా టిఫిన్ చేసి రావచ్చుగా ఆఫీసుకి అని అనుకుంటున్నారు కదా... కానీ తొక్కలో టిఫిన్ కోసం, అద్దం ముందు సోకుల కోసం, బంగారం లాంటి ఓ గంట నిద్రని త్యాగం చేసేంత మూర్ఖుడిని కాదు యువరానర్.. కానీ అప్పటికే నా కడుపులో కాకులు కావ్ కావ్ అంటుండటం చేత లంచ్ కి ఫుల్లుగా కుమ్మెయ్యాలని డిసైడ్ అయ్యి... పన్నెండున్నరకే లగేత్తాను ఆఫీసు పక్కన ఉన్నఆంధ్రామెస్సుకి...


వాడు నాకు ఆకులో అన్నం, పప్పు, అదేదో కుర,అదేదో ఫ్రై, అరిటిపండు పెట్టాడు.. నేను చక్కగా వేడి అన్నంలో పప్పు కలుపుకొని లైట్ గా నెయ్యి తగిలించి.. ఒకొక్క ముద్దా ఆస్వాదిస్తూ ఓ మూడు ముద్దలు తిన్నానో లేదో, నా ముందు ఒక అరవోడు వచ్చి కూర్చున్నాడు.. అంతే నేను నాలుగో ముద్ద పెట్టుకొనే లోపే వాడు చేస్తున్న చేష్టలు చూసి నిశ్చేష్టుడినయ్యాను.. వాడు అన్నం మొత్తం ఒక కుప్పగా దెగ్గరికి తీసుకువచ్చి...మొదటగా ఆ కుప్పలో నెయ్యి వేసి కలిపాడు..ఆ వెంటనే పప్పు,కూర,ఫ్రై మూడింటిని అలా నెయ్యి కలిపిన్న అన్నం లో వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసాడు..వెంటనే ఆ మిశ్రమంలో సాంబారు, పెరుగు, పెరుగు చట్నీ, కంది పొడి వేసి బాగా కలిపాడు..వెంటనే అరిటిపండు వలిచి ఆ మిశ్రమంలో వేసి బాగా పిసకడం మొదలెట్టాడు.. ఆ మిశ్రమానికి కొద్దిగా ఆవకాయ పచ్చడి కూడా తగిలించి, అప్పడంతో నంజుకొని వాడు తింటుంటే నాకు వెంటనే కడుపులో దేవేసి, ఏ క్షణంలోనైనా లోపల ఉన్న మూడు ముద్దలు బైటకి ఎగదన్నేస్తాయి అని కంగారు పడి.. హుటాహుటిగా లేచి వెళ్లి చెయ్యి కడుక్కొని.. బైటకి వెళ్ళబోతూ..ఓ సారి వాడి వైపు చూసాను..వాడికి ఆ మిశ్రమంలో పదార్ధాలు సరిపోయినట్లు లేవు..ఇంకా ఏదో కావాలని కేకేస్తున్నాడు.. "అన్నే ...కారా కొలంబు, మోరు కొలంబు ఎడ్తుకు వా శీఘ్రం..." అంటున్నాడు ఆ మిశ్రమాన్ని జుర్రుకుంటూ.. "ఓర్నీ నువ్వు మనిషివా అరవోడివా (వాడు నిజంగానే అరవోడు)... ఆ తిండి ఏంట్రా.. ఎన్ని ఉంటె అన్నిటినీ కలిపి తినేస్తావేంట్రా నువ్వు ... నెయ్యి కలిపిన అన్నంలో పెరుగు,పప్పు,సాంబారు,అరిటిపండు, నీ శార్ధం, పిండాకూడు, మన్ను మాశానం అన్నీ ఒకేసారి కలపడమేంట్రా అష్టదరిద్రపు నికృష్టపు బేవార్సు A1 ఏబ్రాసి ఎలుకలు కొట్టేసిన కోతులు చీకేసిన తాటికాయ టెంకె మొహం నువ్వూను ...నా కడుపు మంట ఏనాడో నీ గుండె మంట అవ్వక మానదు..." అంటూ వాడిని తనివి తీరా తిట్టేసుకొని బైటకి నడిచాను.. ఆకలిగా ఉన్నా ఆ మిశ్రమాన్ని చూసిన కళ్ళతో ఇప్పుడు నేను ఏమి తిన్నా ఆ భయంకర మిశ్రమమే గుర్తుకువచ్చే సూచనలు ఉన్నాయి కనుక...అలా ఆకలి తీరకుండానే ఇలా మళ్ళీ ఆఫీసుకి వచ్చేశాను... నా ఈ కడుపు మంట మీతో కూడా కొంచెం పంచుకొని ఆ మంటను కొంచెం అయినా ఆర్పే పనిలో ఉన్నాను అనమాట... ఇక రాత్రి డిన్నర్ కి ఏ విఘ్నాలు కలగకుండా ఉంటె హాయిగా తినేసి పడుకుంటాను...సో అదీ అసలు సంగతి !!

Sunday, June 13, 2010

జావా...ఇంగ్లీష్...సైన్స్...ఫిజిక్స్


వెంకట్ సార్ ఆ కుర్రోడి జావా రికార్డ్ ల్యాబ్ లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు కోపంగా విసిరేసి "వెళ్లి తీసుకురా .." అని అనడం వరసగా నాలుగోసారి అదే రోజు అదే ల్యాబ్ సెషన్ లో .. పాపం ఆ కుర్రోడు కష్టపడి ఆ చివరివరకు నడుచుకుంటూ వెళ్లి రికార్డు తెచ్చి వెంకట్ సార్ కి ఇచ్చాడు ముచ్చటగా నాలుగోసారి ... అచ్చు ఇలాగే అదేదో చిత్రంలో ఒకావిడ కుక్కకి ట్రైనింగ్ ఇస్తుంది ...ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి ....

"అసలిది రికార్డేనా... ప్రతి ప్రోగ్రాంలో వంద బగ్గులు ...జావాలో C,C++,C# అన్నీ కలిపి తాళింపు పెడితే ఇలాగే ఏడుస్తాయి ప్రోగ్రామ్స్ ... అసలీ కోడింగ్ ఏంటి ?.. అసలీ స్టేట్మెంట్స్ ఏంటి?? .. కంప్యూటర్ లో ఈ ప్రోగ్రాం కంపైల్ చేస్తే కెవ్వు కెవ్వు మని కాలు తెగిన కోడిలా అరుస్తుంది కంప్యూటర్ ...నీకు రికార్డులో మాత్రం అవుట్ పుట్ భలే వచ్చేస్తుంది  ... నువ్వు కంప్యూటర్ కి అర్థం కావు ...." అంటూ అయిదోసారి విసిరేశాడు రికార్డు ..ఈ సారి ఆ కుర్రోడు వెళ్ళలేదు ...జావ తాగడం అంటే ఎంత చిరాకో, జావా ప్రోగ్రాం అంటే అంతకన్నా అసహ్యం ఆ కుర్రాడికి ... జావాకీ తనకి జాతకరిత్యా కంప్యూటర్ గండం ఉందని పక్కింటి పంతులు గారు ఏనాడో చెప్పారు ... అలా నిండు ల్యాబ్ లో తనని అవమానించడం సహించని ఆ కుర్రాడు, సర్ చేతులో ఉన్న రికార్డు (ఎవరిదో?) లాక్కొని బలంగా విసిరేసాడు ... అదెళ్లి బండ పాప వీపుకి తగిలినా ఆమెకి ఈగ వాలినట్లు కూడా లేకపోవడంతో ...కుర్రాడు విసురుగా బైటకి వెళ్లాడు .... వెంకట్ సర్ కి మండింది ...

"రామకృష్ణని రేపటి నుండి జావా ల్యాబ్ కి రావాద్దని చెప్పండి ..."
బైటకి వెళ్లి నడుస్తున్న తనకి ఆ మాటలు వినిపించాయి ...అంతే, అతను జ్ఞాపకాల టైం మెషిన్ ఎక్కి ఓ పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు .....

                                                  ****

ముక్కుపచ్చలే కాదు...మూతికి అంటుకున్న కొబ్బరి పచ్చడి కూడా ఆరిన ఆ పసి మగవాడు అప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు....
ఓ రోజు టీచర్ క్లాసులో ఆ పిల్లాడ్ని పిలిచి "క్యాట్ స్పెల్లింగు రాసి తీసుకురా ..." అంది
మనోడు బుద్దిగా పలక మీద తుపుక్ అని ఊసి...దాన్ని సుబ్బరంగా తుడిచి దాని మీద "KAT" అని రాసి టీచర్ కి చూపించాడు ... టీచర్ అది చూసి "KAT కాదు  CAT అని రాయాలి " అని చెప్పింది ... మనోడు వెంటనే 'క' కి 'C' ఇంగ్లీష్ పెళ్ళాం అని డిసైడ్ అయ్యాడు... కాని 'క' కి 'K' కూడా సెకండ్ సెటప్ అని తెలుసుకోలేకపోయాడు ...

టీచర్ మరునాడు అదే సుకుమార బాలుడిని పిలిచి "కైట్ స్పెలింగ్ రాసి తీసుకురా..." అంది ... మనోడు తెగ సంబర పడిపోయి, బహుసా టీచర్ కి తనంటే ఇష్టమనుకున్నాడో లేక తను రాబోయే కాలానిని పరుగెత్తుకొచ్చే ఐన్ స్టీన్ అన్న విషయం టీచర్ కి తెలిసిపోయిందేమో అనుకున్నాడో, వెంటనే పలక మీద "CITE" అని రాసి పరిగెత్తుకొచ్చి టీచర్ కి చూపించాడు ...టీచర్ అది చూసి, టపక్ అని ఓ మొట్టి కాయ వేసి "CITE కాదు KITE... ఇలా స్పెల్లింగులు తప్పురాస్తే రేపు పరీక్షలో తప్పి కూర్చుంటావు...వెధవా" అంది ... మనోడి చిట్టి మనసు గాయపడింది...ఆ గాయం పుండైంది...అది మంటెక్కుతుంది...టీచర్ ఆ పుండు మీద మళ్ళీ ఎండు మిరప కారం చల్లుతూ "కోకోనట్ స్పెల్లింగు రాయి అంది ..."..మన బుజ్జి బాబుకి 'క' మొదటి పెళ్ళాం 'C' ని ఎంచుకోవాలో...సెకండ్ సెటప్ 'K" ని ఎంచుకోవాలో అర్థంకాక...ఈ సారి సెకండ్ సెటప్ కి చాన్స్ ఇద్దామని "KOKONAT" అని రాశాడు....వెంటనే మొట్టికాయ ...
"కైండ్ ...స్పెల్లింగ్ .."....."CIND"....మొట్టికాయ ...
"కామిల్ స్పెల్లింగ్ .."...."KAMIL"....మొట్టికాయ ..
"కంగారో స్పెల్లింగ్ .."...."CANGARO"...పెద్ద మొట్టికాయ ...
"క్రోకోడైల్.."...."KROKODAIL"...లాగి లెంపకాయ ...  అన్ని కాయలని ఒకేసారి పాపం మనోడు తినలేకపోయాడు ...
అప్రతిహతంగా తన మీద కొనసాగుతున్న స్పెల్లింగుల దాడికి భీతిల్లి, నడి క్లాస్ లో తన ఈడు బ్యుటీస్ ముందు తన మీద జరుగుతున్న ఘోర అత్యాచారాన్ని భరించలేక...పలక విసిరేసి...మోకాలి దాక జారిపోయిన నిక్కర్ ని ఎగ్గట్టి...పరుగో ..పరుగు ...

"రేపటి నుండి రామకృష్ణని నా క్లాస్ కి రావద్దని చెప్పండి ..."

                                                      ****
"పొట్టి లాగు వయసు లోంచి పాంటు లోకి వచ్చాను .....మీసం నేను పెంచుతాను ..." అంటూ కాలర్ ఎగరేసి ... ఇంకా ఆనవాళ్ళు కూడా లేని మీసం మీద వేలుపెట్టి, వంశం అంటూ మీసం తిప్పే వాళ్ళ సినిమాలు చూసి, ఆ పిల్లాడు కూడా పెదవికి ముక్కుకి మధ్య ప్లేస్ లో రెండు చివర్లా దురద పుట్టినట్టు గోక్కునేవాడు ....ఆ పిల్లాడు అప్పుడు ఏడవ తరగతికి వచ్చాడు ....

క్లాసులో  కేరళా సైన్స్ మిస్సు లీలామా చెపుతున్న విషయం చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆ పిల్లాడు ...
"లెసన్ చెప్పినప్పుడు ...శ్రద్ధగా విని ... కాన్సెప్టు బాగా అర్థం చేసుకోవాలి ... ముఖ్యమైన పాయింట్లు నోట్స్ లో రాసుకోవాలి ... సొంతంగా ఆలోచించాలి ... పరీక్షల్లో కూడా సొంత బుర్రనే ఉపయోగించి సమాధానాలు రాయండి ... " అన్న ఆమె సందేశం ఆ పిల్లాడికి తారక మంత్రంలా తోచింది ....

వెంటనే తారక మంత్రాన్ని అమలు చేసాడు ... ముఖ్యంగా సొంత బుర్ర ఉపయోగించి సమాధానాలు రాయడం అన్న పాయింట్ ఈ పిల్లోడికి తెగ నచ్చేసింది ... పెద్ద పులి లాంటి సైన్స్,మాథ్స్ కాన్సెప్టుల మీద తన చిట్టెలుక లాంటి బుర్రని ఉస్కో అని  ఉసిగొల్పి.. బుర్రని పలు భాగాలుగా విడగొట్టి, ఒక్కో భాగానికి  ఒక్కో కాన్సెప్టు అప్పజెప్పి....పీకి పాతరేసి ..మొత్తానికి క్వార్టర్లీ పరీక్షలు రాశాడు...

ఆ పిల్లోడు బాగా టెన్షన్ పడే క్షణాలు - టీచర్ ఆన్సర్ పేపర్లు కరక్షన్ చేసి క్లాసుకి తీసుకొచ్చి...డెస్క్ మీద పడేసి ...అందరి వైపు భయపెట్టేలా ఒక బ్లాంక్ ఫేస్ పెట్టి.. పెదవి విరిచి ...లాభం లేదు అందరూ పూర్ పర్ఫామెన్స్ అని చెప్పి ఒక్కొక్క ఆన్సర్ షీట్ ఇస్తూ సస్పెన్స్ మైంటైన్ చేస్తూ... ప్రతిసారీ ఆఖరిగా ఆ పిల్లోడి ఆన్సర్ షీట్ ఇచ్చేది ...ఈ లోపు మనోడు టెన్షన్ తట్టుకోలేక గోళ్ళు తినడమో అవి లేక చాక్ పీస్ తినడమో,లేకపోతే బెంచ్ మీద బరా బరా గోకడమో..అవి కూడా ఫలించకపోతే బుర్రని బెంచీ కేసి ధనా ధనా కొట్టుకోవడమో చేస్తుంటాడు ...

క్వార్టర్లీ పరీక్షల పేపర్లు దిద్ది క్లాస్ రూంకి తీసుకువచ్చింది మేడం... సస్పెన్స్ ఏమాత్రం తగ్గకుండా అందరి పేపర్లు ఇచ్చాక మనోడి పేపర్ తీసుకొని "ఇలారా..." అని పిలిచి చెవుపట్టుకొని మెలితిప్పుతూ "ఏంటీ మార్కులు ...నూటికి ఏడా ??.." అంది ...ఆ మాట చెవిన పడగానే పిల్లోడు షాక్ కొట్టిన బల్లిలా అయిపోయాడు...  పేపర్ చూసుకొన్నాడు, బిట్స్ లోనే వచ్చాయి ఆ ఏడు మార్కులు కూడా.. మిగతా షార్ట్, లాంగ్ అన్సర్స్ అన్నీటినీ ఎర్ర పెన్నుతో పెట్టి ఎడా పెడా కొట్టి అవతల పారేసింది మేడం...

ఎంతో కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే కూలిపోతుంటే కలిగే బాధ కలిగింది ఆ పిల్లోడికి... "నేను ఎంతో కష్టపడి రాశాను మేడం ఎందుకు అన్నీ ఇలా కొట్టేశారు..." అడిగాడు, కళ్ళ నుండి జలజలా పారుతున్న ప్రవాహాన్ని కాలర్ తో తుడుచుకుంటూ... "కష్టపడి రాస్తే మార్కులు వెయ్యరు...కరెక్టుగా రాస్తే వేస్తారు ..." అన్న మేడం సెటైర్ కసక్కున వచ్చి ఆ పిల్లోడి గుండెల్లో గుచ్చుకుంది ..."నేను తప్పెక్కడ రాసానో చూపించండి ..." అన్నాడు రోషంగా... "కరెక్ట్ ఎక్కడ రాసావో నువ్వే చూపించు ..." మళ్ళీ సెటైర్ ... మనోడు వెంటనే ఆన్సర్ పేపర్ లో కోస్చేన్స్ కి తను రాసిన ఆన్సర్స్ గట్టిగా టీచర్ కి వినిపించేలా చదవడం మొదలెట్టాడు ..."ఆపు ... నేనిచ్చిన నోట్స్ పట్రా ..." అంది ...పిల్లోడు వెళ్లి నోట్స్ తీసుకొచ్చాడు ...ఇప్పుడు చదువు....నువ్వు రాసిన ఆన్సర్స్ నేను నోట్స్ లో చెప్పిన ఆన్సర్స్ కంపేర్ చెయ్యి ... అంది మేడం ... మనోడు దెబ్బతిన్నట్లు చూశాడు మేడం వైపు... "మీరు నోట్స్ లో చెప్పినట్లు నేను రాయలేదు ...మీరే కదా సొంతంగా ఆలోచించి రాయమన్నారు పరీక్షల్లో ... అలాగే రాసాను .." అన్నాడు

"నేను టెస్టు పుస్తకంలో ఉన్నదాన్ని కాచి వోడపోసి మీకు నోట్స్ ఇచ్చింది ఎందుకు ... అది చూసి చదువుకుంటారు అనే కదా... ఇప్పుడు ఇలా లేని పోని సొంత బ్రెయిన్ ఎందుకు ఉపయోగించడం ... నేను ఇప్పుడంటే ఇప్పుడు సొంతంగా రాయమని చెప్పలేదు ...జనరల్ గా చెప్పాను ... అయినా మీకు నేను అరిపండు వలిచినట్లు అన్నీ అన్సర్స్ ఇస్తుంటే ... చదవడానికి ఏం గాడు ... పైగా సొంతంగా రాశాడట "
"అయినా మేడం ...కనీసం నేను రాసిన ఆన్సర్ అయిన చదివారా... మరీ పూర్తిగా కొట్టేసెంత దారుణంగా నేనేమి రాయలేదు ..."
"ఇలా కొట్టేస్తే ఈ సారాన్నా బుద్ధిగా నా నోట్స్ ఫాలో అవుతావని అలా చేశా ...వెళ్ళు వెళ్లి ఆన్సర్స్ అన్ని కంఠతా పెట్టు ..." అంది

ఆ పిల్లోడికి ఈత కొట్టడం ...చెట్లు ఎక్కడం ... కంఠతా పెట్టడం ఎప్పటికీ రావు ... పదిహేను లైన్ల ఆన్సరుని కంఠతా పెట్టడం కోసం ప్రతి లైనూ వంద సార్లు చదివినా...చివరికి మొత్తం కలిపి చెప్పలేక పోయేవాడు...అసలు అంతంత పెద్ద ఆన్సర్స్ ని కంఠతా ఎలా పెడతారు అనేది అతనికి అంతుచిక్కన ప్రశ్న.... ఆ మధ్య టీవీలో ఏదో వాణిజ్య ప్రకటనలో 'బ్రెయిన్ పవర్ కోసం బ్రెయినోవీటా వాడండి ...ఎంత పెద్ద జవాబు అయినా ఒక్క సారి చదివితే చాలు ఇట్టే కంఠతా పెట్టయ్యగలరు' అని రావడంతో మనోడు ఇదేదో బోర్నవీటలా బాగుందే అనుకొని, ఇంట్లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసి ఆ బ్రెయినోవీటా కొనడానికి నిధులు సంపాదించి దాన్ని కొనుక్కొని ... వస్తూ వస్తూ వినాయకుడి గుడికి వెళ్లి బ్రెయినోవీటాకి అష్టోత్తరం అర్చనా చేయించి ... ఆ డబ్బాకి అన్నివైపులా బొట్లు పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు ... గుళ్ళో పూజారి గారు చెప్పిన సుభ ముహూర్తం అర్థరాత్రి పన్నెండింటికి కావడంతో, అప్పటిదాకా మేలుకొని కరెక్టుగా పన్నెండింటికి చిన్న పూజ చేసి పుస్తకం తెరిచి బ్రెయినోవీటా ఓపెన్ చేసి ...ఒక చెంచా తిన్నాడు ...అబ్బా కారెట్ హల్వాలా ఎంత బాగుందో అనుకొని ఒక పేజి చదివాడు ... చదవగానే ఆ పేజి తనకి తనే అప్పజెప్పుకోడానికి ట్రై చేశాడు ...అబ్బే ...ఒక్క లైన్ కూడా గుర్తురాలేదు ...కొంచెం ఎక్కువ తినాలి కాబోలు అనికొని మూడు స్పూన్లు తిని మళ్ళీ ఓ పేజి చదివి, గుర్తుతెచ్చుకోడానికి ప్రయతించాడు ...ఉహూ ఈ సారీ ఆ సబ్జక్ట్ పేరు కూడా గుర్తురావట్లా ... ఇక లాభం లేదని బ్రెయినోవీటా అలియాస్ కారెట్ హల్వాని మొత్తం తినేసాడు సుబ్బరంగా ... ఆ వెంటనే ఆవులిస్తూ నిద్రపోయాడు ....

"నేను కంఠతా పెట్టను మేడం ....నేను ఇలాగే రాస్తాను ..." ఎదురుతిరిగాడు పిల్లోడు ...
"షటప్ ....వెళ్లి ఒక్కొక్క ఆన్సర్ వెయ్యి సార్లు ఇంపోజిషన్ రాసి రాసుకురా ..."
మనోడికి తిక్క నషాలానికి ఎక్కింది ...చేతులో ఉన్న ఆన్సర్ షీట్ విసిరి కొట్టి ... బాగ్ తీసుకొని బైటకి పరిగెత్తాడు ...

"రేపటి నుండి రామకృష్ణని నా క్లాస్ కి రావద్దని చెప్పండి .."

                                                      ****

S = ut + 1/2 at2
V2 = (R2/R1 + R2) Vs
Sinθ1/Sinθ2 = λ1/λ2 = V1/V2

పైవి యేవో ఫిజిక్స్ ఫార్ములాలు అనుకున్నారా ?..కావచ్చు ...కానీ అవి రోజూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ అబ్బాయికి అర్థరాత్రి కలలో వచ్చి భయపెట్టే దెయ్యాలు కూడా ... ఫార్ములాలని దెయ్యాలు అని చెప్పి దెయ్యాల్ని కించపరిస్తే సారీ, ఆ ఫార్ములాలు దెయ్యాలా కన్నా డేంజర్ ... పాపం పిల్లోడు రోజూ నిద్రలో వెర్రి కేకలు పెట్టేవాడు ..."వద్దు ...నన్నేం చెయ్యద్దు ... మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకోవద్దు " అంటూ కలవరించేవాడు ...ఓ రోజు ఐన్ స్టీన్ కలలో వచ్చి E=MC2 లో C ఏంటో చెప్పమని ఆ పిల్లోడి ప్రాణాలు తోడేసాడు ...మరోరోజు పైథాగరస్ అనే మహానుభావుడు వచ్చి మూడు గీతలు గీసి, రొండు గీతల పొడువు నేను చెప్తా, మూడోది నువ్వు చెప్పుకో చూద్దాం అంటూ కేరింతలు కొట్టాడు ... మరో కాళరాత్రి ఫిజిక్స్ లెక్చరర్ దేవీప్రసాద్ కలలో వచ్చి "రెండు రైళ్ళు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా వస్తున్నాయి ....అవి రెండూ గుద్దుకోకుండా ఉండాలంటే ఆ రెండు రైళ్ళ డ్రైవర్లు ఎంత డిస్టెన్స్ లో బ్రేకులు అప్లయ్ చెయ్యాలి ... దీనికి జావాబు చెప్పు.. దీనికి ఏ ఫార్ములా అప్లయ్ చేస్తావు ..తప్పు చేస్తే ఆ రెండు రైళ్ళలో ఉన్న వందలాది మంది ప్రాణాలు పోవడానికి నీవే కారణం అవుతావు ..." అంటూ యస్వీ రంగారావులా భయంకరంగా రాక్షసంగా నవ్వాడు ... కలలో ఈ ఫిజిక్స్ హింస భరించలేక "కేవ్ వ్ వ్ వ్ వ్ వ్ వ్ ..." మని చెవులుమూసుకుంటూ లేచి వెర్రి కేక పెట్టేవాడు ఆ కుర్రాడు అర్థరాత్రి ...పాపం రోజూ కలలో ఫిజిక్స్ మహామహులంతా మూకుమ్మడిగా ఆ పిల్లోడిపై మానసిక ఫిజిక్స్-అత్యాచారం సాగిస్తుండటంతో వేసిన వెర్రి కేకలకు పక్కన ఉండే కుర్రాడు హడలి చచ్చేవాడు ...

"సార్ ...నాకీ ప్రాబ్లం రావడం లేదు ..." దేవిప్రసాద్ దెగ్గరికి వెళ్లాడు పుస్తకం తీసుకొని ఆ పిల్లోడు స్టడీ అవర్లో ...
"ఆ ప్రాబ్లం ఏంటో చదువు..."
"ఒక మనిషి A అనే నగరం నుండి V1 అనే వేగంతో బైల్దేరాడు ...మరో మనిషి B అనే నగరం నుండి V2 అనే వేగంతో బైల్దేరాడు ...వాళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటారు ?...ఏం మాట్లాడుకుంటారు? ...A గాడి ఇల్లు B గాడి ఇంటి నుంచి ఎంత దూరం? ... A గాడు బెంజ్ వాడటం వల్ల, B గాడు ఫియట్ వాడటం వల్ల వాళ్ళు కలుసుకునే వేళల్లో మార్పు ఉండగలడా? ...A గాడు ఆఫీసు వెళ్ళాక B గాడు A గాడి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు?..A గాడు ఆఫీసుకి అని చెప్పి B గాడి ఇంటికి వెళ్లుంటాడు అని A గాడి పెళ్ళాం అనుమానించి B గాడిని ఇంటికి ఆహ్వానించడం సబబేనా ?....వాళ్ళిద్దరి కాపురాల్లో జరుగుతున్న చిచ్చుని ఏ ఫార్ములా అప్లయ్ చేసి పరిష్కరిస్తావో వివరింపుము?...ఇది సార్ ప్రశ్న ...మొన్న IITలో వచ్చింది .." అన్నాడు పిల్లోడు

"గుడ్ ...మంచి ప్రశ్న ..నువ్వెళ్ళి ఫిజిక్స్ లో ఉన్న అన్ని ఫార్ములాలు వెతికి..అర్థం చేసుకొని .. ఏది దీనికి సూట్ అవ్వుద్దో నిర్ణయించుకొని .. దీన్ని సాల్వ్ చెయ్యి ..." అన్నాడు ...
"అది నా వల్ల కాదు సర్ ... "
"అవుతుంది ...వెళ్ళు ...దీన్ని సాధించు ..."
"ఇప్పటికే చాలా సాధించాను సర్ ...రాత్రుళ్ళు మెరుపు కలలు...పగలేమో ఈ గ్రంథంలోని సృష్టి రహస్యాలు ...ఇక నా వల్ల కాదు సర్ ..."
"ఏం పిచ్చి పిచ్చిగా ఉందా....తప్పి కూర్చుంటావు తిక్క వెధవా !! ..."
"చాలు సర్...చాలు...చిన్నప్పటి నుంచి నేను ఈ డైలాగ్ వినీ వినీ చెవులు తుప్పు పట్టాయి ...ఇక చాలు .. ఈ ఇంగ్లీష్,సైన్స్,ఫిజిక్స్ వల్ల నేను కోల్పోయింది చాలు ...కనీసం రాత్రి సరిగా నిద్ర కూడా పోవట్లేదు సర్ ...పిచ్చి పిచ్చి కలలు ... వాటి వల్ల నేను పెట్టె వెర్రి కేకలు ...నవ్వుతున్నారు సర్ పక్కన ఫ్రెండ్స్ .. ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చి ఉస్కో అని మా మీద వదలడంలో ఉండే ఆనందం మీకు తెలుసు, కానీ ఆ ప్రాబ్లంకి ఏ ఫార్ములా పెట్టాలో అర్థంకాక లాక్కొని పీక్కుంటుంటే లేచే పిచ్చి మీకు తెలీదు ... పదిహేనేళ్ళగా ఏంట్రా నా జీవితం అని చూసుకుంటే..అందులో ఇంగ్లీష్, సైన్స్,ఫిజిక్స్ లే ఉంటాయి సర్ ...నేనుండను ...." అంటూ పుస్తకం విసిరేసి ... బాగ్ తీసుకొని లగేత్తాడు మనోడు ....

"రేపటి నుండి రామకృష్ణని నా క్లాస్ కి రావద్దని చెప్పండి ...."

                                                          ****  
Hope you had a great weekend,takecare - Ramakrishna Reddy Kotla.

Wednesday, June 9, 2010

ఉరకలై గోదావరి...ఉరికె నా వడిలోనికి....


సర్కార్ ఎక్సుప్రెస్ రాజమండ్రి స్టేషన్ లో ఆగింది...
అప్పటిదాకా హడావిడిగా స్టేషన్ లో అటూ ఇటూ పరుగులెడుతున్న ప్రయాణికులు...
ఆకాశంలో ఎగురుతున్న పక్షులు..
అప్పుడే  ఇంకో ప్లాటుఫారంకి రాబోతున్న ట్రైన్...
అన్నీ...సమస్తమూ...ఆక్షణమే...అక్కడే...తుపాకితో హాండ్సప్ అన్నప్పుడు ఫ్రీజ్ అయినట్లు ఆగిపోయాయి..కాలం స్థంబించింది...అంటే దేవుడు పాజ్ బట్టన్ నోక్కాడన్నమాట...

అప్పుడే..సర్కార్ ఎక్సుప్రెస్ స్లీపర్ బోగీ నుండి రాజమండ్రి  స్టేషన్ లో బూటు మోపాడు బ్యాగ్గుతో మన హీరో...ఒక్కసారిగా వీచిన గాలికి అతని క్రాఫ్ లయబద్ధంగా కదులుతుండగా..కూలింగ్ గ్లాస్ తీసి పెట్టుకున్నాడు ...అంతే.. మళ్లీ దేవుడు ప్లే బట్టన్ నొక్కాడు ....హీరో ఎంట్రన్స్ ని స్పెషల్ గా చూపించడానికి దేవుడు చూపిన దర్సకత్వ ప్రతిభ అన్నమాట అది...

                                                             ***
"ఎక్కడికి ?"
"గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ...ఎంత? "
"కాలేజీనా  ??!!.."
"కాదు ఆటోకి..."
"లక్షన్నర అయింది దాదాపు...టాక్సుతో కలిపి....."
"తింగరి తింగరిగా ఉందా...ఇప్పుడే నెల్లూరు నుంచి దిగా...నాతో పెట్టుకోకు ...కాలేజీ దాకా రావడానికి ఆటోకి ఎంత?"
"నలభై అయిదు..."
"ఏంటి ఊరికి కొత్తని నీ ఇష్టం వచ్చినంత చెప్తే ఓ.కే అంటాననుకున్నావా? ....నలభై రెండు రూపాయలకి పైసా కూడా ఎక్కువివ్వను..."
"సరే...ఎక్కండి..మీరు మరీ అంత గీసి గీసి బేరం ఆడితే నాలాటి ఆటోగాళ్ళు ఎట్టా బతకాలి సారూ ..."
హీరో ఎక్కాడు... ఎక్కేప్పుడు చుట్టూ చూసి కాలరెగరేసి కూర్చున్నాడు ...
"మీది నెల్లూరా సారూ ..."
"అవును..."
"అచ్చా... ఇంత దూరం ఇంజనీరింగ్ కాలేజీ సూడ్డానికి వచ్చారా.."
"ఏంటి తిక్క తిక్కగా ఉందా...చదువుకోడానికి వచ్చాను ..." 
ఆటో కోటిపల్లి బస్సుస్టాండ్ దాటి...చర్చిగాటు దాటి అలా వెళ్తూ..వెళ్తూ...ఒక భవనం ముందు ఆగింది ...
హీరో ఆటో వాడి వైపు చూశాడు...ఏంటి ఆపావు అన్నట్లు..."ఇదే కాలేజీ ..." అని ఓ బిల్డింగ్ వైపు చూపించాడు ...
హీరో ఆటోలోంచి బైటకి తొంగి చూశాడు ... "శ్రీనివాసా హార్డువేర్ సప్లయర్స్" దాని పక్కన "వాసవీ కిరానా & జనరల్ స్టోర్స్" ఆ తర్వాత "పంకజం మ్యారేజ్ బ్యూరో"...

హీరో లక్ష సెంటీగ్రేడుల తీక్షణతతో ఆటోగాడి వైపు చూసి "ఏరోయ్... నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా...మాది నెల్లూరని తెలిసీ నువ్వు తెగ కిండలు పడతాండావే..నాకు గానీ తిక్కరేగిందనుకో..." అన్నాడు..
"నేనేటి చేశాను బాబూ...ఇదే గోదావరి ఇంజనీరింగ్ కాలేజీ ..."
"మ....ళ్ళీ...అదే మాట... షాపింగ్ కాంప్లెక్స్ పట్టుకొని కాలేజీ అంటావెంట్రా బాబూ... సిల్కుస్మితని చూపించి సౌందర్య అని నొక్కివోక్కాణించినా నమ్ముతానేమో గాని...ఇది కాలేజీ అంటే నమ్మను "
"ఓ పాలి కనుక్కోండి...నేను ఓ పాలి వొచ్చినప్పుడు ఇక్కడే ఉంది కాలేజీ..."
హీరోకి చిర్రెత్తి చేసేదేమీలేక, మిగతా రెండు షాపులు మూసేసి ఉండటం చేత...పంకజం మ్యారేజ్ బ్యూరోకి వెళ్లాడు విషయం కనుక్కుందామని..

"ఎక్సుక్యుజ్ మీ..." అన్నాడు రిసెప్షనిస్ట్ దెగ్గర
"చెప్పండి..." అంది... అబ్బో రిసెప్షనిస్ట్ సూపర్ ఉంది...
"అదీ...ఇక్కడ..." అంటూ హీరో చెప్పబోతుండగా..
"ఈ ఫారం ఫిల్ చెయ్యండి ..." అంటూ ఓ ఫారం హీరోకిచ్చింది
అందులో - పేరు, ఊరు, రాశి, గోత్రం, నక్షత్రం, గ్రహం, గ్రహణం,మీ ఎత్తు, మీ బరువు, మీ పక్కంటి ఆవిడ బరువు, మీ ఎదురింటి అంకుల్ వయసు, మీ ఆవిడ తాగితే మీరు సంతోషిస్తారా? మీకు వంటలు బాగా వచ్చా?...- ఇక చూడలేక పోయాడు హీరో...'ఏంటి నీ ఉద్దేశం' అన్నట్లు ఓ లుక్కిచ్చాడు రిసెప్షనిస్టుకి.. 

"ఆ ఫారం ఫిల్ చేసి మీరు మాకిస్తే ఒక వారంలో మీకు తగ్గ జోడుని మేము గేలం వేసి పట్టుకుంటాం..." అందామె అరవై నలుగు పళ్ళూ బయట పెడుతూ...
"నేను నీ కళ్ళకి పెళ్లీడు వచ్చిన అంకుల్లా కనబడుతున్నానా... యంసెట్ లో రాంక్ కొట్టి, ఇంజనీరింగ్ సీటు పట్టి, రాజమండ్రిలో అడుగుపెట్టా...గోదావరి కాలేజీ ఎక్కడికెళ్ళింది?"
"దాని పుట్టింటికెళ్ళింది..."
హీరో కి మండింది...దీనికి కూడా తింగరితనం తక్కువేం లేదు ...
"ఎక్కడ దాని పుట్టిల్లు ?"
"ఎప్పటినుంచో రాజానగరంలో కడుతున్నారు బిల్డింగు...పూర్తయ్యి ఉంటది...ఇక్కడి జండా పీకి అక్కడ పాతారు ..." 
"ఎక్కడ ఆ రాజానగరం ..."
"ఓ పది కిలోమీటర్లు ఉంటుంది...తుని, ఏలేశ్వరం బస్సులు చాలానే ఉంటాయి అటేపు వెళ్ళేవి "
"థాంక్స్...." అంటూ వెళ్ళబోయిన హీరో, ఆమె వైపు తిరిగి "ఆ ఫారంలో ప్రశ్నలు తయారు చేసిందెవరు ?" అన్నాడు 
"మా మేడం ..."
"అంటే..లేడినే కదా..."
                                                        ***
"నన్ను బస్సుస్టాండులో దింపు..." అన్నాడు హీరో ఆటోలో బ్యాగ్ విసిరేస్తూ
"ఏటైంది బాబు..."

"కాలేజీని ఇక్కడ నుంచి రాజానగరం అనే ఊరికి షిఫ్ట్ చేశారట..."
"అట్టాగా...అయితే నే చెప్పినట్లు కాలేజీ ఇంతకముందు ఇక్కడే ఉండేది అని ఒప్పుకుంటారా?"
"ఒప్పుకుంటాను మహాప్రభు...నన్ను బస్సు స్టాండులో దింపి పుణ్యంకట్టుకో...." 
ఆటో వాడు బస్సుస్టాండ్ లో దింపి యాభై రూపాయలు ఇవ్వకపోతే వచ్చే బస్సు క్రింద తలపెట్టేస్తా అని భయపెట్టడంతో...వాడిని బ్రతిమిలాడి..గీసి గీసి...నలభై తొమ్మిది రూపాయల యాభై పైసలు ఇచ్చాడు హీరో...ఆటోవాడికి వాడి మీద వాడికే విరక్తి వచ్చి ఎర్రోడిలా ముఖం పెట్టి... ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ...

బస్సు ఎక్కి కూర్చున్నాడు హీరో...
"టికెట్..." అంటూ హీరో దెగ్గరికి వచ్చాడు కండక్టర్ ..
హీరోకి సడన్ గా ఆ ఊరి పేరు గుర్తురాలేదు...  సిరిసిల్ల, జగిత్యాల, చిన్నమెట్టపల్లి, లత్తునూరు, ముత్తునూరు, తంగిటపురము...అంటూ ఆర్.నారాయణ మూర్తి పాటలా ఎక్కడెక్కడో ఊరి పేర్లన్నీగుర్తొస్తున్నాయి...కానీ కాలేజీ ఉన్న ఊరి పేరు మాత్రం గుర్తురావట్లేదు...పిడికిలి బిగించి నుదిటి మీద గుద్దుకుంటున్నాడు..అబ్బే లాభం లేదు...అసలు ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పినా కండక్టరుకి అర్థం అవుద్దేమో...కానీ అంత తెలివి ఉంటే వాడు మన సూపర్ మెగా హీరో ఎందుకు అవుతాడు...

"ఏం బాబూ ఎక్కడికి టికెట్ " రెట్టించాడు కండక్టర్
"అదీ...అదీ...ఆ ఊరు...." థూ ఎదవ జీవితం సరిగ్గా కండక్టరు ముందు దొరికిపోయానేంటిరా దేవుడా..అని హీరో మధనపడుతుండగా...
"టీ-చొక్కా ..జీన్సు పాంటు...పైగా చలికాలం కూలింగు గ్లాసు...టికెట్టుకి మాత్రం డబ్బులు ఉండవు.." అన్నాడు కండక్టరు...లాగి లెంపకాయ ఇస్తే వచ్చే రియాక్షన్ వచ్చింది హీరోలో... భర్త అర్థం చేసుకోకుండా అనుమానిస్తే భార్య ముఖంలో కనిపించే రోషం కనిపించింది హీరోలో...వెంటనే పర్స్ తీసి అందులో ఉన్న వెయ్యి నూట పదహార్లు చూపించాడు కండక్టరుకి..
"అంతడబ్బు మాకవసరం లేదు ...టిక్కేట్టుకి సరిపడా ఇస్తే చాలు.."
"అదీ..కండక్టరు గారు." అంటూ హీరో లేచి కండక్టరు చెవి దెగ్గర "ఆ ఊరి పేరు మర్చిపోయానండి...గుర్తురావట్లా" అంటూ ఊదాడు...
"మా బాబే...ఊరి పేరు మర్చిపోయావా... కనీసం మీ ఊరి పేరైనా గుర్తుందా..." అంటూ ఆ బస్సే కాదు పక్కన ఉన్న పది బస్సులకి వినిపించేట్టు అరిచాడు ... హీరో సీట్ కి రెండు సీట్ల ముందు ఉన్న అమ్మాయిలు గలగలా నవ్వారు...హీరో కి గొప్ప అవమానం జరిగిపోయింది... ఛా ఇక నా ముఖం పెట్టుకొని ఈ బస్సులో ప్రయాణం చెయ్యలేను అని హీరో దిగబోయి ఆగాడు....అక్కడ కూర్చున్న అమ్మాయిలు స్టూడెంట్స్ లా ఉండటంతో .. కొంచెం అందంగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని "ఎక్సుక్యుస్ మీ...మీరు ఏ కాలేజీ.." అన్నాడు...పక్కనున్న అమ్మాయి "మమ్మీ ..." అని అరిచింది...ఈ పిల్ల "నా చర్మం వయసుని అసలు తెలియనివ్వదు.." అంది... హీరో పరమ దరిద్రంగా చూశాడు వాళ్ళ వైపు...వాళ్ళు అంత కంటే దరిద్రంగా ఫక్కున నవ్వారు... హీరోకి అవమానం మీద అవమానం..ప్రొద్దుటి నుంచి ఎవడు పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు ఎదవ జీవితం ..అంటూ బస్సు దిగేశాడు...

దిగి ప్లాట్ఫారం మీద కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఆ ఊరు పేరు ఏంటా అన్న ఆలోచనలో పడ్డాడు హీరో...ఇంతలో ఆ బస్సు కదిలింది...మెల్లిగా అది ప్లాట్ఫారం నుంచి బైల్దేరుతుండగా చూశాడు ఆ బస్సు ముందు పెట్టిన తుని బోర్డు ప్రక్కన చిన్న అక్షరాలతో రాసిన "వయా రాజానగరం, అన్నవరం" అక్షరాలని.. హీరో కి ఫ్లడ్ లైట్ వెలిగింది...రాజానగరం...ఎస్ అదే...ఇక లగేత్తాడు..."ఆపండ్రోయ్....ఆపండ్రోయ్...ఆపండ్రోయ్" అంటూ ....

                                                      ****
హీరో కాలేజీకి చేరాడు...ఆ భవన కట్టడం ఇంకా పూర్తి కానట్లు ఉంది...ఒక సైడ్ పూర్తి అవ్వడం వల్ల అక్కడ క్లాసెస్ మోదలేట్టినట్లు ఉన్నారు...కౌన్సిలింగుకి వెళ్ళినప్పుడు ఈ కాలేజీ ఏదో ఇంద్రభవనంలా చూపించారు ఒక పుస్తకంలో..పాపం నిజమే అనుకొని ఏరి కోరి ఆ కాలేజీలోనే జాయిన్ అయ్యాడు హీరో...కానీ అది అప్పుడు ఓ కాలేజీలా కాకుండా ఓ భూత్ బంగాళాలా ఉంది..

హీరో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేసి...హాస్టల్ ఫీజు కట్టి..
"హాస్టల్ ఎక్కడుంది " అడిగాడు ఆమెని
"దానవాయిపేటలో .."
"అదెక్కడుంది ..."
"రాజమండ్రిలో ..."
"సరే.. అడ్రెస్స్ ఇవ్వండి..వెళ్లి రెస్టు తీసుకొని..రేపు ఫ్రెషుగా వస్తా..." అన్నాడు హీరో
"ఒక్కసారి కాలేజీలోకి ఎంటర్ అయిన స్టూడెంట్ మళ్ళీ బైటకి వెళ్ళేది రాత్రి పదింటికి స్టడీ అవర్స్ అయ్యాకే...సో మీరెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వండి ..." అందామె చిద్విలాసంగా 
హీరోకి ఒక్క సారిగా గుండెలో వంద సునామీలు....వెయ్యి అగ్నిపర్వతాలు...లక్ష భూకంపాలు వచ్చాయి...అప్పటిదాకా ఇంటర్మీడియట్ లో రోజుకి ముప్పై నాలుగు గంటలు స్టడీ అవర్స్ తో మగ్గి మగ్గి మోడైన హీరో జీవితం, ఇంజనీరింగ్ లో అయినా ఓ వెలుగు వెలిగిద్దాం అనుకున్న ఆశలన్నీ అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోయాయి... దెబ్బతిన్నట్లు చూశాడు ఆమె వైపు ...
"ఇంజనీరింగ్ లో కూడా స్టడీ అవర్సా" అన్నాడు కూడతెచ్చుకున్న ధైర్యంతో
"అదే ఈ కాలేజీ స్పెషాలిటీ...మా రాజు గారు, ఎన్నో ఇంటర్మీడియట్ కాలేజీలు నడిపిన నైపుణ్యంతో ఈ ఇంజనీరింగ్ కాలేజీని కుడా ఆ రేంజ్ కి తగ్గకుండా నడిపిస్తున్నారు " అంది ...
ఆమె వైపు ఓ సారీ పిచ్చేక్కినట్లు చూసి ...బైటకి నడిచాడు హీరో ....

అలా బ్యాగ్ తగిలించుకొని నడుస్తున్నాడు హీరో ....అతనికి ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి ... యధాలాపంగా అటు చూసిన హీరో కళ్ళు మిల మిల మిల మెరుస్తున్నాయి ఆ అమ్మాయిని చూసి...వైట్ చూడిదార్ మీద పువ్వుల ఎంబ్రాయిడరీ..ఆరంజ్ కాలర్ దుపట్టా... గాలికి ముఖం మీద పడుతున్న కురులని తన సుకుమారమైన చేతులతో సున్నితంగా సవరిస్తూ..విడివడకుండానే నవ్వులు పూయిస్తూ కిలోలు కిలోలు ముత్యాలు రాల్చే లేత గులాబీ రంగు పెదవులు ...ఎవరీ అద్భుతమైన లావణ్యవతి... ఏం జరుగుతుంది..ఆమే హీరో ముందు వచ్చి ఆగింది ...
"ఇక్కడ హాస్టల్ ఫీజు ఎక్కడ కట్టాలి" అంది 
"ఆ...అలా వెళ్లి రైట్ కి తిరగండి ..." అన్నాడు
"థాంక్స్..." అంటూ వెళ్ళబోయిన ఆమెను "మీది ...ఏ ఊరు " అని అడిగాడు హీరో 
"అమలాపురం " అంది ...
అమలాపురంలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా?..వావ్ ఇదంతా గోదావరి మహిమ... ఈ అమ్మాయి పుట్టిన కోనసీమ జన్మ తరించింది పో.... సడన్ గా హీరో కి ఆ కాలేజీ అంటే అభిమానం మొదలైంది..

"ఉరకలై గోదావరి ...ఉరికె నా వడిలోనికి ..." అంటూ అతని గుండె పాడింది నడిచి వెళ్తున్న ఆమెని చూసి ...
"సొగసులై బృందావని విరిసే నా సిగలోనికి ..." అంటూ ఆమె అతనివైపు తిరిగి పాడినట్లు ఊహించుకున్నాడు... 
"జత వెతుకు హృదయానికి శ్రుతి తెలిపె మురళీ ...."

ఇంతలో  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుండి ప్యూన్ పరిగెత్తుకుంటూ హీరో దెగ్గరికి వచ్చి "మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు " అన్నాడు ....
హీరో పిచ్చ హ్యాపీ అయిపోయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లోపలికి వెళ్లాడు...ఆ అమ్మాయి అక్కడే ఉంది..ఏదో ఫారం ఫిల్ చేస్తుంది...హీరో ఆ అమ్మాయి వైపే చూసుకుంటూ మేడం దెగ్గరికి వెళ్ళబోయి ప్యూన్ దెగ్గరికి వెళ్ళాడు ..ప్యూన్ గాడు "మేడం అక్కడ ..." అన్నాడు ..
మాకు తెలుసులే అన్నట్లు ఫేసు పెట్టి హీరో మేడం దెగ్గరికి వెళ్లాడు 
"మీరు ఇందాక సైన్ చెయ్యడం మరచిపోయాడు ...ఇక్కడ సైన్ చెయ్యండి ..." అంది ...
హీరో సైన్ చేసి వెళ్లబోతుండగా...మేడం ఆ సైన్ చూసి "మీ పేరు ?" అంది హీరో ని ...
"రామకృష్ణా రెడ్డి ...."అని హీరో ఆ అమ్మాయినే చూసుకుంటూ బైటకి వెళ్లాడు .....

అతని గుండెలో మళ్ళీ అదే సాంగ్ "ఉరకలై గోదావరి ...ఉరికె నా వడిలోనికి ..." అంటూ ....

                     ------------కుదిరితే మళ్ళీ కలుద్దాం -  రామకృష్ణా రెడ్డి

Friday, June 4, 2010

సాఫ్టువేర్ సింహా...


"సింహా ఎక్కడ?"
"ఇంకా ఆఫీసుకి రాలేదు సార్.."
"ఇడియట్...వచ్చాక నా కాబిన్ కి రమ్మను..." అంటూ వెళ్లాడు ప్రాజేక్ట్ మేనేజర్ (PM)...

****సీన్ పార్కింగ్ బేస్మెంట్ కి మారుతుంది****

ఒక బ్లాక్ స్కార్పియో ఆఫీసు గేటు పైనుండి ఎగ్గిరి దూకి సరాసరి పార్కింగ్ లాట్ లో ల్యాండ్ అవ్వగా... అక్కడ ఉన్న ఒక సెక్యురిటీ గార్డ్ బిత్తరపోయి తత్తరపడతాడు..
అందులో ఉన్న వ్యక్తి, కాదు ఒక శక్తి, మామూలుగా డోర్ తీసుకొని కాకుండా డోర్ బద్దలుకొట్టుకొని బయటకి వచ్చాడు, ఆ దెబ్బకి కార్ డోర్ ఎగ్గిరి సెక్యురిటీ గార్డ్ తల మీద పడింది...వాడు దెబ్బకి అక్కడే బబ్బున్నాడు..
"నేను ఆఫీసు నుంచి సాయంత్రం వచ్చేసరికి కొత్త డోర్ ఉండాలి.. లేకపోతే రేపు డోర్ బదులు నిన్ని విసిరేస్తా.." అంటూ వెనుక కూర్చున్న ఒకతనికి చెప్పి ఆఫీసు లోకి యంటర్ అవుతాడు సింహా..

"సింహా...పి.యం గారు మిమ్మల్ని తన కాబిన్ కి రమ్మన్నారు !!"...చెప్పాడతను
"కుయ్యా గాడికి మూడింది ..." అంటూ సింహా నడిచి వెళుతుంటే ఒక బండ పిల్ల అతన్ని చూస్తూ చొంగతో సహా పైట కూడా జార్చుకొని "వావ్...మగాడంటే ఇతనే.. సింహం నడుస్తున్నట్లుంది.." అంటూ కార్చుకున్న చొంగతో ఆమె కీ బోర్డు తడిచిపోయింది..

సింహా డైరెక్ట్ గా పి.యం కాబిన్ కి వెళ్లి కుర్చోలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని " ఊ..." అంటాడు...
"మిష్టర్ సింహా నీకు ఈ మధ్య కోడింగ్ ఎక్కువైంది, తగ్గించు... ఇంకోసారి ఇన్ని బగ్గులు వస్తే ..." అతని మాట పూర్తికాకుండానే..
"ఇష్ ష్ ష్ ష్....నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను..ఆప్షన్ ఏ, కోడింగ్ రాసి బగ్గులు లేకుండా టెస్టింగ్ చెయ్యమనడం...ఆప్షన్ బీ, బగ్గు చూపించిన వాడి బుర్రని బండకేసి బాదడం.."
"ఏం పిచ్చి పిచ్చిగా ఉందా...నా సంగతి తెలీదేమో..."
"నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచెయ్యాలి...అలా కాదని మోకాలులో ఉన్న నీ బుర్ర పనిచేసిందో, నీకు జీవితంలో నెక్స్ట్ అప్రైజల్ ఉండదు..."
పి.యం కరెంటు షాక్ కొట్టిన కాకిపిల్లలా అలాగే బిగుసుకుపోయాడు ..

సింహా తన డెస్క్ దెగ్గరికి రాగానే అందరూ చాలా టెన్షన్ గా ఉన్నారు..
"ఏమయింది "అడిగాడు సింహా..
"ఈ ప్రోగ్రాం ఎవ్వరికీ రావట్లా... ఇంకో గంటలో డెలివరీ.." అంటాడు ఒకతను..
"సరే...నేను పది నిముషాల్లో ఈ ప్రోగ్రాం రాస్తా... మీరంతా కాస్త దూరంగా పొండి..నేను ప్రోగ్రాం రాసేప్పుడు ఎవరూ చూడకూడదు.." అంటూ వాళ్ళని ఒక పదడుగులు దూరంగా పంపించి ప్రోగ్రాం రాస్తుండగా, పి.ఎం అటువైపుగా వచ్చి వీడు ఇంత సీరియస్ గా ఏం చేస్తున్నాడబ్బా అంటూ మిగతా వాళ్ళు వద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా సింహా కంప్యూటర్ లోకి తొంగి చూడబోతుండగా... సింహా సడన్ గా పి.యం వైపు తిరిగి ...."చూడు... ఒక స్క్రీన్ వైపే చూడు...దాని వెనకున్న గూగుల్ స్క్రీన్ చూడకు...తట్టుకోలేవ్...మా....డి...పోతావ్ .." అని గాండ్రించడంతో వీచిన గాలి మరియు సింహం జొల్లు వచ్చి పి.ఎం మొహాన పడటంతో, పి.యం ఎగ్గిరి సెక్యూరిటీ గార్డ్ కాళ్ళ మీద పడతాడు ... సెక్యురిటీ గార్డ్ "దీర్ఘ సుమంగళీ భవ" అని దీవించడంతో "థూ...దీనెమ్మ జీవితం ..." అంటూ తిట్టుకొని సింహా దెగ్గరికి వెళ్తాడు ..

"రేయ్ ఏంట్రా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావ్...ఈ ఆఫీసు ఏమన్నా నీదా?"
"ఒకసారి దేన్నైనా నాది అనుకున్నానంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలీదు ..." ఆ మాటతో జోళ్ళు కార్చుకున్న బండ పిల్ల సిగ్గుల కాలిఫ్లవర్ అయ్యి, స్మశానంలో డ్యూయాట్ వేసుకోడానికి అర్జెంటుగా స్కూటీ తాళాలు తీసుకొని బైల్దేరింది ..
"అయితే పి.ఎం అని కూడా చూడకుండా నానామాటలు అంటావా?" దెబ్బతిన్నట్లుగా మొహం పెట్టాడు పి.యం..
"సారీ...నేనిలా మాట్లాడకూడదు....కంప్యూటర్ కొడకా, గుడ్డలూడదీసి అమ్మాయిల కాబిన్ ముందు నిల్చోబెడతా..."
"రేయ్...నిన్నూ ..." పి.యం గాడి బీపీ 3,30,300/2,200 దాటింది ...
"మూస్కోరా కుయ్యా...నీ మేనేజర్ పోస్ట్ కి వంద రూల్స్ ఉండొచ్చు అవి నీ కాబిన్ లో , కానీ ఈ కాంపౌండ్ లో ఒకటే రూల్...నేను మాట్లాడాలి నువ్వినాలి ... వన్ వే ట్రాఫిక్ ...వినూ... నీ మీద జొల్లు పడితే నీకేక్కడో కాలుద్దేమో, నా కంప్యూటర్ లోకి తొంగి కోడింగ్ చూస్తే నాకిక్కడ కాలుద్ది (మోకాలిపై వేలు పెట్టి చూపిస్తూ ..)...ఇక్కడా గానీ కాలిందనుకో (కింది పెదవిని పంటితో బిగిస్తూ ..)..నేను వాగేటప్పుడే సొంత బ్రెయిన్ వాడుతా, కోడింగ్ చేసేటప్పుడు అస్సలు వాడను...ఎటు పక్కకి మొదలెట్టి ఎటు పక్కకి తీసుకెళ్తానొ...నాకే తెలిదు...దబిడి దిబిడే.... ప్రోగ్రామర్, మేనేజర్, సి.ఈ.ఓ , క్లయింట్ (తల్లీ తండ్రి గురువు దైవం టైపులో) అంటారు...మేనేజర్ గా నువ్వు ఫెయిల్, ప్రోగ్రామర్ గా నేను చేస్తున్నా...  నీకు నీ పి.యం పోస్టే కావాలో దాని జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకొని నాకు చెప్పు.....ఫో ...." సింహం గర్జించడం ఆగింది ... అక్కడ కొంత సేపు నిశ్శబ్దం...తరువాత (షాక్ నుంచి తేరుకున్నాక ...) బల్ల మీద దరువేస్తూ సింహాన్ని అభినందించారు..

ఆ అవమాన భారం భరించలేక పి.యం వెళ్లి సెక్యురిటీ గార్డ్ బూట్లు రెండు నిముషాలు అరువడిగి, వాటితో ఎడా పెడా చెంపల్ని వాయించుకొని...ఇంటికెళ్ళి టాం అండ్ జెర్రీ చూస్తూ తీవ్రంగా ఆలోచించగా ఒక ఆలోచన మెరిసింది .... తరువాత రోజు వెళ్లి సింహ గురుంచి CEO కి కంప్లైంట్ చేసాడు పి.యం...

తరువాత  కొద్దిసేపట్లో సింహ CEO ముందు కుర్చోని ఉన్నాడు ... కాలు మీద కాలేస్కోని కుడి అరచేతిని వేళ్ళతో నలుపుకుంటూ వేళ్ళ వైపు చూసుకుంటూ ఉన్నాడు ..
"ప్రోగ్రామర్ అయ్యుండి మీరిలా చేయ్యడమేంటి..." అడిగాడు CEO..
"ఒక ప్రోగ్రామర్ గా ప్రోగ్రామ్ లో బగ్గులు లేకుండా చూసిచూడనట్లు పొమ్మని టెస్టర్లకు చెబుతాను...అలాగే ఒక యంప్లాయిగా పి.ఎం లాంటి పదోన్మాదులను ఎండగడతాను.."
"అతనేమన్నా తప్పు చేస్తే మాకు చెప్పు... CEOగా నేనున్నానుగా .."
"CEO నా....ఉన్నారా?...ఎక్కడ ?" ...CEO నీళ్ళ బదులు టై నమిలాడు ....
"వంద మంది కలిసి వంద రోజులు శ్రమించి పాలిండ్రోమ్ ప్రోగ్రాం రాసి క్లైంట్ కిస్తే, ఆడు వాళ్ళందరిని ఆంగ్లంలో అమ్మనాబూతులు తిట్టినప్పుడు....No CEO .... రోజుకి ఎనిమిది పనిగంటల్లో పద్దెనిమిది నిముషాలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి అయిదుకి రెండు రేటింగ్ ఇచ్చినప్పుడు...No CEO ....ఆర్కుట్, ఫేస్బుక్, యాహూ లాంటి సైట్లు బ్లాక్ చేసి ఏంతో మంది ప్రేమికుల కన్నీళ్లకు కారణమైనప్పుడు ....No CEO .... రెస్ట్ రూముల్లో తుడుచుకోడానికి సానిటరీ పేపర్లుండగా ఇంకా నీళ్ళెందుకని వాటర్ సరఫరా కాస్ట్ కట్టింగ్ అని కట్ చేసినప్పుడు....No CEO ..... వార్షిక స్టార్ అవార్డ్స్ లో గత రెండేళ్ళగా బెంచి మీద కూర్చొని రోజుకి ఎనిమిది గంటలు క్యారమ్స్,టేబుల్ టెన్నిస్ తదితర ఆటలు ఆడి తన ప్రతిభ చూపించిన నా స్నేహితుడుకి మొండి చెయ్యి చూపించినప్పుడు....నో....C.....E......O..... అలాంటిది ఇప్పుడొక కుయ్యా  పి.యం ని రెండు మాటలంటే నోరు లె..గు...స్తుం...దే  ..ఏం?? ....ఇప్పటిదాకా ఎలా అయితే NO CEOనో...ఇక మీదట కూడా No CEO  ... Program is made up of rules, but not Google..." సింహం కళ్ళల్లో మంటలు ... సింహం కంఠంలో ఉరుములు చూసిన CEO తను ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాడో... తనని షాజహాన్ మహాభారత యుద్ధంలో ఎందుకు ఓడించాలేదో...పశ్చిమ నైజీరియా పంటపొలాల్లో తను కట్టుకున్న గూటికి వెళ్లి నిదానంగా ఆలోచించుకోవాలి అని బైల్దేరాడు ....

CEO ని కలిసి డెస్క్ దెగ్గరికి వస్తున్న సింహాకి ఒక టెస్టర్ ఎదురయ్యాడు.. 
"నీ ప్రోగ్రాంలో నేను బగ్గులు పట్టాను...ఏం చేస్తావ్ భే...." అన్న టెస్టర్ వైపు చూసి "నీ లాంటి పిల్ల పాం-టాప్ గాళ్ళతో నేను మాట్లాడను .. వెళ్లి కంప్యూటర్ లో సోలిటైర్ ఆడుకో...ఫో ...." అంటూ చెయ్యి విదిలించాడు సింహం .... 
"ఛా...నువ్వేదో పెద్ద మెయిన్ ఫ్రేమ్ అన్నట్లు మాట్లాడుతున్నావ్ ... నా చేతులో నీ ప్రోగ్రాములన్నీ ఇకనుండి బలి .."
"గూగుల్ లో వెతికినా కనపడని సింటాక్స్ లతో ప్రోగ్రాం రాసి మొహాన కొట్టానంటే, దాన్ని అర్థం చేసుకొని డీ-బగ్ చెయ్యడానికి నీ తాతలు దిగి రావాలి .. అది ఒక ఆప్షన్ .. అలా కాదు అంటే, నీ ఆయువుపట్టు మీద ఒక్క పిడి గుద్దు గుద్దానంటే మెడికల్ టెస్టులు చేయించుకోడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు ....ఏ ఆప్షన్ కావలి ..చాయిస్ ఈజ్ యువర్స్ ..." అంటూ డెస్క్ లో కూర్చొని గాండ్రించింది సింహం ..సింహం అరుపులు తట్టుకోలేక అంతక ముందే రోజే జాయిన్ అయిన పిల్ల టెస్టర్ ఆలస్యం చెయ్యకుండా పేపర్లు పెట్టేసాడు .....

CEO పిచ్చి పట్టి పారిపోయాడని తెలిసి, పి.యం కూడా సైలెంట్ గా జంప్ అయ్యాడు... మెల్లిగా సింహం కంపెనీని హస్తగతం చేసుకొని "Simha Technology Services" గా పేరు మార్చి, అందులో చేరే ఔత్సాహిక ఇంజినీర్లకు రాత పరీక్ష నిర్వహించడం మొదలెట్టాడు ...అందులో కొన్ని ప్రశ్నలు :
-->  పి.యం ని ఎలా బెదరకొడతారు?
--> CEO కి పది నిముషాల్లో పిచ్చెక్కించడం ఎలా?
--> డవలప్పర్లు టెస్టర్లకు అసలైన "టెస్ట్" ఏంటో చూపించడం ఎలా?
--> అమ్మాయిలను కేవలం నీ నడకతో ఎలా చొంగ కార్పిస్తావు?
--> కేవలం కొన్ని నెలల్లో ఒక కంపెనీని ఎలా చేజిక్కించుకుంటావు?
--> ఎలాంటి ప్రోగ్రాం అయినా.. గూగుల్ లో చూసి పది నిముషాల్లో చేసి క్లయింట్ మొహాన పడేయ గలికే సత్తా ఉందా? ఉంటే, ఎలాగో నిరూపించుము?

[సింహా చిత్రాన్ని ఆధారంగా చేసుకొని సరదాగా రాసింది మాత్రమె ...మీరు కూడా సరదాగానే తీసుకోండి ..సరేనా :)...సింహా చిత్రం చూసిన వాళ్ళు ఈ టపాతో బాగా కనెక్ట్ అవ్వగలరు ...మిగతావాళ్ళకి కొంచెం కాంఫ్యుజింగ్ గా ఉండొచ్చు ....- కిషన్ రెడ్డి ]