Sunday, June 13, 2010

జావా...ఇంగ్లీష్...సైన్స్...ఫిజిక్స్


వెంకట్ సార్ ఆ కుర్రోడి జావా రికార్డ్ ల్యాబ్ లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు కోపంగా విసిరేసి "వెళ్లి తీసుకురా .." అని అనడం వరసగా నాలుగోసారి అదే రోజు అదే ల్యాబ్ సెషన్ లో .. పాపం ఆ కుర్రోడు కష్టపడి ఆ చివరివరకు నడుచుకుంటూ వెళ్లి రికార్డు తెచ్చి వెంకట్ సార్ కి ఇచ్చాడు ముచ్చటగా నాలుగోసారి ... అచ్చు ఇలాగే అదేదో చిత్రంలో ఒకావిడ కుక్కకి ట్రైనింగ్ ఇస్తుంది ...ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి ....

"అసలిది రికార్డేనా... ప్రతి ప్రోగ్రాంలో వంద బగ్గులు ...జావాలో C,C++,C# అన్నీ కలిపి తాళింపు పెడితే ఇలాగే ఏడుస్తాయి ప్రోగ్రామ్స్ ... అసలీ కోడింగ్ ఏంటి ?.. అసలీ స్టేట్మెంట్స్ ఏంటి?? .. కంప్యూటర్ లో ఈ ప్రోగ్రాం కంపైల్ చేస్తే కెవ్వు కెవ్వు మని కాలు తెగిన కోడిలా అరుస్తుంది కంప్యూటర్ ...నీకు రికార్డులో మాత్రం అవుట్ పుట్ భలే వచ్చేస్తుంది  ... నువ్వు కంప్యూటర్ కి అర్థం కావు ...." అంటూ అయిదోసారి విసిరేశాడు రికార్డు ..ఈ సారి ఆ కుర్రోడు వెళ్ళలేదు ...జావ తాగడం అంటే ఎంత చిరాకో, జావా ప్రోగ్రాం అంటే అంతకన్నా అసహ్యం ఆ కుర్రాడికి ... జావాకీ తనకి జాతకరిత్యా కంప్యూటర్ గండం ఉందని పక్కింటి పంతులు గారు ఏనాడో చెప్పారు ... అలా నిండు ల్యాబ్ లో తనని అవమానించడం సహించని ఆ కుర్రాడు, సర్ చేతులో ఉన్న రికార్డు (ఎవరిదో?) లాక్కొని బలంగా విసిరేసాడు ... అదెళ్లి బండ పాప వీపుకి తగిలినా ఆమెకి ఈగ వాలినట్లు కూడా లేకపోవడంతో ...కుర్రాడు విసురుగా బైటకి వెళ్లాడు .... వెంకట్ సర్ కి మండింది ...

"రామకృష్ణని రేపటి నుండి జావా ల్యాబ్ కి రావాద్దని చెప్పండి ..."
బైటకి వెళ్లి నడుస్తున్న తనకి ఆ మాటలు వినిపించాయి ...అంతే, అతను జ్ఞాపకాల టైం మెషిన్ ఎక్కి ఓ పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు .....

                                                  ****

ముక్కుపచ్చలే కాదు...మూతికి అంటుకున్న కొబ్బరి పచ్చడి కూడా ఆరిన ఆ పసి మగవాడు అప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు....
ఓ రోజు టీచర్ క్లాసులో ఆ పిల్లాడ్ని పిలిచి "క్యాట్ స్పెల్లింగు రాసి తీసుకురా ..." అంది
మనోడు బుద్దిగా పలక మీద తుపుక్ అని ఊసి...దాన్ని సుబ్బరంగా తుడిచి దాని మీద "KAT" అని రాసి టీచర్ కి చూపించాడు ... టీచర్ అది చూసి "KAT కాదు  CAT అని రాయాలి " అని చెప్పింది ... మనోడు వెంటనే 'క' కి 'C' ఇంగ్లీష్ పెళ్ళాం అని డిసైడ్ అయ్యాడు... కాని 'క' కి 'K' కూడా సెకండ్ సెటప్ అని తెలుసుకోలేకపోయాడు ...

టీచర్ మరునాడు అదే సుకుమార బాలుడిని పిలిచి "కైట్ స్పెలింగ్ రాసి తీసుకురా..." అంది ... మనోడు తెగ సంబర పడిపోయి, బహుసా టీచర్ కి తనంటే ఇష్టమనుకున్నాడో లేక తను రాబోయే కాలానిని పరుగెత్తుకొచ్చే ఐన్ స్టీన్ అన్న విషయం టీచర్ కి తెలిసిపోయిందేమో అనుకున్నాడో, వెంటనే పలక మీద "CITE" అని రాసి పరిగెత్తుకొచ్చి టీచర్ కి చూపించాడు ...టీచర్ అది చూసి, టపక్ అని ఓ మొట్టి కాయ వేసి "CITE కాదు KITE... ఇలా స్పెల్లింగులు తప్పురాస్తే రేపు పరీక్షలో తప్పి కూర్చుంటావు...వెధవా" అంది ... మనోడి చిట్టి మనసు గాయపడింది...ఆ గాయం పుండైంది...అది మంటెక్కుతుంది...టీచర్ ఆ పుండు మీద మళ్ళీ ఎండు మిరప కారం చల్లుతూ "కోకోనట్ స్పెల్లింగు రాయి అంది ..."..మన బుజ్జి బాబుకి 'క' మొదటి పెళ్ళాం 'C' ని ఎంచుకోవాలో...సెకండ్ సెటప్ 'K" ని ఎంచుకోవాలో అర్థంకాక...ఈ సారి సెకండ్ సెటప్ కి చాన్స్ ఇద్దామని "KOKONAT" అని రాశాడు....వెంటనే మొట్టికాయ ...
"కైండ్ ...స్పెల్లింగ్ .."....."CIND"....మొట్టికాయ ...
"కామిల్ స్పెల్లింగ్ .."...."KAMIL"....మొట్టికాయ ..
"కంగారో స్పెల్లింగ్ .."...."CANGARO"...పెద్ద మొట్టికాయ ...
"క్రోకోడైల్.."...."KROKODAIL"...లాగి లెంపకాయ ...  అన్ని కాయలని ఒకేసారి పాపం మనోడు తినలేకపోయాడు ...
అప్రతిహతంగా తన మీద కొనసాగుతున్న స్పెల్లింగుల దాడికి భీతిల్లి, నడి క్లాస్ లో తన ఈడు బ్యుటీస్ ముందు తన మీద జరుగుతున్న ఘోర అత్యాచారాన్ని భరించలేక...పలక విసిరేసి...మోకాలి దాక జారిపోయిన నిక్కర్ ని ఎగ్గట్టి...పరుగో ..పరుగు ...

"రేపటి నుండి రామకృష్ణని నా క్లాస్ కి రావద్దని చెప్పండి ..."

                                                      ****
"పొట్టి లాగు వయసు లోంచి పాంటు లోకి వచ్చాను .....మీసం నేను పెంచుతాను ..." అంటూ కాలర్ ఎగరేసి ... ఇంకా ఆనవాళ్ళు కూడా లేని మీసం మీద వేలుపెట్టి, వంశం అంటూ మీసం తిప్పే వాళ్ళ సినిమాలు చూసి, ఆ పిల్లాడు కూడా పెదవికి ముక్కుకి మధ్య ప్లేస్ లో రెండు చివర్లా దురద పుట్టినట్టు గోక్కునేవాడు ....ఆ పిల్లాడు అప్పుడు ఏడవ తరగతికి వచ్చాడు ....

క్లాసులో  కేరళా సైన్స్ మిస్సు లీలామా చెపుతున్న విషయం చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆ పిల్లాడు ...
"లెసన్ చెప్పినప్పుడు ...శ్రద్ధగా విని ... కాన్సెప్టు బాగా అర్థం చేసుకోవాలి ... ముఖ్యమైన పాయింట్లు నోట్స్ లో రాసుకోవాలి ... సొంతంగా ఆలోచించాలి ... పరీక్షల్లో కూడా సొంత బుర్రనే ఉపయోగించి సమాధానాలు రాయండి ... " అన్న ఆమె సందేశం ఆ పిల్లాడికి తారక మంత్రంలా తోచింది ....

వెంటనే తారక మంత్రాన్ని అమలు చేసాడు ... ముఖ్యంగా సొంత బుర్ర ఉపయోగించి సమాధానాలు రాయడం అన్న పాయింట్ ఈ పిల్లోడికి తెగ నచ్చేసింది ... పెద్ద పులి లాంటి సైన్స్,మాథ్స్ కాన్సెప్టుల మీద తన చిట్టెలుక లాంటి బుర్రని ఉస్కో అని  ఉసిగొల్పి.. బుర్రని పలు భాగాలుగా విడగొట్టి, ఒక్కో భాగానికి  ఒక్కో కాన్సెప్టు అప్పజెప్పి....పీకి పాతరేసి ..మొత్తానికి క్వార్టర్లీ పరీక్షలు రాశాడు...

ఆ పిల్లోడు బాగా టెన్షన్ పడే క్షణాలు - టీచర్ ఆన్సర్ పేపర్లు కరక్షన్ చేసి క్లాసుకి తీసుకొచ్చి...డెస్క్ మీద పడేసి ...అందరి వైపు భయపెట్టేలా ఒక బ్లాంక్ ఫేస్ పెట్టి.. పెదవి విరిచి ...లాభం లేదు అందరూ పూర్ పర్ఫామెన్స్ అని చెప్పి ఒక్కొక్క ఆన్సర్ షీట్ ఇస్తూ సస్పెన్స్ మైంటైన్ చేస్తూ... ప్రతిసారీ ఆఖరిగా ఆ పిల్లోడి ఆన్సర్ షీట్ ఇచ్చేది ...ఈ లోపు మనోడు టెన్షన్ తట్టుకోలేక గోళ్ళు తినడమో అవి లేక చాక్ పీస్ తినడమో,లేకపోతే బెంచ్ మీద బరా బరా గోకడమో..అవి కూడా ఫలించకపోతే బుర్రని బెంచీ కేసి ధనా ధనా కొట్టుకోవడమో చేస్తుంటాడు ...

క్వార్టర్లీ పరీక్షల పేపర్లు దిద్ది క్లాస్ రూంకి తీసుకువచ్చింది మేడం... సస్పెన్స్ ఏమాత్రం తగ్గకుండా అందరి పేపర్లు ఇచ్చాక మనోడి పేపర్ తీసుకొని "ఇలారా..." అని పిలిచి చెవుపట్టుకొని మెలితిప్పుతూ "ఏంటీ మార్కులు ...నూటికి ఏడా ??.." అంది ...ఆ మాట చెవిన పడగానే పిల్లోడు షాక్ కొట్టిన బల్లిలా అయిపోయాడు...  పేపర్ చూసుకొన్నాడు, బిట్స్ లోనే వచ్చాయి ఆ ఏడు మార్కులు కూడా.. మిగతా షార్ట్, లాంగ్ అన్సర్స్ అన్నీటినీ ఎర్ర పెన్నుతో పెట్టి ఎడా పెడా కొట్టి అవతల పారేసింది మేడం...

ఎంతో కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే కూలిపోతుంటే కలిగే బాధ కలిగింది ఆ పిల్లోడికి... "నేను ఎంతో కష్టపడి రాశాను మేడం ఎందుకు అన్నీ ఇలా కొట్టేశారు..." అడిగాడు, కళ్ళ నుండి జలజలా పారుతున్న ప్రవాహాన్ని కాలర్ తో తుడుచుకుంటూ... "కష్టపడి రాస్తే మార్కులు వెయ్యరు...కరెక్టుగా రాస్తే వేస్తారు ..." అన్న మేడం సెటైర్ కసక్కున వచ్చి ఆ పిల్లోడి గుండెల్లో గుచ్చుకుంది ..."నేను తప్పెక్కడ రాసానో చూపించండి ..." అన్నాడు రోషంగా... "కరెక్ట్ ఎక్కడ రాసావో నువ్వే చూపించు ..." మళ్ళీ సెటైర్ ... మనోడు వెంటనే ఆన్సర్ పేపర్ లో కోస్చేన్స్ కి తను రాసిన ఆన్సర్స్ గట్టిగా టీచర్ కి వినిపించేలా చదవడం మొదలెట్టాడు ..."ఆపు ... నేనిచ్చిన నోట్స్ పట్రా ..." అంది ...పిల్లోడు వెళ్లి నోట్స్ తీసుకొచ్చాడు ...ఇప్పుడు చదువు....నువ్వు రాసిన ఆన్సర్స్ నేను నోట్స్ లో చెప్పిన ఆన్సర్స్ కంపేర్ చెయ్యి ... అంది మేడం ... మనోడు దెబ్బతిన్నట్లు చూశాడు మేడం వైపు... "మీరు నోట్స్ లో చెప్పినట్లు నేను రాయలేదు ...మీరే కదా సొంతంగా ఆలోచించి రాయమన్నారు పరీక్షల్లో ... అలాగే రాసాను .." అన్నాడు

"నేను టెస్టు పుస్తకంలో ఉన్నదాన్ని కాచి వోడపోసి మీకు నోట్స్ ఇచ్చింది ఎందుకు ... అది చూసి చదువుకుంటారు అనే కదా... ఇప్పుడు ఇలా లేని పోని సొంత బ్రెయిన్ ఎందుకు ఉపయోగించడం ... నేను ఇప్పుడంటే ఇప్పుడు సొంతంగా రాయమని చెప్పలేదు ...జనరల్ గా చెప్పాను ... అయినా మీకు నేను అరిపండు వలిచినట్లు అన్నీ అన్సర్స్ ఇస్తుంటే ... చదవడానికి ఏం గాడు ... పైగా సొంతంగా రాశాడట "
"అయినా మేడం ...కనీసం నేను రాసిన ఆన్సర్ అయిన చదివారా... మరీ పూర్తిగా కొట్టేసెంత దారుణంగా నేనేమి రాయలేదు ..."
"ఇలా కొట్టేస్తే ఈ సారాన్నా బుద్ధిగా నా నోట్స్ ఫాలో అవుతావని అలా చేశా ...వెళ్ళు వెళ్లి ఆన్సర్స్ అన్ని కంఠతా పెట్టు ..." అంది

ఆ పిల్లోడికి ఈత కొట్టడం ...చెట్లు ఎక్కడం ... కంఠతా పెట్టడం ఎప్పటికీ రావు ... పదిహేను లైన్ల ఆన్సరుని కంఠతా పెట్టడం కోసం ప్రతి లైనూ వంద సార్లు చదివినా...చివరికి మొత్తం కలిపి చెప్పలేక పోయేవాడు...అసలు అంతంత పెద్ద ఆన్సర్స్ ని కంఠతా ఎలా పెడతారు అనేది అతనికి అంతుచిక్కన ప్రశ్న.... ఆ మధ్య టీవీలో ఏదో వాణిజ్య ప్రకటనలో 'బ్రెయిన్ పవర్ కోసం బ్రెయినోవీటా వాడండి ...ఎంత పెద్ద జవాబు అయినా ఒక్క సారి చదివితే చాలు ఇట్టే కంఠతా పెట్టయ్యగలరు' అని రావడంతో మనోడు ఇదేదో బోర్నవీటలా బాగుందే అనుకొని, ఇంట్లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసి ఆ బ్రెయినోవీటా కొనడానికి నిధులు సంపాదించి దాన్ని కొనుక్కొని ... వస్తూ వస్తూ వినాయకుడి గుడికి వెళ్లి బ్రెయినోవీటాకి అష్టోత్తరం అర్చనా చేయించి ... ఆ డబ్బాకి అన్నివైపులా బొట్లు పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు ... గుళ్ళో పూజారి గారు చెప్పిన సుభ ముహూర్తం అర్థరాత్రి పన్నెండింటికి కావడంతో, అప్పటిదాకా మేలుకొని కరెక్టుగా పన్నెండింటికి చిన్న పూజ చేసి పుస్తకం తెరిచి బ్రెయినోవీటా ఓపెన్ చేసి ...ఒక చెంచా తిన్నాడు ...అబ్బా కారెట్ హల్వాలా ఎంత బాగుందో అనుకొని ఒక పేజి చదివాడు ... చదవగానే ఆ పేజి తనకి తనే అప్పజెప్పుకోడానికి ట్రై చేశాడు ...అబ్బే ...ఒక్క లైన్ కూడా గుర్తురాలేదు ...కొంచెం ఎక్కువ తినాలి కాబోలు అనికొని మూడు స్పూన్లు తిని మళ్ళీ ఓ పేజి చదివి, గుర్తుతెచ్చుకోడానికి ప్రయతించాడు ...ఉహూ ఈ సారీ ఆ సబ్జక్ట్ పేరు కూడా గుర్తురావట్లా ... ఇక లాభం లేదని బ్రెయినోవీటా అలియాస్ కారెట్ హల్వాని మొత్తం తినేసాడు సుబ్బరంగా ... ఆ వెంటనే ఆవులిస్తూ నిద్రపోయాడు ....

"నేను కంఠతా పెట్టను మేడం ....నేను ఇలాగే రాస్తాను ..." ఎదురుతిరిగాడు పిల్లోడు ...
"షటప్ ....వెళ్లి ఒక్కొక్క ఆన్సర్ వెయ్యి సార్లు ఇంపోజిషన్ రాసి రాసుకురా ..."
మనోడికి తిక్క నషాలానికి ఎక్కింది ...చేతులో ఉన్న ఆన్సర్ షీట్ విసిరి కొట్టి ... బాగ్ తీసుకొని బైటకి పరిగెత్తాడు ...

"రేపటి నుండి రామకృష్ణని నా క్లాస్ కి రావద్దని చెప్పండి .."

                                                      ****

S = ut + 1/2 at2
V2 = (R2/R1 + R2) Vs
Sinθ1/Sinθ2 = λ1/λ2 = V1/V2

పైవి యేవో ఫిజిక్స్ ఫార్ములాలు అనుకున్నారా ?..కావచ్చు ...కానీ అవి రోజూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ అబ్బాయికి అర్థరాత్రి కలలో వచ్చి భయపెట్టే దెయ్యాలు కూడా ... ఫార్ములాలని దెయ్యాలు అని చెప్పి దెయ్యాల్ని కించపరిస్తే సారీ, ఆ ఫార్ములాలు దెయ్యాలా కన్నా డేంజర్ ... పాపం పిల్లోడు రోజూ నిద్రలో వెర్రి కేకలు పెట్టేవాడు ..."వద్దు ...నన్నేం చెయ్యద్దు ... మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకోవద్దు " అంటూ కలవరించేవాడు ...ఓ రోజు ఐన్ స్టీన్ కలలో వచ్చి E=MC2 లో C ఏంటో చెప్పమని ఆ పిల్లోడి ప్రాణాలు తోడేసాడు ...మరోరోజు పైథాగరస్ అనే మహానుభావుడు వచ్చి మూడు గీతలు గీసి, రొండు గీతల పొడువు నేను చెప్తా, మూడోది నువ్వు చెప్పుకో చూద్దాం అంటూ కేరింతలు కొట్టాడు ... మరో కాళరాత్రి ఫిజిక్స్ లెక్చరర్ దేవీప్రసాద్ కలలో వచ్చి "రెండు రైళ్ళు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా వస్తున్నాయి ....అవి రెండూ గుద్దుకోకుండా ఉండాలంటే ఆ రెండు రైళ్ళ డ్రైవర్లు ఎంత డిస్టెన్స్ లో బ్రేకులు అప్లయ్ చెయ్యాలి ... దీనికి జావాబు చెప్పు.. దీనికి ఏ ఫార్ములా అప్లయ్ చేస్తావు ..తప్పు చేస్తే ఆ రెండు రైళ్ళలో ఉన్న వందలాది మంది ప్రాణాలు పోవడానికి నీవే కారణం అవుతావు ..." అంటూ యస్వీ రంగారావులా భయంకరంగా రాక్షసంగా నవ్వాడు ... కలలో ఈ ఫిజిక్స్ హింస భరించలేక "కేవ్ వ్ వ్ వ్ వ్ వ్ వ్ ..." మని చెవులుమూసుకుంటూ లేచి వెర్రి కేక పెట్టేవాడు ఆ కుర్రాడు అర్థరాత్రి ...పాపం రోజూ కలలో ఫిజిక్స్ మహామహులంతా మూకుమ్మడిగా ఆ పిల్లోడిపై మానసిక ఫిజిక్స్-అత్యాచారం సాగిస్తుండటంతో వేసిన వెర్రి కేకలకు పక్కన ఉండే కుర్రాడు హడలి చచ్చేవాడు ...

"సార్ ...నాకీ ప్రాబ్లం రావడం లేదు ..." దేవిప్రసాద్ దెగ్గరికి వెళ్లాడు పుస్తకం తీసుకొని ఆ పిల్లోడు స్టడీ అవర్లో ...
"ఆ ప్రాబ్లం ఏంటో చదువు..."
"ఒక మనిషి A అనే నగరం నుండి V1 అనే వేగంతో బైల్దేరాడు ...మరో మనిషి B అనే నగరం నుండి V2 అనే వేగంతో బైల్దేరాడు ...వాళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటారు ?...ఏం మాట్లాడుకుంటారు? ...A గాడి ఇల్లు B గాడి ఇంటి నుంచి ఎంత దూరం? ... A గాడు బెంజ్ వాడటం వల్ల, B గాడు ఫియట్ వాడటం వల్ల వాళ్ళు కలుసుకునే వేళల్లో మార్పు ఉండగలడా? ...A గాడు ఆఫీసు వెళ్ళాక B గాడు A గాడి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు?..A గాడు ఆఫీసుకి అని చెప్పి B గాడి ఇంటికి వెళ్లుంటాడు అని A గాడి పెళ్ళాం అనుమానించి B గాడిని ఇంటికి ఆహ్వానించడం సబబేనా ?....వాళ్ళిద్దరి కాపురాల్లో జరుగుతున్న చిచ్చుని ఏ ఫార్ములా అప్లయ్ చేసి పరిష్కరిస్తావో వివరింపుము?...ఇది సార్ ప్రశ్న ...మొన్న IITలో వచ్చింది .." అన్నాడు పిల్లోడు

"గుడ్ ...మంచి ప్రశ్న ..నువ్వెళ్ళి ఫిజిక్స్ లో ఉన్న అన్ని ఫార్ములాలు వెతికి..అర్థం చేసుకొని .. ఏది దీనికి సూట్ అవ్వుద్దో నిర్ణయించుకొని .. దీన్ని సాల్వ్ చెయ్యి ..." అన్నాడు ...
"అది నా వల్ల కాదు సర్ ... "
"అవుతుంది ...వెళ్ళు ...దీన్ని సాధించు ..."
"ఇప్పటికే చాలా సాధించాను సర్ ...రాత్రుళ్ళు మెరుపు కలలు...పగలేమో ఈ గ్రంథంలోని సృష్టి రహస్యాలు ...ఇక నా వల్ల కాదు సర్ ..."
"ఏం పిచ్చి పిచ్చిగా ఉందా....తప్పి కూర్చుంటావు తిక్క వెధవా !! ..."
"చాలు సర్...చాలు...చిన్నప్పటి నుంచి నేను ఈ డైలాగ్ వినీ వినీ చెవులు తుప్పు పట్టాయి ...ఇక చాలు .. ఈ ఇంగ్లీష్,సైన్స్,ఫిజిక్స్ వల్ల నేను కోల్పోయింది చాలు ...కనీసం రాత్రి సరిగా నిద్ర కూడా పోవట్లేదు సర్ ...పిచ్చి పిచ్చి కలలు ... వాటి వల్ల నేను పెట్టె వెర్రి కేకలు ...నవ్వుతున్నారు సర్ పక్కన ఫ్రెండ్స్ .. ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చి ఉస్కో అని మా మీద వదలడంలో ఉండే ఆనందం మీకు తెలుసు, కానీ ఆ ప్రాబ్లంకి ఏ ఫార్ములా పెట్టాలో అర్థంకాక లాక్కొని పీక్కుంటుంటే లేచే పిచ్చి మీకు తెలీదు ... పదిహేనేళ్ళగా ఏంట్రా నా జీవితం అని చూసుకుంటే..అందులో ఇంగ్లీష్, సైన్స్,ఫిజిక్స్ లే ఉంటాయి సర్ ...నేనుండను ...." అంటూ పుస్తకం విసిరేసి ... బాగ్ తీసుకొని లగేత్తాడు మనోడు ....

"రేపటి నుండి రామకృష్ణని నా క్లాస్ కి రావద్దని చెప్పండి ...."

                                                          ****  
Hope you had a great weekend,takecare - Ramakrishna Reddy Kotla.

22 comments:

diamond said...

Your narration is simply superb....
me blog last month lo chusanu rendu rojullo anni chadivesanu antha baagunnay kishan garu :)

మాలా కుమార్ said...

మరింతకీ ఇప్పుడు ఆ రామ కృష్ణ ఏం చేస్తున్నాడు ? జీవాలు కాసుకుంటున్నాడా ?

శివరంజని said...

బోలెడు బంధువులని ఇచ్చారు కదా ఇంగ్లీష్ లెటర్స్ మీకు ఋణపడి ఉంటాయి.
నవ్వలేక చస్తున్నాము.....
"రేపటి నుండి రామకృష్ణని బ్లాగ్ కి రావద్దని చెప్పండి ..."

ఆ.సౌమ్య said...

బాబోయ్ కేకో కేక....చివరి డవిలాగులు మాత్రం సూపరు....హమ్మ భలే నవ్వించారండీ :)

సతీష్ said...

Hilarious..:)) చాలా బాగా వ్రాసారు
ఇవి కేక :
>>కష్టపడి రాస్తే మార్కులు వెయ్యరు...కరెక్టుగా రాస్తే వేస్తారు ..
>>పైథాగరస్ అనే మహానుభావుడు వచ్చి మూడు గీతలు గీసి, రొండు గీతల పొడువు నేను చెప్తా, మూడోది నువ్వు చెప్పుకో చూద్దాం అంటూ కేరింతలు కొట్టాడు
>>ఇప్పటికే చాలా సాధించాను సర్ ...రాత్రుళ్ళు మెరుపు కలలు...పగలేమో ఈ గ్రంథంలోని సృష్టి రహస్యాలు
>> ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చి ఉస్కో అని మా మీద వదలడంలో ఉండే ఆనందం మీకు తెలుసు, కానీ ఆ ప్రాబ్లంకి ఏ ఫార్ములా పెట్టాలో అర్థంకాక లాక్కొని పీక్కుంటుంటే లేచే పిచ్చి మీకు తెలీదు
>>పదిహేనేళ్ళగా ఏంట్రా నా జీవితం అని చూసుకుంటే..అందులో ఇంగ్లీష్, సైన్స్,ఫిజిక్స్ లే ఉంటాయి సర్ ...నేనుండను(బొమ్మరిల్లు స్టైల్)

Ram Krish Reddy Kotla said...

ప్రస్సు : చాలా థాంక్స్ మీ అభిమానానికి :-)

మాలాకుమార్ : పాపం ఏదో మీ దయవల్ల ఇప్పుడు చెన్నై లో ఒక MNC లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు లెండి. Thanks for the comment.

రంజని: బాగానే రుణ పడ్డాయి లెండి ...హా హా ..సో ఇప్పుడు మీరు కూడా మొదలెట్టారా రేపటినుండి రావద్దని ..సరే రానులెండి ...నేను రాకపోతే ఆకాశవీధిలో సీరియల్ ఎవరు కంప్లీట్ చేస్తారు రంజని గారు..మీరు చేస్తారా మరి ??.. ఇంకా రాయలేదని నా మీద కత్తులు నూరుతున్నారు సౌమ్య గారు :-(

Ram Krish Reddy Kotla said...

సౌమ్య : మిమ్మల్ని అంత నవ్విన్చినందుకు నేను ధన్యుడిని...

సతీష్ : థాంక్స్ ...మీకు నచ్చినందుకు, నచ్చినవి కోట్ చేసినందుకు :-)

Unknown said...
This comment has been removed by the author.
చదువరి said...

:) సూపరండీ Ramacrishna Reddi గారూ!

నేస్తం said...

>>>"రెండు రైళ్ళు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా వస్తున్నాయి ....అవి రెండూ గుద్దుకోకుండా ఉండాలంటే ఆ రెండు రైళ్ళ డ్రైవర్లు ఎంత డిస్టెన్స్ లో బ్రేకులు అప్లయ్ చెయ్యాలి ... దీనికి జావాబు చెప్పు

నిజమే ఇలాంటి ప్రశ్నలు చూడగానే నాకు ఏడుపొచ్చేసేది.. అది సరే గాని టీక్చర్ చేతిలో బుక్ విసిరివేయడం.. ఎదిరించడం వంటి పనులు రామ క్రిష్ణ నిజం గానే చేసాడా?? లేదా వీళ్ళకు ఏం తెలుస్తుందిలే అని కోతలా :)

Ram Krish Reddy Kotla said...

చదువరి : థాంక్స్ :-)

నేస్తం : రామకృష్ణ చెయ్యడు అనుకున్నారా ?...చెయ్యలేడు అనుకున్నారా??... అదే మీసం ...అదే రోషం ...అదే పౌరుషం... బుక్ విసిరేసి పరిగెత్తడంలో అదే చాకచక్యం :-)

పరిమళం said...

:) :)

Ram Krish Reddy Kotla said...

పరిమళం గారు థాంక్స్ :)

హను said...

nice one anDi, chala bahga raSaru superb

Ram Krish Reddy Kotla said...

Hanu, thanks a lot :)

కవిత said...

-->తప్పి కూర్చుంటావు తిక్క వెధవా !!
-->పదిహేనేళ్ళగా ఏంట్రా నా జీవితం అని చూసుకుంటే..అందులో ఇంగ్లీష్, సైన్స్,ఫిజిక్స్ లే ఉంటాయి సర్ ...నేనుండను(బొమ్మరిల్లు స్టైల్)
కేక.అదుర్స్ ...జావా అంటే మరీ అంత బయమా??ఒక్క ప్రోగ్రాం లో 100 బాగ్గులా????ఐతే మీకు మంచి భావిష్యత్హే ఉంది ........

శిశిర said...

చాలా బాగా రాశారు. మీరు హ్యూమర్ టచ్ తో రాసినా చాలా మంది విద్యార్ధుల ప్రస్తుత పరిస్థితి ఇదే. ఇష్టంలేని, అర్థంకాని చదువులు.

Lakshmi said...

a very good narration..mee writings lo humour chala baguntundandi

RaaGa said...

Wow, that was excellent screenplay with real humour touch. In your style as usual :)

Ram Krish Reddy Kotla said...

@ కవిత : అవును..నిజమే మంచి భవిష్యత్తే...కానీ జావాలో కాదు సుమండీ...

@ శిశిర : ఉన్న మాట అనారు :)

@ లక్ష్మి: మీ అభిమానానికి ధన్యవాదాలు :)

@ రాగ : థాంక్స్ :)

Sai Praveen said...

Superb!!
ఫిజిక్స్ క్వశ్చన్ అదిరింది. :)

Ram Krish Reddy Kotla said...

Thank you praveen :)