Wednesday, September 8, 2010

ముకుందాపురం రైల్వే స్టేషన్

వర్షం జోరుగా కురుస్తుంది...
ముకుందాపురం  రైల్వే స్టేషన్ లో ఉన్న చిన్నపాటి షెల్టర్ క్రింద జనాలు చేరిపోవడంతో, మిగతా స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది...

ప్లాట్  ఫారం మీద గుడ్డిఎంకడి వేణుగానం, వర్షంతో తాళం వేస్తున్నట్లుగా ఉంది...తలా ఓ రూపాయో అర్థో అతని ముందు వేసి వెళ్తున్నారు...

"136 డౌన్ రేపల్లె పాసింజర్..... రాజన్న వెళ్లి గంట కొట్టు..." కేకేశాడు స్టేషన్ మాస్టర్ గది బైటకి వచ్చి ..
"అట్టాగే సారూ ..." అంటూ అతను పరిగెత్తుకుంటూ వెళ్లి .. మూడు గంటలు గబాగబా కొట్టేసి, షెల్టర్ కిందకోచ్చేసేడు..
ముకుందాపురం స్టేషన్ లో ఆగే రైళ్ళు రెండే రెండు...ఒకటి రేపల్లె పాసింజర్, మరోటి విజయవాడ పాసింజర్..
రేపల్లె  పాసింజర్ కరెక్టుగా సాయింత్రం నాలుగింటికి రావాల్సిన బండి, ఏ రోజూ ఆరులోపు వచ్చిన పాపాన పోలేదు..
కానీ అదేంటో విజయవాడ పాసింజర్ మాత్రం మా టంచనుగా వచ్చేస్తుంది...

అంత  వర్షంలోనూ పైట తలపై కప్పుకొని తడుచుకుంటూ స్టేషన్ కి వచ్చింది ఆవిడ...యాభై ఏళ్ళు పైనే ఉంటాయి ఆమెకి..వణుకుతూ వచ్చి షెల్టర్ లో ఓ మూలాన కూర్చుంది...
రైలు గంట కొట్టడంతో అందరూ సామానులు అన్నీ ఓ దెగ్గర పెట్టుకొని రైలు కోసం ఎదురు చూడసాగారు..
"చూడయ్యా.. రేపల్లె పాసింజర్ వచ్చిందా?" అడిగింది ఆవిడ ప్రక్కన ఉన్న అతన్ని....
"ఇంకా లేదు...గంట కొట్టాడు ఇందాకే...కాసేపట్లో వత్తాది..." అన్నాడు చుట్ట ముట్టించుకుంటూ..
"అట్టాగా...." అంటూ నుదిటి మీద అరచెయ్యి అడ్డంగా పెట్టుకొని కనుచూపు మేరల దాకా కనిపించే పట్టాలను చూస్తుంది ఆత్రుతగా...
"ఏ ఊరెళ్ళాలేంటి?" అడిగాడు అతను..
"నేనెక్కడికీ ఎల్లడం లేదయ్యా...మా అబ్బాయి వస్తున్నాడు ఈ రైల్లో....ఆడు ఇంజినీర్ సదువు సదువుతున్నాడు పట్నంలో.."
"అట్టాగా...అయినా వచ్చినోడు ఇంటికి రాకుండా ఉంటాడా...ఈ వర్షంలో తడుచుకుంటూ రాకపోతే ఏం.."
"అట్టా కాదు...ఆడు బండి దిగగానే, నేను ఆడికి కనిపియ్యాల...ఎప్పుడొచ్చినా బండి దిగగానే నన్ను సూత్తే ఆడి కళ్ళలో ఆనందం అంతా ఇంతా కాదు..."

ఇంతలో పెద్ద కూత పెట్టుకుంటూ పొగబండి రానే వచ్చింది...అది ప్లాట్ ఫారం మీద ఆగగానే, ఒక్కసారిగా సందడి మొదలయ్యింది వచ్చి పోయే జనాల ఉరుకుల పరుగులతో...
"ఎల్లమ్మా ఆ పళ్ళ బుట్టందుకోవే...."
"పెళ్లి నడక ఆపి ఒడుపు చెయ్యి...రైలు ఆట్టే ఎక్కువసేపు ఆగదు.." గదుముతున్నాడు అతను నెమ్మదిగా నడుస్తున్న పెళ్ళాని చూసి..
"మనవడా నువ్వు ముందు పరిగెత్తి ఎక్కి సీటు మీద నా తుండు ఏసి పెట్టారా...లగెత్తు..."
"వెళ్ళొస్తా నాన్నా .." అంటూ వాళ్ళ నాన్న కేసి చెయ్యి ఊపుతున్న ఆ కుర్రాడి చూపులు మాత్రం, అతని కోసమే వచ్చి దూరంగా నిలబడ్డ ఆ అమ్మాయి మీద ఉన్నాయి...ఆ పిల్ల కన్నీళ్ళు తుడుచుకుంటూ వీడికి టాటా చెప్పింది..దూరం నుంచే..

వర్షంలో తడుచుకుంటూ వచ్చిన ఆవిడ మాత్రం రైలు పెట్టేలన్నీ గాలిస్తుంది బైటనుండే "బాబూ...అనీల్...ఉన్నావా రా...టేసన్ వచ్చినాది " అంటూ అరుచుకుంటూ ..
రైలు కూత పెట్టుకుంటూ వెళ్ళిపోయింది...దానితో పాటే అక్కడి సందడిని కూడా తీసుకుపోయింది...వర్షం కూడా దాదాపు తగ్గింది...ప్లాట్ ఫారం మొత్తం మళ్ళీ ఖాళీ అయ్యింది...
ఆవిడ మళ్ళీ వచ్చి ప్లాట్ ఫారం మీద ఓ ఉన్న ఓ బెంచీ మీద కూర్చుంది దిగులుగా...

స్టేషన్ మాస్టర్ బయటకి వచ్చి ఆమె వైపు చూశాడు...ఆమె దెగ్గరికి వచ్చి .."ఇదిగో చూడమ్మా...మిమ్మల్ని నేను రోజూ చూస్తున్నాను...రోజూ రేపల్లె బండి టైంకి వస్తారు ...పెట్టేలన్నీ ఎవరికోసమో వెదుకుతారు...కానీ ఎవరూ రారు..మీరు ఇలా రోజూ రావడం దేనికి" అడిగాడు అతను..
"నా కొడుకు పలానా రోజున వత్తున్నానని ఉత్తరం ముక్క రాసాడయ్యా...చానాళ్ళయింది రాసి...ఆ రోజు ఆడు రాలేదు...మరుసటి రోజు వత్తాడేమో అని మళ్ళీ వచ్చాను...అప్పుడు కూడా రాలేదు...నా మనసు ఉండబట్టలేక రోజూ వత్తున్నాను బాబుగారు...ఇంకా రాలేదు."
"ఎప్పుడో అతను ఉత్తరం ముక్క రాస్తే, నువ్వు రోజూ రావడం దేనికమ్మా...ఎదో పని ఉండి రాలేకపోయి ఉంటాడు...అయినా ఆగిపోయిన వాడు, అతనైనా ఓ ఉత్తరం ముక్క రాయాల్సింది..." అన్నాడు..
"ఒక ఏల..నేను ఓ రోజు రాకపోయి, అదే రోజు ఆడొస్తే....ఆడు బండి దిగగానే నేను కనిపించకపోతే ఆడు సిన్నబుచ్చుకుంటాడు బాబు..."
"నీకొడుకు మీద ఎంత ప్రేమమ్మా నీకు...అతగాడికీ అంతే ప్రేమ ఉంటే, మా అమ్మ ఇలా నాకోసం రోజూ స్టేషన్ కి వచ్చి ఎదురుచూస్తుంటుందేమో అని ఒక్కసారైనా వచ్చేవాడు..లేదా ఎంటనే ఉత్తరమో ఫోనో చేసేవాడు కదా.."
"ఆడు ఇంజినీరింగు సదువు సదువుతున్నాడు బాబూ...ఆడికి ఏ అవసరం పడి రాలేకపోయాడో...అయినా రోజూ ఆమాత్రం ఆడికోసం టేసన్ కి రాలేనా బాబూ....సరే బాబూ..పోద్దుగూకుతుండాది...ఎల్లోత్తాను.." అంటూ ఆవిడ వెళ్ళిపోతుండగా, ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు స్టేషన్ మాస్టార్

                                         **** మూడేళ్ళ క్రితం ****
"సావిత్రమ్మా.. పోస్ట్...."
"నీ నోట్లో పంచదార బొయ్యా...సల్లటి మాట చెప్పావ్ గంగాధరం ...యాడనుంచి, మా అబ్బాయి కాడనుంచేనా?" అంటూ లోపలి నుంచి పరుగుపరుగున వస్తూ అంది సావిత్రమ్మ..
"అందులో సందేహమా తల్లీ...అనీల్ బాబు దెగ్గరి నుంచే..." అన్నాడు ఉత్తరం విప్పుతూ..
"ఆ ముక్కేదో తొందరగా సదివెయ్యి గంగాధరం...ఏం రాసాడు..." అందామె పైట కొంగు భుజం చుట్టూ కప్పుకొంటూ..
"అమ్మకి నమస్కారం...నేను బాగానే ఉన్నాను..నా గురుంచి నువ్వేమీ బెంగ పెట్టుకోకు...రోజూ మందులు సరిగ్గా వాడుతున్నావా?..నిన్నోక్కదాన్ని వదిలేసి నేను ఇక్కడ చదువుకోసం ఉండటం నాకు బాధగానే ఉన్నా, రేపు నిన్ను నేను బాగా చూసుకోవాలంటే పెద్ద చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి...అందుకు తప్పడం లేదు...ఇంకో ఏడాదికి చదువు పూర్తవుతుంది...వెంటనే ఉద్యోగం తెచ్చుకొని నిన్ను నాతో కూడా తీసుకువెళతాను...ఇక విషయం ఏమిటంటే, మాకు సంక్రాంతికి పది రోజులు సెలవులు...వచ్చే శనివారం రేపల్లె బండికి వస్తున్నాను...నేను దిగగానే నిన్ను చూడాలి..మర్చిపోకుండా స్టేషన్ కి రా...ఇక ఉంటాను.." అంటూ ముగించాడు గంగాధరం
"ఎంత తీపి కబురు చెప్పావు గంగాధరం...వచ్చే శనివారం వస్తున్నాడా...ఇంకా నాలుగు రోజులు ఉంది...ఈ లోపు ఆడికి ఇష్టమైనవి అన్నీ చేసెయ్యాలి..."
"ఇంకేం...మీరు ఆ పనిలో ఉండండి...సరే నే వస్తాను మరి..."
"అట్లు పోశాను...ఉండు తెస్తాను...తిని వెళ్దువు గాని ..." అంటూ లోపలి పరుగుతీసింది సావిత్రమ్మ ....

సావిత్రమ్మ తన కొడుక్కి ఇష్టమయిన పిండివంటలు సిద్దం చెయ్యడంలో మునిగిపోయింది...
ఇల్లంతా శుభ్రంగా కడిగింది...దాదాపు ఆరునెలల తరువాత వస్తున్నాడు...వాడు ఉన్నన్నాళ్ళు ఏ కష్టం రాకుండా సూడాలి అనుకుందామె....
"రవిగా...ఇంట్లో ఫాను తిరగడం లేదురా...రేపు అబ్బాయి వస్తున్నాడు, మెయిన్ రోడ్డులో మెకానిక్ రాజుని అర్జెంటుగా రమ్మన్నానని పిలువు..." కేకేసింది బడికి వెళ్తున్న ఆ అబ్బాయిని ఉద్దేశించి...
"అట్టాగే అత్తా ..." అంటూ పరుగు తీసాడు ...
"మర్చిపోకు అల్లుడా...."

శనివారం రానే వచ్చింది...సావిత్రమ్మకి ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు...ఆమె కొడుకును చూడబోతున్న సంతోషంలో ఉంది...
"సావిత్రమ్మా....ఈ రోజే పెన్షన్ ఇస్తున్నారు...నువ్వెళ్ళి తెచ్చుకో..." ఇంటికొచ్చి చెప్పాడు రంగయ్య... 
సావిత్రమ్మ భర్త చనిపోయాక రంగయ్య ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు..ఆమెని ఓ తోబుట్టువులా చూస్తాడు..
"ఈ రోజు నా కొడుకు వస్తున్నాడు...నేను టేసన్ కి ఎల్లాలి అన్నయ్యా..."
"అనిల్ వచ్చేది రేపల్లె పాసింజర్ కి కదమ్మా...అది సాయంత్రం ఆరు దాటాక గానీ రాదు...ఈ లోపు నువ్వెళ్ళి పెన్షన్ తెచ్చేసుకోవచ్చు...ఈ రోజు నువ్వు తీసుకోకపోతే, మళ్ళా నీ చేతికి వచ్చేదానికి చాలా రోజులు పడతాది..పెన్షన్ డబ్బులే కదమ్మా మీకు ఇప్పుడు ఆదరువు..." అన్నాడు రంగయ్య
"నిజమే రంగయ్యా...అట్టాగేలే...ఎళ్ళి తెచ్చేసుకుంటా..ఎట్టగూ అనిల్ కి కూడా ఏదైనా డబ్బు అవసరం ఉండి ఉంటుంది...ఆ డబ్బు వాడికి ఉపయోగపడుతుంది.."

మధ్యాహ్నం పన్నెండింటికల్లా పెన్షన్ ఆఫీసుకి వెళ్ళింది సావిత్రమ్మ...
పెన్షన్ ఇచ్చే ఆఫీసరు ఇంకా రాలేదట...
"బాబూ...ఎన్నింటికి ఇత్తారు బాబూ పెన్షను..." అడిగింది సావిత్రమ్మ అక్కడున్న క్లర్క్ ని
"నాకేం తెలుసమ్మా...గంటలో ఇవ్వొచ్చు...రెండు గంటల్లో ఇవ్వొచ్చు...అసలు ఈ రోజు ఇవ్వకపోనూ వచ్చు..." అన్నాడు చెవిలో అగ్గిపుల్ల పెట్టి తిప్పుకుంటూ ...
"మా రంగయ్య ఈ రోజే ఇస్తారని చెప్పాడే...లేట్ అయితే మా అబ్బాయి వచ్చే రైలుకి టైం అయిపోతాది...కొంచెం ఇవరంగా సేప్పయ్యా..."
"ఏంటమ్మా నీ నస..పెన్షన్ గావాలంటే వెయిట్ చెయ్యాలి మరి...అప్పనంగా తినే గవర్నమెంటు సొమ్ము కదా...కూసింత వెయిట్ చెయ్యండి..." అన్నాడు నిర్లక్ష్యంగా
అతని మాటలకి నొచ్చుకుంటూ వెళ్లి బల్ల మీద కూర్చుంది సావిత్రమ్మ...
అప్పటికే అక్కడ కొందరు వృద్ధులు పెన్షన్ కోసం కూర్చొని ఉన్నారు....
సావిత్రమ్మ అలాగే కూర్చొని ఎదురు చూస్తుంది...ప్రతి అయిదు నిముషాలకోసారి గుమ్మంకేసి చూస్తుంది, ఎవరైనా వస్తున్నారా అని...
టైం గడిచిపోతుంది...గడియారం కేసి చూసింది...అయిదు కావచ్చింది...
ఇంకో గంటలో బండి వచ్చేస్తుంది, ఇక లాభం లేదనుకొని లేచింది వెళ్దామని...సరిగ్గా అప్పుడే వచ్చాడు పెన్షన్ ఆఫీసరు...
అతను రావడంతో,కాసేపు తటపటాయించి...తీసుకునే వెళ్దాం అనుకుంది సావిత్రమ్మా..
అప్పటిదాకా కూర్చున్న వాళ్ళు ఆ ఆఫీసర్ ని చూడగానే వెళ్లి క్యు కట్టారు...అతను నెమ్మదిగా కౌంటర్ తెరిచి..ఒక్కొక్కళ్ళకి పెన్షన్ ఇవ్వసాగాడు...

మధ్యలో ఎవరో ఓ ముసలాయన పెన్షన్ ఆఫీసర్ తో గొడవకు దిగాడు..తనకి రావాల్సిన మొత్తం రాలేదని..ఇచ్చేదాకా అక్కడ నుంచి కదలనని గొడవ చేయ్యసాగాడు..ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగి, మిగతా వారికి పెన్షన్ ఇవ్వడం లేట్ అయ్యింది.. సావిత్రమ్మకి ఎక్కడ రైలు బండి వేళకు తను స్టేషన్ కి చేరుకోలేనేమో అని దిగులుగా ఉంది.. మొత్తానికి కాసేపట్లో సావిత్రమ్మ చేతికి పెన్షన్ వచ్చింది..డబ్బు తీసుకొని ఆగ మేఘాల మీద స్టేషన్ కి దారితీసింది...వేగంగా నడుస్తూ ఉంది..ఒక్కసారిగా ఆమెకి ఆయాసం దానితో కూడుకున్న దగ్గు విపరీతంగా మొదలయ్యింది...అలా దగ్గుతూనే ఉండటం వల్ల నోట్లో నుండి కొంచెం రక్తం పడటం..అది చూసుకొని "మాయదారి రోగం...అబ్బాయి వచ్చినప్పుడు రాకుండా ఉంటే బాగుండు...లేకపోతే ఆడు బాధపడతాడు...ఆడు చక్కగా చదవాలి..నేను సంతోషంగానే ఉన్నాను అని ఆడికి తెలియాలి..." అనుకుంటూ దెగ్గరిలో ఉన్న బోరింగు దెగ్గరికి వెళ్లి నీళ్ళు పుక్కిలించి శుభ్రం చేసుకొని, మళ్ళీ నడక ప్రారంభించింది...

స్టేషన్ దరిదాపుల్లోకి వచ్చింది..
ఎదురుగా చుక్కాలు వస్తుంది..చుక్కాలు రోజూ పట్నంలో స్కూల్లో ఆయా పని చేసి, సాయంత్రంకల్లా రేపల్లె బండికి ఊరికి చేరుకుంటుంది...చుక్కాలుని చూసేసరికి సావిత్రమ్మకి ఒక్కసారిగా దిగులు పట్టుకుంది "ఏంటే సుక్కాలు...బండి వచ్చేసినాదా?" అంటూ పరుగులాంటి నడకందుకుంది...
చుక్కాలు ఏమీ మాట్లాడకుండా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది...సావిత్రమ్మ ముఖం వైపు కూడా చూడలేకపోతుంది..ఏదో బాధ కనిపిస్తుంది చుక్కాలులో...చుక్కాలు చేతులు వణకడం గమనించలేదు సావిత్రమ్మ...
"ఏంటే..మూగి దానిలాగా మాట్లాడవు...బండి వచ్చేసినట్లు ఉండాదిగా..నువ్వందులోనేగా వస్తావు...అనిల్ కనిపించాడా?"
కానీ చుక్కాలు మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకుండా...అలాగే నడుచుకుంటూ వెళ్తుంది...
"ఇదో తిక్కలది..." అంటూ సావిత్రమ్మ వేగంగా నడుచుకుంటూ స్టేషన్ చేరింది...
లోపలకి వెళ్ళింది సావిత్రమ్మ...చాలా మంది జనాలు ఉన్నారు...ఏంటి కొంపదీసి ఇంకా రైలు రాలేదా?...రాకుండా ఉండే బాగుండు దేవుడా...నా కొడుకు రైలు దిగినాక నేను ఆడికి కనపడాలి..అయినా రైలు రాకపోతే చుక్కాలు ఎట్టా వచ్చింది...ఆ మూగి మొహం ఒక్క మాట కూడా మాట్లడకపోయే అనుకుంటూ...చూస్తుండగా...స్టేషన్ మాస్టర్ సుధాకరరాజు ఆమె దెగ్గరికి వచ్చాడు..

                                     ***** ప్రస్తుతం *****

డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరాడు స్టేషన్ మాస్టర్ రాజారం...స్టేషన్ ప్రక్కనే ఉంటుంది అతను క్వార్టర్...రిటైరుమెంటుకి దెగ్గరిలో ఉన్నాడు..మూడు నెలల క్రితమే ట్రాన్స్ఫర్ అయ్యి ముకుందాపురానికి వచ్చాడు..అంతకముందు బాపట్ల స్టేషన్ మాస్టారుగా పనిచేసాడు..అయన భార్య ఓ ఏడాది క్రితమే కాలంచేసింది..ఇద్దరు పిల్లలూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు..పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి..రిటైర్ అయ్యాక కొడుకుల దెగ్గర ఉండి, మనవాళ్ళతో ఆడుకోవాలని కోరిక రాజారాంకి..

"అయ్యగారూ...డిన్నర్ తీసుకువచ్చాను" అంటూ క్యారియర్ టేబుల్ మీద పెట్టాడు రాజన్న..
"అలాగే రాజన్న..నువ్వేలేకపోతే నేనేమైపోయేవాడినో రాజన్నా...నా అవసరాలన్నీ నువ్వే చూస్తున్నావ్..ఈ ఊరిలో నాకున్న బంధువువి నువ్వొక్కడివే.." అన్నాను అభిమానపూర్వకంగా
"భలేటోరే అయ్యగారు...మీలాంటి మంచి సారుకి ఆమాత్రం చెయ్యలేనా..."
"సరే..నువ్వు కూడారా...కలిసి తిందాం.." అంటూ రెండు ప్లేటులు తీసాడు రాజారాం...
"నేను ఇంటికాడ తింటాలే మీరు కానియ్యండయ్యా .."
"అదేం కుదరదు...నువ్వు ఇప్పుడు నాతో పాటు తినాల్సిందే.." అంటూ రాజన్నకి కూడా వడ్డించాడు ప్లేట్ లో..

 ఇద్దరూ కలిసి తింటుండగా...రాజారాం మాట్లాడుతూ "నాక్కిక్కడ చాలా నచ్చింది రాజన్న..వచ్చి మూడు నెలలే అయినా, ఈ ఊరు చాలా ప్రశాంతంగా అనిపించింది..పెద్దగా పని వత్తిడి లేదు..రిటైర్ అయ్యేదాకా నాకు ఇక్కడ బాగానే ఉంటుంది.." అన్నాడు 
"ముకుందాపురం మహిమ అట్టాంటిది అయ్యా...ఈ ఊరికి వచ్చినోళ్ళు ఈ ఊరుని ఈ జనాలనీ మర్చిపోరు.."
"నిజమే...నా కంటే ముందు స్టేషన్ మాస్టారుగా పనిచేసింది ఎవరు?"
"మీకంటే ముందు గోపాలం గారు ఉన్నారు...కాని చెప్పుకోవలసింది ఆయకన్నా ముందు ఉన్న సుధాకరరాజు గారి గురించి...గొప్ప మనిషి..మంచికి మారు పేరు..ఆయనంటే అందరికీ గౌరవం..ముకుందాపురం రైల్వే స్టేషన్ ఈమాత్రం అయినా అభివృద్ధి చెందింది అంటే అది ఆయన వల్లే...కానీ మంచోళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది..మూడేళ్ళ క్రితం జరిగిన ఓ ఆక్సిడెంటుకి ఆయన బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసాడు..."
"అయ్యో...అలాగా..అయినా ఏదీ మన చేతుల్లో లేదులే రాజన్నా...ఆ చెప్పడం మరచాను...రోజూ ఒక ఆవిడ స్టేషన్ కి వస్తుంటుంది రేపల్లె బండి టైంకి...రోజూ పాపం తన కొడుకు రైల్లో వస్తాడేమో అని ఆశగా చూస్తుంది...ఈ రోజు ఆవిడతో మాట్లాడాను..పాపం ఆవిడని చూస్తే జాలేసింది..ఆ వయసులో కూడా కొడుకు కోసం రోజూ స్టేషన్ కి వస్తుంది..నువ్వెప్పుడైనా గమనించావా రాజన్న ఆమెని.." అడిగాడు రాజారాం..
"మీరు చెప్పేది సావిత్రమ్మ గురుంచే కదా.."
"ఆమె పేరు తెలీదు...కానీ ఆమె కొడుకు మీద కోపం వచ్చింది..ఆ తల్లి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇన్ని రోజులు రాకుండా ఉంటాడా..ఎప్పుడో వచ్చేవాడు కదా..." అన్నాడు ఉద్వేగంగా..
"అందులో అతని తప్పేమీ లేదు రాజారం గారు..." నెమ్మదిగా చెప్పాడు రాజన్న..
వింతగా చూసాడు రాజారం అతని వైపు...
"ఉంటే కదా రావడానికి...అనిల్ బాబు చనిపోయి మూడేళ్ళు.."
దిగ్బ్రాంతిగా చూసాడు రాజారం రాజన్న వైపు...

"ఇదే స్టేషన్ లో, రైలు దిగి పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు డీ కొట్టింది..అదంతా దురదృష్టం..ఈ ఊరిస్టేషన్ కి అప్పుడు ఓవర్ బ్రిడ్జి లేదు..మామూలుగా ఏ బళ్ళూ పెద్దగా రావు కనుక అందరూ పట్టాలు దాటి వెనుక వైపు నుండి బైటకి వెళ్తారు..ఆ రోజు మాత్రం మృత్యువే ఆ గూడ్స్ రూపంలో వచ్చింది..ఇది తన తప్పుగానే సుధాకర్ గారు భావించారు...అందుకే రాజేనామా చేసారు" అన్నాడు 
"మరి..మరి...సావిత్రమ్మ రోజూ ఇలా ..."

"కొడుకు మీదే ఆమెకి ఉన్న ఆశలన్నీ...కొడుకంటే పంచ ప్రాణాలు..ఆమె భర్త అనిల్ బాబు చిన్నతనంలోనే చనిపోయాడు..చాలా కష్టపడి పెంచి ఇంజినీరింగ్ చదివించింది కొడుకుని...ఎప్పుడు చూసినా కొడుకు గురుంచే మాట్లాడుతుంది..కొడుకుని చూడకుండా అస్సలు ఉండలేదు, అయినా ఆడి చదువుకోసం ఏళ్ల తరబడి ఒక్కత్తే ఉంటుంది...'ఎందుకు సావిత్రమ్మ ఒక్కదానివే నీకిన్ని కష్టాలు' అంటే 'కష్టాలేముంది అయ్యా..నాకొడుకు సదువు అయ్యి పట్నంలొ ఆడికి ఓ ఉద్యోగం వస్తే, ఆడితో పాటే నన్ను కూడా తీసుకెళతాడు..' అంటుండేది...కానీ దేవుడు ఇలా అర్ధాంతరంగా....ఇంకా ఘోరం ఏమిటంటే, ఆ ఆక్సిడెంటు జరిగినప్పుడు తన కొడుకు కోసం ఆమె స్టేషన్ కి వచ్చింది..సుధాకర్ గారికి ఆమెతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు..కొడుకు మీద పంచప్రాణాలు పెట్టుకున్న తల్లికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా..కానీ చెప్పడం ఆయన ధర్మం..ఆమెని కొడుకు మృతదేహం దెగ్గరికి తీసుకువచ్చి..విషయం చెప్పి..ఆమెకి చూపించాడు..ఆమె చూసింది..గుండె పగిలితే ఏడుపు కూడా రాదేమో..ఆమెలో చలనం ఏమీ లేదు..అలానే చూస్తుండి పోయింది..ఆమె గొంతు పెగల్లేదు..కొడుకుని అలా చూసిన క్షణమే ఆమె మానసికంగా చచ్చిపోయింది..ఆమె ఆ తరువాత ఎప్పటికీ మామూలు మనిషి కాలేకపోయింది...పిచ్చిది అయ్యింది...కొడుకు విగత జీవుడిగా కనిపించినప్పుడు ఆమెకి కలిగిన గుండె కోత బహుసా ఆ దేవుడికి కూడా అర్థమయ్యి ఉండదు..ఉంటే ఇలా జరిగేదే కాదు.. కొడుకు చనిపోయిన విషయమే ఆమెకి గుర్తులేదు..ఇంకా కొడుకు వస్తాడనే అనుకుంటుంది..అదీ ఒకందుకు మంచిదేనేమో, చనిపోయిన కొడుకుని తలచుకుంటూ పడే మానసిక క్షోభ కన్నా, ఆడు బతికే ఉన్నాడు..రేపో మాపో తన కోసం వస్తాడు అనుకొనే పిచ్చితనమే మేలేమో...ఆ రోజు నుండి ప్రతి రోజూ స్టేషన్ కి రావడం..ఎదురు చూడటం ..వెళ్ళడం...మూడేళ్ళుగా ఆమె స్టేషన్ కి రాని రోజు లేదు...కొడుకు చనిపోయిన రోజు ఆమె స్టేషన్ కి ఆలస్యంగా వచ్చింది...సరైన టైంకి ఆమె వచ్చి ఉండి ఉంటే, ఈ ప్రమాదం తప్పి ఉండేదేమో...అంతా రాసి పెట్టినట్లే జరగుతుంది కాని మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి..." అన్నాడు రాజన్న..

                                ***
"136 డౌన్ రేపల్లె పాసింజర్..... రాజన్న వెళ్లి గంట కొట్టు..." కేకేశాడు రాజారం...
రాజన్న వెళ్లి గంట కొట్టాడు...
ప్లాట్ ఫారం మీద మళ్ళీ సందడి...కొద్దిసేపట్లో సావిత్రమ్మ వచ్చింది...
రైల్ రావడం...వెళ్ళడం..జరిగిపోయాయి...
"నీ కొడుకు ఈ రోజు కూడా రాలేదామ్మా.." అడిగాడు రాజారం 
"లేదయ్యా..." అంది ఆయాసపడుతూ...
"రామ్మా కాసేపు లోపల కూర్చుందువుకాని.."
"లేదు..ఎల్లాలయ్యా..." అంటూ నెమ్మదిగా లేచి వెళ్ళింది సావిత్రమ్మ... 
ఆమెనే చూస్తూ నిలబడ్డాడు రాజారం..అప్రయత్నంగా చెమ్మగిల్లాయి అతని కళ్ళు...

A story and script by  ----- Ramakrishna Reddy Kotla.

Friday, August 13, 2010

One Missed SMS

 2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

"అమ్మా..flat చాలా బాగుంది..5th ఫ్లోర్..Liked it a lot..ఆఫీసుకి కూడా చాలా దెగ్గర..మంచి వెంటిలేషన్.." చెప్తుంది కీర్తి వాళ్ళ అమ్మతో ఫోన్లో..
"అవునా...జాగ్రత్త బంగారం..అసలే కొత్త ప్రదేశం..చుట్టుప్రక్కన ఇళ్ళ వాళ్ళని పరిచయం చేసుకో..."
"హబ్బా..మొన్నటిదాకా అమెరికాలో ఉండొచ్చిన దాన్ని నాకు చెప్తావేంటమ్మా.."
"నువ్విప్పుడు ఉంటున్నది అమెరికా కాదే...హైదరాబాద్..సరేలే కాని, నిన్న నాన్నగారు నీకు ఈ-మెయిల్ చేసిన అబ్బాయి ఫోటో చూసావా ...నచ్చాడా?"
"మొదలెట్టేసావా...అనుకుంటున్నా ఇంకా మొదలెట్టలేదెంటా అని...ఒక్క 2 years గ్యాప్ ఇవ్వవే..ఫుల్ గా లైఫ్ ఎంజాయ్ చేసి, అప్పుడు నువ్వు ఎవడిని చూస్తే వాడిని కట్టేసుకుంటా...ప్లీజ్"
"పెళ్లి చేసుకోవే తల్లీ అంటుంటే, లైఫ్ ఎంజాయ్ అంటావేంటే తిక్కల బొంతా....అసలు ఆ అబ్బాయి గురుంచి చెప్పాలంటే..."
"అమ్మా...రేపు తీరిగ్గా వింటాను..నాకు నిద్రొస్తుంది...గుడ్ నైట్..." అంటూ ఫోన్ పెట్టేసింది కీర్తి...

బాల్కనీలోకి వెళ్లి చుట్టూ చూసింది..కనుచూపు మేరలదాకా వీధి దీపాలతో మెరిసిపోతూ ఉంది భాగ్యనగరం..చల్లటి గాలి ముఖానికి తాకుతుండగా, వెంటనే కాఫీ తాగాలనే ఆలోచన వచ్చింది కీర్తికి..తనకి అప్పుడప్పుడు ఇలా మిడ్నయిట్ కాఫీ తాగుతూ చల్లటి గాలికి బయటకూర్చోని అలా చంద్రుని కేసి చూడటం చాలా ఇష్టం..అనుకున్నదే తడవుగా కాఫీ పెట్టుకొని కప్పుతో బాల్కనీకి వచ్చి చంద్రుని వైపు చూసుకుంటూ..ఐ-పోడ్ లో పాత పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంది..అందులో ఉన్న గొప్ప అనుభూతి కేవలం తనకి మాత్రమే తెలుసు...

టైం పన్నెండున్నర కావస్తుండగా, పడుకుందామని బెడ్ రూమ్ కి వచ్చి బెడ్ మీద వాలింది...కొత్త ప్రదేశం కావడం మూలాన ఓ పట్టాన నిద్రపట్టడం లేదు కీర్తికి..అటూ ఇటూ మెసలడమే సరిపోతుంది..ఇంతలో బైట రివ్వున వీస్తున్న గాలి మరీ ఎక్కువ కావడంతో హాల్లో కిటికీలు టపా టపా కొట్టుకోవడం మొదలెట్టాయి..తను లేచి వెళ్లి కిటికీలు మూసి, వెనక్కి మళ్ళగా ఒక్కసారిగా కరంట్ పోయింది..'కొంచెం గాలి ఎక్కువైతే చాలు కరెంట్ పీకి పారేస్తాడు..ఛా..' అనుకుంటూ తవిళ్ళాడుకుంటూ బెడ్ రూమ్ వైపు వెళ్తుండగా దేన్నో తట్టుకొని కిందపడింది..తడిమి చూడగా అదేదో బుక్ షెల్ఫ్..ఆ షెల్ఫ్ క్రింద లోపల ఏదో తళుక్కుమని కనిపించడంతో చేత్తో దాన్ని పట్టుకొని చూసింది..ఏదో పుస్తకం...కాదు డైరీ..అంత చీకట్లోనూ..ఆ డైరీ మీద తళుక్కుమంటున్నాయి 2008 అని అంకెలు....
                                                                        *****
2008 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్. 

కౌశిక్ చాలా టెన్షన్ గా ఉన్నాడు..ప్రతి సెకండు ఒక యుగంలా గడుస్తుంది ఆతనికి...స్వప్న నుండి ఇంకా SMS ఎందుకు రాలేదు..ఉత్తరం చదివే ఉంటుంది..మరి ఎందుకు ఇంకా తను SMS చెయ్యలేదు ..ఎమన్నా తేడా జరిగితే తను బ్రతకడు..స్వప్న తనకి ప్రాణం కన్నా ఎక్కువ..ఆమె నుండి తిరస్కారం భరించలేడు..దానికన్నా మరణమే ఆతనికి సంతృప్తిని కలిగిస్తుంది..
ఇంతలో...టింగ్..టింగ్...అంటూ మోగింది SMS టోన్ తన మొబైల్ లో...
వణుకుతున్న చేతులతో మొబైల్ తీసుకున్నాడు...
"Read SMS" అనే బట్టన్ నొక్కడానికి అతని చేతుల్లో ఉన్న బలాన్ని మొత్తం ఎవరో లాగేస్తున్నట్లు ఉంది...
వణుకుతున్న చేతులతో బట్టన్ నొక్కి చూసాడు...
"NO...IAM SORRY..I DON'T LOVE U" అని ఉంది...
క్షణాల్లో అతని వళ్ళంతా చమటలు...పిచ్చేక్కినట్లు అయిపోయాడు..ఫోన్ ని గిరాటేసికొట్టాడు...వెక్కి వెక్కి ఏడ్చాడు...చివరిసారిగా స్వప్నతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది ...కానీ ... ఎందుకో ...ఏమనుకున్నాడో...అలా ఎదురుగా కనిపిస్తున్న బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు...చుట్టూ చూసాడు, నిద్రలో జోగుతుంది నగరమంతా...ఒక్కసారిగా కళ్ళు మూసుకొని, ఒక్క ఉదుటన దూకేసాడు...తను ఉంటున్న అయిదవ అంతస్తునుండి...

మరు నిముషంలో ఎక్కడో బీరువా క్రింద విసిరేయబడ్డ సెల్-ఫోన్ లో మళ్ళీ మెసేజ్ బీప్... 

                                                                    ******
2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

ఆ డైరీ పట్టుకొని...అటూ..ఇటూ తిప్పుతూ చూస్తుండగా...కరెంట్ వచ్చింది..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది కీర్తి..ఎలాగూ నిద్ర రావట్లేదు, ఈ డైరీతో టైం పాస్ చేద్దామనుకొని..దాన్ని పట్టుకొని బెడ్ రూమ్ కి వెళ్లి..ఓపెన్ చేసింది..
డైరీ మొదటి పేజీలో ఒక అందమైన అమ్మాయి ఫోటో...ఆ ఫోటో క్రింద..నా ప్రాణం, నా సర్వసం...నా స్వప్న అని రాసుంది...
డైరీ లోని ఒక్కొక్క పేజీ తిరగేస్తూ చాలా శ్రద్ధగా చదవసాగింది కీర్తి ...

"ఈ రోజు స్వప్నతో చాలా సేపు మాట్లాడాను..ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను..తను నాకోసమే పుట్టిందేమో అనిపిస్తుంటుంది నాకు..తనతో మాట్లాడితే చాలు, నాకు ఇంక ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం అవసరం లేదు..అనాధగా పెరిగిన నాకోసం దేవుడు కురిపించిన వారాల మూటే స్వప్న..నేనొక ఒంటరిని అన్న భావన నాలో నుంచి దూరం చేసిన స్నేహమయి...తనంటే నాకెంత ఇష్టమో నేను కూడా మాట్లల్లో చెప్పలేను.."

"ఈ రోజు స్వప్నని ఎవడో ఏడిపించాడంట..నాకు చెప్పి నా దెగ్గర బాధ పడింది..నా స్వప్నని బాధ పెట్టిన వాడిని ఊరికే వదులుతానా... స్వప్న నాకు గిఫ్ట్ గా ఇచ్చిన క్రికెట్ బ్యాట్ తోనే వాడి రూమ్ కి వెళ్లి మరీ వాడి తల బద్దలు కొట్టాను ...స్వప్న కి ఈ విషయం చెప్పలేదు...తనకి గొడవలంటే నచ్చదు.."

"స్వప్న పేరు పచ్చ పొడిపించుకున్నా ఈ రోజు నా ఛాతీ దెగ్గర...నా మనసులో మాట ఆమెకి చెప్పిన తరువాత నా హృదయ భాగాన ఉన్న ఆమె పేరు ఆమెకి చూపిస్తా..తను నీకేమన్నా పిచ్చా అని నన్ను తిడుతుంది..అయినా సరే పర్లేదు, నా హృదయ భాగాన ఉండాల్సింది తనే కదా.."

"రేపు స్వప్న పుట్టిన రోజు...తనకి నన్ను నేను గిఫ్ట్ గా ఇచ్చుకుందామనుకుంటున్నా...తను స్వీకరిస్తుందో? లేదో?..తను స్వీకరించని నా జీవితం ఖచ్చితంగా వృధానే..జీవితాంతం తనతోనే గడపాలని అనుకున్నాను..అందులో తేడా జరిగితే ఈ కౌశిక్ బ్రతకడు..."
'అబ్బో...వీడు బాగా మునిగిపోయాడు ఈ పిల్లతో లవ్వు లో ...అయినా లవ్ చెయ్యకపోతే చనిపోవడం ఏంటో..చూద్దాం ఏం జరిగిందో'..అంటూ తరువాతి పేజ్ ఓపెన్ చేసింది..

"ఈ రోజు తనని అందరికన్నా మొదటగా నేనే విష్ చేశా...నోబుల్ ప్రైజ్ అందుకున్నంత ఆనందంగా ఉంది..ఉదయం తనతో కలసి టెంపుల్ కి వెళ్లాను..అప్పుడే, నేను రాసి పెట్టిన లెటర్ ఆమె చూడకుండా ఆమె హ్యాండ్ బాగ్ లో వేసాను...తన మీద నాకున్న ప్రేమనంతా ఒక చిన్న లెటర్ లో ఖచ్చితంగా రాయలేను..కానీ తన ప్రేమ నన్నెంత ప్రభావితం చేసిందో రాసాను..తనతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని రాసాను..తన అభిప్రాయం, నాకు ఒక SMS ద్వారా చెప్పమని...ఆ SMS కోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసాను..."

"టైం పన్నెండు దాటింది...తన నుంచి నాకు ఇంకా SMS రాలేదు ..నాకు పిచేక్కిపోతుంది...మైండ్ పనిచెయ్యట్లేదు..దేవుడా, నాకు నా అనే వాళ్ళని ఎవరినీ నువ్వు ఇవ్వలేదు..ఇన్నాళ్ళకి నువ్వు నాకు స్వప్నని చూపించి నా జీవితానికి ఒక అర్థం ఉండేలా చేసావు...ఇప్పుడు తనని నా నుంచి దూరం చెయ్యకు...అది భరించి బ్రతకలేను..............."
తరువాతి పేజీలు తిప్పి చూసింది కీర్తి..ఏమీ లేదు...అన్ని ఖాళీ కాగితాలు...

'ఏమయ్యుంటుంది....స్వప్న కౌశిక్ ప్రేమ ఒప్పుకొని ఉంటుందా??..లేకపోతే, పాపం ఆ అబ్బాయి ఎమన్నా చేసుకొని ఉంటాడా...దేవుడా అలా జరగకుండా ఉండాలి...అయినా, స్వప్న తన లవ్ యాక్సెప్ట్ చేసి ఉంటే, ఆ విషయం ఈ డైరీలో రాసేవాడు కదా...ఇక్కడ నుంచి అన్నీ తెల్ల పేజీలు ఉన్నాయి అంటే...కొంపదీసి అతను...' కీర్తికి ఆలోచించాలంటేనే అదోలా అనిపించింది..
అయినా ఈ డైరీ ఈ ఇంట్లో ఉందంటే, ఆ అబ్బాయి రెండేళ్ళ క్రితం ఈ ఇంట్లోనే ఉన్నాడేమో...రేపు ఇంటి ఓనర్ ని కనుక్కోవాలి..
                                                                     *****
2008 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

"suicide case సార్...ఆధారాలేమీ తెలియరాలేదు..." అన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఎస్.ఐ స్పాట్ కి రాగానే..
"క్లూస్ టీంని పిలిచారా...." అడిగాడు ఎస్.ఐ
"క్లూస్ టీం సెర్చ్ చేసారు..ఇంట్లో క్లూ ఏం దొరకలేదు..ఇతని పేరు కౌశిక్, నా అనేవాళ్ళు ఎవరూ లేరు.. TCS లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..బాడీ మీద మాత్రం స్వప్న అని పచ్చ పొడిపించుకున్నాడు.."
"ఓ.కే...ఇతని కొలీగ్స్ ని ఎంక్వైరీ చెయ్యండి..ఎమన్నా క్లూ దొరకొచ్చు..లవ్ ఫైల్యుర్ కావచ్చేమో.."
"అలాగే సార్..."
"అలాగే..బాడీని పోస్ట్-మార్టంకి పంపించండి..." అంటూ వెళ్లిపోయాడు ఎస్.ఐ.
                                                                      *****
2010 మార్చ్ 31st ,గృహసీమ ఎంక్లేవ్, కూకట్ పల్లి, హైదరాబాద్.

"రెండు సంవత్సరాల క్రితం కౌశిక్ అనే అబ్బాయి ఉండేవాడు..నిజమే..నీకెలా తెలుసు.." తెల్లబోయి అడిగింది ఇంటి వోనర్..
"అంటే ఆంటీ...మా ఫ్రెండ్ ఒకమ్మాయి చెప్పింది..ఆ అమ్మాయి కౌశిక్ ఫ్రెండ్..." అంది కీర్తి 
"అవునా...ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు పాపం...బాల్కనీ నుంచి దూకేసాడు...మంచి కుర్రాడు, ఎందుకలా చేసాడో..."
ఆ మాట విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది కీర్తి..పెద్ద షాక్ లా తగిలింది ఆ మాట కీర్తికి..ఎందుకో చాలా బాధగా అనిపించింది...
"కౌశిక్ గురుంచి వివరాలు ఏమైనా తెలుసా..."
"ఆ అబ్బాయి TCS లో పనిచేసే వాడు...పాపం ఎవరూ లేరు..నాకు కూడా అతని విషయాలు పెద్దగా తెలియవు..ఎప్పుడూ పెద్దగా మాట్లాడేవాడు కాదు..అయినా ఎందుకు అడుగుతున్నావ్ అమ్మాయ్ ఇవన్నీ .." అందామె దీర్ఘం తీస్తూ..
"ఏం లేదాంటీ...మామూలుగానే..."
"నువ్వు ఆ ఫ్లాట్ లో ఉండటానికి ఏమీ భయపడక్కర్లేదు...ఫర్నీచర్ అప్పటిదే అయినా.. ఆ అబ్బాయి చనిపోయాక, రకరకాల పూజలూ, హోమాలూ, శాంతి జరిపించాము...దెయ్యాలు గట్రా ఏమీ రావులే.." అందామె 
"హ హ...అయ్యో ఆంటీ...నాకలాంటి నమ్మకాలు ఏమీ లేవులే...వెళ్ళొస్తా ఆంటీ.." అంటూ బైటకి వచ్చింది కీర్తి..
                                                       ****
"రజితా...నేను కీర్తిని..."
"కీర్తి..ఏంటి మామ్ ఈ surprise...U.S. నుండి వచ్చాక ఒక్క కాల్ కూడా లేదు..."
"అదేం..లేదే..కొంచెం వర్క్ బిజీ...నువ్వు ఇంకా TCS లోనే వర్క్ చేస్తున్నావా?"
"అవునే...ఇక్కడ వర్క్ టెన్షన్ తక్కువ ఉంది నాకు...సో అందుకే మారలేదు.."
"two years back మీ కంపెనీలో పనిచేసిన కౌశిక్ అనే అతను తెలుసా నీకు...??"
"ఏ కౌశిక్?..suicide case కౌశిక్?"
"అవును...అతనే...తెలుసా.." ఆత్రుతగా అడిగింది కీర్తి..
"తెలియకపోవడం ఏమిటే బాబూ...అతను మా టీమే...పెద్ద మూడీ ఫెలో..ఎవ్వరితో మాట్లాడడు..ఏమైందో ఏంటో, సడన్ గా suicide.."
"ఓహో...సరేకాని, అతను ఎవరితో ఎక్కువ క్లోస్ గా ఉండేవాడు..."
"మాతో ఎవరితోనూ క్లోస్ గా ఉండేవాడు కాదు...కానీ వేరే టీంలో స్వప్న అని ఒకమ్మాయి ఉండేది..ఆ అమ్మాయితో మాత్రం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు..."
"స్వప్న...ఎస్...స్వప్న ఎక్కడ ఉంది ఇప్పుడు??"
"ఎంటే బాబూ ఈ ప్రశ్నలు..ఎమన్నా CBI లో చేరావా?"
"తర్వాత చెప్తా...ముందు స్వప్న ఎక్కడ ఉందో చెప్పు..."
"ఆ అమ్మాయి TCS లో లేదు ఇప్పుడు...పెళ్లి చేసుకొని US వెళ్లిందని చెప్పారు..ఈ కౌశిక్ చనిపోయిన దెగ్గరనుంచి ఆ అమ్మాయి కూడా జాబ్ మానేసింది అని విన్నాను..ఏంటో మరి.."
"ఓహ్..అలాగా..సరెలేవే..నేను మళ్ళీ చేస్తాను..." అంటూ ఫోన్ పెట్టేసింది కీర్తి..

ప్రొద్దుగుంకింది...చల్లగా గాలి మొదలయ్యింది...కీర్తి బాల్కనీలో నిల్చుని కౌశిక్ గురుంచే ఆలోచిస్తుంది...
'ఏంటో పాపం లవ్ ఫెయిల్ అయినందుకు కౌశిక్ ఆత్మహత్య చేసుకున్నాడు..ఒక అమ్మాయి కోసం మంచి లైఫ్ నాశనం చేసుకున్నాడు..ఏమోలే, ఇలాంటి మాటలు మనం ఎన్నయినా చెప్పొచ్చు...కానీ ఆ సమయంలో అతను ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో...చనిపోవడానికి నిర్ణయించుకున్నాడంటే ఎంత మనోసంఘర్షణ అనుభవించి ఉంటాడో...అలాంటి ప్రేమికుడిని దూరం చేసుకున్న స్వప్న నిజంగా దురద్రుష్టవంతురాలు...' అనుకుంటుండగా అప్పుడు గుర్తొచ్చింది ఆమె నిల్చుంది బాల్కనీ దెగ్గర అని...అక్కడ నుంచే కౌశిక్ దూకి చనిపోయాడు అని..వెంటనే ఆ దృశ్యం గుర్తురాగానే, ఏదో తెలియని దడ పుట్టింది ఆమెలో...

కాసేపు వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడింది...తరువాత పడుకుందామని బెడ్ పైన వాలింది..కానీ నిద్ర పట్టడం లేదు..లేచి అటూ ఇటూ తిరగనారంభించింది...అక్కడ ఉన్న అలమారాలు షెల్ఫ్ లు అన్ని వెతుకుతూ ఉంది...ఏవేవో పాత మాగజైన్స్..అవీ ఇవీ అన్నీ ఉన్నాయి..అలా చూస్తూ ఉండగా, బీరువా వెనుక ఆమెకి కనిపించింది...సెల్ ఫోన్...
భ్రుకుటి ముడిచి ఆ సెల్ ఫోన్ చేతులోకి తీసుకొని చూసింది...
'ఇది ఎవరి సెల్ ఫోన్ అయ్యి ఉంటుంది' అనుకుంటుండగా... చూసేసరికి...డిస్ప్లే కొంచెం పగిలి ఉంది...
అది నోకియా కావడంతో తన దెగ్గర ఉన్న చార్జర్ తో ఒక పావుగంట చార్జ్ చేసి, స్విచ్ ఆన్ చేసింది...ఆన్ అయ్యాక వెల్కం మెస్సేజ్ "Swapna...my life" అని వచ్చింది...ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది కీర్తికి..
ఆన్ అయ్యింది..."సెర్చింగ్ ఫర్ సిగ్నల్..." అని రావడం చూసి ఆశ్చర్య పోయింది కీర్తి...రెండు సంవత్సరాల క్రితం సిమ్..ఇంకా ఎలా వ్యాలిడ్ గా ఉందో ఆమెకి అర్థం కాలేదు...ఒకేవేళ 3 years validity కాని life long validity కానీ అయ్యుంటుందేమో అనుకుంది..
"Airtel" అని సిగ్నల్ చూపించడం.."unread message" అని ఇన్బాక్స్ లో చూపించడం ఒకేసారి జరిగాయి...

ఆమె చేతులు వణుకుతుండగా...మెసేజ్ ఓపెన్ చేసింది...అందులో ఉన్న మెసేజ్ చూసి..ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.. చేష్టలుడిగి అలాగే మెసేజ్ వైపు చూస్తుండిపోయింది.. ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి...

"Text message
 From : Swapna

No ante nammesava?..orey fool, repu April fools day telusugaa.. ippudu NO cheppi, repu April fool ani fool cheddam anukunnanu, but i dont wanna make you feel sad and disappointed for 10 more hours..so ippude cheppestunna "I LOVE U A LOT MY DARLING...no life without U"     


                                                              *****
                   -- A story and Script by --------------- Ramakrishna Reddy Kotla
                   [It is purely a work of fiction]

Tuesday, August 10, 2010

నిన్ను చూడగా గుండెలో...

ప:    నిన్ను చూడగా గుండెలో ఎన్నెన్నో రాగాలు...
        మనసునిండుగా మ్రోగెనులే ఏవేవో తాళాలు..
        తనువంతా సంగీతం...తపనలతో సావాసం...
        ఊహలలో ప్రయాణం...మేఘాల్లో సరాగం..
        పరిచెయమయ్యెను కొత్త భాష..అనుభవమయ్యెను తీపి ఘోష..

చ1:  నిన్ను చేరే సమయాన..పెదవే దాటని మాటలమూటలు విప్పి కళ్ళతో ఎన్నోఊసులు చెప్పెయ్యనా..
        నిన్ను తలచే విరహాన.. కొంటె ఆశలు కలవరపెడితే నిజమంటి కలగా కలలో నిజమై దరిచేరనా..
        ఆకాశం అందనంత దూరంలో లేదులే...జాబిల్లిలా నాముందే నువ్వుంటే..
        వెన్నెల్లో హాయి పగలైనా చేరునులే..నాగమల్లిలా నువ్వు నవ్వుతుంటే...

చ1:  గుండె వేగం తగ్గేనా..ఓ నిముషం పాటు నీ ఓరచూపే నా తనువుని తడిమీ కన్నుగీటుతుంటే..
        కలకంటున్నాననుకున్నా.. నువ్వు కళ్ళముందున్నా పోల్చలేకున్నా నిజమే కలలాగున్నదే..
        గుండెలోనే గువ్వలా దాగున్నావే...అయినా నీకోసం ఎక్కడో వెదుకులాట..
        చెప్పవే మనసా నువ్వైనా నా కళ్ళకి...నీలోనే దాగున్న నాచెలి చిరునామాని...
      
                                                                                                 -- కోట్ల రామకృష్ణా రెడ్డి 

[ఈ రోజు ఆఫీసులో పెద్దగా పనిలేక, ఏదో ఇలా ఓ పాట రాయడానికి ప్రయత్నించాను... దీనికి ట్యూన్ కూడా కట్టాలి అనుకుంటున్నా..అలా ట్యూన్ కట్టాక ఒక పోడ్-కాస్ట్ గా రిలీజ్ చేస్తా..]

Friday, July 30, 2010

నేను, కాజల్ అగర్వాల్ @ ట్విట్టర్

ఆరోజు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళాక, మేనేజర్ వైపు 'హాయ్' అనే స్మైలింగ్ లుక్కోటి పడేసినప్పుడు, ఆడు ఏబ్రాసి మొహం ఏస్కోని 'స్మైల్ కి ప్రతి స్మైల్.. కోల్గేట్ స్మైల్..' అనే విషయం కూడా మరచి మొహం మాడ్చి అటువైపు తిప్పెసుకుంటే, 'నీ లతుకూర్ ఫేస్ లో నా లంగర్ హౌస్...' అని తిట్టేసుకొని (తిట్టుకి అర్థం అడక్కండే ) నా డెస్క్ మీద ఓ పది నిముషాలు రిలాక్స్ అయ్యి...వెళ్లి కాఫీ సేవించి...మళ్ళీ వచ్చి మెయిల్స్ చెక్ చేసి..ట్విట్టర్ ఓపెన్ చేశాను..మహేష్ బాబు, సిదార్థ్, నాగార్జున, శ్రియా, etc..వాళ్ళ ట్వీట్లు చదువుతుండగా...ఎందుకో ఓ సారి చూద్దామని...తన ట్విట్టర్ పేజ్ ఓపెన్ చేశాను.. చేసేసింది...బ్లాక్ చేసేసింది నన్ను..కాజల్ అగర్వాల్ .. ఎందుకు నన్ను బ్లాక్ చేసింది..అందుకేనేమో??...హమ్, మనం అలా ఒక మూడు వారాలు ఫ్లాష్ బ్యాక్ కి వెళ్దాం...అందరూ సీట్ బెల్టులు కట్టుకోండి .....

*********** మూడు వారల క్రితం *****************

ట్విట్టర్ లో ట్వీటింగ్ మొదలెట్టిన దెగ్గరనుండి..దాదాపు అందరు సెలబ్రిటీస్ ని ఫాలో అయిపోతున్నాను...అది కాదు ఇక్కడ ముఖ్యం...నా డార్లింగ్ "కాజల్ అగర్వాల్"ని ఫాలో అవ్వడం ...బ్రహ్మ దేవుడు మాంచి క్రియేటివ్ మరియు రొమాంటిక్ మూడ్ లో ఉండగా సృష్టించబడ్డ అమ్మాయే...కాజల్ అగర్వాల్..పూర్వ జన్మలో నా గర్ల్ ఫ్రెండ్..ఇష్ ఇష్..ఆ అమ్మాయికి ఇంకా ఈ విష్యం తెలీదు ..నాకెలా తెల్సిందంటే, చందమామ సినిమా వంద రోజుల ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, నేను ఫంక్షన్ హాల్లో నిల్చుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ చేతులు రెండూ వెనక్కి చాపినప్పుడు...నా చేతి వేళ్ళకు షాక్ కొట్టింది..తీరా ఏంట్రా ఈ షాక్ అని చూసేసరికి, అప్పుడే అటు ప్రక్కనుండి డయాస్ మీదకి వెళ్తున్న కాజల్ చెయ్యి నా చేతిని తాకింది ..వెంటనే నాకు ఏవేవో గుర్తొచ్చాయి .......

ఆ యువకుడు ఒక యుద్ధంలో దేశం కోసం పోరాడుతుండగా...ఓ రోజు అతని ప్రేయసి వచ్చి "నువ్వు యుద్ధంలో పోరాడుతుండగా నీకు ఎమన్నా అపాయం కలుగుంతుందేమో అని ఇన్ని రోజులూ ఏదో బాధతో జీవించాను...కానీ దేశం కోసం నువ్వు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, నిన్ను చూసి అందరూ పొగుడుతుంటే..నేనెందుకు బాధ పడాలి అనిపించింది..నిన్ను చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది..నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో నీ వంతు పాత్ర పోషించి, విజయంతో తిరిగి వస్తావు...ఆ రోజు వరకూ నీకోసం వేచి ఉంటాను.." అంటూ ఆ అమ్మాయి ఆతనికి వీర తిలకం దిద్దింది ..కానీ అతను ఎప్పటికీ యుద్ధం నుంచి తిరిగి రాలేదు..అతని ప్రేయసి కూడా అతని కోసం చూసి చూసి..ప్రాణాలు విడిచింది ...ఆ జన్మలో ఆ అబ్బాయి, అమ్మాయే...ఈ జన్మలో...నేను కాజల్ అగర్వాల్ ...

గతం గుర్తొచ్చిన వెంటనే, నా డార్లింగ్ కి ఈ విష్యం చెప్పాలనిపించింది...కానీ ఎప్పుడూ కనిపించలేదు...కానీ ఈ విషయాన్ని నా స్నేహితుడికి చెప్తే, వాడు ఇదేదో కాన్సెప్ట్ బాగుంది అని,డబ్బులకి ఆశపడి రాజమౌళి వాళ్ళ నాన్న చెవులో ఊదాడు ...విజయేంద్రప్రసాద్ గారు దానికి మార్పులు చేర్పులు చేసి..మగధీర అనే కథ తయారుచెయ్యడం..మనం చూడటం జరిగిపోయాయి ...

ఇకపోతే ఇన్ని రోజులకి ట్విట్టర్ లో కాజల్ మళ్ళీ కనిపించడంతో ఫాలో అయిపోవడమే కాకుండా..ఒకేసారి ఒక పది ట్వీట్లు ఇచ్చా..రిప్లై ఇస్తుందనే ఆశ మాత్రం కలగలేదు...విచిత్రం ఒక పదినిముషాల్లోనే కాజల్ నుండి నాకు రిప్లై ..ఎగిరి గంతేసాను ..ఇక ట్వీట్ల మీద ట్వీట్లతో తూట్లు పొడిచాను..అడపాదడపా కాజల్ నుండి కూడా రిప్లయిస్ రావడం నన్ను నేలమీద కాకుండా ఒక రెండు అడుగులు గాల్లోకి నిలబడేలా చేసింది..ఓ రోజు ఇండియా పాక్ మ్యాచ్ వస్తుండగా తను స్కోర్ చెప్పవా అని అడిగితే..అరవోడి(మేనేజర్) పని పక్కన పెట్టి అరనిముషానికి ఓ సారి ఫ్రెష్ స్కోర్ తనకి ట్వీట్ చేసి "అభిమాని అంటే వీడేరా" అనిపించుకున్నాను...ఇలా క్రమం తప్పకుండా రోజుకి ఒక వంద ట్వీట్లు తగ్గకుండా ఇస్తుండేసరికి..ఓ రోజు నా అభిమానం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి "నువ్వే నా సిన్సియర్ అండ్ సూపర్ అభిమానివి...ఉమ్మా.." అంటూ నాకు ట్వీట్ ఇచ్చేసరికి...ఇక నేను రెక్కలు కట్టుకొని అన్ని గ్రహాలూ చుట్టేసుకొని వచ్చాను ...

డార్లింగ్  సినిమా రిలీస్ అయ్యింది..నేను వారం ముందే టికెట్స్ బుక్ చేసుకొని, మధ్యాహ్నం ఆఫీస్ ఎగ్గొట్టి సత్యం సినిమాస్ కి బైల్దేరి సినిమా చూశా...సినిమా చూస్తుండగా..తెర మీద కనిపించే కాజలే రోజూ నేను ట్విట్టర్ లో మాట్లాడే కాజల్ అన్న ఊహ వచ్చినప్పుడల్లా ఏదో మనసులో మధురమైన పులకరింత ...ఇక ఉండబట్టలేక హాల్లోనే నా మొబైల్ తీసి కాజల్ కి ట్వీట్స్ పంపాను..సినిమా సూపర్, అంత కన్నా సూపర్ నువ్వు, నీ అందం, నీ యాక్టింగ్...చాలా క్యూట్ గా ఉన్నావు అది ఇదీ అని పంపా...తరువాత ప్రతి పదినిముషాలకి ఓ సారి మొబైల్ తీసి ఏమన్నా రిప్లయ్ వచ్చిందా అని చూడటం..లేకపోయేసరికి పాపం షూటింగ్ లో బిజీగా ఉంటుందేమో అనుకొని, మళ్ళీ ఎక్కడ స్క్రీన్ మీది కాజల్ ని మిస్ అయిపోతానో అని తెరవైపు అటుచూడటం....ఇలా సినిమా చూసేసి రూమ్ కి వచ్చాక నా ట్వీట్ కి రిప్లయ్ ఉంది ..."థాంక్ యు మై గ్రేట్ అడ్మయిరర్"అని...నేను వెంటనే ..."ఇంకా ఎదో...ఇంకా ఏదో..ఇధైపోతావే ఇష్టాలే తెలిపేందుకు....సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు..." అంటూ సాంగ్ వేసుకున్నాను ....

ఇలా నేను కాజల్ తో ట్విట్టర్ లో పీకలలోతు అదేదో దాంట్లో మునిగి పోయి ఉండగా ...ఇక లేట్ చెయ్యకుండా...తనకి పూర్వ జన్మ జ్ఞాపకాలు గుర్తుచెయ్యాలి అని డిసైడ్ అయ్యాను ...సరిగ్గా అప్పుడే...అదే జరిగింది ...ఎప్పుడైతే మనం కలలో మాత్రమే జరుగుతుంది అనుకున్నది నిజంగానే జరిగితే, పైనున్న వాడికి కన్నుకుడుతుందేమో... వెంటనే అటువంటి  దాన్ని మళ్ళీ కలగానే మిగుల్చుతాడు..అవును ఆ రోజు అలాగే జరిగింది ...నేను ఆ రోజు కూడా యధాప్రకారమే కాజల్ కి ట్వీట్ల స్వీట్లు ఇచ్చి ఆఫీస్ నుంచి రూమ్ కి వచ్చి..టీ.వీ ఆన్ చేసి పేపర్ చూస్తున్నాను...ఇంతలో ఎదో తెలిసిన గొంతు టీవీలో మాట్లాడుతుంటే యధాలాపంగా చూస్తే ...ఇంకెవరు...డార్లింగ్ కాజల్...పేపర్ పక్కన పడేసి, చెవులు, కళ్ళు టీవీ వైపు పడేశాను...

యాంకర్: మీ డార్లింగ్ సినిమా రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది...కంగ్రాట్స్
కాజల్: Thanks...... and my sincere thanks to everyone who made this film a grand success..love you all....
(ఆ చివరి ముక్క ఎందుకో నన్ను ఉద్దేశించి అన్నట్లు అనిపించింది )
యాంకర్: మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ?
కాజల్: I've signed one with Ram Charan again and two more scripts are in consideration...let you know all soon....
(అమ్మనీ....ఈ ముక్క నాకు కాజల్ ట్విట్టర్ లో చెప్పలేదే...నేను అలిగేసాను అంతే...అని మూతి ముడుచుకున్నాను ...)
యాంకర్: చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే ట్విట్టర్ లో జాయిన్ అయ్యి...తమ అభిమానులకి చేరువ అయ్యారు...మరి మీరు కూడా జాయిన్ అయ్యారా?
(...నా మైండ్ బ్లాక్ అయ్యే...గుండెలో అగ్ని పర్వతాలు బద్దలయ్యే సమాధానం ఇప్పుడు వచ్చింది ...)
కాజల్: Yep, i knew that...but i didn't join in twitter yet...didn't find much time for myself to do that..well, dunno..i may join soon in future..I came to know that a fake ID imitating me is doing rounds in twitter...guys, be aware, i don't have a twitter ID yet...don't fall in trap with fake imitators...

ఆ సమాధానం విన్న నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు...ఆ వంటనే, ఆకాశంలో నేను కట్టుకున్న ఆశల సౌధం కూలిపోతున్న దృశ్యం నాకు కనిపించింది...నాకు బాధ,కోపం,ఏడుపు,చిరాకు అని ఒకేసారి వచ్చాయి
...వెంటనే లాపీ ఓపెన్ చేసి...ఫేక్ కాజల్ అగర్వాల్ కి ట్వీట్ కొట్టాను.."నువ్వు ఫేక్ కాజల్ అని నాకు ఈ రోజు తెల్సింది..ఎందుకు ఇంత మోసం చేశావు..నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను...నిన్ను ఎంతాగా అడ్మైర్ చేశాను...ఓ ఫేక్ కాజల్ నీకు నా శాపం తప్పక తగులుతుంది..." అని ట్వీట్ ఇచ్చేసి ...నాలాగా ఈ ఫేక్ కాజల్ బారిన పడ్డ వాళ్ళని కాపాడాలి అని చెప్పి, అప్పటికే ఉన్న వెయ్యి మంది ఫాలోవర్స్ లో ఒక 500 మందికి 'ఇది ఫేక్ కాజల్...అసలు కాజల్ కి ఇంకా ట్విట్టర్ లేదు..' అంటూ ట్వీట్స్ పెట్టాను...మిగతా 500 మందికి తరువాత రోజు త్వీట్ పెడదాం అనుకున్నాను....

********* ఆ తరువాత రోజు....అనగా మూడు వారాల ఫ్లాష్ బాక్ అయోపోయిన తర్వాతి రోజు ******

 అలా తరువాత రోజు ఆఫీస్ కి వచ్చి ఫేక్ కాజల్ ట్విట్టర్ పేజ్ ఓపెన్ చేసేసరికి...ఇంకేముంది...బ్లాక్ చేసి పడేసింది...నాకు కసీ కోపం రెండూ కలగలిపి వచ్చేసి నేను కూడా తనని బ్లాక్ చేసి పడేశాను...ఇప్పుడు ఆ ఫేక్ కాజల్ కి దాదాపు పదివేల మంది ఫాలోవర్స్..ఫేక్ కాబట్టి పదివేలు మాత్రమే ఉన్నారు...రియల్ ఐ.డీ అయ్యుంటే, ఈ పాటికి లక్ష ఫాలోవర్స్ దాటేవళ్ళే...త్రిషకి జాయిన్ అయిన వారంలోనే ముప్పై వేల మంది ఫాలోవర్స్ వస్తే, మా కాజల్ కి ఏంత మంది రావాలి? అయినా ఫేక్ ఐ.డీ పెట్టుకోవడం ఏం ఆనందమో నాకు అర్థం కాలేదు ,...

హమ్ అలా...నా అభిమానం వేష్ట్ అయిపొయింది ఫేక్ కాజల్ మీద... ...త్వరలో రియల్ కాజల్ ట్విట్టర్ లో జాయిన్ అవుతుంది అని ఆశాభావంతో ఉన్నాను  ..