Sunday, July 25, 2010

స్వాతి...యాహూ...వెంకట్ సార్..

9:00 PM

ఆ రోజు నేను చాలా టెన్షన్ గా రూంకి చేరుకున్నాను...
"ఏమయింది రా...." అన్నాడు శీనుగాడు నా టెన్షన్ చూసి టెన్షన్ తో...
"ఒరేయ్...ముందు ఓ గ్లాస్ మంచి నీళ్ళివ్వు..." అన్నాను నుదిటి మీద పట్టిన స్వేదబిందువులను కర్చీఫ్ తో అద్దుకుంటూ...
మంచి నీళ్ళు తాగి..."ఈ రోజు స్వాతితో యాహూలో చాట్ చేశానురా...." అన్నాను...
"అయితే??"
"బాగానే మాట్లాడుకున్నాం కొంచెం సేపు...."
"మరికేం అయ్యి తగలడింది..." అన్నాడు నా వైపు చూసి త్వరగా చెప్పరా బాబు అనే లుక్కోటి ఇచ్చి ...

                                                        ******

7:30 PM
యాహూ చాట్

కిషెన్: స్వాతీ ఈరోజు నువ్వు కాలేజీకి వేసుకోచ్చిన వైట్ చుడీదార్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా...
స్వాతి: నిజమా??...థాంక్ యు కిషెన్...
కిషెన్: యు లుక్ లైక్ ఏంజెల్... లైక్ కాదు ఏంజెలే...అసలు రాజమండ్రికి ఏంజెల్ ఎలా వచ్చిందబ్బా అని తెగ ఆలోచించాను...అప్పుడు ఒకటి అర్థమయ్యింది..దేవలోకంలో ఇంద్రుడి శాపం వల్ల కాని...లేక..భూలోకంలో ఏదో సరస్సులో జలకాలాడుతూ ముని తపస్సుకి భంగం కలిగించినందువల్ల కాని...ఇలా భూలోకంలో జన్మించావేమో?? ..కదా... నిజం చెప్పు??
స్వాతి: కిషెన్...నువ్వు మరీ టూ మచ్...ఏమో కాని, అంత అందంగా ఉంటానంటావా??
కిషెన్: అప్సరా ధియేటర్లో అరసెకండుకి ఓ సారి కుట్టే నల్లుల మీదొట్టు...
స్వాతి: నల్లుల మీద...పిల్లుల మీద ఒట్లు చాలు గానీ...ఓ విషయం అడుగుతా చెప్తావా?
కిషెన్: ష్యూర్...ఏంటి?
స్వాతి: మన కాలేజీలో వెంకట్ సార్ తెలుసు కదా...
కిషెన్: ఆయన మా క్లాస్ ఇంచార్జ్... నాకెందుకు తెలీదు...
స్వాతి: అవునా, ఈ సెమ్ నుంచి ఆయన మాకు కంప్యుటర్ నెట్వర్క్స్ కి వస్తారు...ఎలా చెప్తాడు ఆయన....??

                                                                ******
9:15 PM

"వార్నీ అవునా..." అన్నాడు శీనుగాడు బోలెడు ఆశ్చర్యపోతూ...
"అవును...." అన్నాను ప్రపంచంలో ఉన్న బాధ మొత్తం నా కళ్ళల్లో చూపిస్తూ...
"అవునని ఖచ్చితంగా ఎలా చెప్పగలవురా..." అన్నాడు గడ్డం మీద గోక్కుంటూ...
"కంఫర్మ్ చేసుకున్నాను కాబట్టి...."
"ఎలా??"
"సురేష్ గాడికి కాల్ చేశా...నీకు తెలుసుగా సురేష్ గాడు కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడని..."
"అయితే...???"
"నీకు జావా క్లాస్ అర్థమవుద్ది కాని...జనాల ఘోష అర్థం కాదు...స్వాతి కూడా కాలేజీ హాస్టలే కదరా..." అన్నాను..
"అవునవును......అయితే??"
"వార్నీ...సరే విను....నేను వాడికి కాల్ చేసి.......ఇంటర్నెట్ ల్యాబుకి వెళ్ళమన్నాను...అప్పుడు...."

                                                                     *****
7:45 PM

కిషెన్: ఎలా చెప్తాడు అని నన్నడుగుతున్నావా??..అసలు వాడు ఎం.సి.ఏ ఎలా పాస్ అయ్యాడో నాకు అస్సలు అర్థం కావట్లా ??
స్వాతి: అవునా?...అంత దారుణంగా చెప్తాడా క్లాస్?
కిషెన్: హమ్...వాడి ఇంగ్లీష్ ఉంటుంది...హబ్బా...మన చెవుల తుప్పు వదిలిపోద్ది అంటే నమ్ము...సపోజ్ మనం క్లాసులో లేకుండా అలా క్యాంపస్ మొత్తం తిరుగుతున్నాం అనుకో .."వై నో క్లాస్...వై రౌండింగ్ రౌండింగ్ ద కాలేజ్ ..." అంటాడు ...హా హా
స్వాతి : అవునా...మరి సబ్జక్ట్ అన్నా ఉందా పాపం...
కిషెన్: వాడి బొంద సబ్జెక్ట్... ఏదో టెస్ట్ బుక్కులో నాలుగు పదాలు బట్టీపట్టి, అవే ముందుకీ వెనక్కి మార్చి మార్చి కొడుతుంటాడు... పైగా వాడి మొహానికి వాడు అసిస్టెంట్ ప్రొఫెసర్...
స్వాతి: అయ్యో...అలాగా.!..ఇది మీ ఒపీనియనా లేక అందరూ ఇలాగే అంటుంటారా??
కిషెన్: వాడి గురుంచి తెలిసిన అందరూనూ....రేపు నువ్వు కూడా అంటావులే..."

                                                                  *****
8:30 PM

"హలో.."
"సురేష్ గా....నేను కిషెన్..."
"ఆ చెప్పరా...ఏంటి విశేషాలు...."
"విశేషాలు చెప్పే మూడ్ లో లేను...ముందు నువ్వు వెంటనే ఒక పని చెయ్యాలి..."
"ఏంటి??"
"మన కాలేజీ హాస్టల్లో ఉండే స్వాతి తెలుసు కదా...వెంటనే నువ్వు మన ఇంటర్నెట్ ల్యాబుకి వెళ్లి అది అక్కడ ఉందేమో చూడు...."
"ఎందుకురా ...ఏమైంది?"
"చూడేహే...తర్వాత చెప్తా..."
"సరే....చూసి చెప్తా.."
"సరే నేనొక పది నిముషాల్లో మళ్ళీ చేస్తా....బై..."

                                             ******


8 PM

స్వాతి:  అవునా...హమ్...మొత్తానికి వెంకట్ మీద స్టూడెంట్ టాక్...ఇలా ఉందనమాట..."
కిషెన్: అవును మరి...
స్వాతి: ఇంకేంటి??
కిషెన్: చెప్పాలి...
స్వాతి: ఇంకేమన్నా చెప్పు...వెంకట్ గురుంచి?
కిషెన్: ఏమున్నాయి...వేస్ట్ ఫెలో అయినా...ఒక మంచి గుణం ఉంది వెంకట్ దెగ్గర...స్టూడెంట్స్ కి బాగా హెల్ప్ చేస్తాడు...ఇంటర్నల్ మార్కులు వెయ్యడం కానీ...అటెండెన్స్ షార్టేజ్ లేకుండా చూడటం గానీ..సో ఆవిధంగా కొంచం ఫాలోయింగ్ ఉందిలే స్టూడెంట్స్ దెగ్గిర...
స్వాతి: ఓ ...గుడ్....

                                                         ******
8:45PM
"హలో...."
"సురేష్ గా...నేనే...కనుక్కున్నావా చెప్పింది?"
"ఒరేయ్...ఇంటర్నెట్ ల్యాబ్ లో స్వాతి లేదురా...ఆ పిల్ల లైబ్రరీలో ఉంది..."
"అవునా...." లైట్ గా చెమటలు నాకు ....
"అయితే ఇంటర్నెట్ ల్యాబ్ లో ఎవరెవరు ఉన్నారు ...."
"తక్కువ మందే ఉన్నార్రా... రెగ్యులర్ గా ఉండే.. నాయుడు గాడు, రాజు గాడు, రమణ గాడు....ఇంకా మన వెంకట్ సర్ కూడా ఉన్నర్రోయ్ ఈ రోజు.. ఏంటో ఇంకా రూమ్ కి వెళ్ళలేదు ఆయన ..."
నా గుండెల్లో పిడుగు పడింది...రివ్వున వీచే గాలిలో కూడా సర్రున కారుతుంది చెమట....
"స...రే..మళ్ళీ చేస్తాను..."
"ఏమయిందిరా...."
......కుయ్ ...కుయ్.....

                                                                         ******

8:15 PM

కిషెన్: BUZZ........BUZZ....
(ఓ పది నిముషాల దాకా రిప్లయ్ లేదు  ....తరువాత సడన్ గా ...)
స్వాతి: కమ్ టూ మై రూమ్...వితిన్ వన్ అవర్..
కిషెన్: స్వాతీ...ఏం అంటున్నావ్...నేను నీ రూమ్ కా....తప్పు బాగోదు...ఛీ అయినా లేడీస్ హాస్టల్లో నన్నెలా రానిస్తారు...!!
స్వాతి: ఎడ్చావ్....దిస్ ఈజ్ వెంకట్...కమ్ టూ మై రూమ్ ఇన్ వన్ అవర్...
మైండ్ ...మొదట...మొద్దు బారి...మరు నిముషంలో షట్ డౌన్ అయ్యి...రీబూట్ ఫెయిల్ అయ్యి...పిచ్చి చూపులు చూస్తూ...యాహూ మెసెంజర్ కి నమస్కరించి...సైన్ అవుట్ చేసి...బైటకి వచ్చాను...

అసలు నిజంగా వెంకటేనా...లేకపోతే స్వాతి నన్ను ఆటపట్టిస్తుందా... ఏమో... తేల్చుకోవాలి... ఎలా??...రీబూట్ ఫెయిల్ అయినా కూడా రీజన్ కనుక్కోడంలో నా బ్రెయిన్ మెరుపు వేగంతో పనిచేస్తుంది...ఒక ఐడియా తళుక్కు మంది....ఎస్ సురేష్ గాడికి కాల్ చేద్దాం...వాడూ కాలేజ్ హాస్టల్లోనే...స్వాతి కాలేజీ హాస్టల్లోనే...ఈ పిల్ల ఆన్లయిన్ కి వచ్చేది కాలేజీ ఇంటర్నెట్ ల్యాబ్ నుండే...సో వాడికి కాల్ చేసి ఇంటర్నెల్ ల్యాబ్ లో స్వాతి ఉందా లేదా అని తేల్చుకుంటే సరి...అనుకొని...వెంటనే టెలిఫోన్ బూత్ దెగ్గరికి పరిగెట్టాను...

                                                            ******

9:30 PM

"అదీ....జరిగింది...సో ల్యాబ్ లో వెంకట్ గాడే ఉన్నాడు...వాడే నాతో చాట్ చేశాడు...." అన్నాను స్థిరంగా...
"అయితే అప్పటిదాకా నీతో చాట్ చేసింది...స్వాతి కాదు...వెంకట్ గాడే అనమాట...." అన్నాడు శీనుగాడు నోరు సున్నాలా చుట్టి ...
"ఉన్నమాటే...."
"అయినా వాడికి స్వాతి ఐ.డీ ఎలా తెలుస్తుందిరా..." అన్నాడు..

"ఈ పిల్లకి డిస్కనెక్ట్ చేసే అలవాటు లేదులే....వాడు కరెక్టుగా వచ్చి ఇంతకుముందు ఈ పిల్ల ఉపయోగించిన సిస్టంలోనే కూర్చొని ఉంటాడు...యాహూ ఓపెన్ చెయ్యగానే, స్వాతి ఐ.డీ.తో ఓపెన్ అయ్యుంటుంది...ఆ పిల్ల ఆన్లయిన్ వచ్చీ రాగానే, మెరుపు వేగంతో మనం మెసేజ్ పంపిస్తాం కదా....సో అలా నేను పంపిన మెసేజులు చూసి..నేనెవరో తెలివిగా తెలుసుకొని...వాడి గురుంచి నేనేమి అనుకుంటున్నానో తెలుసుకోవాలనే తెలివితో కూడిన చిలిపి ఆలోచన వచ్చుంటుంది మహానుభావుడికి..." అన్నాను..
"వామ్మో....దీంట్లో ఇంత లాజిక్ ఉందా!!....అయినా నీ పని ఇక గోవిందా..వాడి గురుంచి వాడికే అన్ని పచ్చిపచ్చి నిజాలు చెప్తే వాడు ఊరుకుంటాడా...నిన్ను ఓ రేంజ్ లో ఆడుకుంటాడురా..." అంటూ చెప్పి నాకు ఉన్న టెన్షన్ కి పదింతలు టెన్షన్ పెట్టాడు....

"ఒరేయ్ ...ఇప్పుడెం చెయ్యాల్రా....వాడు నన్ను వాడి రూముకి రమ్మన్నాడు ఇప్పుడు..." అన్నాను బాధగా...
"అయినా...ఎల్లుండి ఎగ్జాం ఎట్టుకొని...ఎవడెళ్లమన్నాడు నిన్ను నెట్ కి...." అంటూ విరుచుకుపడ్డాడు...
"సరే లేరా...జరిగిన దాన్ని మనం మార్చలేము...ఒక పని చెయ్యనా...వాడి రూముకి వెళ్లి...'సారీ సార్...ఏదో నోరు జారాను...అసలు ఉన్న లెక్చరర్స్ లో మీరే మెగాస్టార్ అని చెప్పనా'..." అన్నాను..
"అప్పుడు 'ఏటకారం అంటే ఇదేరా!' అనే లెవెల్లో చూస్తాడు నీ వైపు..."
"మరేం చెయ్యాల్రా...నాకు టెన్షన్ గా ఉంది...ఆడి చేతులో నా Internals..lab Externals ...Attendance...ఇవన్నీ ఉన్నాయి...గోదావరిలో ముంచేస్తాడేమోరా...." అన్నాను
"నిజమేరా....అయినా పిచ్చోడి దెగ్గరికి వెళ్లి నువ్వు పిచ్చోడివి అంటేనే ఆడికి కోపం వచ్చి నిన్ను లాగి ఒకటి ఇస్తాడు...అలాంటిది, వెంకట్ సార్ తోనే 'నీకు సబ్జెక్టు రాదు...ఇంగ్లీష్ రాదు...వేస్ట్ ఫెలోవి' అంటే ఆడికి కోపం రావడంలో ఆశ్చర్యం ఏముంది...చూద్దాం నిన్ను ఏ రేంజిలో ఆడుకుంటాడో...." అన్నాడు
"ఏట్రోయ్...ఇండియా పాక్ మ్యాచ్ చూడబోతున్నట్లు కేరింతలు కొడుతున్నావ్??....అసలు ఫ్రెండువేనా?...'ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇండీడ్' అన్నారు కదరా..." అన్నాను
"అంటే??"
"థూ..." అనుకుంటూ బాల్కనీకి వెళ్లి బుక్ తీశా చదువుదామని.....

బుక్ తీసీ తియ్యడంతోనే...బుక్ లోంచి వెంకట్ గాడు ప్రత్యక్షం అయ్యి..."ఏరా...నాకు ఇంగ్లీష్ రాదా?..నేను టెస్టు బుక్కులో నాలుగు పదాలు అట్టుకొని తిరగేసి మరగేసి చెప్తానా?..."అన్నాడు
"సార్...ప్లీజ్...ఈ సారికి క్షమించెయ్యండి సార్...ఈ సారి మీ గురుంచి ఎవరడిగినా గొప్పగా చెప్తాను సార్...అయినా మీ గురుంచి కొన్ని మంచి విషయాలు కూడా చెప్పాను మర్చిపోయారా?..ఇంటర్నల్స్, అటెండెన్స్ వీటి గురుంచి..." అన్నాను ..
"ఇన్ని అభాండాల మధ్య అవి ఆవిరైపోయాయిరా....ఇక నీకు మూడింది..."
"సార్...అంత మాట అనకండి సార్..."
ఇంతలో శీనుగాడు వచ్చి...."లాభం లేదురా....నీకు లైట్ గా పిచ్చి ఎక్కింది...వెంకట్ మహిమ..." అన్నాడు నవ్వుతూ... నాకు ఎక్కడో సర్రున కాలింది...

అసలు ఆ రెండు రోజులు ఎగ్జాంకి ఏం చదివానో నాకు అర్థం కాలేదు....
ఎగ్జాం రాయడానికి బైల్దేరాము కాలేజీకి....నాకు కాలేజీలో అడుగెట్టగానే దడ మొదలైంది...ఎక్కడ వెంకట్ గాడు కనిపిస్తాడోనని...మూతి వరకు కర్చీఫ్ కట్టుకొని దొంగోడిలా నక్కి నక్కి వెళ్లాను ఎగ్జాం రూమ్ కి....
అక్కడ అరుణ్ గాడు కనపడ్డాడు...నాకు వాడిని చూడగానే టెన్షన్ మొదలైంది...ఎందుకంటే, వాడూ వెంకట్ గాడూ రూమ్ మేట్స్....
వాడు నన్ను చూసి నా వైపు వచ్చాడు...
"ఎగ్జాం అయ్యాక వెంకట్ సార్ నిన్ను కలవమన్నారు..." అన్నాడు...
నాకు దడ స్టార్ట్...ఏం చెప్పాలి...సరే క్షమించమని అడుగుదాం...ఇంకెప్పుడూ ఇలా చెయ్యను, ఈ సారి ఎవరడిగినా గొప్పగా చెప్తాను సార్ అంటే దరిద్రంగా ఉంటుందేమో...ఏదోకటి కన్విన్సింగుగా చెప్పాలి...అయినా ఏమని కన్విన్స్ చేస్తాం...ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ...జాగ్రత్తగా డీల్ చెయ్యాలి...అని స్థిరంగా అనుకున్నా....

ఎగ్జాం మొదలైంది.......వెంకట్ సార్ ఇన్విజిలేషన్...

వెంకట్ సార్ ని చూడగానే...అప్పటిదాకా వచ్చు అనుకున్న సమాధానాలు కూడా సడన్ గా గుర్తురావడం మానేశాయి...నా మీద నాకే విరక్తి పుట్టింది...నాకసలు ఎగ్జాం రాయాలనిపించలేదు...పేపర్ ఇచ్చేసి రంభ కెళ్ళి (ధియేటర్) రిలాక్స్ అవ్వాలనిపించింది...ఇద్దామా...వద్దా అన్న మీమాంసలో ఉండగా ఎప్పుడొచ్చాడో వెంకట్ సార్ నా పక్కకి వచ్చి నిల్చున్నాడు...వాడిని చూడగానే ఏదో రాస్తున్నట్లు యాక్ట్ చెయ్యడం మొదలెట్టాను...
"ఏటోయ్...పేపర్ ఎలా ఉంది?" అన్నాడు నవ్వుతూ...
"బా...గా...నే...ఉంది...సా....ర్..." అన్నాను తలెత్తకుండా...
మళ్ళీ కాసేపు వేరే వైపు వెళ్లి, ఓ పది నిముషాల్లో నా పక్కకి వచ్చాడు...'వీడు ఈ రోజు నన్ను ప్రశాంతంగా రాయనిచ్చేట్లు లేడు..' అనుకున్నాను...

అ ఎగ్జాంలో ఒ ప్రాబ్లం దెగ్గర గిల గిలా కొట్టుకుంటుంటే, ఆ ప్రాబ్లం ఏమిటో నా పేపర్ లో చూసి...వేరే ఎవరి దేగ్గరికో వెళ్లి కనుక్కొని నాకు ఎలా చెయ్యాలో స్టెప్స్ చెప్పాడు....నాకు ఆశ్చర్యం వేసింది...నాకు హెల్ప్ చేస్తున్నాడు ఏంటా అనుపించింది....తర్వాత కొంచెం సంతోషం వేసింది...చాట్ లో "పర్వాలేదు స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తాడు" అని చెప్పినందువల్ల ఇలా హెల్ప్ చేసి, తను శత్రువులకు అయినా సహాయం చేసే రకం అని అనిపించుకోవాలి అనుకుంటున్నాడా...ఏదైతే ఏమైంది అనుకొని...అదే చేత్తో - కొంచెం ఫేస్ బేలగా పెట్టి మరో రెండు ప్రాబ్లెంస్ చెప్పించుకొని...ఎగ్జాం ముగించి బయటపడ్డాను...ఇక వెంకట్ సార్ ని ఫేస్-టు-ఫేస్ ఫేస్ చెయ్యాలి అనుకొని బైల్దేరాను....

స్టాఫ్ రూమ్ దెగ్గర నిల్చొని ఉన్నాడు.....
నేను నెమ్మదిగా వెళ్లి...."సార్...." అన్నాను
"ఆ...ఏంటోయ్...చెప్పు...ఎగ్జాం బాగా రాశావా?" అన్నాడు ..
"రాశాను సార్ ..." అన్నాను...తుఫాను ముందు ప్రశాంతతలా అనిపించింది ఆయన ముఖం చూడగానే...
"సరే....ఏమిటీ...చాటింగ్ ఎక్కువ చేస్తున్నట్లున్నావ్..." అన్నాడు
"సార్....సార్....అసలు మీరనుకోలేదు సార్...అదీ...ఏంటో అలా...అసలు...సార్...నేను చెప్పింది ఉత్తినే...నిజం కాదు...అసలు ...మిమ్మల్ని...చ చ...అసలు...మీరు ఎంత హెల్ప్ చేస్తారో కదా సార్ మాకు...అదీ...మరి....సారీ సార్..." అనేశాను అసలు నేను మాట్లాడుతున్న మాటల మీద పెద్దగా నాకే పట్టులేనట్లుగా...
"సరేలే...ఎందుకోయ్ టెన్షన్...హాయిగా చదువుకో పరీక్షలకి...నెట్ కి వెళ్ళడం మానెయ్యి...ఏటి సరేనా..." అన్నాడు...
వార్నీ ఇంత ఈజీగా క్షమించేశాడు ఏంట్రా బాబు...అసలు ఇది నిజమేనా...ఈ మాత్రం దానికి రెండు రోజులు తెగ టెన్షన్ పడిపోయాను అనుకొని "ష్యూర్ సార్...థాంక్ యు సార్...." అనుకొని అక్కడ నుండు జంపో జంబులింగం.....

                             ** పరీక్షల అనంతరం ఇచ్చిన సెలవులు ముగిసిన తరువాత **

"వాట్ ఈజ్ Inheritance?" అని అందరి వైపూ చూస్తూ ..."రామకృష్ణ....చెప్పు వాట్ ఈజ్ Inheritance?" అన్నాడు వెంకట్ సార్....
నేను 'ఇదేంట్రా బాబూ నన్ను అడిగేశాడు' అనుకొని...లేచి తెల్ల మొహం వేసి నిల్చున్నాను....
"కొందరికి చాటింగ్ చెయ్యడం బాగా వచ్చు...పుస్తకం లో కాన్సెప్టులు మాత్రం రావు..." అన్నాడు...క్లాస్ అంతా నవ్వారు ....

ఇంకోరోజు....
"రామకృష్ణ....ఊప్స్ వల్ల ఉపయోగాలు చెప్పు...." అన్నాడు
వార్నీ...ఈడు నన్ను ఆడేసుకుంటున్నాడుగా అనుకొని...ఈసారి లేచి నల్ల మొహం వేసాను...
"కొంత మందికి....వేరే వాళ్ళకి ఏమీ రాదని ఎద్దేవా చెయ్యడం తెలుసు...వాళ్ళకి వాళ్ళు పెద్ద పండిట్స్ అనుకుంటారు...చివరికి చూస్తే...బుర్రంతా ఖాళీ...." అన్నాడు....మళ్ళీ క్లాస్ అంటా ఘొల్లున నవ్వారు....చిరాకేసింది నాకు....

మరో రోజు....
"రామకృష్ణ...జావాలో ఒక ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తావో చెప్పు...." అన్నాడు
దేవుడా...వీడు ఆరోజు నాతో ప్రశాంతంగా మాట్లాడితే పాపం పెద్ద మనసుతో క్షమించాడేమో అనుకున్నా కానీ ఇలా, ఇంస్టాల్ మెంట్స్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తాడు అనుకోలేదు.....అని ఏదో ఎర్రి మొహం ఏసి ఆలోచిస్తుండగా..."చెప్పు ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తావ్..." అన్నాడు మళ్ళీ....
'ఎలా కాల్ చేసేది ఏట్రా బాబూ....హే బేబ్ కమాన్ అంటే వస్తుందా ఫంక్షన్...' అనుకొని...ఏమీ చెప్పలేక...చెప్పడానికి ఏమీ రాక...అలాగే నిల్చున్నా....
"కొంతమందికి....చాటింగ్ లో మెసేజులు రాకపోతే బజ్ కొట్టడం తెలుసు....అలాగే సమాధానం రాకపోతే...ఇదిగో ఇలా కొస్చెన్ మార్క్ ఫేస్ వెయ్యడం కూడా తెలుసు...." అన్నాడు...క్లాస్ అంతా మళ్ళీ గోలీ సోడా కొట్టినట్లు నవ్వారు అని నేనే మీకు వేరేగా చెప్పాలా.....

అలా మూడు ప్రశ్నలు...ఆరు అవమానాలతో నా జీవితం భారంగా గడుస్తుండగా ...
ఓరోజు శీను గాడితో నాగోడు వెళ్ళబోసుకున్నాను..."ఓరి శీనుగా...ఆ వెంకట్ గాడు సినిమా విలన్ కన్నా డేంజర్రా...అప్పుడు వదిలేసినట్లే వదిలేసి...ఇప్పుడు ఆడేసుకుంటున్నాడురా..." అన్నాను బాధగా ...
"ఒరేయ్...నువ్వు వాడిని అన్న మాటలకి ఆమాత్రం కసి వాడికి ఉంటుందిరా...నువ్వు పట్టించుకోకు...పోను పోనూ  ఆడే వదిలేస్తాడు..." అన్నాడు....అలాగే అని నేను కూడా పట్టించుకోడం మానేశాను...

................ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక.........

"సార్...."అన్నాను
"హా...రామకృష్ణ...చెప్పు..." అన్నాడు వెంకట్ సార్ ..
"ఈ రోజుతో లాస్ట్ డే ...మీకు మనస్పూర్తిగా సారీ చెప్దామని వచ్చాను సార్...మీరు మాకు చాలా హెల్ప్ చేసారు...నేను మిమ్మల్ని ఆ విధంగా అన్నా కూడాను, మీరు నాకు ఇంటర్నల్స్...అటెండెన్స్...అన్ని బాగా వేశారు...మిమ్మల్ని అలా అన్నందుకు ఐ ఫీల్ గిల్టీ..." అన్నాను...
"రామకృష్ణ...అదేం లేదు...నువ్ అలా అన్నాక...నన్ను నేను చాలా డవలప్ చేసుకున్నాను...నా లోపాలు సవరించుకున్నాను...యు డోంట్ నీడ్ టూ ఫీల్ గిల్టీ...ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్..." అన్నాడు...
నేను చాలా హాపీగా బైటకి వచ్చాను....






-------------------------A post by.............................Ramakrishna Reddy Kotla
[ This is the true incident happened to me when am in 3rd Btech :-)) ]

21 comments:

మధురవాణి said...

అబ్బ.. నవ్వలేక చచ్చానండీ బాబూ! :D :D అయితే, ఇది నిజంగా జరిగిందా మీకు కాలేజీలో! ఇప్పుడు చదువుతుంటే ఇంత నవ్వొస్తుంది గానీ, అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే అయ్యుంటుంది కదా! ;-)
ఇంతకీ దీన్ని బట్టి ఏం తెలుసుకున్నారు? అమ్మాయిల్ని మొహం మీద తప్పితే చాటింగులో పొగడకూడదు అనా? ;-)

సతీష్ said...

వావ్...సూపర్ కామెడీ...స్క్రీన్ ప్లే మాత్రం రచ్చ అసలు..Extra Ordinary treatment for a funny concept, really Marvelous boss..నిజంగా నవ్వలేక చచ్చాను..:))

భావన said...

:-)) ఏంటి నిజంగా జరిగిందా? ఫన్నీ.

swapna@kalalaprapancham said...

mi post chaduvuthu mimmalni, mi venkat sir ni ohinchukuntu chadivesukukunnanu ;)

appudu miru kooda analsi unde (questions adigi answer cheppakapothe ila antaru kaani )kondaru vere valla chat id use chesukoni chat chestuntaaru adento ani.

hehehe ;)

ayina ala anentha dare undadanuko appudu

ponile motthaniki mi venkat sir nijam telusukunndau kada

3g said...

టెక్నిక్ అదిరింది. పోస్ట్ కూడా చాలా బాగుంది.

చందు said...

ha ha ha chachanu navaleka ;-)

Sai Praveen said...

ఇదంతా నిజమేనా?
చదువుతున్నంత సేపు నవ్వు వచ్చింది కాని, అప్పుడు మీ పరిస్థితి ఊహించుకుంటే జాసేలింది :)

sunita said...

eppaTlaanae :-)

నేస్తం said...

'ఎలా కాల్ చేసేది ఏట్రా బాబూ....హే బేబ్ కమాన్ అంటే వస్తుందా ఫంక్షన్...':)))))
బాగా రాస్తున్నావ్ కిషన్..
ఎక్జాం రాసేటప్పుడు కూడా తమరికి రంభ,ఊర్వశి,మేనక దియేటర్లు గుర్తుకొస్తున్నాయేం..:) ఇప్పుడు ఇంకా ఉన్నాయా అవి...

Lakshmi Sadala said...

Kishan you have great sense of humour..sir ni maarchina shishyudu anipinchukunnaru..
keep up the good work...

Sirisha said...

ippudu funny ga undi kani appudu chala ibbandi padi untav ga asalu...

good one....

మనసు పలికే said...

హిహ్హీహ్హీ.. చాలా బాగుందండీ.. :)
"వై నో క్లాస్...వై రౌండింగ్ రౌండింగ్ ద కాలేజ్ ..."
కొత్త బంగారు లోకం గుర్తొచ్చింది కొద్ది సేపు. :) మీ రచనా శైలి మాత్రం సూ...పర్..

శివరంజని said...

.స్వాతి కాస్త వెంకట్ సార్ అయిపోయేటప్పడికి...... ఆ టైం లో ఎంత టెన్సన్ పడి ఉంటారో కదా. పాపం...... కిషెన్ గారు .....

హే బేబ్ కమాన్ అంటే వస్తుందా ఫంక్షన్:):).. మీరు సామాన్యులు కాదు.... ఆ నల్లు ల మీద పిల్లుల మీద ఒట్టేసి చెబుతున్నా టాపిక్ అదిరిపోయింది...అయ్య బాబోయ్ నవ్వలేక సచ్చిపొయాననుకోండి..... .

Ram Krish Reddy Kotla said...

మధురవాణి: అవునండీ నిజంగా జరిగినదే..కొంచెం కాదండీ చాలా ఇబ్బందికర పరిస్థితి..అలా ఏమీ తెలుసుకోలేదు.. ;)

సతీష్: థాంక్స్ ఏ లాట్.. :)..ఏదో కొంచెం అలా ట్రై చేశా

భావన: జరిగిందేనండీ...ధన్యవాదాలు :)

Ram Krish Reddy Kotla said...

స్వప్న: మీరు చెప్పినట్లే అనాలనుకున్నాను...కానీ అంత సీన్ లేదు బసిక్ గా... యా మొత్తానికి తెలుసుకున్నారు :-)

త్రీజీ: థాంక్స్ అన్నాయ్ :-)

సావిరహే: థాంక్స్ :-))

ప్రవీణ్: అవును నిజమే..అప్పటి నా పరిస్థితి చాలా దారుణం లెండి..కొన్ని రోజులు నిద్రకూడా సరిగ్గా పట్టలేదు రేపు ఏమేమి అడుగుతాడో ప్రశ్నలు అని..వాడు మా క్లాస్ ఇంచార్జ్ మరి :-)

Ram Krish Reddy Kotla said...

సునీత: థాంక్స్ :-))

నేస్తం: ధన్యవాదాలు..అవును కరెక్టుగా ఎగ్జాం రాసేప్పుడే గుర్తొస్తాయి..ఏంటో మరి..;-)..అవునండీ ఇప్పటికీ ఉన్నాయి రంభా,ఊర్వసి,మేనకలు..జనాలని తమ ఆటలతో (సినిమా ఆటలతో..) అలరిస్తున్నాయి..

లక్ష్మి: ధన్యవాదాలు అండి.. :-)

Ram Krish Reddy Kotla said...

మురళీ: అవును చాలా...థాంక్స్ అండి :)

మనసుపలికే: హా హా...ఆయన ఆలాగే మాట్లాడేవాడు మరి ఇంగ్లీష్ లో..కొత్తబంగారులోకం చూసినప్పుడు ఆయనే గుర్తొచ్చాడు..థాంక్స్ అండి :-)

రంజనీ: అవును మరి..మిమ్మల్నీ అంతగా నవ్వించానంటే..పర్లేదు అనమాట..:-)..ఎంతైనా మీ అంత కాదులెండి :-))

కవిత said...

హి హి హి ....మరి అమ్మాయితో చాటింగ్ అంటే మజాకా ???
'ఎలా కాల్ చేసేది ఏట్రా బాబూ....హే బేబ్ కమాన్ అంటే వస్తుందా ఫంక్షన్...':)))))
మీ సర్ క్యూస్షన్స్ అడుగుతుంటే మీ ఫీలింగ్స్ ...తలచుకొని తెగ నవ్వేసుకున్నాను.బాగుంది బాగుంది...

బాలు said...

‘హే బేబ్ కమాన్’ అంటే వస్తుందా ఫంక్షన్... నవ్వలేక చచ్చానండీ బాబూ. అవునూ, మీరు కాలేజీలో పడ్డ భయం గురించి చెప్పారు. రూములో మీ ఫ్రెండ్సు మాటిమాటికీ మీ వెంకట్ సారు గురించి గుర్తుచేసి ఏడిపించి రచ్చరచ్చ చేసుండాలే... ఒకవేల అలాటిదేదైనా ఉంటే మరో పోస్టు రాద్దురూ. బీసీఏ చదివేటప్పుడు మా ఫ్రెండు సుబ్రమణ్యం అని ఉండేవాడు, ఒకరోజు ఫుల్లుగా మందుకొట్టేసి... మా డేటాటైప్స్ లెక్చరర్ రోడ్డు మీద కనపడితే ‘అరే, కోటిగా ఐదో చాప్టర్ చెప్పకుండా, ఆరో చాప్టర్లోకి ఎళ్లిపోతే మేమేమైపోవాల్రా’ అని చెడామడా కడిగేశాడు. తర్వాత రెండేళ్లూ మా కోటిగాడు ఆడితో ఆడుకున్నదానికన్నా మేం వాణ్ని ఏడిపించిందే ఎక్కువ. :-)))))

బాలు said...

సారీ... డేటాటైప్స్ కాదు డేటాస్ట్రక్చర్స్ లెక్చరర్. ఫ్లోలో తప్పు కొట్టాను. కొద్దగా మార్చి పెట్టండి

divya vani said...

‘హే బేబ్ కమాన్’ అంటే వస్తుందా ఫంక్షన్...
పేపర్ ఇచ్చేసి రంభ కెళ్ళి (ధియేటర్) రిలాక్స్ అవ్వాలనిపించింది.
super kishen gaaru